తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు విభజనలో ఎందుకింత ఆలస్యం?

హైకోర్టు

ఫొటో సోర్స్, High court website

    • రచయిత, సతీష్ ఊరుగొండ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విభజన వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో అసలు హైకోర్టు గురించి చట్టం ఏం చెప్పింది? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలు ఏమంటున్నాయి? హైకోర్టు విభజన ఆలస్యానికి కారణాలేంటి?

ఉమ్మడి హైకోర్టు విభజన కోసం తెలంగాణ ఎంపీలు గురువారం లోక్‌సభలో నిరసన చేపట్టారు.

హైకోర్టును తక్షణం విభజించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో ఏపీ ఎంపీలు విభజన హామీలపై కేంద్రాన్ని ప్రశ్నించారు.

దీంతో ఈ అంశాలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్ లోక్‌సభలో వివరణ ఇచ్చారు.

ఏపీలో కొత్త హైకోర్టును త్వరలోనే ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అమరావతిలో తాత్కాలిక హైకోర్టు ఏర్పాటుకు ఏపీ సీఎం చంద్రబాబు సానుకూలంగా ఉన్నారని చెప్పారు.

ఇందుకోసం 4 భవనాలు సిద్ధంగా ఉన్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారని తెలిపారు. ఆ నాలుగింటిలో ఒకదాన్ని ఖరారు చేయాల్సి ఉందని రవిశంకర్ ప్రసాద్ వివరించారు.

ఏపీలో హైకోర్టు ఏర్పాటు తర్వాత హైదరాబాద్‌లోని హైకోర్టు భవనం తెలంగాణాకే చెందుతుందని ఆయన తెలిపారు.

రవిశంకర్ ప్రసాద్

ఫొటో సోర్స్, lok sabha tv

పదోన్నతుల ప్రక్రియ నిలిపేయండి: జితేందర్‌రెడ్డి

రవిశంకర్‌ ప్రకటనను టీఆర్ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి స్వాగతించారు. అయితే, హైకోర్టు విభజన జరిగే వరకు న్యాయమూర్తుల పదోన్నతుల ప్రక్రియ నిలిపి వేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ ప్రక్రియ కొనసాగితే తెలంగాణ న్యాయమూర్తులకు అన్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.

అయితే, పదోన్నతుల అంశంపై ఎలాంటి హామీ ఇవ్వలేమని కేంద్ర మంత్రి రవిశంకర్ స్పష్టం చేశారు. ఈ అంశం తమ పరిధిలో లేదని, కొలీజియం పరిధిలో ఉందని ఆయన వివరించారు.

జితేందర్ రెడ్డి

ఫొటో సోర్స్, Lok Sabha tv

హైకోర్టు విభజన జరిగే వరకు పోరాడుతామని టీఆర్ఎస్ ఎంపీ కవిత చెప్పారు. నెపం సుప్రీం కోర్టు మీదకు తోయడం సరికాదని ఆమె అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టం ఏం చెబుతోంది?

ఉమ్మడి హైకోర్టు విభజనపై ఆంధ్రప్రదేశ్ పునర్ విభజన చట్టం -2014 లో స్పష్టంగా పేర్కొన్నారు.

సెక్షన్ 30 (1) నుంచి సెక్షన్ 34 వరకు వివిధ సెక్షన్ల కింద సమగ్రంగా వివరించారు.

రాజకీయ కారణాలే అసలు సమస్య!

ఏపీలో కొత్త హైకోర్టు ఏర్పాటు చేయాలని విభజన చట్టం చెబుతోంది. కానీ మూడున్నరేళ్లు గడిచినా అది కార్యరూపం దాల్చలేదు. ఈ వివాదం పలుమార్లు కేంద్రం దృష్టికి వెళ్లింది.

10 ఏళ్ల పాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని చట్టంలో ఉంది. కానీ ఉమ్మడి హైకోర్టు విషయంలో ఇలాంటి నిర్దిష్ట గడువు ఏదీ లేదు.

రాష్ట్ర విభజన జరిగిన తొలినాళ్లలో ఈ విషయాన్ని రెండు ప్రభుత్వాలు పట్టించుకోలేదన్న వాదన ఉంది.

రాష్ట్ర విభజన తర్వాత కూడా 2016 మే నెలలో తెలంగాణ న్యాయవాదులు ఆందోళనలు నిర్వహించారు. బంద్‌లకు పిలుపు ఇచ్చారు. జడ్జీలూ విధులు బహిష్కరించారు.

రాజకీయ కారణాల వల్లే హైకోర్టు విభజన ఆలస్యం అవుతోందని ఏపీకి చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది సతీశ్ అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్రాల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు, న్యాయవాదులు ఇబ్బంది పడుతున్నారని ఆయన బీబీసీతో చెప్పారు.

ఏపీలో తాత్కాలిక హైకోర్టు భవనంలో విధులు నిర్వహించేందుకు కొందరు ఉద్యోగులు సుముఖంగా లేకపోవడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు.

కె.చంద్రశేఖరరావు

ఫొటో సోర్స్, Telangana CMO

హైకోర్టును తక్షణం విభజించాల్సిందే:తెలంగాణ

ఉమ్మడి హైకోర్టును తక్షణం విభజించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. సీఎం కేసీఆర్ గతంలోనే ఈ అంశంపై ప్రధాని మోదీకి లేఖ రాశారు.

హైకోర్టు విభజనను ఏపీ ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తోందని టీఆర్ఎస్ నాయకులు గతంలో ఆరోపించారు.

విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఉండాలని, గతంలో కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు హైకోర్టు విభజన ఇంత జాప్యం కాలేదని టీఆర్ఎస్ ఎంపీలు చెబుతున్నారు.

ఏపీ ప్రభుత్వం భవనం కేటాయించకపోవడం వల్లే హైకోర్టు విభజన ఆలస్యం అవుతోందని తెలంగాణకు చెందిన న్యాయవాది శ్రవణ్ బీబీసీతో అన్నారు.

గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఏపీ హైకోర్టు కోసం హైదరాబాద్‌లో ఒక భవనం చూపించారు.

కానీ విభజన చట్టం ప్రకారం కొత్త హైకోర్టు ఏపీ భూభాగంలోనే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దాంతో కేసీఆర్ ప్రతిపాదన కూడా కార్యరూపం దాల్చలేదు.

బాబు

ఫొటో సోర్స్, NCBN/Twitter

సదుపాయాలు లేకుండా విభజన ఎలా సాధ్యం!: ఏపీ

సరైన మౌలిక సదుపాయాలు లేకుండా రాజధాని అమరావతికి హైకోర్టును ఎలా తరలిస్తామని ఏపీ ప్రశ్నిస్తోంది.

అమరావతి మాస్టర్‌ ప్లాన్, భవనాల డిజైన్లు ఖరారు చేసిన తర్వాత నిర్మాణం ప్రారంభించాలని ఏపీ భావిస్తోంది.

హైకోర్టు భవన నిర్మాణానికి సమయం పడుతుంది. అందుకే అమరావతి పరిధిలో తాత్కాలిక భవనంలో హైకోర్టు ఏర్పాటు యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది.

హైకోర్టు నిర్మాణం ప్రారంభించిన తర్వాత 16 నెలల్లో దాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్‌లైన్ పెట్టుకుంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

హైకోర్టు విభజన కోసం తెలంగాణ ఎందుకు పట్టుబడుతోంది?

ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల్లో ఆంధ్రా ప్రాంతం వాళ్లే ఎక్కువగా ఉన్నారని, తెలంగాణ వారికి అన్యాయం జరుగుతోందని టీఆర్ఎస్ ఎంపీలు చెబుతున్నారు.

ఉమ్మడి హైకోర్టును విభజిస్తే కొత్తగా ఉద్యోగాలు ఏర్పడతాయి. దీంతో తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని వారంటున్నారు.

హైకోర్టు విభజనతో న్యాయస్థానంపై కేసుల భారం తగ్గుతుంది. పెండింగ్ కేసుల పరిష్కారానికి అవకాశం ఏర్పడుతుంది.

హైకోర్టు న్యాయమూర్తుల విభజన కూడా కొలిక్కి వచ్చింది. ఉమ్మడి హైకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తులు ఇచ్చిన ఐచ్ఛికాల ఆధారంగా ఏపీ, తెలంగాణ మధ్య న్యాయమూర్తులను కేంద్రం విభజన చేసింది.

ఉమ్మడి హైకోర్టుకు మంజూరైన జడ్జిల సంఖ్య 61. ప్రస్తుతం హైకోర్టులో 31 మంది న్యాయమూర్తులు ఉన్నారు. జనాభా ప్రాతిపదికన 58:42 నిష్ఫత్తిలో 17 మందిని ఏపీకి, 12 మందిని తెలంగాణకు కేటాయించారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)