మిస్ టర్కీ కిరీటం వదులుకునేలా చేసిన ట్వీట్

ఫొటో సోర్స్, Getty Images
ఒక ట్వీట్ వల్ల ’మిస్ టర్కీ 2017‘ తన కిరీటాన్ని వదులుకోవాల్సి వచ్చింది.
18 ఏళ్ల వయస్సున్న ఇతిర్ ఇసేన్.. టర్కీలో గతేడాది జరిగిన తిరుగుబాటు యత్నంపై ప్రభుత్వాన్ని సమర్ధిస్తూ.. చనిపోయిన "అమరవీరుల" రక్తాన్ని తన ఋతుచక్రంతో పోల్చుతూ ఓ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ ఆమోదయోగ్యం కాదని అందుకే ఆమెను అనర్హురాలిగా ప్రకటిస్తున్నామని పోటీ నిర్వాహకులు తెలిపారు. కిరీటం గెలిచిన కొద్ది గంటల్లోనే ఆమెను అనర్హురాలిగా ప్రకటించారు.
అయితే ఇసేన్ మాత్రం తాను రాజకీయ కోణంలో ట్వీట్ చేయలేదని తెలిపింది.
15 జూలై 2016 నాడు టర్కీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు యత్నం జరిగింది. ఆ తిరుగుబాటు యత్నాన్ని ప్రతిఘటిస్తూ 250మంది చనిపోయారు. గత జులైలో మొదటి సంవత్సర వార్షికోత్సవం సందర్భంగా ఆమె ఈ ట్వీట్ చేసింది.
"ఉదయం రుతుస్రావం మొదలయ్యింది .. అమరవీరులు చిందించిన రక్తాన్ని స్మరించుకుంటూ నేను కూడా నా రక్తాన్ని చిందిస్తూ ఈ సంబరాలలో పాల్గొంటున్నాను" అని ఇసేన్ ఆ ట్వీట్‌లో పేర్కొంది.
ఈ తిరుగుబాటు యత్నాన్ని ప్రతిఘటిస్తూ చనిపోయిన వారంతా అమరవీరులని టర్కీ అధ్యక్షుడు రెకెప్ తయ్యిప్ ఎర్డొగన్ తరచూ సంబోధిస్తుంటారు.
ఆ ట్వీట్ గురించి ఫలితాలు ప్రకటించే వరకూ తమకు తెలియలేదని ఈ పోటీ నిర్వాహకులు అన్నారు. ట్వీట్ గురించి సుదీర్ఘంగా చర్చించి, ఆ ట్వీట్‌ను నిర్ధారించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
"ఇతిర్ ఇసేన్ చేసిన ట్వీట్ కారణంగా ఆమెను అనర్హురాలిగా ప్రకటిస్తున్నాం. ఇలాంటి పోస్టులు సమర్థనీయం కావు. ఇది ప్రపంచం ముందు టర్కీ గౌరవానికి సంబందించిన అంశం" అని నిర్వాహకులు ప్రకటించారు.
ఆ తరువాత ఇతిర్ ఇసేన్ స్పందిస్తూ "నేను 18 ఏళ్ల అమ్మాయిని. రాజకీయ ఉద్దేశంతో ట్వీట్ చేయలేదు" అని వివరించారు.
"మాతృదేశాన్ని గౌరవిస్తూనే నేను ట్వీట్ చేశాను. తప్పుగా అర్ధం చేసుకుంటే క్షమించాలి" అని కోరారు.
ఈ పోటీలో రన్నరప్‌గా నిలిచిన అస్లీ సుమెన్ టర్కీ తరపున మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనడానికి చైనా వెళ్లబోతోంది.

ఫొటో సోర్స్, Getty Images
రాజకీయ కారణాలతో ఇబ్బందుల్లో చిక్కుకున్నది ఇతిర్ ఇసేన్ మాత్రమే కాదు.
2016లో మాజీ మిస్ టర్కీ మెర్వే బుయుక్సరక్‌కు 14 నెలల జైలు శిక్ష విధించారు.
టర్కీ అధ్యక్షుడు రెకెప్ తయ్యిప్ ఎర్డొగన్‌కు వ్యతిరేకంగా ఓ వ్యంగ్య పద్యాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసి మెర్వే బుయుక్సరక్ చిక్కుల్లో పడింది. అధ్యక్షుడ్ని కించపర్చినందుకు ఆమెకు 14నెలల జైలు శిక్ష పడింది.
బుయుక్సరక్ 2006లో మిస్ టర్కీ కిరీటాన్ని గెలుచుకుంది.
2015లో టర్కీ అధ్యక్షుడు రెకెప్ తయ్యిప్ ఎర్డొగన్ తనను అవమానించారంటూ వేలాది మందిపై పరువు నష్టం కేసులు వేశారు.
ఆ తరువాత 2016లో ఆయనకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు విఫలమవ్వడంతో ఈ వ్యాజ్యాలను ఉపసంహరించుకున్నారు.
టర్కీలో తిరుగుబాటు విఫలమైన తర్వాత అక్కడి ప్రభుత్వం జాతీయ భద్రత పేరుతో కఠినమైన అణిచివేత కొనసాగించింది. 1,50,000 ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుండి తొలగించింది. దాదాపు 50,000 మందిని అరెస్టు చేసింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









