పాదయాత్ర @50: జగన్ ఇస్తున్న హామీల అమలు సాధ్యమేనా?

ఫొటో సోర్స్, YS Jagan Mohan Reddy/Facebook
- రచయిత, పృథ్వీరాజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర పేరుతో చేస్తున్న పాదయాత్ర 50వ రోజుకు చేరుకుంది.
ఈ యాత్రలో ఆయన రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను కలుస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, హామీలు ప్రకటిస్తున్నారు.
ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం వరకూ మొత్తం 13 జిల్లాల్లో 180 రోజులు 3,000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలని.. ఈ క్రమంలో సుమారు 2 కోట్ల మందిని స్వయంగా కలుసుకోవాలని జగన్ ప్రణాళిక.
2017 నవంబర్ 6వ తేదీన వైఎస్సార్ జిల్లా ఇడుపుల పాయ నుంచి ప్రారంభించిన ఈ యాత్రకు 2018 జనవరి 2వ తేదీ నాటికి 50 రోజులు పూర్తయింది. ఇప్పటికే ఆయన దాదాపు 650 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తిచేశారు.
ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మీద తీవ్ర విమర్శలు ఎక్కుపెడుతూ.. మరోవైపు వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామంటూ పలు హామీలు ఇస్తూ జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు.

ఫొటో సోర్స్, YS Jagan Mohan Reddy/Facebook
నిజానికి 2017 జూలైలో జరిగిన పార్టీ ప్లీనరీలోనే.. జగన్‌మోహన్‌రెడ్డి 2019 ఎన్నికల కోసం 9 హామీలను ‘నవరత్నాలు’ పేరుతో ప్రకటించారు. తాజా పాదయాత్రలో అవే హామీలను ఉద్ఘాటిస్తున్నారు. వాటిలో కొన్నిటిని సవరిస్తూ ప్రకటిస్తున్నారు.
అయితే 2014 ఎన్నికల సందర్భంగా వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీ అమలు సాధ్యం కాదని పేర్కొన్న జగన్‌మోహన్‌రెడ్డి.. ఇప్పుడు తానే స్వయంగా అసాధ్యమైన హామీలను ఇస్తున్నారంటూ ఇతర పార్టీల నుంచి విమర్శలు వస్తున్నాయి.

ఫొటో సోర్స్, YS Jagan Mohan Reddy/Facebook
పాదయాత్రలో జగన్ ప్రకటించిన ముఖ్యమైన హామీలు ఇవీ...
- అధికారంలోకి రాగానే.. పిల్లల్ని బడికి పంపించే ప్రతి తల్లికీ ‘అమ్మ ఒడి’ పథకం కింద ఏటా రూ. 15,000 అందిస్తాం. పిల్లలు ఎంత పెద్ద చదువు చదివితే అంతవరకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. వేరే ప్రాంతాల్లో చదువుకునే పిల్లల హాస్టల్ ఖర్చు కింద ఏటా రూ. 20,000 ఇస్తాం.
- వృద్ధాప్య పెన్షన్ వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తాం. అందరికీ నెలకు రూ. 2,000 పింఛన్ ఇస్తాం. వికలాంగులకు రూ. 3,000 పింఛను ఇస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 45 ఏళ్లకే వైఎస్సార్ చేయూత పెన్షన్ పథకం కింద నెలకు రూ. 2,000 అందిస్తాం.
- ప్రతి రైతు కుటుంబానికి రైతన్న భరోసా పేరుతో ఏటా మే నెలలో రూ. 12,500 ఇస్తాం. నాలుగు పర్యాయాలు రూ. 12,500 చొప్పున మొత్తం రూ. 50,000 అందిస్తాం. వడ్డీ లేని పంట రుణాలు, తొమ్మిది గంటలు పగటిపూట ఉచిత విద్యుత్ ఇస్తాం. రూ. 3,000 కోట్లతో ధరల స్ధిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. పంట ధరను ముందే నిర్ణయిస్తాం. అదే రేటుకు ఎవరూ కొనకపోతే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వంతో కలిసి రూ. 4,000 కోట్లతో ప్రకృతి విపత్తు పరిహార నిధి ఏర్పాటు చేస్తాం. ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజీలు, గోదాములు నిర్మించి, రైతులు ఉచితంగా వాడుకునే ఏర్పాట్లు చేస్తాం.
- వైద్యం ఖర్చు రూ. 1000 దాటే ఏ వ్యాధి అయినా ఆరోగ్యశ్రీ పథకం కిందకు తీసుకువచ్చి వైద్యం చేయిస్తాం. ఎంతటి పెద్ద ఆపరేషన్ అయినా చేయిస్తాం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఎక్కడైనా సరే నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం. తలసేమియా, మూత్ర పిండాలు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు.. డాక్టర్ సలహా మేరకు రూ. 10,000 పింఛన్ ఇస్తాం.

ఫొటో సోర్స్, YS Jagan Mohan Reddy/Facebook
- డ్వాక్రా మహిళలు ఎన్నికలు అయిపోయిన తర్వాత బ్యాంకులకు వెళ్లి.. అప్పు ఎంత ఉందో రశీదు తీసుకోండి. మా ప్రభుత్వం రాగానే ఆ మొత్తాన్ని నాలుగు దఫాలుగా వారి చేతికే ఇస్తాం. ఆ సొమ్ముతో ఏమైనా చేసుకోవచ్చు. బ్యాంకులకు వడ్డీ లెక్కలు కడతాం. సున్నా వడ్డీకి రుణాలు ఇప్పిస్తాం.
- ప్రతి పేద వాడికీ ఇల్లు కట్టిస్తాం. ఏటా ఐదు లక్షలు చొప్పున ఐదేళ్లలో అక్షరాలా 25 లక్షల ఇళ్లు కట్టిస్తాం. ఆ ఇంటిని మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేయిస్తాం. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఇంటిని తాకట్టు పెట్టి బ్యాంకు నుంచి పావలా వడ్డీకి అప్పు తీసుకునేలా ఏర్పాటు చేయిస్తాం.
- మూడు దఫాలుగా మద్య నిషేధాన్ని అమలు చేస్తాం. తాగుడు మానివేసినప్పుడు ఎదురయ్యే సమస్యలకు చికిత్స కోసం ప్రతి నియోజకవర్గంలో ఆస్పత్రిని ఏర్పాటు చేస్తాం. మళ్లీ ఎన్నికలు వచ్చే సమయానికి పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం. ఆ తర్వాతే మళ్లీ ఓట్లేయండని అడుగుతాం.
- ప్రతి ఊర్లో గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తాం. ఆ ఊరి వాళ్లకే 10 మందికి అందులో ఉద్యోగమిస్తాం. ఇళ్లు, పెన్షన్, రేషన్‌కార్డులు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ ఇవన్నీ 72 గంటల్లోనే మంజూరుచేస్తాం.
- అధికారంలోకి వస్తే.. ఇమామ్‌లకు రూ. 10,000, మౌజన్‌లకు రూ. 5,000 గౌరవ వేతనం ఇస్తాం. మసీదు, చర్చి, గుడికి ప్రభుత్వం సహాయం చేస్తుంది. ఒక్కోదానికి రూ.15 వేలు ఇస్తాం.

ఫొటో సోర్స్, YS Jagan Mohan Reddy/Facebook
అలాగే.. అధికారంలోకి రాగానే యుద్ధ ప్రాతిపదికన అన్ని సాగునీటి ప్రాజెక్టులనూ పూర్తిచేస్తామని, విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల అనుభవం, విద్యార్హతను బట్టి దశల వారీగా రెగ్యులరైజ్ చేస్తామని జగన్ ప్రకటించారు.
ప్రతి జర్నలిస్ట్‌కు కచ్చితంగా ఇళ్లస్థలం ఇస్తామని, చనిపోయిన రైతు కుటుంబాలకు వైఎస్సార్ బీమా పథకం ద్వారా నేరుగా రూ. 5 లక్షలు ఇస్తామని, రాష్ట్రవ్యాప్తంగా రైతుల భూములపై నిష్పక్ష పాతంగా టైటిల్ డాక్యుమెంట్స్ రీ సర్వే చేయిస్తామనే అంశం కూడా ఆయన హామీలలో ఉంది.

ఫొటో సోర్స్, Kalava Srinivasulu/Facebook
రాజనీతిని దుర్నీతిగా మారుస్తున్నారు: తెలుగుదేశం పార్టీ
వైఎస్ జగన్ ఇస్తున్న హామీలు ఆచరణయోగ్యం కావని ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు బీబీసీతో అన్నారు
‘‘2014లో జగన్‌మోహన్‌రెడ్డి రైతు రుణ మాఫీ సాధ్యం కాదన్నారు. అంతకుముందు ఆయన తండ్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రైతులకు రాయితీ ఇస్తే సరిపోతుంది కానీ రుణ మాఫీ వద్దని వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, రైతులకు ఆర్థిక సాయం చేస్తానని హామీలు ఇస్తున్నారు. ఇక కొన్నివర్గాల వారి పెన్షన్ వయసు 45 ఏళ్లకు తగ్గిస్తానంటున్నారు. ఎస్సీ వర్గాల వారికి ఉద్యోగ నియామక వయో పరిమితి 35 సంవత్సరాలు ఉంది. ప్రభుత్వం ప్రజలకు చేసే ఏ సాయమైనా ప్రజల డబ్బే ప్రజలకు ఇస్తుంది. రాజ్యంలో వికలాంగులు, నిస్సహాయస్థితిలో ఉన్న వాళ్లని ఆదుకోవాలనేది రాజనీతి. ఆ రాజనీతిని జగన్‌మోహన్‌రెడ్డి దుర్నీతి చేస్తున్నారు’’ అని మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు.
ఆయన బీబీసీ ప్రతినిధితో మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం రాష్ట్ర జనాభా సుమారు ఐదు కోట్ల మంది అనుకుంటే 50 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. పెన్షన్ వయసును 45 ఏళ్లకు తగ్గిస్తే.. ఆ సంఖ్య ఇంకా పెరుగుతుంది. జగన్ హామీ ఇస్తున్న ఈ పెన్షన్లు, డ్వాక్రా రుణాల మాఫీ, రైతులకు సాయం, అమ్మ ఒడి వంటివన్నీ అమలు చేయాలంటే సంవత్సరానికి రూ. 1.75 లక్షల కోట్లు ఖర్చవుతుంది. రాష్ట్ర వార్షిక బడ్జెట్ రూ. 1.60 లక్షలు. కాబట్టి ఈ హామీలు అమలు ఆచరణ సాధ్యం కాదు. అధికారం కోసం ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. ఈ హామీలు ఆచరణ యోగ్యం కానివి’’ అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, CPIM - Andhra Pradesh/Facebook
మౌలిక రంగాలపై దృష్టి పెట్టటం లేదు: సీపీఐ(ఎం)
2014 ఎన్నికలపుడు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలే అమలు జరగటం లేదని సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి పి. మధు అన్నారు.
"ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఎన్నికల కోసమే ఈ హామీలు ఇస్తున్నారు. 45 సంవత్సరాలకే పెన్షన్ అనటం ఎంత విచిత్రమో చూడండి. అయితే.. మౌలికమైన ఉద్యోగం, వ్యవసాయం, పరిశ్రమల రంగాల్లో పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పించే హామీలు కనిపించడం లేదు. ఈ హామీలను ప్రజలు నమ్మే పరిస్థితులూ కనిపించటం లేదు’’ అని మధు విమర్శించారు.
ఎన్నికల హామీలు అమలవటం తక్కువే: బీజేపీ
‘‘రాజకీయ అధికారం కోసం పాదయాత్ర చేస్తే ప్రజలకు దగ్గర కావచ్చు. ఎన్నికల హామీలు ఆచరణలో అమలవటం తక్కువ. ఇదే జగన్‌మోహన్‌రెడ్డి 2014 ఎన్నికల సమయంలో రైతు రుణాల మాఫీ సాధ్యం కాదన్నారు. అప్పుడు ఆచరణ సాధ్యమయ్యే హామీలే ఇస్తామన్నారు. ఇప్పుడు అమలు సాధ్యం కాని అనేక హామీలు ఇస్తున్నారు. బహుశా అధికారంలోకి వచ్చాక ఆలోచించుకోవచ్చులే అనుకుంటున్నారేమో. గతానికి, ఇప్పటికి జగన్ వైఖరిలో మార్పు వచ్చిందేమో అనిపిస్తోంది’’ అని బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యాంకిషోర్‌బాబు వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Sajjala Ramakrishna Reddy/Facebook
హామీలు పూర్తిగా కొత్తవేమీ కాదు.. అమలు సాధ్యమే: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్రలో ఇస్తున్న హామీలు పూర్తిగా కొత్తవి కావని జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి బీబీసీతో అన్నారు. అమలులో ఉన్న పథకాలనే మరింత మెరుగుపరుస్తామని జగన్ చెప్తున్నారని ఆయన చెప్పారు.
"గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే చాలా వరకూ ఉద్ఘాటిస్తున్నారు. దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ఇప్పటికే అమలులో ఉంది. దానిని పూర్తి ఫీజులకు వర్తింపచేస్తామని జగన్ చెప్తున్నారు" అని రామకృష్ణారెడ్డి చెప్పారు.
ఆరోగ్యశ్రీ పథకం కూడా అమలులో ఉన్నదేననీ, దానిని పేదలకు పూర్తిస్థాయి ప్రయోజనం కలిగించేలా మరింతగా విస్తరిస్తామని జగన్ చెప్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
ఆయన బీబీసీ ప్రతినిధితో మాట్లాడుతూ.. ’’రైతు భరోసా పథకం కానీ, డ్వాక్రా మహిళలకు రుణాల తిరిగి చెల్లింపు పథకం కానీ.. ఎలా అమలు చేస్తామనే విషయాన్నీ జగన్ ముందుగానే వివరిస్తున్నారు. రైతు భరోసా కింద ఒక్కో రైతుకు రూ. 12,500 చొప్పున నాలుగు విడతలుగా రూ. 50,000 సాయం అందిస్తామని చెప్పారు. అలాగే.. డ్వాక్రా మహిళల రుణాలను కూడా నాలుగు విడతలుగా చెల్లిస్తామని ప్రకటించారు. ఒకవేళ నిజాయితీ లేని ఎన్నికల హామీలే అయితే.. రైతుకు రూ. 50 వేలు ఇస్తామని, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించేవారు. అలా కాకుండా.. తాము ఇచ్చే హామీలను ఎప్పుడెప్పుడు, ఏ విధంగా అమలు చేస్తామనేది జగన్ వివరిస్తున్నారు’’ అని చెప్పారు.
‘‘గతంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి వంటి హామీలను అమలు చేయటానికి లక్ష కోట్ల రూపాయల వ్యయమవుతుంది. అవి అమలైతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతుంది. అందుకే టీడీపీ అధికారంలోకి వచ్చాక అమలు చేయటంలో విఫలమవుతోంది. కానీ జగన్ ఇస్తున్న హామీలు అలా ఆర్థిక పరిస్థితి మీద భారీగా భారం మోపేవి కావు" అని రామకృష్ణారెడ్డి తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్ పథకం అమలు చేయటం ఒక్కటే కొత్తగా ఇస్తున్న హామీ. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి, వాటికి పరిష్కారాలేమిటి అనేది జగన్ పాదయాత్ర ద్వారా స్వయంగా తెలుసుకుంటూ.. తన పథకాలను అందుకు అనుగుణంగా మెరుగుదిద్దుతున్నారని రామకృష్ణారెడ్డి వివరించారు.
మా ఇతర కథనాలు:
- ఎంఎస్ ధోని: ‘నమ్మిన దానికోసం పోరాడుతూనే ఉండండి’
- ప్రశాంతంగా నిద్ర పోవాలనుకునే వారి కోసం పది విషయాలు
- మహిళలూ మెదడును మీ దారికి తెచ్చుకోండి ఇలా..
- తిరుమలలో తన మతం గురించి సోనియా ఏం చెప్పారు?
- తెలుగు రాజకీయాల్లో పాదయాత్రల ట్రెండ్
- Exclusive: ముద్రగడ పద్మనాభం ఇంటర్వ్యూ
- ‘బాబు గారూ ఆనాడు కాపు ఆందోళనకు మద్దతిచ్చారు..మరి డబ్బెంత ఇచ్చారు?’
- పోలవరం: ఎప్పుడు మొదలైంది? ఇప్పుడు ఎక్కడుంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








