అభిప్రాయం: ‘బికినీ’ లేని అందాల పోటీని మీరు వీక్షిస్తారా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దివ్య ఆర్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
అమెరికాలో అందాల రాణిని ఎంపిక చేసే ‘మిస్ అమెరికా’ పోటీల్లో ఇకపై బికినీ రౌండ్ ఉండదు.
పోటీలో పాల్గొనే వారి శారీరక ఆకృతిని బట్టి వారిపై నిర్ణయం తీసుకోవటం ఇకపై జరగదని నిర్వాహకులు చెప్పారు.
ఇప్పటివరకూ ఈ అందాల పోటీల్లో భాగంగా ఉండే బికినీ రౌండ్‌లో.. అందులో పాల్గొనే యువతులు ‘రెండు ముక్కల బికినీ’ - అంటే నిజంగా రెండు ముక్కల వస్త్రంతో చేసిన దుస్తులు - ధరించి ర్యాంప్ మీద నడుస్తారు. వారిని న్యాయనిర్ణేతలు పరిశీలించి మార్కులు వేస్తారు.
ఇప్పుడు మిస్ అమెరికా బోర్డులో కేవలం మహిళలు మాత్రమే ఉన్నారు. 1989 మిస్ అమెరికా విజేత గ్రెట్చెన్ కార్ల్‌సన్ అధ్యక్షురాలు. ఇకపై పోటీల్లో బికినీ రౌండ్ ఉండబోదని ఆమె ప్రకటించారు. పోటీలో పాల్గొనే యువతుల ఆకాంక్షలు, అవగాహన, మేధస్సులను బట్టి నిర్ణయం జరుగుతుందని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
కానీ.. ఈ అందాల పోటీల అసలు ఉద్దేశం అందం మీద తీర్పు చెప్పటం.. కదా? అలాంటపుడు బికినీ రౌండ్ మీద వ్యతిరేకత ఎందుకు? ఇలాంటి పోటీలను నిర్వహించటంలో ఇండియాకు కూడా సుదీర్ఘ అనుభవం ఉంది.
ఫెమినా మేగజీన్ మొట్టమొదటిగా 1964లో ‘మిస్ ఇండియా’ పోటీని నిర్వహించినప్పుడు కూడా ‘స్విమ్‌సూట్ రౌండ్’ ఉంది.
కాకపోతే.. రెండు ముక్కల బికినీ కాకుండా.. మహిళ శరీరంలో ఎక్కువ భాగాన్ని కప్పే ఒకే ముక్కతో చేసిన స్విమ్ సూట్‌ను ఉపయోగించారు.
1994లో ఐశ్వర్యారాయ్, సుశ్మితాసేన్‌లు ఈ పోటీల్లో గెలిచినపుడు కూడా అదే తరహా పోటీలు జరిగాయి.
అయినా.. అప్పుడు దీనిని విప్లవాత్మకంగా పరిగణించారు. నిజానికి ఆ అందాల పోటీలను వీక్షించటానికి ఇదే పెద్ద కారణం.

ఫొటో సోర్స్, Getty Images
ఒక లాంఛనమైన కార్యక్రమంలో మోడళ్లను అతి తక్కువ దుస్తుల్లో చూడటం ఇప్పుడు చాలా మామూలుగా జరిగే విషయంగా కనిపించొచ్చు. కానీ.. 1980-90ల్లో కేబుల్ టీవీలు మన ఇళ్లలోకి రాకముందు.. అది చాలా ప్రత్యేకమైనది.
అది యువతీయువకులు ఇరువురికీ అందుబాటులో లేని మరో ప్రపంచాన్ని చూపే ఒక కిటికీ లాంటిది.
అప్పుడు మార్కెట్ బలపడింది. మహిళ అందానికి గీటురాళ్లు ఆమె ముఖం నుంచి ఆమె శరీరం మొత్తానికీ మారాయి. ఆ మార్పుకు అందాల పోటీలు ఒక చిహ్నంగా మారాయి.
స్విమ్‌సూట్‌లో కొన్ని వందల మంది ప్రేక్షకుల ముందు ఈ ‘నడక’.. అందానికి ప్రమాణాలను నిర్ణయించటం ఆరంభించింది. ఆ పోటీలు టీవీలో కోట్ల మందికి ప్రసారమవుతాయి.
స్విమ్‌సూట్ కూడా రెండు ముక్కలుగా చీలిపోయింది. అది మహిళను వస్తువుగా మారుస్తోందన్న వాదనలు వచ్చాయి. చర్చోపచర్చలు సాగాయి.
2000 కాలానికి.. ఈ ట్రెండ్ అందాల పోటీలను దాటుకుని మెయిన్‌స్ట్రీమ్ మీడియాలోనూ సాధారణంగా మారింది.

ఫొటో సోర్స్, Getty Images
సినిమాలు, మ్యూజిక్ వీడియోల్లో ఒళ్లు కనిపించే దుస్తుల్లో ఉండే ఒక నిర్దిష్ట తరహా శరీరాకృతి ఉన్న మహిళలను చూడటం షరా మామూలయింది.
‘మిస్ ఇండియా’ కూడా మామూలుగా మారింది. ఈ తరహాలో ‘మిసెస్ ఇండియా’, ‘మిస్ దివా’, ‘మిస్ సూపర్‌మోల్’ వంటి చాలా పోటీలు నిర్వహించటం మొదలైంది.
ఒక తరహా శరీరాకృతి ప్రజాదరణ పొందింది. మహిళల మీద వారి శరీరాలను బట్టి తీర్పు చెప్పటం అలవాటుగా మారింది.
క్రమంగా.. ఈ కొత్త ‘మామూలు పద్ధతి’ మీద ప్రశ్నలు తలెత్తాయి. ‘బికినీ రౌండ్’ను తొలగించాలన్నడిమాండ్లు వచ్చాయి.
2014లో ‘మిస్ వరల్డ్’ పోటీల్లో (ప్రపంచ సుందరి పోటీలు) బికినీ రౌండ్‌ను రద్దు చేశారు. ఆ తర్వాత రెండేళ్లకు ‘మిస్ ఇండియా’ పోటీల్లో కూడా ఆ రౌండ్ రద్దయింది.

ఫొటో సోర్స్, Getty Images
లింగవివక్ష, లైంగిక వేధింపులు ఎంత విస్తృతంగా ఉన్నాయో చాటిచెప్పిన ‘MeToo’ ఉద్యమం అనంతరం జరిగిన తాజా చర్చల నేపథ్యంలో.. ‘మిస్ అమెరికా’ పోటీల్లో బికినీ రౌండ్‌ను రద్దు చేయటం సహజ పరిణామమే.
కానీ.. దీనివల్ల జరిగేదేమిటి? స్విమ్‌సూట్ రౌండ్ ఒకప్పుడు కిటికీగా ఉన్న ప్రపంచానికి ఇప్పుడు ఒక ద్వారం ఏర్పడింది.
ఇప్పుడు ఒకటే ద్వారం కాదు.. చాలా ద్వారాలున్నాయి. మహిళలను వారి శరీరాకృతులను బట్టి ఈ అందాల పోటీలు తీర్పు చెప్పకపోవచ్చు. కానీ రోజు వారీ జీవితంలో అదే ఒక ముఖ్యమైన గీటురాయిగా మారింది.
ఆ ప్రశ్న మళ్లీ మనల్నే వేలెత్తి చూపుతుంది. బికినీ రౌండ్ లేని అందాల పోటీలను మనం వీక్షిస్తామా? ఒక మహిళ అందాన్ని ఆమె శరీరాకృతిని బట్టి తీర్పు చెప్పటాన్ని మనం ఆపివేస్తామా?
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








