ఆమె అతడై.. అతడు ఆమెయై.. తర్వాత ఒక్కటై

- రచయిత, విఘ్నేశ్ అయ్యాసామి
- హోదా, బీబీసీ ప్రతినిధి
పుట్టుకతో ఒకరు అమ్మాయి, మరొకరు అబ్బాయి. పెద్దయ్యాక ఆ ఇద్దరూ లింగ మార్పిడి చేయించుకున్నారు. తాజాగా పెళ్లి చేసుకున్నారు.
ఆరేళ్ల కిందట వీరికి ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు అది కాస్తా ప్రేమగా మారింది. జీవితాంతం ఒకరికొకరు తోడునీడగా ఉందామంటూ వివాహం కూడా చేసుకున్నారు.
"నేను పుట్టుకతో అబ్బాయిని. కానీ, 14 ఏళ్ల వయసులో నేను అమ్మాయిని అన్న విషయాన్ని గ్రహించాను" అని ప్రితీషా బీబీసీకి చెప్పారు.
మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు చెన్నైలో ప్రేమ్ కుమారన్‌తో ఆమె వివాహం జరిగింది. పెళ్లి కొడుకు కూడా లింగ మార్పిడి చేయించుకున్నవారే(ట్రాన్స్ జెండర్).
ప్రితీషా 1988లో తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా కల్యాణిపురంలో జన్మించారు.
స్కూలుకు వెళ్లే సమయంలో స్టేజి డ్రామాలు వేయడమంటే ఆమెకు ఆసక్తి ఉండేది. ప్రస్తుతం ప్రొఫెషనల్ ఆర్టిస్ట్, ట్రైనర్ కూడా.

'ఆ పనులు చేయొద్దని నిర్ణయించుకున్నా'
"2004, 2005 మధ్యలో పాండిచ్చేరిలోని మా బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ సుధ అనే ఓ ట్రాన్స్ జెండర్‌ను కలిశాను. ఆ తర్వాత తమిళనాడుకు చెందిన పలువురు ట్రాన్స్‌జెండర్లు గురించి తెలుసుకున్నాను. వాళ్లంతా మహారాష్ట్రలోని పుణెలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అయితే, ట్రాన్స్ జెండర్లలో ఎక్కువ మంది పొట్ట కూటికోసం భిక్షాటన, లేదంటే వ్యభిచారం చేస్తున్నారు. నాకు ఆ పనులు చేయాలని అనిపించలేదు. నా స్నేహితురాలి సలహాతో రైళ్లలో కీ చైన్లు, మొబైల్ ఫోన్లు అమ్మడం ప్రారంభించాను. చాలా మంది ట్రాన్స్‌జెండర్లు నన్ను కీ చైన్లు అమ్మడం ఆపేయాలని సూచించారు. కానీ, నేను ఒప్పుకోలేదు" అని ప్రితీషా వివరించారు.
అయితే, సిటీ రైళ్లలో వస్తువుల అమ్మకాలపై నిషేధం విధించడంతో ప్రితీషా సొంతంగా ఓ చిన్న దుకాణం ప్రారంభించారు. దాంతో రోజూ రూ. 300 నుంచి రూ. 400 వచ్చేవి.
17 ఏళ్ల వయసులో అప్పటి దాకా దాచుకున్న డబ్బుతో లింగ మార్పిడి చికిత్స చేయించుకున్నారు. అందుకు కుటుంబ సభ్యులు కూడా అభ్యంతరం చెప్పలేదు.
తర్వాత కొన్నాళ్లకు దిల్లీలోని ట్రాన్స్‌జెండర్ ఆర్ట్స్ క్లబ్‌లో ప్రితీషా చేరారు. దేశ రాజధానిలో స్టేజి ప్రదర్శనలు ఇస్తుండేవారు.
మరో 3-4 ఏళ్ల తర్వాత చెన్నైకి వెళ్లారు.

పెళ్లి కొడుకు కథ ఇది
1991లో తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ప్రేమ్ కుమారన్ జన్మించారు. తను పుట్టుకతో అమ్మాయి.
బాల్యం అందరిలాగే గడిచింది. కానీ, తనలో పురుష లక్షణాలు ఉన్నాయని టీనేజీలోకి అడుగుపెట్టిన తర్వాత తెలిసింది.
ఆ విషయం తల్లికి చెబితే, అంతా అబద్ధమని అన్నారు. ఆ లక్షణాలు తాత్కాలికమేనని, కొన్నాళ్లకే పోతాయని చెప్పారు.
కానీ, అలా జరగలేదు.
స్కూలు, కాలేజీలో అమ్మాయిలాగే పేరు నమోదు చేయించారు.
ప్రీతిషా, ప్రేమ్‌లు ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది.
లింగ మార్పిడి ఆపరేషన్ గురించి తెలుసుకునేందుకు 2012లో చెన్నైలో ఉన్న ప్రీతిషా వద్దకు ప్రేమ్ వెళ్లారు.
అప్పటి నుంచి వారు మరింత దగ్గరయ్యారు. 2016లో ప్రేమ్ లింగ మార్పిడి చేయించుకున్నారు.

ట్రాన్స్ జెండర్ అన్న కారణంగా సమాజంలో తమపట్ల ఎవరూ ప్రేమను చూపించడంలేదని బాధపడేవారు.
దాంతో "ఇద్దరం ఒకే కారణంతో ప్రేమకు దూరమవుతున్నాం. మరి మనమే ఎందుకు కలిసి జీవించకూడదు?" అని ఓ రోజు ప్రితీషా అన్నారు.
అందుకు ప్రేమ్ సరే అన్నారు. దాంతో అప్పటి నుంచి వారి స్నేహం పెళ్లి వైపు అడుగులు వేసింది.
చెన్నైలోని పెరియార్ ఆత్మాభిమాన వివాహ కేంద్రాన్ని సంప్రదించి 2018 మార్చి 8న మహిళా దినోత్సవం నాడు వీరు పెళ్లి చేసుకున్నారు.
జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా నిలుస్తామని ప్రమాణం చేశారు.
"కొందరు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు. ఇల్లు ఖాళీ చేయాలని ఇరుగుపొరుగు వారు బెదిరిస్తుంటారు. కానీ, మా ఇంటి యజమానికి చాలా మంచి వ్యక్తి. తన సహకారంతో ఆ ఇంట్లోనే ఉండగలుగుతున్నాం" అని ప్రితీషా తెలిపారు.

ఈ జంటకు ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి.
ఓ షో రూం దగ్గర పనిచేయడం ప్రారంభించారు. కానీ, అక్కడ రోజూ 8 గంటలు నిలబడేందుకు ఆరోగ్యం సహకరించకపోవడంతో మానేశారు.
కొన్ని నెలలపాటు ఖాళీగా ఉన్నారు. ఉపాధి కోసం వెతుకుతున్నారు.
కాలేజీ రోజుల్లో రోడ్డు ప్రమాదం కారణంగా ప్రేమ్ చదువు ఆపేశారు. ఇప్పుడు అతన్ని దూర విద్యలోనైనా చదివిస్తానని ప్రితీష బీబీసితో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








