సబ్‌మెరీన్‌లోకి వెళ్లి శవంగా తేలిన స్వీడన్ జర్నలిస్టు

ఫొటో సోర్స్, AFP
డెన్మార్క్‌లో ఒక ఇంజినీర్ రూపొందించిన సబ్‌మెరీన్ మీద ప్రత్యేక కథనం రాయడం కోసం వెళ్లిన స్వీడిష్ మహిళా జర్నలిస్ట్ కిమ్ వాల్ సముద్రంలో శవమై కనిపించారు. ఆగస్టు 10వ తేదీన కోపెన్‌హాగెన్‌లో పీటర్ మాడ్సన్ వెంట సబ్‌మెరీన్‌లోకి వెళ్లిన ఆమె ఆ తర్వాత ఆచూకీ లేకుండాపోయారు.
అదృశ్యమైన 11 రోజులకు తల లేని ఆమె మొండెం సముద్రంలో లభించింది. రెండు నెలల తర్వాత ఆమె తలను కూడా డెన్మార్క్ పోలీసులు సముద్రంలో నుంచి వెలికితీశారు.
జర్నలిస్ట్ కిమ్ (30)ను తాను హత్య చేయలేదని పీటర్ (46) చెబుతున్నారు. అయితే కిమ్ స్నేహితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, AFP
పీటర్ స్వయంగా యూసీ3 నాటిలస్ అనే సబ్‌మెరీన్‌ను తయారు చేశారు. అతడి కృషి గురించి కథనం రాయడం కోసం ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అయిన కిమ్ ఆగస్టు 10వ తేదీన అతడితో కలిసి సబ్‌మెరీన్‌లోకి వెళ్లారు. అయితే ఆమె మరుసటి రోజు సాయంత్రానికి కూడా తిరిగి రాకపోవడంతో ఆమె స్నేహితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కిమ్‌ను తాను క్షేమంగా కోపెన్‌హాగెన్‌లో దించానని పీటర్ తొలుత పేర్కొన్నారు. అయితే తర్వాత పోలీసుల విచారణలో మాట మార్చారు. ప్రమాదవశాత్తూ ఆమె తలకు సబ్‌మెరీన్ తలుపు తగిలి బలమైన గాయమవడంతో చనిపోయిందని, తాను ఆమెను సముద్రంలోనే సమాధి చేశానని చెప్పాడు. ఆ తర్వాత సబ్‌మెరీన్‌ను ముంచేసి తాను కూడా చనిపోదామని అనుకున్నానని పేర్కొన్నాడు.
కానీ కిమ్ తలను పరీక్షించిన నిపుణులు ఆమె తలకు ఎటువంటి గాయం కాలేదని తేల్చారు. అంతకుముందు.. కిమ్ మొండెం మీద కత్తితో చేసిన గాయాలు ఉన్నాయని, కానీ అవి ఆమె చనిపోయిన వెంటనే చేసిన గాయాలుగా కనిపిస్తున్నాయని శవపరీక్ష నివేదికలో పేర్కొన్నారు.
అలాగే.. పీటర్‌కు చెందినవిగా భావిస్తున్న హార్డ్ డ్రైవ్‌లో.. సజీవంగా ఉన్న ఒక మహిళ తలను నరుకుతున్న వీడియో దృశ్యాలు ఉన్నాయని ఈ నెల మొదట్లో డెన్మార్క్ ప్రాసిక్యూటర్ జాకబ్-జెప్సన్ వెల్లడించారు.
కానీ ఆ హార్డ్ డ్రైవ్ తనది కాదని, లేబరేటరీలో ఉన్న ప్రతి ఒక్కరికీ అది అందుబాటులో ఉంటుందని అరెస్టయిన పీటర్ చెబుతున్నారు.
ఆ వీడియో దృశ్యాల్లో ఒక మహిళను హింసించి, తల నరికి, మంటల్లో కాల్చిన దృశ్యాలున్నాయని జర్నలిస్ట్ కిమ్‌ను పీటర్ హత్య చేశాడనే తమ అనుమానాలు మరింత బలపడ్డాయని ప్రాసిక్యూటర్ జాకబ్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, RITZAU FOTO
కిమ్ అవార్డు గ్రహీత
స్వీడన్‌కు చెందిన కిమ్ వాల్ ప్రతిభావంతురాలైన ఫ్రీలాన్స్ పాత్రికేయురాలు. పలు అవార్డులు కూడా అందుకున్నారు. ఆమె తన వృత్తిలో భాగంగా ఉగాండా, క్యూబా, మార్షల్ ఐలాండ్స్, కెన్యా, అమెరికా వంటి ఎన్నో దేశాలకు వెళ్లి కథనాలు రాశారు. ఒకసారి ఆమె ఉత్తర కొరియాకి కూడా ‘రహస్యంగా’ వెళ్లొచ్చారని ఆమె స్నేహితులు చెబుతున్నారు.
ఆమె స్వీడన్‌లోని ట్రెల్బార్గ్ పట్టణంలో జన్మించారు. ఆ పట్టణానికి డెన్మార్క్‌లోని కోపెన్‌హాగెన్‌కు మధ్య ఒక జలసంధి మాత్రమే ఉంది.
‘‘ప్రమాదకరమైన చాలా ప్రాంతాల్లో కిమ్ పనిచేశారు. ఆమె గురించి మేం చాలాసార్లు ఆందోళన చెందాం. కానీ, ఆమె తన బాల్యాన్ని గడిపిన ఇంటికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న కోపెన్‌హాగన్‌లోనే తనకు హాని జరుగుతుందని ఊహకు కూడా రాలేదు’’ అని ఆమె కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








