స్వలింగ సంపర్కం ఒక వ్యాధిలాంటిదా, తల్లిదండ్రులు ఏమనుకుంటారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సిద్ధనాథ్ గానూ
- హోదా, బీబీసీ ప్రతినిధి
''భారత సైకియాట్రిక్ సమాజం స్వలింగ సంపర్కాన్ని ఒక వ్యాధిగా పరిగణించకపోవడమనే విప్లవాత్మక వైఖరిని తీసుకోవాలి.''
ఈ మెసేజ్ భారత సైకియాట్రిస్టుల అత్యున్నత సంస్థ అధ్యక్షుడి నుంచి ఫేస్‌బుక్ వీడియో రూపంలో వచ్చింది.
'స్వలింగ సంపర్కం వ్యాధి కాదు'
''ద ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ (ఐపీఎస్) ఎప్పుడూ కూడా స్వలింగ సంపర్కాన్ని ఒక వ్యాధిగా పరిగణించలేదు'' అని ఐపీఎస్‌కు నేతృత్వం వహిస్తున్న డాక్టర్ అజిత్ భిడే బీబీసీకి తెలిపారు. ఫేస్‌బుక్‌లో ఆయన వీడియో చూసి చాలా మంది ఆ సంస్థ ఈ విషయంపై ఇలాంటి వైఖరి తీసుకోవడం ఇదే మొదటిసారి అని భావించడానికి దోహదపడింది. అయితే వాస్తవం మాత్రం దానికి విరుద్ధమని డాక్టర్ భిడే తెలిపారు. ఐపీఎస్ గతంలోనే ఈ వైఖరి తీసుకుందని అన్నారు.
తన అనుభవాలను వివరిస్తూ, ''నేను కౌన్సెలింగ్ ఇచ్చి బాగు చేస్తాననే నమ్మకంతో చాలా మంది.. స్వలింగ సంపర్కులైన తమ పిల్లలను నా దగ్గరికి తీసుకు వస్తుంటారు. అయితే నేను చాలా సేపు తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి అది ఒక వ్యాధి కాదని వాళ్లకు నచ్చచెబుతాను. అంటే వాళ్లు తమ పిల్లలకు కౌన్సెలింగ్ ఇప్పించడానికి వచ్చి, వాళ్లే కౌన్సెలింగ్ తీసకుని వెళుతుంటారు'' అని వివరించారు.
''గత 30-40 ఏళ్లుగా సేకరించిన శాస్త్రపరిజ్ఞానం ఆధారంగా, స్వలింగ సంపర్కాన్ని ఒక వ్యాధిగా పరిగణించడానికి ఎలాంటి ఆధారాలూ లేవు'' అని ఆయన బీబీసీకి వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images
మరి సైకియాట్రిస్టులంతా దీనితో ఏకీభవిస్తారా?
''చాలా మంది సైకియాట్రిస్టులు దీనికి అంగీకరిస్తారు. స్వలింగ సంపర్కులుగా ఉండడం అనేది ఒక వ్యాధి కాదని వాళ్లు విశ్వసిస్తారు. అయితే అలా అంగీకరించని వాళ్లు కూడా కొంత మంది ఉన్నారు. దానిని అంగీకరించడానికి కొంత సమయం పడుతుంది'' అని డాక్టర్ భిడే తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా మనకు ఇలాంటి అనుభవాలు కనిపిస్తాయని ఆయన అంటారు. ''ఇలాంటి పరిస్థితి ఎదురైనపుడు దానిపై నిర్ణయం తీసుకోవడానికి అమెరికన్ సైకియాట్రిక్ సొసైటీ ఓటింగ్‌కు వెళ్లాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆ ఓటింగ్‌లో మూడోవంతు మంది ఆ అభిప్రాయంతో విభేదించారు'' అని భిడే తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
స్వలింగ సంపర్కం, చట్టం
భారతదేశంలో స్వలింగ సంపర్కుల చట్టబద్ధతను గురించి మాట్లాడాలంటే, భారత నేరస్మృతిలోని సెక్షన్ 377 గురించి చర్చించాలి.
ఈ విషయంలో అనేక మలుపులు, మెలికలు ఉన్నాయి. 2013లో సుప్రీంకోర్టు 'ప్రకృతికి విరుద్ధమైన లైంగిక చర్య'ను నేరపూరితంగా పేర్కొంటూ సెక్షన్ 377ను తిరిగి భారతీయ నేరస్మృతిలో చేర్చింది. దీనిలో స్వలింగ సంపర్కం కూడా ఉంది. ఈ సెక్షన్ కింద జీవిత ఖైదు, లేదా పదేళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించే అవకాశం ఉంది.
2017, ఆగస్టులో సుప్రీంకోర్టు గోప్యతకు సంబంధించిన అంశంపై, ''లైంగిక ధోరణి అనేది గోపత్యా హక్కులో ఒక ముఖ్యమైన అంశం'' అని పేర్కొంది. అంతే కాకుండా, లైంగిక ధోరణి ఆధారంగా వివక్షను ప్రదర్శించడం వ్యక్తిగత గౌరవానికి భంగకరమని తప్పుబట్టింది.
ఎల్‌జీబీటీక్యూఐ (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్ ఆర్ క్వశ్చనింగ్ అండ్ ఇంటర్‌సెక్స్) కార్యకర్త ఆదిత్య బంధోపాధ్యాయ, ''మీ వ్యక్తిగత పరిధిలో మీరు స్వలింగ సంపర్కులుగా ఉండడం వరకు ఫర్వాలేదు. కానీ అలాంటి లైంగిక భావాలను మీరు బయట ప్రదర్శించడానికి ప్రయత్నించినపుడు చట్టం దాన్ని నేరపూరితంగా భావిస్తుంది'' అన్నారు.
కానీ ఇక్కడ విషయం సెక్స్ చుట్టూ కేంద్రీకృతం కాలేదు. ఎల్‌జీబీటీక్యూఐ కార్యకర్త, ఎంట్రప్రెన్యూర్ అయిన నక్షత్ర బాగ్వే, ''మేం కేవలం సెక్స్ కోసం పోరాడడం లేదు. ఇది గుర్తింపు కోసం పోరాటం'' అని తెలిపారు.
సెక్షన్ 377ను స్వలింగ సంపర్కులకు వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నారని, అందుకే దానిని తొలగించాలని ఎల్‌జీబీటీక్యూఐల హక్కుల కోసం పోరాడుతున్న కార్యకర్తలు పట్టుబడుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఐఐటీ విద్యార్థుల పిటిషన్
సెక్షన్ 377కు వ్యతిరేకంగా వివిధ ఐఐటీలకు చెందిన 20 మంది విద్యార్థులు, మాజీ విద్యార్థులు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు.
సెక్షన్ 377ను నేరరహితం చేయాలన్న డిమాండ్‌ను సమర్థిస్తూ డాక్టర్ భిడే, మొదటి అది జరిగితే తర్వాత దశలో దానిని ఒక వ్యాధిగా పరిగణించకపోవడం జరుగుతుందన్నారు.
డాక్టర్లకూ అవగాహన లేదు
సైకియాట్రిస్టులు స్వలింగ సంపర్కాన్ని అంగీకరిస్తుండగా, వైద్యసమాజం కూడా ఈ విషయంపై అవగాహన ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉందని కొంతమంది డాక్టర్లు అభిప్రాయపడ్డారు.
''స్వలింగ సంపర్కులపై డాక్టర్లకు ఎన్నడూ అవగాహన కల్పించలేదు. మా సిలబస్‌లో ఎన్నడూ దాని గురించి ప్రస్తావించలేదు. అందువల్ల వైద్యులకు కూడా స్వలింగ సంపర్కంపై అవగాహన కల్పించాలి'' అని ఆంకాలజిస్ట్ మరియు 'హెల్త్ ప్రొఫెషనల్స్ ఫర్ క్వీర్ ఇండియన్స్' (హెచ్‌పీక్యూఐ) సంస్థ నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ దండేకర్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
స్వలింగ సంపర్కంపై ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితి ఉంది?
ఐక్యరాజ్య సమితి 'స్వేచ్ఛ మరియు సమానత్వ ప్రచారం' ప్రకారం, వ్యక్తిగత స్వలింగ సంపర్క సంబంధాల విషయంలో 76కు పైగా దేశాలలో వివక్షపూరితమైన చట్టాలున్నాయి.
స్వలింగ సంపర్క లక్షణాలు ఉంటే 5 దేశాలతో మరణశిక్షను విధిస్తున్నారు.
వాటిలో చాలా దేశాలు గతంలో బ్రిటిష్ వలసదేశాలు. ఆ దేశాలలో అలాంటి చట్టాలను తీసుకురావడానికి బ్రిటిష్ సామ్రాజ్య పాలకులే కారణం. ఇటీవల కామన్వెల్త్ దేశాల సదస్సులో బ్రిటిష్ ప్రధాని థెరెసా మే, స్వలింగ సంపర్కాన్ని నేరపూరితం చేస్తున్న చట్టాలపై ఎల్‌జీబీటీక్యూఐలకు క్షమాపణలు చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా క్రమంగా స్వలింగ సంపర్కాన్ని ఆమోదించడం జరుగుతోంది. ఇటీవల ఆస్ట్రేలియాలో స్వలింగ సంపర్కుల మధ్య వివాహాలను చట్టబద్ధం చేశారు. స్వలింగ సంపర్కుల మధ్య వివాహాన్ని నిషేధించే చట్టాన్ని బెర్మూడా రద్దు చేసింది. స్వలింగ సంపర్కుల మధ్య వివాహాలు తమ అంతిమ లక్ష్యం కాదని, తమ గుర్తింపు కోసమే తాము పోరాడుతున్నామని ఎల్‌జీబీటీక్యూఐ కార్యకర్తలు చెబుతున్నారు.
''మేం సమాజ, దేశ శ్రేయస్సుకు దోహదపడుతున్నాం. కేవలం మేం భిన్నంగా ఉన్నంత మాత్రాన మీరు ఈ దేశానికి చెందిన వారు కాదనడం ఎంత మాత్రం భావ్యం కాదు'' అని నక్షత్ర బాగ్వే అన్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








