బడ్జెట్-సోషల్ మీడియా: బీజేపీ ఫేస్‌బుక్ పేజీలో ఏపీ నెటిజన్ల నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రవిశంకర్ లింగుట్ల
- హోదా, బీబీసీ ప్రతినిధి
2018-19 కేంద్ర బడ్జెట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక్కసారిగా మార్పు కనిపించింది.
బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులు, ఇతర అంశాలపై బీజేపీ జాతీయస్థాయి ఫేస్‌బుక్ అధికారిక పేజీలో ఏపీ నెటిజన్లు నిరసనలు తెలుపుతున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటి రోజు శుక్రవారం నుంచే ఫేస్‌బుక్ పేజీలో ఈ ప్రభావం కనిపించింది.
బీజేపీపై నిరసన తెలపాలంటూ కొన్ని ఎంటర్‌టైన్‌మెంట్ పేజీలు పిలుపునిచ్చిన తర్వాత బీజేపీ ఫేస్‌బుక్ పేజీపై రివ్యూలు, వన్-స్టార్ రేటింగ్‌లు పెరిగిపోయాయని, దీంతో పేజీ రేటింగే తగ్గిపోయిందని 'ద హిందూ' పత్రిక ఒక కథనంలో తెలిపింది. ''శుక్రవారం సాయంత్రం ఐదు స్టార్లకుగాను 4.5 స్టార్లకు పైగా ఉన్న రేటింగ్ శనివారం సాయంత్రం ఏడు గంటల సమయానికి 3.4కు పడిపోయింది'' అని చెప్పింది.
ఆదివారం, సోమవారం కూడా ఈ పేజీపై తెలుగు నెటిజన్ల విమర్శలు కనిపించాయి. బడ్జెట్‌తోపాటు ప్రత్యేక హోదా అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు.

ఫొటో సోర్స్, BJP/Facebook
'విశాఖకు రైల్వే జోన్ ఇవ్వాలి'
'ప్రత్యేక హోదా-ఆంధ్రప్రదేశ్ హక్కు' అనే నినాదాన్ని చాలా మంది కామెంట్ల రూపంలో పెట్టారు.
ఈ నినాదాన్ని అవినాశ్, మోహన్ చంద్, అభిషేక్, ఇంతియాజ్ పాషా, రాజేశ్, శివ కల్యాణ్, హబీబుల్ రెహ్మాన్, అశోక్ రెడ్డి, ఫాల్గుణ కృష్ణ అనే నెటిజన్లు, మరికొందరు నెటిజన్లు ఇంగ్లిష్, తెలుగు, హిందీతోపాటు గుజరాతీ, తమిళం, కన్నడ, బాంగ్లా(బెంగాలీ) భాషల్లోనూ పోస్ట్ చేశారు.
విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇవ్వాల్సిందేనని పలువురు యూజర్లు డిమాండ్ చేశారు. ''ఏపీని నిర్లక్ష్యం చేసిన బడ్జెట్'', ''ఏపీని మోసగించిన బీజేపీ'' అంటూ వారు విమర్శలు చేశారు.
పనిగట్టుకొని చేశారు: బీజేపీ
బీజేపీ జాతీయస్థాయి ఫేస్‌బుక్ పేజీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఐటీ సెల్ కన్వీనర్ సౌరభ్ ఖమర్‌ను బీబీసీ సంప్రదించింది.
ఇదంతా పనిగట్టుకొని చేశారని, దీని వెనక కాంగ్రెస్ లాంటి పార్టీల పాత్ర ఉండొచ్చని ఆయన ఆరోపించారు. ప్రజాగ్రహమే కారణమైతే తమ పేజీకి లైకులు, ఫాలోయర్ల సంఖ్య కూడా తగ్గాలని, అలాంటిదేమీ జరగలేదని తెలిపారు. ట్విటర్‌లోనూ తమకు ఫాలోయర్ల సంఖ్య తగ్గలేదన్నారు.
బీజేపీ ఫేస్‌బుక్ పేజీపై సోమవారం సాయంత్రానికి రేటింగ్ ఆప్షన్ కనిపించలేదు. దీనిని బీజేపీ ఐటీ విభాగం కనిపించకుండా చేసిందా అని సౌరభ్ ఖమర్‌ను అడగ్గా- రేటింగ్ తగ్గించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను దృష్టిలో ఉంచుకొని ఆ దిశగా నిర్ణయం తీసుకొని ఉండొచ్చని ఆయన బదులిచ్చారు.

ఫొటో సోర్స్, Facebook/BJP
'తెలుగు ప్రజలకు బీజేపీ భయపడింది'
రేటింగ్ ఆప్షన్ కనిపించకపోవడంపై 'రుషి రుషిక్' పేరుతో ఉన్న ఒక నెటిజన్ బీజేపీ ఫేస్‌బుక్ పేజీలో స్పందిస్తూ- ''తెలుగు ప్రజలకు బీజేపీ భయపడిపోయింది.. రేటింగ్స్ ఆప్షన్‌ను దాచేయడమో, తొలగించడమో చేశారు'' అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఏమైందని ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించారు.
ప్రధాని మోదీ అంటే తమకు ఇష్టమని, కానీ ఆయన ఏపీని ప్రతీసారి నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇప్పుడు బడ్జెట్‌లో కూడా అలాగే చేశారని గణేష్ గద్దె అనే యూజర్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను కాంగ్రెస్ గాయపరిచిందని, గత ఎన్నికల్లో ఆ పార్టీకి ఏం జరిగిందో అందరికీ తెలుసని, ఏపీ పట్ల వైఖరి మార్చుకోకపోతే రాష్ట్రంలో బీజేపీకి కూడా అదే గతి పడుతుందని విశాఖపట్నానికి చెందిన పవన్ అజయ్ రాజ్ అనే యూజర్ వ్యాఖ్యానించారు.
'వారిలో సినీ నటుల అభిమానులే ఎక్కువగా ఉండొచ్చు'
బీజేపీ ఫేస్‌బుక్ పేజీకి రేటింగ్ తగ్గింపు పరిణామాల గురించి, సోషల్ మీడియాలో టీడీపీకి మద్దతుగా కార్యకలాపాలు నిర్వహించే సతీశ్ చాగంటితో మాట్లాడగా- వాటి వెనక టీడీపీ మద్దతుదారుల పాత్ర లేదని ఆయన చెప్పారు.
బడ్జెట్‌కు సంబంధించిన పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిని ఆన్‌లైన్‌లో ప్రజలకు వివరించడంపైనే తాము రెండు మూడు రోజులుగా దృష్టి కేంద్రీకరించామని సతీశ్ తెలిపారు. తాము స్వచ్ఛందంగా పనిచేస్తున్నామన్నారు.
''ఎంటర్‌టైన్‌మెంట్ పేజీలు పిలుపు ఇచ్చాకే ఏపీ యూజర్లు పెద్ద సంఖ్యలో బీజేపీ ఫేస్‌బుక్ పేజీలోకి వెళ్లి, అప్పటికే ఇచ్చిన రేటింగ్‌ను తగ్గిస్తూ, లేదా కొత్తగా తక్కువ రేటింగ్‌ను ఇస్తూ నిరసన తెలిపారు. ఇలా చేసిన వారిలో పార్టీల అభిమానుల కంటే సినీనటుల అభిమానులే ఎక్కువగా ఉండొచ్చు'' అని సతీశ్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Saurabh Khamar
సోషల్ మీడియా: పోరు టీడీపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మధ్యే...
ఏపీ రాజకీయాలపై సోషల్ మీడియాలో ముఖ్యంగా ఫేస్‌బుక్‌లో సాధారణంగా పాలక టీడీపీ, ప్రధాన ప్రతిపక్షం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల మధ్యే పోరు జరుగుతుంటుంది.
ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. టీడీపీ పట్ల మెతక వైఖరిని ప్రదర్శిస్తున్నారంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మద్దతుదారులు తరచూ ఆయనపైనా ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తుంటారు. వాటిపై జనసేన మద్దతుదారులు స్పందిస్తుంటారు. చాలా సందర్భాల్లో టీడీపీ మద్దతుదారులు వీరికి జత కలుస్తుంటారు.
ఇప్పుడు బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు, ఇతర పరిణామాల నేపథ్యంలో బీజేపీ సోషల్ మీడియాపై ఏపీ నెటిజన్ల యాక్టివిటీ పెరిగిపోయింది.
ఇవి కూడా చదవండి:
- #BudgetWithBBC: మోదీ సర్కార్ ఈ సవాళ్లను అధిగమిస్తుందా!
- ఆరోగ్య బీమాకు ప్రశంసలు.. ఆదాయ పన్నుపై విమర్శలు
- ఆరోగ్య బీమా పథకం: ‘50 కోట్ల మందికి లబ్ధి.. ఆరు నెలల్లో అమలు’
- మోదీ-అమిత్ షా ద్వయాన్ని ఎదుర్కోగల ప్రతిపక్షమేదీ?
- పాదయాత్రలో జగన్ ఇస్తున్న హామీల అమలు సాధ్యమేనా?
- రిపబ్లిక్ డే పరేడ్: ఆసియాన్ ఎందుకంత ప్రత్యేకం?
- రోడ్ల ప్రాజెక్టు నిరుద్యోగులకు ఊరటనిస్తుందా?
- ఒక దేశం - ఒక ఓటు... ఎంతవరకూ సాధ్యం?
- సుప్రీంకోర్టు: ఇంతకూ ‘రోస్టర్’ ఏంటి? దాని ప్రాధాన్యం ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










