బంగ్లాదేశ్ హీరోపై కేసు పెట్టిన రిక్షావాలా

సినిమాల్లో హీరో స్టయిల్‌గా తన నెంబర్ చెప్పేస్తాడు. కానీ దాని వల్ల నిజంగా ఆ నెంబర్ కలిగిన వ్యక్తి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో వాళ్లకు తెలీదు.
ఇటీవల ఏపీలో ఓ వ్యక్తి 'రాజా ది గ్రేట్' సినిమా కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుగు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
వాటి ప్రకారం.. ఆ సినిమాలో రవితేజ తల్లిగా నటించిన రాధిక విలన్లతో.. 'ధైర్యముంటే నా కొడుకు నెంబర్‌కు మీ లొకేషన్‌ను వాట్సాప్‌లో పెట్టి చూడండి' అంటూ సవాలు చేస్తుంది.
నిజానికి ఆ నెంబర్ విశాఖ జిల్లా ఆనందపురానికి చెందిన లంకలపల్లి గోపి అనే వ్యక్తిది. దీంతో సినిమా చూసిన చాలామంది ఆ నెంబర్‌కు ఫోన్ చేసి రవితేజ గారూ.. మీ నటన అద్భుతం అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.
అలా విరామం లేకుండా ఫోన్ కాల్స్ రావడంతో విసుగెత్తిన గోపి చివరకు తన ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, Ravi Teja/facebook
తాజాగా బంగ్లాదేశ్‌లోనూ ఓ రిక్షావాలా అలాంటి ఇబ్బందులే ఎదుర్కొన్నాడు. అయితే విషయాన్ని అంతటితో వదిలిపెట్టకుండా అతను ఏకంగా ఆ హీరో పైనే కేసు వేసాడు.
బంగ్లాదేశ్‌లో షకీబ్ ఖాన్ బాగా పేరున్న హీరో. అనేక అవార్డులు కూడా గెల్చుకున్నాడు. ఇటీవలే షకీబ్ రాజ్‌నీతి అనే సినిమాలో నటించాడు.
ఆ సినిమాలోని ఓ సీన్‌లో హీరో తన ఫోన్ నెంబర్‌ను తన గర్ల్ ఫ్రెండ్‌కు చెబుతాడు.
నిజానికి ఆ నెంబర్ ఇజాజుల్ మియా అనే రిక్షావాలాది.
సినిమా విడుదలయ్యాక ఇజాజుల్‌కు రోజూ షకీబ్ ఫ్యాన్స్ నుంచి ఫోన్ కాల్స్ రావడం ప్రారంభమయ్యాయి.
'హలో షకీబ్! మేం నీ ఫ్యాన్స్. ఓ రెండు నిమిషాలు మాట్లాడవా' అంటూ రోజూ సుమారు 500 కాల్స్ వచ్చేవి.
''వాటి వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది'' అని ఇజాజుల్ తెలిపాడు.
ఒక ఫ్యాన్ అయితే అతనే షకీబ్ అనుకుని ఏకంగా 500 కి.మీ. దూరం నుంచి వచ్చేసింది.
ఈ ఫోన్ వ్యవహారం ఎంత దూరం వెళ్లిందంటే ఇజాజుల్ భార్య అతనిపై అనుమానం పెంచుకుంది. విషయం విడాకులు ఇచ్చేవరకు వెళ్లింది.

ఫొటో సోర్స్, AFP
దీంతో తనకు రూ.38 లక్షలు చెల్లించాలంటూ షకీబ్‌పై ఇజాజుల్ కేసు దాఖలు చేసాడు.
తన పని అంతా మొబైల్ మీదే జరుగుతుందనీ, కొత్త నెంబర్ తీసుకుంటే తన జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందనీ ఇజాజుల్ వాదిస్తున్నాడు.
జడ్జి మొదట ఇజాజుల్ కేసును స్వీకరించడానికి నిరాకరించినా, అతని తరపున వాదిస్తున్న లాయర్లు అతని బాధను వివరించడంతో అందుకు అంగీకరించారు.
ఇజాజుల్ కేసు డిసెంబర్ 18న విచారణకు రానుందని స్థానిక మీడియా వెల్లడించింది.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








