#గమ్యం: వైద్య అనుబంధ రంగాలు - అవకాశాలు ఎక్కువ, అభ్యర్థులు తక్కువ

వీడియో క్యాప్షన్, #గమ్యం: నీట్ రాయకపోయినా వైద్యరంగంలో అవకాశాలు ఉంటాయా?
    • రచయిత, అనిల్ కుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బీబీసీ న్యూస్ తెలుగు గమ్యం కు స్వాగతం. గతవారం గమ్యంలో నీట్ గురించి మాట్లాడుకున్నాం. నీట్‌కు సంబంధించి గమనించాల్సినవి మూడు అంశాలున్నాయి.

  • ఓపెన్ స్కూలింగ్ ద్వారా 10+2 చేసినవారు నీట్ రాయడానికి అనర్హులు అని ప్రభుత్వం ఓ నిబంధన పెట్టింది. దీన్ని మార్చాలని చాలామంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వారంతా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నారు.
  • ఇంటర్లో ఎంపీసీ చేస్తూ అనుబంధ సబ్జెక్ట్‌గా బయాలజీ చదివినవారు నీట్ రాయడానికి అనర్హులు.
  • చైనా, రష్యా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు వెళ్లి ఎంబీబీఎస్ చేసి ఇక్కడకు వచ్చి వైద్యుడిగా స్థిరపడవచ్చనే ఆలోచన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ విద్యార్థుల్లో ఎక్కువగా ఉంది. అక్కడ సులభంగా ఎంబీబీఎస్ సీటు దొరుకుతుందనో, ఖర్చు తక్కువగా ఉంటుందనో... ఇలా దీనికి రకరకాల కారణాలుండవచ్చు. కానీ ఈ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం విదేశాల్లో ఎంబీబీఎస్ చేసి, ఇక్కడకు వచ్చి డాక్టర్‌గా ప్రాక్టీస్ చేయాలన్నా ఇప్పుడు నీట్ రాసి అర్హత సాధించాల్సిందే.

ఎంబీబీఎస్, బీడీఎస్ ఇతర అన్ని రంగాల్లో కలిపి నీట్ ద్వారా భర్తీ అయ్యే సీట్లు సుమారు 65000. కానీ ఈ పరీక్ష రాసేవారు 15 లక్షలమంది పైనే. అంటే 5 శాతం కన్నా తక్కువమందికి మాత్రమే వైద్యవృత్తిలోకి ప్రవేశించే అవకాశం లభిస్తోంది. మరి వైద్యరంగంలో స్థిరపడాలని ఆశపడిన మిగిలిన విద్యార్థుల పరిస్థితి ఏంటి?

ఈ ప్రశ్నకు సమాధానం... సుమారు 60కి పైగా వైద్య అనుబంధ రంగాల్లో ఉన్న అద్భుత ఉద్యోగ అవకాశాలు అంటున్నారు Careers360.com ఛైర్మన్ అండ్ ఫౌండర్ మహేశ్వర్ పేరి. ఎంబీబీఎస్ సీటు రాలేదని నిరుత్సాహపడాల్సిన అవసరంలేదని, వైద్యరంగంపై మక్కువ ఉంటే ఇతర అనుబంధ రంగాల్లో అవకాశాలు ఎన్నో ఉన్నాయని, రాబోయే కాలంలో వీటికి డిమాండ్ బాగా పెరగబోతోందని వివరిస్తున్నారు మహేశ్వర్ పేరి. ఈ అంశాలపై మీకు ఇంకా ఏమైనా సందేహాలు, ప్రశ్నలు ఉంటే బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్‌బుక్ పేజీలో కామెంట్ చేయండి. వాటికి మహేశ్వర్ పేరి సమాధానాలిస్తారు.

#గమ్యం: నీట్ రాయకపోయినా వైద్యరంగంలో అవకాశాలు ఉంటాయా?

ఫొటో సోర్స్, Getty Images

1.ఆప్టోమెట్రీ

కంటి పరీక్షలకు ఎవరైనా ఆస్పత్రికి వెళ్తే ముందు నేరుగా డాక్టర్ని కలవరు. మొదట ఆప్టోమెట్రిస్ట్ మీ కంటిని పరిశీలించి, పరీక్షించి ప్రాథమిక అంశాలు, సమస్యలను నమోదు చేసుకుంటారు. బీఎస్సీ ఆప్టోమెట్రీ చేసినవారే ఈ పరీక్షలన్నీ చేయడానికి అర్హులు. ఈ కోర్సు దిల్లీలోని ఎయిమ్స్, అమైటీ యూనివర్శిటీ, మణిపాల్ విద్యాసంస్థలు, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర కొన్ని యూనివర్శిటీల్లో అందుబాటులో ఉంది.

#గమ్యం: నీట్ రాయకపోయినా వైద్యరంగంలో అవకాశాలు ఉంటాయా?

ఫొటో సోర్స్, Getty Images

2.మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ (ఎంఎల్‌టీ)

ఏ ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో చూసినా వారికి సొంతంగా మెడికల్ ల్యాబ్ ఉంటుంది. అవే కాకుండా బయట కూడా ఎన్నో ల్యాబ్స్ ఉన్నాయి. వీటిలో పనిచేయాలంటే బీఎస్సీ ఎంఎల్‌టీ చేసి ఉండాలి. వీరు మాత్రమే రోగులకు అవసరమైన రక్తపరీక్షలు, ఇతర స్కానింగ్‌లు వంటివన్నీ చేయడానికి అర్హులు.

ఎంఎల్‌టీ నాలుగేళ్ల కోర్సు. వెల్లూరులోని సీఎంసీ ఈ కోర్సు చేయడానికి ఉత్తమ సంస్థ. మణిపాల్ విద్యాసంస్థలు, జీబీ పంత్ యూనివర్శిటీ, ఇంకా ఇతర కొన్ని సంస్థల్లో కూడా ఈ కోర్సు అందుబాటులో ఉంది.

3.డయాలసిస్ థెరపీ టెక్నాలజీ (డీటీటీ)

డయాలసిస్ థెరపీ టెక్నాలజీలో బీఎస్సీ, ఎంఎస్సీ చేసినవారికి భవిష్యత్తులో మంచి అవకాశాలుండబోతున్నాయి. ఇది మూడేళ్ల కోర్సు (రెండున్నరేళ్ల కోర్సుతో పాటు 6 నెలల ఇంటర్న్‌షిప్). మనదేశంలో ఈ రంగంలో నిపుణులకు కొంత కొరత కూడా ఉంది. అందువల్ల డీటీటీ నిపుణులకు మంచి అవకాశాలుంటాయి.

4.హెల్త్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్

ఇది ఒక డిప్లొమా (రెండేళ్లు) లేదా డిగ్రీ (మూడేళ్లు) కోర్సు. వ్యాధులు రాకుండా నివారణ చర్యలు చేపట్టడానికి అవసరమైన అవగాహన కల్పించడం, రోగులకు ముందు జాగ్రత్త చర్యలను వివరించడం వంటివి వీరి విధులు. దీనిలో భాగంగా రకరకాల పరిశోధనా పత్రాలు, అధ్యయనాలను నిరంతరం చదవాల్సి ఉంటుంది.

#గమ్యం: నీట్ రాయకపోయినా వైద్యరంగంలో అవకాశాలు ఉంటాయా?

ఫొటో సోర్స్, Getty Images

5.ఆడియాలజీ అండ్ స్పీచ్ పాథాలజీ

ఎంపీసీ చేసినవారు కూడా దీన్ని చేయవచ్చు. బీఎస్సీ ఆడియాలజీ డిగ్రీ పూర్తి చేస్తే స్పీచ్ పాథాలజిస్టుగా స్థిరపడేందుకు అవకాశం ఉంటుంది. ఇటీవల కాలంలో మన దేశంలో వినికిడి సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. దీంతోపాటే హియరింగ్ ఎయిడ్స్‌ను ఉపయోగించేవారి సంఖ్య కూడా పెరుగుతోంది.

6.మెడికల్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ

ఎక్స్-రే, ఎంఆర్ఐ, న్యూక్లియర్ మెడిసిన్, బోన్ డెన్సిటీ, సీటీ స్కాన్... ఇలా ఎన్నో పరీక్షలు ఇప్పుడు ఆస్పత్రుల్లో మనం చూస్తూనే ఉన్నాం. బీఎస్సీ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీలో అర్హులైనవారు వీటిని నిర్వహిస్తారు. ఈ కోర్సు చేయాలనుకునేవారికి దిల్లీలోని ఎయిమ్స్ ఉత్తమ సంస్థ. అంతేకాదు, సీఎంసీ-వెల్లూరుతోపాటు అపోలో ఇన్‌స్టిట్యూట్ వంటి ప్రైవేటు సంస్థల్లో కూడా ఇది లభిస్తోంది.

#గమ్యం: నీట్ రాయకపోయినా వైద్యరంగంలో అవకాశాలు ఉంటాయా?

ఫొటో సోర్స్, Getty Images

7.ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ

సర్జికల్ ప్రొసీజర్స్ అన్నీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీపై అవగాహన ఉన్నవారి పరిధిలో జరుగుతాయి. ఆపరేషన్ థియేటర్లో శస్త్రచికిత్స సమయంలో అన్నీ సక్రమంగా జరిగేలా చూడటం ఓటీటీ నిపుణుల బాధ్యత. అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలనే దానిపై వీరికి ప్రత్యేక శిక్షణ ఉంటుంది. రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో దీనిపై ఉత్తమ శిక్షణ లభిస్తుంది. కొన్ని హాస్పటల్స్‌లో కూడా డిప్లొమా కోర్సులాగా లభిస్తోంది.

8.ఫిజియోథెరపీ

ఇది నాలుగేళ్ల కోర్సు. దేశవ్యాప్తంగా చాలా విద్యా సంస్థల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగి, ఎముకలు విరగడం వంటివి జరిగితే మందులతో పాటు డాక్టర్లు ఫిజియోథెరపీ కూడా చేయించుకోవాలని సూచిస్తారు. దీనిపై నైపుణ్యం సాధించాలంటే బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సు పూర్తి చేసి ఉండాలి.

వీటితో పాటు రేడియోథెరపీ, న్యూట్రిషన్ అండ్ డైటిక్స్వంటి సుమారు 50 కోర్సులున్నాయి. మీ ఆసక్తిని బట్టి వీటిలో ఏ కోర్సు పూర్తి చేసినా భవిష్యత్తులో మంచి ఉద్యోగం లభించడానికి అవకాశాలెక్కువ. కనీసం వచ్చే 20, 30 ఏళ్లలో ఈ రంగాల్లో నిపుణులకు డిమాండ్ తగ్గదని కచ్చితంగా చెప్పవచ్చు.

ఈ కోర్సులపై అవగాహనకోసం కెరీర్స్360.కామ్ అందిస్తున్న మరింత సమాచారాన్ని చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)