పంటల రక్షణకు మొబైల్ యాప్ ఉపయోగిస్తున్న గుంటూరు రైతులు

- రచయిత, జార్న్ మాడ్‌స్లీన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కరవు, పంటనష్టం, గిట్టుబాటు ధరలు లేకపోవడం.. ఇలా ఒకటి కాదు, అన్నదాతను కుంగదీస్తున్న సమస్యలు. దేశంలో సగానికి పైగా జనాభా ఆధారపడి ఉన్న వ్యవసాయరంగం దుస్థితికి పంటలను నాశనం చేసే చీడపీడలు మరో పెద్ద ఇబ్బంది.
ఈ సమస్యలను భరించలేక, అప్పుల ఊబిలో కూరుకుపోయి ప్రాణాలు తీసుకుంటున్న రైతుల వ్యథలు మనం చూస్తూనే ఉన్నాం.
మరి దీనికి టెక్నాలజీ ఏమైనా పరిష్కారం చూపిస్తుందా?
ఓరుగంటి సురేంద్ర గుంటూరు జిల్లాకు చెందిన ఓ రైతు. ఈయన తన ఎకరం పొలంలో వరిని పండిస్తున్నారు. సురేంద్రతో పాటు మరికొంత మంది రైతులు ఓ మొబైల్ యాప్‌ని ఉపయోగిస్తున్నారు. ఆ యాప్ ద్వారా తమ పంటలను ఆశిస్తున్న తెగుళ్లేమిటి, వాటికి నివారణ, పరిష్కార మార్గాలేమిటో తెలుసుకుంటున్నారు. "ఈ యాప్ మాకు చాలా ఉపయోగపడుతోంది, దీన్ని రైతులంతా వాడుకుంటే బాగుంటుంది" అని వారంటున్నారు.
బెర్లిన్, జర్మనీ దేశాలకు చెందిన విద్యార్థులు, శాస్త్రవేత్తలు కలసి రూపొందించిన ఈ యాప్ పేరు ప్లాంటిక్స్.

"రైతులకేం కావాలో, వారు ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకోవడం చాలా అవసరం, దీనికోసం మేం భారతదేశంలో రైతుల స్థితిగతులపై చాలా అధ్యయనం చేశాం" అంటున్నారు ప్రోగ్రెసివ్ అండ్ అగ్రికల్చరల్ టెక్నాలజీస్ (పీట్) కో-ఫౌండర్ చార్లోట్ షుమాన్.
ఫొటోల సాయంతో సమస్యను గుర్తించి, పరిష్కారాన్ని సూచించే ఓ యాప్ రూపొందించాలనే ఆలోచన వారికి అప్పుడే కలిగింది.
"గుంటూరు జిల్లా బాపట్ల మండలం కర్లపాలెం గ్రామానికి చెందిన రైతు సురేంద్రతో పాటు వరి, పత్తి, అరటి, మిర్చి వంటి పంటలు పండించే మరో 500 మంది రైతులకు దీన్ని అందించాం. తెగులు సోకిన పంటలకు సంబంధించిన ఫొటోలను యాప్‌లోకి అప్‌లోడ్ చేస్తే... ఆ ఫొటోలని విశ్లేషించి, సమస్యకి తగిన సలహాని ఇస్తుంది ప్లాంటిక్స్".

"కేవలం చీడపీడల గురించే కాదు, ప్లాంటిక్స్ ద్వారా టమాటా పంటలో పొటాషియం లోపం, అరటిలో పోషక విలువల లోపం వంటి వాటిని కూడా గుర్తించవచ్చు" అంటున్నారు షుమాన్.
ప్రస్తుతం ఈ యాప్ మన దేశంలో తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషలతో పాటు మరో 5 దేశాల్లో రైతులకు సమాచారాన్నందిస్తోంది.
అయితే, ఇలాంటి అప్లికేషన్లపై పరిశోధన చేసే సంస్థలు ఇంకా చాలానే ఉన్నాయి. ఆఫ్రికాలో సీజీఐఏఆర్ (ఆహార భద్రతపై పరిశోధనలు చేసే సంస్థ) కూడా రైతులకోసం ఓ యాప్ రూపొందించే పనిలో ఉంది. వీరు ప్లాంటిక్స్ కన్నా మెరుగైన యాప్ సిద్ధమవుతోందని చెబుతున్నారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








