ఫేస్‌బుక్ ప్రాభవం తగ్గుతోందా? ఈ 8 సంకేతాలు చెబుతున్నదేమిటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అమోల్ రాజన్
- హోదా, బీబీసీ మీడియా ఎడిటర్
ఫేస్‌బుక్ సమస్యల సుడిగుండంలో చిక్కుకుందా? ఫేస్‌బుక్ ఇక ప్రాభవం కోల్పోనుందా? ఫేస్‌బుక్ పతనం దిశగా సాగుతోందా?
ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో ఆదరణను చూరగొన్న సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ - ఫేస్‌బుక్. అత్యంత విజయవంతమైన కంపెనీల్లో ఫేస్‌బుక్ ఒకటి.
ఫేస్‌బుక్ మార్కెట్ విలువ(మార్కెట్ కాపిటలైజేషన్) 50 వేల కోట్ల డాలర్లకు పైనే ఉంది. ఐదేళ్ల కిందటితో పోలిస్తే షేర్లు ఆరింతలు లాభదాయకంగా ఉన్నాయి.
'ఫైనాన్షియల్ టైమ్స్' కాపిటల్ మార్కెట్ ఎడిటర్ మైల్స్ జాన్సన్ కొద్ది రోజుల క్రితం చేసిన విశ్లేషణ ప్రకారమైతే- ప్రతి త్రైమాసికానికి ఫేస్‌బుక్ తన లాభాలను 50 శాతానికి పైగా పెంచుకొంటోంది.
14 ఏళ్ల ప్రయాణంలో ఫేస్‌బుక్ అసాధారణమైన వృద్ధిని సాధించింది. ఆర్థికంగా ఎంతో బలంగా కనిపిస్తున్న ఈ కంపెనీ భవిష్యత్తుపై విశ్లేషణలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి.
ఈ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ప్రభావం ఇక పెరగబోదని, ఇప్పటికే ఇది గరిష్ఠ స్థాయికి చేరిందని అంచనాలు చెబుతున్నాయి. ఫేస్‌బుక్ మధ్యకాలిక, దీర్ఘకాలిక స్థితిగతులపై నీలినీడలు కమ్ముకొంటున్నాయని ఇవి సూచిస్తున్నాయి.
ఈ విశ్లేషణకు ప్రధానంగా ఎనిమిది అంశాలు ప్రాతిపదికగా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty
1. తగ్గిపోతున్న యూజర్లు
అమెరికా, కెనడాల్లో ఫేస్‌బుక్ యూజర్లు అత్యధిక సంఖ్యలో ఉంటారు. ఈ రెండు దేశాల్లో రోజువారీగా తమ సైట్‌ను వినియోగించేవారి సంఖ్య తగ్గిపోయినట్లు ఫేస్‌బుక్ ఇటీవల విడుదల చేసిన ఒక నివేదికలో తెలిపింది. 18.5 కోట్ల నుంచి 18.4 కోట్లకు యూజర్ల సంఖ్య పడిపోయింది.
ఈ తగ్గుదల స్వల్పమే అయినప్పటికీ ఇదో ముఖ్య పరిణామం. ఎందుకంటే ఇలా జరగడం ఇదే తొలిసారి.
వార్తల స్థానంలో యూజర్ల మధ్య అర్థవంతమైన సమాచార వినిమయానికి వీలు కల్పించేలా తమ న్యూస్‌ఫీడ్‌కు సంబంధించిన ఆల్‌గారిథమ్‌ను మారుస్తున్నామని ఫేస్‌బుక్ ఛైర్మన్, ముఖ్యకార్యనిర్వహణాధికారి(సీఈవో) మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించడానికి ముందు జరిగిన పరిణామం ఇది.
2. తగ్గిన ఎంగేజ్‌మెంట్
యూజర్లు ఫేస్‌బుక్‌పై గడిపే సమయం(ఎంగేజ్‌మెంట్) తగ్గిపోతోంది. గతంతో పోలిస్తే ఈ సమయం రోజుకు ఐదు కోట్ల గంటల మేర తగ్గిందని ఫేస్‌బుక్ వెల్లడించింది.
ఇది భారీ తగ్గుదల. యూజర్లను న్యూస్‌ఫీడ్ ఫేస్‌బుక్‌పై నిలిపి ఉంచడం లేదని ఈ పరిణామం సూచిస్తోంది.
పరిస్థితి ఇలాగే కొనసాగితే ఫేస్‌బుక్‌లో ప్రకటనలు ఇవ్వడంపై ప్రకటనదారులు పునరాలోచనలో పడతారు.

ఫొటో సోర్స్, Getty Images
3. ప్రకటనదారుల ఉపసంహరణ
ప్రకటనదారులు పెద్దయెత్తున వెనక్కు వెళ్లిపోవడమనే ముప్పు ఫేస్‌బుక్‌కు పొంచి ఉన్న అతి పెద్ద ముప్పు.
సోషల్ నెట్‌వర్కులపై వినియోగదారుల్లో విశ్వాసం క్షీణించిందని కొన్ని రోజుల క్రితం యూనీలీవర్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ కీత్ వీడ్ వ్యాఖ్యానించారు.
ఫేస్‌బుక్‌తోపాటు గూగుల్‌లో ప్రకటనలపై పెట్టే సొమ్మును తగ్గించుకొంటామని ఆయన చెప్పారు. మిగతా ప్రధాన ప్రకటనదారులు కూడా యూనీలీవర్ బాటలో సాగితే ఫేస్‌బుక్ ఆదాయానికి భారీగానే గండిపడే అవకాశముంది.
కొందరు ప్రకటనదారులు, ప్రముఖ టెక్నాలజీ కంపెనీల మధ్య ఇప్పటికే తీవ్రస్థాయి విభేదాలు ఉన్నాయి.
ప్రకటనలు ఎలాంటి యూజర్లను లక్ష్యంగా చేసుకొని అందిస్తున్నారనే విషయంలో టెక్నాలజీ కంపెనీలు గోప్యత పాటిస్తున్నాయనే ఆరోపణలు విభేదాలకు ప్రధాన కారణం. ఫేస్‌బుక్ లాంటి కంపెనీలు పారదర్శకత పాటించడం లేదని ప్రకటనదారులు విమర్శిస్తున్నారు.
తమ సైట్‌పై వీడియోలు చూసేందుకు యూజర్లు వెచ్చిస్తున్న సమయానికి సంబంధించి తాము వేసిన అంచనాలు వాస్తవానికన్నా అధికంగా ఉన్నాయని ఫేస్‌బుక్ యాజమాన్యమే లోగడ అంగీకరించింది. ఇలాంటి అంశాలన్నీ ఫేస్‌బుక్‌కూ, ప్రకటనదారులకు మధ్య దూరాన్ని మరింతగా పెంచేవే.

ఫొటో సోర్స్, AFP/Getty Images
4. తప్పుడు సమాచారం, తప్పుడు వార్తలు
ఫేస్‌బుక్, ఇతర సోషల్ నెట్‌వర్క్‌లకు తప్పుడు వార్తలు, తప్పుడు సమాచారం పెను సవాళ్లుగా పరిణమించాయి.
ఈ అంశంపై యూనీలీవర్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ కీత్ వీడ్ స్పందిస్తూ- నిజాలపైన, ప్రజాస్వామ్యంపైన, ప్రపంచ శ్రేయస్సుపైన డిజిటల్ సాధనాలు చూపే ప్రభావంపై ప్రజల్లో ఆందోళన పెరుగుతోందని చెప్పారు.
2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకొందనే ఆరోపణలు, ఇందుకోసం ఫేస్‌బుక్‌ను వినియోగించిందనే విమర్శలు ఉన్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పోటీపడిన డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కూడా లోగడ ఫేస్‌బుక్‌పై విమర్శలు చేశారు. తన ఓటమికి మూల కారణం ఫేస్‌బుక్కేనని ఆమె ఆరోపించారు. ఇలాంటి పరిణామాలన్నీ ఫేస్‌బుక్ ప్రతిష్ఠను మసకబార్చేవే.
5. సంస్థ మాజీ ఉన్నతాధికారుల విమర్శలు
ఫేస్‌బుక్‌లో ఉన్నతస్థాయిలో పనిచేసిన పలువురు ఎగ్జిక్యూటివ్‌లు చేస్తున్న విమర్శలు సంస్థ ప్రతిష్ఠను బాగా దెబ్బతీస్తున్నాయి.
ఫేస్‌బుక్‌లో 'యూజర్ గ్రోత్' విభాగం వైస్‌ప్రెసిడెంట్‌గా పనిచేసిన చమత్ పాలిహపితాయా కొన్ని నెలల క్రితం ఫేస్‌బుక్ 'ఇంటరాక్షన్ టూల్స్'పై తీవ్ర ఆక్షేపణ వ్యక్తంచేశారు.
ఈ టూల్స్ సమాజంపై అత్యంత తీవ్రమైన చెడు ప్రభావాన్ని చూపిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. చర్చ, పరస్పర సహకారం లేకుండా పోతున్నాయని, తప్పుడు సమాచారం, అబద్ధాలు వ్యాప్తి చెందుతున్నాయని వెల్లడించారు.

ఫొటో సోర్స్, Facebook/Chamath Palihapitaya
ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు, సంస్థ మాజీ ఉన్నతాధికారి సీన్ పార్కర్, మరికొందరు మాజీ ఉన్నతాధికారులు కూడా ఫేస్‌బుక్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇలాంటి మాజీ ఉన్నతాధికారులు చేసే విమర్శలు ఫేస్‌బుక్‌తోపాటు ఈ సంస్థ కొనుగోలు చేసిన ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్ లాంటి సంస్థల ఎదుగుదలపైనా ప్రభావం చూపుతాయి.
6. భారీ జరిమానాలు
నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఐరోపా, అమెరికాల్లో నియంత్రణ సంస్థల నుంచి ఫేస్‌బుక్‌కు తీవ్రమైన ఒత్తిడి ఎదురవుతోంది. బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో 'కమిషనర్ ఫర్ కాంపిటీషన్' మార్గెథే వెస్టాగర్ వివిధ టెక్నాలజీ సంస్థల కార్యకలాపాల తీరుపై దృష్టి కేంద్రీకరించారు.
జర్మనీలోని నియంత్రణ సంస్థలు, విద్వేషపూరిత ప్రసంగాలను నిరోధించే చట్టాలను ప్రయోగించి, ఫేస్‌బుక్‌పై భారీ జరిమానాలు విధిస్తున్నాయి.
7. డేటా భద్రత-నియంత్రణ
యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, దానిని ఉపయోగించుకొని లాభాలు ఆర్జించడమనేది సరికొత్త వ్యాపారంగా అవతరించింది. ఇదే సందర్భంలో డేటా భద్రత, పరిరక్షణపై నియంత్రణ అనే అంశం కూడా తెరపైకి వస్తోంది.
ఐరోపా సమాఖ్యలో 'జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్(జీడీపీఆర్)' అనే నియంత్రణ విధానం మే 25న అమల్లోకి రానుంది. జీడీపీఆర్ అమల్లోకి వచ్చాక, ఫేస్‌బుక్ లాంటి సంస్థలు యూజర్ల వ్యక్తిగత డేటాను కాపాడటంలో విఫలమైతే భారీస్థాయిలో జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది.
తన వృద్ధికి జీడీపీఆర్ అడ్డంకి కాగలదని ఫేస్‌బుక్ ఇటీవలే అంగీకరించింది.

ఫొటో సోర్స్, Getty Images
8. మీడియా నుంచి వ్యతిరేకత
కొంత కాలంగా సోషల్ నెట్‌వర్క్‌లపై మీడియా సంస్థల్లో వ్యతిరేకత పెరుగుతోంది. మీడియా సంస్థలకు రావాల్సిన ప్రకటనల ఆదాయాన్ని ఫేస్‌బుక్, గూగుల్ లాంటి సంస్థలు తన్నుకుపోతున్నాయనే భావన వాటిలో ఈ వ్యతిరేకతకు కొంతమేర కారణం.
మీడియా సంస్థలకు ట్రాఫిక్ తగ్గేలా తన న్యూస్‌ఫీడ్ ఆల్‌గారిథంలో ఫేస్‌బుక్ ఇటీవల తీసుకొచ్చిన కీలక మార్పులు మరో కారణం. ఈ మార్పులపై అనేక మీడియా సంస్థలు గుర్రుగా ఉన్నాయి. ఫేస్‌బుక్ నిర్ణయాన్ని నిరసిస్తూ బ్రెజిల్ పత్రిక 'ఫోల్యా డి ఎస్.పాలో' అయితే తీవ్ర నిర్ణయమే తీసుకొంది. ఫేస్‌బుక్‌లో తమ పేజీలను అప్‌డేట్ చేయబోమని ప్రకటించింది.
న్యూస్‌ఫీడ్ ఆల్‌గారిథంలో మార్పుల నేపథ్యంలో, సోషల్ నెట్‌వర్క్‌లపై షేర్ చేసే వార్తల మీద ఎక్కువగా ఆధారపడే 'బజ్‌ఫీడ్' ఉద్యోగుల తగ్గింపునకు నిర్ణయం తీసుకొంది. ఫేస్‌బుక్ తీసుకొచ్చిన మార్పుల తీవ్రతను ఈ పరిణామం చాటుతోంది. ఇది మరో కోణం.

ఫొటో సోర్స్, Reuters
ఈ ఎనిమిది ప్రధానాంశాలే కాకుండా, ఫేస్‌బుక్‌ను ఆందోళనకు గురిచేసే విషయాలు ఇంకా ఉన్నాయి. ఇంగ్లిష్ మాట్లాడే దేశాల్లో ఫేస్‌బుక్ వృద్ధి గరిష్ఠ స్థాయికి చేరుకొనే అవకాశాలు ఉండటం, ఆఫ్రికా ఖండంలోని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చైనా టెక్నాలజీ సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీ, ఇతర అంశాలు ఈ జాబితాలో ఉన్నాయి.
అన్ని ఒత్తిళ్లనూ తట్టుకొని ఫేస్‌బుక్ వృద్ధి పథంలో ముందుకు సాగగలుగుతుందా అన్నది చూడాల్సి ఉంది.
(బీబీసీ బ్రెజిల్ నుంచి అదనపు సమాచారంతో...)
ఇవి కూడా చదవండి:
- రెండు దేశాల మధ్యలో నలిగిపోతున్న పిల్లలు
- లక్కీమనీ కోసం తల్లిదండ్రులపైనే కేసు
- ప్రపంచంలో ‘పవిత్రమైన’ ఏడు మొక్కలు
- ఇచట వివాహేతర సంబంధాలు తెంచబడును!
- ఇజ్రాయెల్: శత్రువును ప్రేమతో ఉచ్చులో పడేసే 'మొసాద్' మహిళా గూఢచారి కథ
- ‘ట్రంప్ నిర్ణయం అమలైతే భర్తతోపాటు వెళ్లే భార్యలు అమెరికాలో ఉద్యోగం చేయలేరు’!
- ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పీఎన్బీ నుంచి లోన్ తీసుకుని కారు కొన్నప్పుడు ఏం జరిగిందంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










