2017లో వివాదాల్లో చిక్కుకున్న అందగత్తెలు వీళ్లే

ఫొటో సోర్స్, STR/AFP/Getty Images
అందాల పోటీల్లో గెలవగానే ‘మేం ప్రపంచ శాంతికోసం పనిచేస్తాం’, ‘మా దేశంలో పేదరిక సమస్యపై పోరాడతాం’ లాంటి బరువైన మాటలతో ప్రేక్షకుల మనసు దోచుకునే ప్రయత్నం చేస్తారు కొందరు అందెగత్తెలు. కానీ ఆ పరిధి దాటి రాజకీయాలతో ముడిపడ్డ అంశాలనూ ఇటీవలి కాలంలో కొందరు ప్రస్తావిస్తున్నారు. అవి ఏకంగా వాళ్ల కిరీటానికే ఎసరు పెడుతున్నాయి.
చిలీ, టర్కీ, లెబనాన్, మయన్మార్, పెరూ, అమెరికా... ఈ దేశాలకు చెందిన కొందరు సౌందర్య పోటీల విజేతలు ఈ ఏడాది వివిధ అంశాలపైన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వాటి వల్ల కొందరు అందాల పోటీల టైటిల్‌ని సైతం కోల్పోవాల్సివచ్చింది.
ప్రభుత్వ విధానాలు, వలసదారుల సమస్యలు, దేశాధినేతల పనితీరు... ఇలా రకరకాల అంశాలపై స్పందించినందుకు ఈ ఏడాది వార్తల్లో వివాదాస్పద వ్యక్తులుగా నిలిచిన అందెగత్తెలు వీళ్లు.
ఆ దేశానికి వెళ్లినందుకు..
అమండా హన్నా అనే అమ్మాయి ఇటీవలే ‘మిస్ లెబనాన్ ఎమిగ్రెంట్ 2017’ కిరీటాన్ని దక్కించుకుంది. కానీ వారం తిరగకముందే దాన్ని వదులుకోవాల్సి వచ్చింది. ఆమె చేసిన తప్పల్లా ఓసారి ఇజ్రాయెల్ దేశానికి వెళ్లి రావడమే.
లెబనాన్‌కీ, ఇజ్రాయెల్‌కీ మధ్య చాలా కాలంగా యుద్ధ వాతావరణం నెలకొంది. రెండు దేశాలకూ మధ్య గతంలో యుద్ధం కూడా జరిగింది. ఇప్పటికీ వాటికి సయోధ్య కుదరలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ‘మిస్ లెబనాన్ ఎమిగ్రెంట్’ కిరీటాన్ని దక్కించుకున్న అమండా, గతంలో ఓ అకాడమిక్ ట్రిప్‌లో భాగంగా ఇజ్రాయెల్ వెళ్లినట్టు పోటీ నిర్వాహకులకు తెలిసింది. దాంతో ఆమె టైటిల్‌ని వెనక్కి తీసుకున్నారు.
అమండాకు స్వీడన్ పౌరసత్వం కూడా ఉండటంతో ఆ దేశపు పాస్‌పోర్ట్ సాయంతో ఇజ్రాయెల్‌కు వెళ్లింది. కానీ శత్రు దేశంలో కాలుపెట్టడం తప్పని పోటీ నిర్వాహకులు భావించడంతో ఆమె కిరీటం వదులుకోక తప్పలేదు.

ఫొటో సోర్స్, Instagram / Doron Matalon
గతంలో శాలీ గ్రీజ్ అనే యువతికీ ఇలాంటి సందర్భమే ఎదురైంది. 2014లో శాలీ ‘మిస్ లెబనాన్’ టైటిల్‌ని దక్కించుకుంది. ఆ మరుసటి ఏడాదిలో జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లోనూ ఆమె పాల్గొంది. అక్కడ ‘మిస్ ఇజ్రాయెల్’తో కలిసి సెల్ఫీ దిగడంతో శాలీ చిక్కుల్లో పడింది.
అప్పుడు కచ్చితంగా శాలీ తన ‘మిస్ లెబనాన్’ కిరీటాన్ని కొల్పోతుందని చాలా మంది భావించారు. కానీ ఫేస్‌బుక్‌లో ఆమె వివరణ ఇస్తూ ‘నేను మొదట్నుంచీ మిస్ ఇజ్రాయెల్‌తో దూరంగా ఉండటానికే ప్రయత్నిస్తున్నా. కానీ నేను వేరే వాళ్లతో ఫొటో దిగుతుంటే ఉన్నట్టుండి ఆ అమ్మాయి వచ్చి మాతో సెల్ఫీ తీసుకుంది’ అని చెప్పింది. ఆ వివరణ ద్వారా తన టైటిల్‌ని కాపాడుకోగలిగింది.
పక్క దేశానికి సపోర్ట్
‘ఆ సముద్ర భాగం వాళ్లకు చెందిందే. దాని పైన హక్కులు వాళ్లకే ఉంటాయి’... ఈ మాటల్ని అన్నందుకు పొరుగు దేశం నుంచి ప్రశంసలూ, స్వదేశం నుంచి విమర్శలూ అందుకున్నారు ఓ బ్యూటీ.
చిలీకి చెందిన వాలెంటినా స్నిజర్ ఇటీవలే బొలీవియాలో జరిగిన ‘రీనా హిస్పానో అమెరికానా’ పోటీలో పాల్గొన్నారు. అక్కడ స్టేజీ మీద మాట్లాడుతూ చిలీ, బొలీవియా మధ్య ఉన్న పసిఫిక్ సముద్రంలోని ఓ భాగం బొలీవియాకు చెందిందే అని అందరి ముందూ అన్నారు. ఆమె ప్రస్తావించిన సముద్ర భాగానికి సంబంధించి ఆ రెండు దేశాల మధ్య చాలా కాలంగా వివాదం నెలకొంది.
ప్రస్తుతం ఆ కేసు అంతర్జాతీయ న్యాయస్థానం ముందు ఉంది. ఈ నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సొంత దేశాన్ని వదిలేసి పొరుగు దేశానికి మద్దతిచ్చినందుకు చిలీ వాసులు సోషల్ మీడియాలో ఆమెపై దుమ్మెత్తి పోశారు.
ఇంకోపక్క తన మనసులో మాటను ధైర్యంగా బయటపెట్టినందుకు బొలీవియా అధ్యక్షుడు ఎవో మోరేల్స్ మాత్రం వాలంటినాని ట్విటర్ ద్వారా అభినందించారు.

ఫొటో సోర్స్, Getty Images
అది టెర్రరిస్టుల దాడి
గతంలో మిస్ అమెరికా పోటీలు రాజకీయాల ప్రస్తావన లేకుండా జరిగేవి. కానీ అందులో ప్రశ్న-జవాబుల రౌండ్‌ని ప్రవేశపెట్టినప్పటి నుంచీ అవి వివాదాస్పదంగా మారుతున్నాయి.
ఇటీవల అమెరికాలోని చార్లెట్స్‌విల్లే ప్రాంతంలో నియో నాజీల నిరసన ప్రదర్శన జరిగింది. ఆ ప్రదర్శనకు వ్యతిరేకంగా జరిగిన మరో నిరసన ప్రదర్శనలో హీథర్ హేయర్ అనే మహిళ పాల్గొన్నారు. కానీ ఉన్నట్టుండీ ఆ గుంపులో ఉన్న హెయర్‌పైకి ఓ కారు దూసుకురావడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయారు.
ఈ మొత్తం ఉదంతంపై స్పందించమని ‘మిస్ అమెరికా’ పోటీల్లో పాల్గొన్న మార్గానా ఉడ్ అనే యువతిని జడ్జిలు అడిగారు. ఆ అంశంపైన అంతగా అవగాహన లేని మార్గానా, అది టెర్రరిస్టుల దాడి అనీ, దానిపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించాలనీ కోరడంతో ఆమె వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

ఫొటో సోర్స్, Vittorio Zunino Celotto/Getty Images for IMG
అమరుల రక్తంతో పోలిక
‘జూలై 15న అమరుల దినోత్సవం రోజున నాకు పీరియడ్స్ వచ్చాయి. ఆ రోజు అమరులైన వీరుల రక్తానికి సూచికగా ఈరోజు నేను రక్తాన్ని చిందిస్తున్నాను’ అంటూ మిస్ టర్కీ 2017గా ఎంపికైన ఇతిర్ ఎసెన్ ఓ ట్వీట్ చేసింది. ఆ తరవాత కొద్ది సేపటికే ఆమె తన కిరీటాన్ని కోల్పోయింది.
2016లో టర్కీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో కొందరు పౌరులు చనిపోయారు. వారికి మద్దతుగా ట్వీట్ చేసే ఉద్దేశంతో ఇతిర్ ఆ పోస్టు పెట్టినా అది ఎవరికీ నచ్చలేదు. ఆమె చేసిన పోలిక అమరులను అవమానించినట్టుగా ఉందని ‘మిస్ టర్కీ’ పోటీల నిర్వాహకులు భావించారు. దాంతో ఆమె టైటిల్‌ని వెనక్కి తీసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
గతంలో మిస్ టర్కీ టైటిల్ గెలుచుకున్న మెర్వ్ బుయుక్సరా అనే యువతి కూడా ఆ దేశాధ్యక్షుడిని అవమానించే విధంగా ఉన్న ఓ పోస్టుని షేర్ చేసినందుకు పద్నాలుగు నెలల జైలు శిక్షకు గురయ్యారు. ఆ తరవాత న్యాయవాదుల సాయంతో ఆమె ఆ శిక్ష నుంచి బయటపడ్డారు.
ఈ మధ్యే మిస్ గ్రాండ్ మయన్మార్‌గా ఎంపికైన ష్వే ఐన్ సై అనే యువతి ఆ దేశంలో రోహింజ్యాల సమస్యపై స్పందిస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో రోహింజ్యాలకు వ్యతిరేకంగా ఉండటంతో ఆ దేశస్థులంతా ఆమెను సపోర్ట్ చేశారు. కానీ మిస్ గ్రాండ్ మయన్మార్ పోటీల నిర్వాహకులు మాత్రం ష్వే ఒక రోల్ మోడల్‌లా వ్యవహరించలేదని పేర్కొంటూ ఆమె కిరీటాన్ని వెనక్కి తీసుకున్నారు.

ఫొటో సోర్స్, Shwe Eain Si
ఇలా చాలామంది అందాల పోటీల కంటెస్టెంట్లు తమ వ్యాఖ్యలూ, పోస్టుల ద్వారా ఈ ఏడాది వివాదాస్పదమైన వ్యక్తుల జాబితాలో నిలిచారు. మరోపక్క దీనికి భిన్నంగా ఇటీవల పెరూలో జరిగిన ‘మిస్ యూనివర్స్’ పోటీల కంటెస్టెంట్లంతా ప్రపంచవ్యాప్తంగా ఆడవాళ్లపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా గళమెత్తి అందరి అభినందనలూ అందుకున్నారు.
మా ఇతర కథనాలు:
- ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్టూ వేధింపేనా?
- ఫ్రీగా వచ్చిందని పోర్న్ వీక్షణ!
- ఆర్థిక వ్యవస్థ ఎక్కడుంది? అంబానీ ఆస్తి ఎంత పెరిగింది?
- మత్తు మందుల్ని మించిన వ్యసనం
- ‘వాట్సాప్ ఆగిపోతే? గుజరాత్లో బీజేపీ ఓడిపోతుంది’
- గుజరాత్లో కాంగ్రెస్, బీజేపీ 'సోషల్' వార్
- సోషల్ మీడియాలో మీ పిల్లల ఫొటోలు షేర్ చేస్తున్నారా?
- లైంగిక వేధింపులు: చట్ట ప్రకారం ఫిర్యాదు చేస్తారా? సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








