పాకిస్తాన్ బ్లాగర్ ఆసిమ్ సయీద్: ‘ప్రాణాలతో బయటపడతానని అనుకోలేదు’

‘‘భారత నిఘా సంస్థ 'రా' (ఆర్.ఏ.డబ్ల్యూ)తో నీకు సంబంధాలున్నాయా? ఎవరి ఆదేశాల ప్రకారం నువ్వు పనిచేస్తావు? 'రా' నుండి డబ్బు ఎలా అందుతోంది?’’ ఇవీ.. ఆసిమ్ సయీద్‌ను అడిగిన ప్రశ్నలు.
ఆసిమ్ సయీద్ ఓ పాకిస్తానీ బ్లాగర్. సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. తన సోదరుడి పెళ్లికి పాకిస్తాన్ వచ్చిన ఆసిమ్‌ను 2017 జనవరిలో కిడ్నాప్ చేశారు. పాకిస్తాన్ గూఢచార సంస్థే తనను కిడ్నాప్ చేసి, కౄరంగా హింసించిందని ఆసిమ్ చెబుతున్నారు.
కిడ్నాపర్ల నుండి విడుదలయ్యాక బ్రిటన్‌లో ఆశ్రయం పొందడానికి ఆసిమ్ ప్రయత్నిస్తున్నారు. పాకిస్తాన్‌లో తనకు ప్రాణహాని ఉందని అంటున్నారు.
జనవరిలో ఐదుగురు సోషల్ మీడియా కార్యకర్తలను కిడ్నాప్ చేశారు. వారిలో ఆసిమ్ సయీద్ ఒకరు. అయితే, కిడ్నాప్ ఆరోపణలను పాకిస్తాన్ ఆర్మీ తోసిపుచ్చింది. కిడ్నాప్‌లకు, ఆర్మీకు సంబంధం లేదని చెబుతోంది.
కిడ్నాప్‌కు గురవడానికి ముందు తాను ఓ ఫేస్‌బుక్ పేజ్‌ను నడిపేవాడినని ఆసిమ్ బీబీసీకి తెలిపారు. పాకిస్తాన్ మిలిటరీ సృష్టించిన 'మోచీ' అనే సంస్థ గురించి ఆ పేజ్‌లో చర్చ జరిగేదన్నారు.
''పాకిస్తాన్ ఏర్పడ్డప్పటి నుంచి దేశంలో మిలిటరీ పాలన ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నడిచేది'' అన్నారు.
70 సంవత్సరాల పాకిస్తాన్ చరిత్రలో సగభాగం మిలిటరీ పాలనలోనే ఉంది.
సోదరుడి పెళ్లికి వచ్చినపుడు కొందరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఆసిమ్‌ను తమ కారు ఎక్కాలని ఆదేశించారని, వాళ్లందరూ ఆర్మీ యూనిఫాంలో కాకుండా మామూలు బట్టల్లోనే ఉన్నారని ఆసిమ్ వివరించారు.
''నిన్ను ఎందుకు తీసుకువచ్చామో తెలుసా?' అని అడిగారు. నాకు తెలియదన్నాను. అప్పుడు నన్ను కొట్టడం మొదలుపెట్టారు. 'మోచీ గురించి మాట్లాడుదాం' అన్నారు. ఆ తర్వాత ఈ-మెయిల్ అకౌంట్, మొబైల్ ఫోన్ పాస్‌వర్డ్‌లు చెప్పాలని అడిగారని’’ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ మానవ హక్కుల సంస్థ గణాంకాల ప్రకారం.. 2016లో 728 మంది అదృశ్యమయ్యారు. ఈ సోషల్ మీడియా కార్యకర్తల అదృశ్యం వెనుక పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ హస్తముందని, అదృశ్యమైన వారిని కోర్టుకు హాజరు పరచకుండా వారికి మిలిటెంట్లతో సంబంధాలను అంటగట్టారని కూడా ఆరోపణలు వచ్చాయి.
ఈ వ్యవహారంతో సెక్యూరిటీ ఏజెన్సీకి ఎటువంటి సంబంధం లేదని, కిడ్నాప్ అయిన వారి సంఖ్య కూడా వాస్తవం కాదని అధికార వర్గాలు చెబుతున్నాయి.
''ఏం జరిగిందో నాకు గుర్తులేదు. నేను కింద పడిపోయాను. నా మెడ భాగాన్ని ఎవరో కాళ్లతో గట్టిగా తొక్కి ఉంచారు. మరొకరు నన్ను కొడుతూనే ఉన్నారు. నా వీపు, చేతులు నలుపు, నీలం రంగులోకి మారిపోయాయి. ఒళ్లంతా కందిపోయింది.''
భారత నిఘా సంస్థ గురించి ప్రశ్నలు అడుగుతున్నపుడు తనకు పలుసార్లు పాలిగ్రాఫ్‌తో పరీక్షించారని అన్నారు.
''భారత నిఘా సంస్థ 'రా' (ఆర్.ఏ.డబ్ల్యూ)తో నీకు సంబంధాలున్నాయా? ఎవరి ఆదేశాల ప్రకారం నువ్వు పనిచేస్తావు? 'రా' నుండి డబ్బు ఎలా అందుతోంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు''
తనకు ఏ నిఘా సంస్థలతోనూ సంబంధాలు లేవని చెప్పానని, తన ఫేస్‌బుక్ పేజ్ గురించి కూడా ప్రశ్నించారన్నారు.
ఆసిమ్ సయీద్‌తో పాటు నిర్బంధంలో ఉన్న మిగతా వారిని కూడా విడుదల చేయాలంటూ దేశ వ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images
నిర్బంధంలో ఉన్నపుడు, తన ప్రాణాలపై ఆశలు వదులుకున్నానని ఆసిమ్ అన్నారు. గతంలో కిడ్నాప్‌కు గురైన సోషల్ మీడియా కార్యకర్తలెవ్వరూ తిరిగి ఇంటికి చేరలేదని చెప్పారు.
అధికార వర్గాలపై ఒత్తిడి పెరుగుతున్న సమయంలో, బ్లాగర్స్‌కు వ్యతిరేకంగా కూడా ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఈ బ్లాగర్స్ అందరూ మత వ్యతిరేకులని, దైవ దూషణకు పాల్పడ్డారంటూ మతపెద్దలు రోడ్డెక్కారు.
పాకిస్తాన్‌లో చట్టాల ప్రకారం, దైవదూషణ మరణ శిక్షకు అర్హమైనది. దైవదూషణ ఆరోపణలున్న కొందరిని ప్రజలే కొట్టి చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి.
కొన్ని వారాల చెర నుండి విడుదలై ఇంటికొచ్చాక కానీ తనపై దైవదూషణ ఆరోపణలున్నాయని తనకు తెలియలేదని ఆసిమ్ చెప్పారు.
తాను ఎప్పుడూ దైవనిందకు పాల్పడలేదని, తన బ్లాగుల్లో కూడా అటువంటి పని చేయలేదని స్పష్టం చేశారు.
కేవలం తమను భయపెట్టడానికి, తమ కుటుంబాలను బెదిరించడానికే ఇలాంటి దైవనింద ఆరోపణలు చేశారని మరో బ్లాగర్ వివరించారు.
పాకిస్తాన్‌లో తాను బతకలేనని, సింగపూర్‌లో కూడా ఉద్యోగం లేకుండా బతకలేనన్నారు ఆసిమ్. అందుకే, ఆశ్రయం కల్పించాల్సిందిగా బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరానని చెప్పారు.
‘‘సోషల్ మీడియా కార్యకర్తగా పనిచేసినందుకు నాకు బాధ లేదు. కానీ, ప్రజల్లో చైతన్యం రావాలి’’ అని ఆసిమ్ సయీద్ అన్నారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








