చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను మరో మావో అని ఎందుకంటారు?

ఫొటో సోర్స్, Lintao Zhang/Getty Images
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ రెండు రోజుల భారతదేశ పర్యటన కోసం అక్టోబర్ 11 శుక్రవారం దక్షిణాది తీరప్రాంత నగరమైన చెన్నై చేరుకున్నారు.
షీ జిన్‌పింగ్ 2012లో చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఒక అంతర్జాతీయ శక్తిగా చైనా పాత్రను పటిష్టం చేయడంలో జిన్‌పింగ్ కృషి ఎనలేనిదని చెబుతారు.
అవినీతి, భావ ప్రకటనా స్వేచ్ఛ రెండింటిపై నిరంకుశంగా వ్యవహరించారని కూడా ఆయన గురించి చెబుతారు.
రాజకీయ వ్యూహాలు రచించడంలో దిట్ట, అంతుచిక్కని వ్యక్తిత్వం, బలమైన నాయకుడిగా పేరున్న జిన్‌పింగ్ కనీసం 2022 వరకు చైనా కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారని భావిస్తున్నారు.
జిన్‌పింగ్ 1953లో జన్మించారు. ఆయన విప్లవ యోధుడైన షీ జోంగ్జున్ కుమారుడు.
అయితే సాంస్కృతిక విప్లవానికి ముందు 1962లో జరిగిన 'ప్రక్షాళన'లో ఆయన తండ్రి జైలు పాలయ్యారు.
15 ఏళ్ల వయసులో జిన్‌పింగ్‌ను ఏడేళ్ల పాటు గ్రామీణ ప్రాంతాలకు పంపారు. అక్కడి పేద, మారుమూల గ్రామాలలో ఆయన ఎంతో కాయకష్టం చేశారు. ఆయన అధికారిక చరిత్రలో దీని ప్రస్తావన ఎక్కువగా కనిపిస్తుంది.
అయినా జిన్‌పింగ్ కమ్యూనిస్టు పార్టీకి వ్యతిరేకిగా మారకుండా, దాని పట్ల అభిమానంతోనే ఉన్నారు. ఆయన ఎన్నోసార్లు పార్టీలో చేరడానికి ప్రయత్నించినా, తండ్రి నేపథ్యం కారణంగా పార్టీలో ప్రవేశం దొరకలేదు.
జిన్‌పింగ్ ఇలా ఎదిగారు
ఎట్టకేలకు 1974లో జిన్‌పింగ్‌కు పార్టీలో ప్రవేశం లభించింది. ఆ తర్వాత కష్టపడి మొదట హెబెయ్ ప్రావిన్స్ స్థానిక పార్టీ కార్యదర్శి స్థానానికి చేరుకున్నారు. ఆ తర్వాత, చైనాలో రెండో అతి పెద్ద నగరం, ఆర్థిక కేంద్ర బిందువైన షాంఘై పార్టీ చీఫ్ పదవిని చేపట్టారు.
పార్టీలో క్రమంగా పట్టు పెంచుకుంటూ పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీలో చోటు సంపాదించుకున్నారు. 2012లో పార్టీ ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకుంది.
కెమికల్ ఇంజనీరింగ్ చేసిన జిన్‌పింగ్ లియువాన్‌ను వివాహమాడారు. నాటి నుంచి ఈ చైనా ఫస్ట్ కపుల్‌పై ప్రభుత్వ మీడియా ఎన్నో కథనాలు ప్రచురించింది. అంతకు ముందు చైనా ప్రథమ మహిళ గురించి అక్కడ పెద్దగా వార్తలు వచ్చేవి కావు.
మాజీ నేత మావో జెడాంగ్ తరహాలో జిన్‌పింగ్ కూడా వ్యక్తిపూజను ప్రోత్సహిస్తున్నారని ఆయనపై ఆరోపణలున్నాయి.
జిన్‌పింగ్ దంపతులకు ఒకే కూతురు. షి మింగ్జే హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నారు అన్న సమచారం మినహా ఆమె గురించి ఎక్కువగా తెలీదు.
చైనా కల
'చైనా జాతి పునరుజ్జీవం' అన్న తన కలను నిజం చేసేందుకు జిన్‌పింగ్ తీవ్రంగా శ్రమించారు.
తగ్గుముఖం పట్టిన అభివృద్ధిని సరైన దారిలో పెట్టడానికి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రభుత్వ అజమాయిషీ కింద ఉన్న పరిశ్రమలను తగ్గించారు. ఆయన కాలంలోనే ప్రతిష్టాత్మక 'వన్ బెల్ట్ వన్ రోడ్' ట్రేడ్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.
జిన్‌పింగ్ నేతృత్వంలో అంతర్జాతీయంగా చైనా బలోపేతమైంది. అంతర్జాతీయంగా వస్తున్న విమర్శలను పట్టించుకోకుండా దక్షిణ చైనా సముద్రంపై తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.
జిన్‌పింగ్ అవినీతిపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు. పార్టీలోని సుమారు పది లక్షల మందికి పైగా చిన్నాపెద్దా నాయకులను అవినీతి ఆరోపణలతో జైళ్లలో పెట్టారు.

ఫొటో సోర్స్, GREG BAKER/Getty Images
తన ప్రత్యర్థులను తుదముట్టించడానికే జిన్‌పింగ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారని విమర్శలు వచ్చాయి.
ఇటీవల చైనాలో స్వేచ్ఛాస్వాతంత్ర్యాలపై నియంత్రణలు పెరిగిపోయాయి. ఆన్‌లైన్ సెన్సార్‌షిప్‌లు, నిరసనకారులపై ఉక్కుపాదం.. వీటన్నిటితో జిన్‌పింగ్ మావో తర్వాత అంతటి బలమైన నాయకుడు అన్న పేరు పొందారు.
వీటన్నిటినీ పక్కన బెడితే, జిన్‌పింగ్‌కు ఇప్పటికీ సాధారణ పౌరుల మద్దతు ఉంది. వారి సాయంతో రాబోయే కాలంలో ఆయన తన 'చైనా కల'ను నిజం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









