2017: వీరు నోరు జారారా.. పారేసుకున్నారా?!

ఫొటో సోర్స్, Facebook
- రచయిత, అంజయ్య తవిటి
- హోదా, బీబీసీ ప్రతినిధి
మరికొద్ది రోజుల్లో 2017 సెలవు తీసుకోబోతోంది. ఎన్నో గొప్ప సంఘటనలకు సాక్షిగా నిలిచిన 2017లో మరెన్నో వివాదాలు కూడా రేగాయి. అవి సోషల్ మీడియాలో, టీవీ చానెళ్లలో విపరీతంగా చక్కర్లు కొట్టాయి.
కొందరు ప్రముఖులు తమ వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా చాలా సార్లు వార్తల్లోకెక్కారు. పరస్పరం వ్యక్తిగత దూషణలకు దిగిన వారు కొందరైతే.. అలవాటుగానే నోరు జారిన వారు మరికొందరు.
ఇలా తమ వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా వార్తల్లో నిలిచిన వారెవరు? వారు చేసిన ఘాటు ఘాటు వ్యాఖ్యలేంటి? ఓ సారి చూద్దామా సరదాగా!

ఫొటో సోర్స్, Telangana CMO
కోదండ సార్‌పై కేసీఆర్ ఫైర్
తెలంగాణ సీఎం కేసీఆర్, తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరాం మధ్య పరస్పరం మాటల తూటాలు పేల్చుకున్నారు.
"కోదండరాం చేసేది అమరులు స్పూర్తి యాత్రానా.. లేక రాజకీయ యాత్రనా? నీది ఓట్ల రాజకీయం అయితే డైరెక్ట్‌గా రా. జేఏసీ ముసుగు ఎందుకు నీకు. నలుగురు పనికిమాలిన పోరగాళ్లతో సంఘం పెట్టి దానికి జేఏసీ అని పేరు పెట్టుకున్నావ్" అని కేసీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
కోదండరాం కూడా దీనికి దీటుగానే స్పందించారు. రాష్ట్రంలో మంత్రులు లేకుండానే సీఎం నిరంకుశంగా సమీక్షలు చేస్తున్నారని, కేసీఆర్ జాగీర్దార్ వలే పాలిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు.

ఫొటో సోర్స్, YS Jaganmohan Reddy/Facebook
జగనన్నా... ఏందన్నా ఇది?
నంద్యాల ఉప ఎన్నిక ప్రచార కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశిస్తూ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలలో రాజకీయాలు గరం గరంగా మారిపోయాయి.
"ఎన్నికల్లో సానుభూతి కోసం చంద్రబాబు చేస్తున్న కుయుక్తులు చూసినప్పుడు, ఇటువంటి వ్యక్తిని నడిరోడ్డు మీద పెట్టి కాల్చినా తప్పు లేదు" అంటూ జగన్ అన్నారు.
దాంతో ఆయనకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. అయితే, తన వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని ఈసీకి జగన్ వివరణ ఇచ్చారు.
2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని, ఆ ఆవేదనతోనే తానీ వ్యాఖ్యలు చేశానని సమర్థించుకున్నారు.

ఫొటో సోర్స్, Palanatipuli.DrKodelaSivaprasadaro/facebook
కోడెల గారూ.. అదేం మాట సారూ!
అమరావతిలో జరిగిన జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు చేసిన వ్యాఖ్యలతో రేగిన దుమారం ఇంతా అంతా కాదు.
"కారును కొని షెడ్డులో పెడితే యాక్సిడెంట్లు కావు. బయట తిరిగినప్పుడు, అధిక వేగంతో వెళ్లినప్పుడు ప్రమాదాలు జరుగుతాయి. మహిళలు కూడా గతంలో మాధిరిగా.. ఇంట్లో ఉంటే వారిపై ఎలాంటి అఘాయిత్యాలు జరగవు. ఆధునిక కాలంలో ఉద్యోగం, వ్యాపారాల్లో రాణిస్తున్నందునే వారిపై దాడులు పెరుగుతున్నాయని. అలా అని వాళ్లు ఇంట్లోనే ఉండాలని కాదు. ధైర్యంగా బయటకు రావాలి" అని కోడెల అన్నారు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలోనే కాదు జాతీయ మీడియాలో సైతం పెద్ద చర్చకే దారి తీశాయి. దాంతో ఆయన వివరణ ఇచ్చుకోక తప్పలేదు. తన వ్యాఖ్యలపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారని ఆయన వాపోయారు. ఆడబిడ్డలను కించపరిచేలా తాను మాట్లాడలేదని స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, SUDHEER KALANGI
రాజా భయ్యా.. ఎందీ రగడ?
"నా నియోజకవర్గం పరిధిలో 15 సినిమా థియేటర్లున్నాయి. వాటిల్లో ఎక్కడా పద్మావతి సినిమా ఆడకుండా చూస్తా. చరిత్రను వక్రీకరించిన ఈ సినిమా ఆడకుండా చూడడం నా బాధ్యత" అంటూ గోషామహల్ ఎమ్మెల్యే, టి. రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
ఆ మాటకొస్తే రాజాసింగ్‌కు ఇలాంటి వ్యాఖ్యలు కొత్తేమీ కాదు.
పద్మావతిపై దండయాత్ర చేసిన ఓ ముస్లిం ఖిల్జీ, ఒక రాజపుత్ర రాణితో రొమాన్స్ చేసినట్లు చూపించడం అభ్యంతరకరమని ఆయన అన్నారు.

ఐలయ్య పుస్తకం.. టీజీ వెంకటేష్ ఆగ్రహం
'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' పేరుతో కంచె ఐలయ్య విడుదల చేసిన పుస్తకం వివాదాస్పదమైంది.
ఆర్య వైశ్య సంఘాల నేతలు, కంచె ఐలయ్య పరస్పరం వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకున్నారు.
"ఒక కులాన్ని, మతాన్ని కించపరిచే ఇలాంటి వాళ్లను నడిరోడ్డు మీద ఉరి తీసేలా దేశంలో చట్టాలు తీసుకురావాలి" అని ఆర్యవైశ్య మహాసభ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు చేసిన వ్యాఖ్యలతో వివాదం ఇంకా ముదిరింది.
అలాగే.. ఓ టీవీ ఛానల్ చర్చలో పరిపూర్ణానంద స్వామి, ఐలయ్య మధ్య గరం గరం వ్యాఖ్యలు కూడా బాగానే చర్చనీయాంశమయ్యాయి.

వర్మ పేల్చిన లక్ష్మి 'బాంబు'
తరచుగా తనదైన రీతిలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2017లోనూ చాలా అంశాలను టచ్ చేశారు.
అర్జున్ రెడ్డి చిత్రం హీరో విజయ్ దేవరకొండ, పవన్ కల్యాణ్ కంటే 10 రెట్లు బెటర్ అంటూ ఆయన ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టు పవన్ అభిమానులకు విపరీతమైన ఆగ్రహం తెప్పించింది.
అలాగే.. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరుతో సినిమా తీస్తున్నట్టు ఆయన ప్రకటించడం కూడా బాగానే చర్చనీయాంశమైంది.
ఈ సినిమాలో నిజాలను వక్రీకరిస్తే ప్రజలు హర్షించరు, ఎన్టీఆర్ జివితం తెరిచిన పుస్తకం అని ఏపీ సీఎం చంద్రబాబు అంటే.. "ఆ పుస్తకంలోని చిరిగిపోయిన లేదా చింపబడ్డ చాలా పేజీలను తిరిగి అతికించబోతున్నా" అంటూ వర్మ సమాధానం ఇచ్చారు.

ఫొటో సోర్స్, Twitter
రోజా, బండ్ల గణేష్: రచ్చ రచ్చ
ఓ టీవీ ఛానల్ చర్చలో పాల్గొన్న సినీ నటి, వైకాపా ఎమ్మెల్యే రోజా, సినీ నిర్మాత బండ్ల గణేష్‌ల మధ్య మాటల యుద్ధం నడిచింది.
ఆ తర్వాత ట్విటర్‌లోనూ పరస్పరం సెటైర్లు గుప్పించుకున్నారు.

ఫొటో సోర్స్, Youtube
ఆదీ అదేం సెటైర్?!
అనాథ బాలల గురించి 'జబర్దస్త్' టీవీ షో స్కిట్‌లో హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
'అతిగా ఆవేశపడే ఆడదానికి, అతిగా ఆశపడే మగాడికి కలిగే సంతానమే అనాథలు' అన్న ఆదిపై మహిళా సంఘాలు, ఇతరులు గుస్సా గుస్సా అయ్యారు.
ఆదిపై అనాథ ఆశ్రమ బాలలు మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు కూడా చేశారు.

ఫొటో సోర్స్, Twitter
వారికి బుర్రలేదండోయ్: కీరవాణి
ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ట్విటర్‌లో చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చాలా దుమారమే రేపాయి.
"నేను నా కెరీర్‌లో బుర్రలేని చాలా మంది దర్శకులతో కలిసి పనిచేశాను. వారు నా మాట వినేవారు కాదు" అంటూ కీరవాణి ట్వీట్ చేశారు. అలాగే, వేటూరి, సిరివెన్నెల తర్వాత తెలుగు సినిమా సాహిత్యం అంపశయ్యపై ఉందని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
కీరవాణి కామెంట్లను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతో పాటు, పలువురు సినీ ప్రముఖులు తప్పుబట్టారు.
అనంతరం కీరవాణి స్పందిస్తూ.. "మనం ఎప్పటికీ విద్యార్థులమే.. పొరపాట్లు చేస్తుంటాం. మన తప్పులను సరిదిద్దేందుకు తమ్మారెడ్డి భరద్వాజ లాంటి వాళ్లు ఉన్నారు" అని ట్వీట్ చేయడంతో ఆ వివాదం కాస్తా సద్దుమణిగింది.

ఫొటో సోర్స్, Twitter
కత్తుల్ దూసుకున్నారు!
పవన్ కల్యాణ్, ఆయన అభిమానులను ఉద్దేశిస్తూ సినీ క్రిటిక్ కత్తి మహేష్ సోషల్ మీడియాలో చేసిన పలు కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. 'పవన్ కల్యాణ్ దేవుడు' అనే వారిని మెంటల్ డాక్టర్‌కు చూపించాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, పవన్ అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి.
కత్తి మహేష్‌కు సోషల్ మీడియాలో పవన్ అభిమానులు పెద్ద ఎత్తున కౌంటర్లే కాదు, బెదిరింపులు కూడా పోస్ట్ చేశారు.
"మోదీ లాంటి నరహంతకుడితో చెట్టాపట్టాలేసుకుని ఎన్నికల ప్రచారం చేశావంటూ" కత్తి మహేష్ చేసిన ట్వీట్ మరీ వివాదాస్పదమైంది.
దానికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం చెబుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫొటో సోర్స్, NTV Telugu/Youtube
చలపతిరావూ.. ఎంత మాటన్నావూ!
'రారండోయ్ వేడుక చూద్దాం' ఆడియో ఫంక్షన్ సందర్భంగా అమ్మాయిలపై నటుడు చలపతి రావు చేసిన కామెంట్ పెను దుమారమే రేపింది.
మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. చాలా మంది నటీనటులు కూడా ఆయన వ్యాఖ్యలను తప్పుబట్టారు.
దాంతో ఆయన క్షమాపణలు చెప్పక తప్పలేదు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఆయన తరఫున మహిళలకు క్షమాపణలు తెలియజేసింది.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








