పదేళ్లు గడచినా బెనజీర్ హత్య మిస్టరీ ఇంకా ఎందుకు వీడలేదు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఓవెన్ బెన్నెట్ జోన్స్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఒక ముస్లిం దేశానికి నాయకత్వం వహించిన తొలి మహిళ బెనజీర్ భుట్టో. ఆమె హత్య జరిగి దశాబ్దం గడిచింది. ఆమె హత్య వెనుక ఎవరున్నారనేది ఇంతవరకూ వెల్లడి కాలేదు. పాకిస్తాన్‌లో వ్యవస్థల పనితీరు ఎలా ఉంటుందో ఈ కేసు దర్యాప్తు తీరే తేటతెల్లం చేస్తుంది.
2007 డిసెంబరు 27న ఎన్నికల ప్రచారంలో భాగంగా బెనజీర్ భుట్టో రావల్పిండిలో ఒక ర్యాలీలో పాల్గొన్నారు.
ర్యాలీ ముగిసిన వెంటనే బిలాల్ అనే పదిహేనేళ్ల బాలుడు బెనజీర్ కాన్వాయ్ వద్దకు వచ్చి, ఆమెపై కాల్పులు జరిపాడు.
అనంతరం అతడు తనను తాను పేల్చేసుకున్నాడు. బిలాల్ ఆత్మాహుతి దాడి వెనుక పాకిస్తాన్ తాలిబాన్ల ప్రమేయం ఉంది.
పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తొలి ప్రధాని జుల్ఫీకర్ అలీ భుట్టో. ఆయన కుమార్తె బెనజీర్ భుట్టో. జుల్ఫీకర్ రాజకీయ జీవితం కూడా అర్ధాంతరంగానే ముగిసింది.
జనరల్ జియా-ఉల్ హక్ సైనిక పాలనలో ఆయనను ఉరితీశారు. బెనజీర్ భుట్టో 1990లలో రెండుసార్లు ప్రధానిగా ఉన్నారు.
అయితే ప్రతిసారీ అవినీతి ఆరోపణలతో సైన్యం ఆమెను పదవి లోంచి తొలగించింది.
హత్యకు ముందు ఆమె మూడోసారి ప్రధాని పదవికి పోటీ పడుతున్నారు. ఆమె హత్యతో పాకిస్తాన్‌లో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి.

ఫొటో సోర్స్, Getty Images
అధికారంలో ఉన్నవారే తాలిబాన్ల సహాయంతో భుట్టోను హత్య చేయించి ఉండొచ్చని జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ ఒక దశాబ్దం తర్వాత అభిప్రాయపడ్డారు.
ఒక పాకిస్తాన్ నేత నుంచి ఆ రకమైన మాట రావడం చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. మామూలుగా మిలటరీ నేతలు జిహాదీ దాడులపై ప్రభుత్వం మౌనం వహిస్తుందంటే ఒప్పుకోరు.
అధికార వర్గాలలో, పాశ్చాత్య దేశాలకు అనుకూలంగా ఉండే ఒక మహిళపై తనకు అనుమానం ఉన్నట్లు ముషర్రఫ్ పేర్కొన్నారు.
అయితే భుట్టో కేసులో స్వయంగా ముషర్రఫే హత్య, హత్యకు కుట్ర తదితర ఆరోపణలు ఎదుర్కొన్నారు.

ఆమె తనకై తానే విధించుకున్న ఎనిమిదేళ్ల ప్రవాసకాలం ముగియడానికి 3 వారాల ముందు ముషర్రఫ్ వాషింగ్టన్‌లో ఉన్న ఆమెతో మాట్లాడారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది.
ఆ ఫోన్ వచ్చినపుడు భుట్టో అనుచరుడు మార్క్ సైగల్, జర్నలిస్ట్ రాన్ సుస్కిండ్ ఇద్దరూ అక్కడే ఉన్నారు.
''అతను నన్ను బెదిరించాడు. నన్ను పాకిస్తాన్‌కు తిరిగి రావద్దన్నాడు. పాకిస్తాన్‌కు రావొద్దని బెదిరించాడు'' అని భుట్టో అన్నట్లు సైగల్ తెలిపారు.
బెనజీర్ భుట్టోకు ఏమైనా అయితే తనకు సంబంధం లేదని ముషర్రఫ్ అన్నట్లు సైగల్ బీబీసీకి తెలిపారు.
అయితే ముషర్రఫ్ మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ఇటీవల బీబీసీతో మాట్లాడుతూ, ''ఈ మాటలు వింటే నవ్వొస్తోంది. ఆమెను నేనెందుకు చంపుతాను?'' అన్నారు.

ఫొటో సోర్స్, Dawn News TV
హత్యకు కుట్ర
'మా అమ్మను హత్య చేసేందుకు పరిస్థితులను ముషర్రఫ్ బాగా ఉపయోగించుకున్నారు'' అని బెనజీర్ కుమారుడు బిలావల్ తెలిపారు. ''ఆమెను హత్య చేసేందుకు వీలుగా కావాలనే ఆయన మా అమ్మకు భద్రతా సిబ్బందిని తగ్గించారు.'' అని ఆరోపించారు.
ఈ కేసులో మిగతా వారిని నిర్దోషులుగా విడుదల చేయగా, ముషర్రఫ్‌పై మాత్రం కేసు ఇంకా నడుస్తోంది.
పాకిస్తానీ తాలిబాన్, అల్‌ఖైదా ఆదేశాలతో 15 ఏళ్ల బిలాల్ అనే కుర్రాడు భుట్టోను హత్య చేసేందుకు సిద్ధపడ్డట్టు ఐదుగురు అనుమానితులు అంగీకరించారు. భుట్టో హత్యకు గురైన కొన్ని వారాల్లోనే వారీ విషయం చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ తాలిబాన్ తరపున మొదట ఐత్జాజ్ షాను సూసైడ్ బాంబర్ అని అనుకున్నారు. తర్వాత అతణ్ని రిజర్వ్‌లో ఉంచారు. రషీద్ అహ్మద్, షేర్ జమాన్‌లు మధ్యవర్తులుగా వ్యవహరించారు. రావల్పిండికి చెందిన హస్నైన్ గుల్, రఫాకత్ హుస్సేన్‌లు హత్యకు ముందు రోజు బిలాల్‌కు ఆశ్రయం ఇచ్చారు.
మొదట అంగీకరించిన విషయాలను వారు తర్వాత నిరాకరించినా, నిందితుల ఫోన్ రికార్డులు, వారున్న ప్రదేశాలను బట్టి, ఇదంతా నిజమే అని తేలుతోంది.

దాడి తర్వాత బిలాల్ శరీర భాగాల డీఎన్ఏను పరీక్షించగా, అవి హస్నైన్ ఇంటిలో దొరికిన షూస్, టోపీలోని డీఎన్‌ఏతో సరిపోయాయి.
నిందితులందరికీ శిక్ష పడుతుందని భావించగా, సెప్టెంబర్‌లో కేసు వీగిపోయింది.
అయితే అప్పీలు పెండింగ్‌లో ఉండడంతో వారు ఐదుగురూ డిటెన్షన్‌లో ఉన్నారు.


ఫొటో సోర్స్, AFP

అధ్యక్షుడైన భర్త
బెనజీర్ భుట్టో భర్తే ఆమె హత్యకు కుట్ర పన్నారని పాకిస్తాన్‌లో చాలా మంది ప్రజలు మాట్లాడుకుంటుంటారు. ఆమె మరణం తర్వాత అధ్యక్షుడు అయ్యింది ఆయనే కాబట్టి, ఆమె మరణంతో ఎక్కువగా లబ్ధి పొందింది అతనే అనేది వాళ్ల అభిప్రాయం.
అయితే ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలూ లేవు. ఆయన కూడా ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. అధ్యక్ష పదవిలో ఉన్నా తన భార్య హత్యపై సరైన విచారణ జరిపించలేదనేది ఆయనపై మరో అభియోగం.
బీబీసీ రహస్యంగా సేకరించిన పత్రాలను బట్టి చూస్తే, పోలీసు విచారణ సరిగా జరగలేదు. అప్పటికే అరెస్ట్ చేసిన వారు మినహా వారు కొత్తగా ఎవరినీ నిందితులుగా పేర్కొనలేదు.
విచారణాధికారి సౌద్ మీర్జా ఒక సూసైడ్ బాంబర్ గురించి అనుమానాలు వ్యక్తం చేసినా, దానిపై లోతుగా పరిశోధించలేదు. దాని గురించి వివరాలు కూడా బయట పెట్టలేదు.
అయితే మాజీ అధ్యక్షుడు జర్దారీ మాత్రం తనపై వస్తున్న విమర్శలకు సమాధానంగా, ఈ హత్యపై స్కాట్లండ్ యార్డ్ పోలీసుల సహాయం తీసుకున్నట్లు, ఆమె హత్యకు దారి తీసిన పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీతో చర్చించినట్లు సమర్థించుకుంటారు.
అయితే ఈ విచారణను జర్దారీ, పాకిస్తాన్ మంత్రులు పదేపదే అడ్డుకున్నట్లు యూఎన్ కమిషన్ పేర్కొంది.

బెనజీర్ భుట్టోను హత్య చేసిన టీనేజీ కుర్రాడు ఆమె వద్దకు చేరుకునేందుకు సహకరించిన ఇద్దరు వ్యక్తులను 2008, జనవరి 15న మిలటరీ చెక్ పాయింట్ దగ్గర కాల్చి చంపినట్లు బీబీసీ విచారణలో తేలింది.
జర్దారీ ప్రభుత్వంలోని ఒక సీనియర్ అధికారి ఇది 'ఎన్‌కౌంటర్' అని అభిప్రాయపడ్డారు. చట్ట వ్యతిరేకంగా జరిగే ఇలాంటి కాల్పులకు పాకిస్తాన్ అధికారులు పెట్టుకున్న పేరు అది.
బీబీసీ పరిశోధనలో, ఓ మదర్సాకు చెందిన పూర్వ విద్యార్థి అబద్ ఉర్ రెహ్మాన్ బెనజీర్ భుట్టో హత్యకు ఉపయోగించిన సూసైడ్ జాకెట్‌ను తయారు చేసినట్లు తేలింది.
అతను 2010, మే 13న పాకిస్తాన్‌లోని మారుమూల ప్రాంతంలో హత్యకు గురయ్యాడు.
ఆ సూసైడ్ జాకెట్‌లను రావల్పిండికి రవాణా చేసిన అబ్దుల్లా కూడా 2008, మే 31న ఉత్తర పాకిస్తాన్‌లోని మొహమంద్ ఏజెన్సీ ప్రాంతంలో జరిగిన పేలుడులో మృతి చెందాడు.
ఈ కేసులో మరో అతి పెద్ద సంచలన మరణం భుట్టో సెక్యూరిటీ గార్డుల్లో ఒకరైన ఖాలిద్ షహెన్ షాది. రావల్పిండిలో భుట్టో తన చివరి ప్రసంగం చేస్తుండగా అతను ఆమెకు అతి దగ్గరలో ఉన్నాడు. వీడియో ఫుటేజ్‌లో అతని కదలికలు చాలా అసహజంగా కనిపించాయి. దానికి సరైన కారణాలు ఎవరూ వివరించలేకపోయారు.
ఆ ఫుటేజ్‌లో అతను ఎవరికో తన కళ్లతో భుట్టో వైపు చూపించాడు. అదే సమయంలో గొంతుకు అడ్డంగా వేళ్లతో సైగ చేయడం కనిపించింది. 2008 జులై 22న కరాచీలోని తన నివాసం బయట షహెన్ షా హత్యకు గురైనపుడు, ఆ చిత్రాలు వైరల్‌గా మారాయి.

ఫొటో సోర్స్, FAROOQ NAEEM
ఆ తర్వాత బలిపశువు ప్రభుత్వ ప్రాసిక్యూటర్ చౌదరి జుల్ఫికర్. భుట్టో కేసులో పురోగతి సాధిస్తున్నట్లు ఆయన తన స్నేహితులతో పేర్కొన్నారు.
2013, మే 3న ఒక కేసు విచారణకు వెళుతుండగా ఇస్లామాబాద్‌లో ఆయన్ను కాల్చి చంపారు.
చివరిగా అందరూ మరణించాడని భావించిన మరో వ్యక్తి జీవించే ఉన్నాడు.
భుట్టో హత్య మొదటిసారి విఫలమైతే, రెండో దాడి కోసం ఇక్రాముల్లా అనే మరో సూసైడ్ బాంబర్‌ను కుట్రదారులు సిద్ధంగా ఉంచారు.
అయితే మొదటిసారే భుట్టో మరణించడంతో ఇక్రాముల్లా అవసరం రాలేదు. దాంతో అక్కడి నుంచి అతను తప్పించుకున్నాడు.
చాలా కాలం పాటు పాకిస్తాన్ అధికారులు ఇక్రాముల్లా ఒక డ్రోన్ దాడిలో మరణించినట్లు పేర్కొన్నారు.
అయితే 2017లో పాకిస్తాన్ అధికారులు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాను విడుదల చేసారు. దానిలో తొమ్మిదో పేరు ఇక్రాముల్లాదే. బెనజీర్ భుట్టో హత్యలో అతని ప్రమేయమున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇక్రాముల్లా ప్రస్తుతం తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నట్లు బీబీసీ విచారణలో తేలింది. అతను ప్రస్తుతం పాకిస్తాన్ తాలిబాన్ కమాండర్ హోదాలో ఉన్నాడు
ఈ కేసులో ఇప్పటివరకు కేవలం ఇద్దరు పోలీసు అధికారులకు మాత్రమే శిక్ష పడింది. సంఘటన జరిగిన ప్రాంతాన్నంతా వెంటనే నీటితో శుభ్రం చేసి సాక్ష్యాలు లేకుండా చేశారన్నది వారిపై అభియోగం.
అయితే చాలా మంది ప్రజలు వారికి శిక్ష విధించడం తప్పని భావిస్తున్నారు. అధికారుల ఆజ్ఞ లేనిదే వారు ఆ పని చేసి ఉండరనేది ప్రజల అభిప్రాయం.
పాకిస్తాన్‌లో పదవిలో ఉన్న, రిటైరైన మిలటరీ అధికారులతో కూడిన రహస్య నెట్‌వర్క్ చాలా పకడ్బందీగా ఉంటుంది. పాకిస్తాన్ జాతీయ ప్రయోజనాలుగా భావించే వాటి కోసం అది ఎంత దూరమైనా వెళ్తుంది, దేనినైనా కప్పి పెట్టేస్తోంది అనడానికి భుట్టో హత్య ఒక ఉదాహరణగా నిలుస్తుంది.
మా ఇతర కథనాలు:
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.
.








