సరిహద్దుకు ఇరువైపులు.. భర్తల కోసం ఎదురుచూపులు

- రచయిత, రాక్సీ గగ్డేకర్, షుమైలా జెఫ్ఫెరీ
- హోదా, గుజరాత్ (భారత్), సింధ్ (పాకిస్తాన్)
లైలా, అమృత్‌ల మధ్య అరేబియా సముద్రం ఉంది. ఒకరిది పాకిస్తాన్, మరొకరిది భారత్. వీళ్ల దేశాలు వేరైనా, ఎదుర్కొంటున్న సమస్య మాత్రం ఒక్కటే.
వీళ్ల భర్తలు మత్స్యకారులు. లైలా భర్త భారత్ జైలులో, అమృత్ భర్త పాకిస్తాన్ జైలులో మగ్గిపోతున్నారు.
సముద్రంలో సరిహద్దులు దాటారన్న కారణంతోనే ఆ ఇద్దరూ అరెస్టయ్యారు. ఎప్పుడు బయటకొస్తారో తెలియదు.
లైలా ఐదుగురు పిల్లల తల్లి, అమృత్‌కి నలుగురు పిల్లలు. భర్తలు రోజూ చేపల వేటకు వెళ్తే గానీ పూటగడవని పరిస్థితి వాళ్లది. కానీ వాళ్లిప్పుడు జైళ్లలో ఉన్నారు. దాంతో ఈ కుటుంబాలు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి.
"మా భర్తలు స్మగ్లర్లు కాదు. కష్టపడటం తప్ప మరేమీ తెలియని అమాయకులు. పొరపాటున సముద్రంలో సరిహద్దులు దాటినందుకు తీసుకెళ్లి జైలులో పెట్టారు" అని ఆవేదనతో చెబుతున్నారు ఈ మహిళలు.
'భర్తలు ఉన్నా లేనట్టే'
లైలా కుటుంబానికి చెందిన 16 మంది మత్స్యకారులను 2016 డిసెంబర్‌లో భారత నేవీ అరెస్టు చేసింది.
ఆ తర్వాత 2017 జనవరిలో అమృత్ భర్త కాంజితోపాటు, మరో ఆరుగురు భారత జాలర్లను పాకిస్తాన్ అరెస్టు చేసి జైలులో పెట్టింది.

ఈ ఇద్దరికీ చిన్న పిల్లలున్నారు. వాళ్లు అడిగే ప్రశ్న ఒక్కటే, "అమ్మా.. నాన్న సముద్రం నుంచి ఎప్పుడొస్తాడు?’’ అని. అందుకు సమాధానం ఆమెకే కాదు, ఎవరికీ తెలియదు.
"నాన్నా అంటూ నా బిడ్డలు కలవరిస్తున్నారు. నాన్న ఎప్పుడొస్తాడని అడుగుతారు. వాళ్లకు ఏం సమాధానం చెప్పగలను?" అంటూ పాకిస్తాన్‌లోని సింధ్ రాష్ట్రంలో ఉన్న ఝాంగిసర్ గ్రామానికి చెందిన లైలా మౌనంగా రోదిస్తున్నారు.
ఆ ఊరిలో ఎవరిని కదిలించినా ఇలాంటి దీన గాథలే దర్శనమిస్తాయి.
భారత కేంద్రపాలిత ప్రాంతం దయ్యూ దామన్‌లోని వనక్బర గ్రామంలోనూ ఎన్నో కుటుంబాల పరిస్థితి ఇలాగే ఉంది. అందులో ఒకటి అమృత్ సోలంకి కుటుంబం.

ఈమెకు పదమూడేళ్ల కూతురు నమ్రత ఉంది. ఆ చిన్నారి తన తండ్రి గురించి అడిగినప్పుడల్లా "వస్తాడు. నీ అన్నం తినేస్తాడు" అని చెప్పడం తప్ప అమృత్‌కి మరే సమాధానమూ తెలియదు.
ఈ గ్రామస్తులకు చేపలు పట్టడమే జీవనాధారం. పాకిస్తాన్ జైళ్లలో ఉన్న మత్స్యకారుల్లో ఈ వూరి వాళ్లూ ఉన్నారు. దాంతో బాధిత కుటుంబాలు ఆర్థికంగా కుదేలయ్యాయి.
"కుటుంబాన్ని పోషించేందుకు అప్పులు చేయక తప్పట్లేదు. పాకిస్తాన్ జైలు నుంచి నా భర్త తిరిగొచ్చాక అప్పు కడతానని వడ్డీ వ్యాపారులకు చెబుతున్నా’’ అని అమృత్ బీబీసీతో అన్నారు.
ప్రభుత్వ స్పందనేమిటి?
గుజరాత్, దయ్యూ దమన్‌కు చెందిన 376 మంది మత్స్యకారులు పాకిస్తాన్ జైళ్లలో ఉన్నారని గుజరాత్ మత్స్యశాఖ కమిషనర్ మహమ్మద్ షేక్ తెలిపారు.
మరోవైపు, 300 మంది పాకిస్తాన్ మత్స్యకారులు భారత్‌లోని జైళ్లలో మగ్గిపోతున్నారని పాకిస్తాన్‌లోని 'ఫిషర్ ఫోక్ ఫోరం' అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది.
అయితే, పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం భారత్ కస్టడీలో 184 మందే ఉన్నారని అంటోంది.

ఈ రెండు దేశాల్లోని జైళ్లలోని మత్స్యకారుల కుటుంబాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. పూట గడవని స్థితిలో కొందరు మహిళలు వీధుల్లో అడుక్కుంటున్నారు. కొందరు చేపల వేటకు వెళ్లాల్సి వస్తోంది.
వివాదాన్ని పరిష్కరించండి
'సర్ క్రీక్' సరిహద్దు వివాదానికి సత్వర పరిష్కారం కోసం ఇరు దేశాలు కృషి చేయాలని స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి.
- అరేబియా సముద్రతీరంలోని భారత్-పాక్ సరిహద్దు భూభాగాన్ని సముద్ర జలాలు 98 కి.మీ. పొడవునా లోపలికి చొచ్చుకొచ్చి వేరుచేశాయి. ఇలా వేరుచేసిన పాయనే 'సర్ క్రీక్ సరిహద్దు' అని అంటారు.
- ఈ పాయలోకి వెళ్లిన మత్స్యకారులు పొరపాటున సరిహద్దు దాటితే చాలు, జైలుకెళ్లాల్సి వస్తోందని 'ఫిషర్ ఫోక్ ఫోరం' ప్రతినిధులు చెబుతున్నారు. అలా అరెస్టయిన జాలర్లకు 3 నెలలకు మించి జైలు శిక్ష విధించొద్దని కోరుతున్నారు.

భారత మత్స్యకార సంఘాలు కూడా అదే చెబుతున్నాయి.
"మత్స్యకారులను పాకిస్తాన్ అరెస్టు చేసినప్పుడల్లా మేం భారత ప్రభుత్వ సాయాన్ని కోరుతున్నాం. అరెస్టయ్యారంటే వాళ్లను విడిపించేందుకు కనీసం ఏడాది పడుతోంది. దాంతో అనేక కటుంబాలు రోడ్డున పడుతున్నాయి’’ అని పోరుబందర్ ఫిషింగ్ బోట్ అసోసియేషన్ (పీఎఫ్‌బీఏ) మాజీ అధ్యక్షుడు మనీష్ లోధారీ అన్నారు.

మత్స్యకారుల సమస్య పరిష్కారానికి భారత్, పాకిస్తాన్ జుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేశాయి.
జైళ్లలోని మత్స్యకారుల పరిస్థితిని ఏడాదికోసారి పరిశీలించి, వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని, సరైన ఆహారం, వైద్య సదుపాయాలు అందేలా చూడాలని కమిషన్ ఇరు దేశాలకు సూచించింది.
కానీ ఇప్పటివరకు ఆ సూచనలను పట్టించుకున్నదే లేదు.
- మత్స్యకారుల అరెస్టును నిరోధించే అంతర్జాతీయ చట్టానికి అంగీకరిస్తూ రెండు దేశాలూ సంతకాలు చేశాయి. కానీ.. ఆ చట్టాన్నిఇరు దేశాలూ విస్మరిస్తున్నాయి.
- జైళ్లలో మగ్గిపోతున్న జాలర్లను విడిపించేందుకు రెండు దేశాల మధ్య ఆరునెలలకోసారి చర్చలు జరుగుతున్నాయి. విడుదల ప్రక్రియ మాత్రం చాలా నిదానంగా సాగుతోంది.

పుట్టెడు దు:ఖం
పాకిస్తాన్‌లోని ఝంగిసర్ గ్రామానికి చెందిన సల్మా పరిస్థితి మరింత దీనంగా ఉంది. 2016 డిసెంబరులో సముద్రంలోకి వేటకు వెళ్లిన ఈమె కొడుకులను భారత నేవీ అరెస్టు చేసింది.
కొడుకుల అరెస్టును తట్టుకోలేక ఈమె భర్త మరణించాడు. దాంతో కుటుంబం గడవటం భారంగా మారింది. ఒంట్లో శక్తి లేకున్నా, చేపల వేటకు వెళ్లాల్సి వస్తోంది.
"ఇంటర్నెట్‌లో నా కొడుకుల ఫొటోలు చూసిన తర్వాత వాళ్లు అరెస్టయ్యారని అర్థమైంది. భారత మత్స్యకారులను పాకిస్తాన్ అరెస్టు చేసింది. మా కొడుకులను భారత్ కస్టడీలోకి తీసుకుంది. వాళ్లను విడిపించేందుకు ప్రభుత్వం సాయం చేయాలి" అంటూ సల్మా చేతులెత్తి వేడుకుంటున్నారు.

భారత్‌లోని దయ్యూకు చెందిన శాంతా పటేల్ పరిస్థితి కూడా ఇలాంటిదే.
పాకిస్తాన్ అయినా, భారత్ అయినా మత్స్యకారుల జీవితాలన్నీ ఇలాగే ఉన్నాయంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










