దిల్లీ సమీపంలో ఈ కొంగ కోసం వెతుకులాట.. ఎందుకంటే

ఫొటో సోర్స్, MANOJ NAIR
ఓ అరుదైన కొంగ జాతి పక్షి ముక్కు ప్లాస్టిక్ రింగులో ఇరుక్కుపోయింది. దాంతో ఆ పక్షి ప్రాణానికే ముప్పు ఏర్పడింది.
దాన్ని రక్షించేందుకు వణ్యప్రాణి సంరక్షణ కార్యకర్తలు, అటవీ శాఖ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
పొడవాటి ముక్కు, నల్లని మొడ కలిగి ఉండే ఈ అరుదైన కొంగను మొదట జూన్ 7న దిల్లీకి 34 కిలోమీటర్ల దూరంలోని బసాయి చిత్తడి నేలల్లో పక్షుల సంరక్షణ కార్యకర్తలు గుర్తించారు. దాని ముక్కు చుట్టూ ఓ ప్లాస్టిక్ ఉంగరం బిగ్గరగా కట్టేసినట్టు ఉండటాన్ని గమనించారు.
దాంతో దానికి మేత తినే అవకాశం లేదని, దాంతో అది నీరసించి చనిపోయే ప్రమాదముందని వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే దాన్ని పట్టుకుని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.
"దాని ముక్కుకు ప్లాస్టిక్ రింగ్ చుట్టుకుని ఉంది. దాంతో తిండి తినలేక అది నీరసించిపోతుంది. శరీరంలో శక్తి కోల్పోయి ఎగరలేని స్థితికి చేరుకుంటుంది. ఈ ఎండలకు మరింత డీలాపడి చనిపోయే ప్రమాదముంది" అని దిల్లీ బర్డ్ ఫౌండేషన్‌కు చెందిన పంకజ్ గుప్తా బీబీసీకి వివరించారు.
ఈ పక్షి కోసం గాలిస్తున్న బృందంలో పంకజ్ గుప్తా కూడా ఉన్నారు.

ఫొటో సోర్స్, MANOJ NAIR
ఆ రింగ్ ఒక ప్లాస్టిక్ డబ్బా మూత కింద ఉండే ఉంగరంలా అనిపిస్తోంది. మేత కోసం కొంగ నీటిలో పొడిచినప్పుడు ముక్కు ఆ రింగులో ఇరుక్కుపోయి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కొంగ ఫొటోను మొదట మనోజ్ నాయర్ అనే మరో పక్షి సంరక్షకుడు చిత్రించారు. దాన్ని పంకజ్ గుప్తాతో పాటు, ఇతర సహచరులకు పంపించడంతో చాలా మందికి చేరింది.
దాంతో అందరూ కలిసి దానికోసం కోసం వెతకడం ప్రారంభించారు.
స్థానిక అటవీ అధికారుల సహాయంతో ప్రస్తుతం బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ అనే వణ్యప్రాణి సంరక్షణ సంస్థ కార్యకర్తలు కూడా తీవ్రంగా గాలిస్తున్నారు.
"మొదట్లో వలలు పెట్టి పట్టుకునేందుకు చాలాసార్లు ప్రయత్నించాం. కానీ, అది వలకు చిక్కకుండా ఎగిరిపోయింది. ఇప్పుడు వెదురుబొంగులు, జిగురుతో తయారు చేసిన ప్రత్యేక వలలను వినియోగించాలని నిర్ణయించాం" అని గుప్తా తెలిపారు.
అంతరించిపోతున్న పక్షి జాతుల్లో ఈ నల్ల మెడ కొంగ ఒకటని, ఇవి భారత్, ఇండోనేసియా, శ్రీలంక దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయని ఆయన వివిరించారు.

ఫొటో సోర్స్, MANOJ NAIR
"ఇటీవల దిల్లీ సమీపంలోని చిత్తడి ప్రదేశాల్లో 50 నుంచి 60 పక్షులు కనిపించాయి. ఇవి పొలాల్లో, నీడి మడుగుల్లో చేపలను, నత్తలను ఏరుకుని తింటాయి. తిండి కోసం దాదాపు 15 నుంచి 20 కిలోమీటర్ల దాకా వెళ్తాయి" అని పంకజ్ గుప్తా చెప్పారు.
హరియాణాలోని బసాయి చిత్తడి నేలల్లో భవన నిర్మాణ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసే పరిశ్రమను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే ఆ పరిశ్రమ వల్ల అనేక పక్షిజాతులు అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దానిపై జాతీయ హరిత ట్రైబ్యునల్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఈ పక్షి కోసం తాము పడుతున్న ప్రయాస, బసాయి చిత్తడి నేలల పరిరక్షణకు కూడా దోహదపడుతుందని గుప్తా బృందం ఆశిస్తోంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









