ఆ సబ్బులతో మగవాళ్లలో వక్షోజాలు పెరుగుతాయా

ఫొటో సోర్స్, Getty Images
టీనేజ్ మగపిల్లల్లో వక్షోజాలు పెరగడానికి, లావెండర్, తేయాకు నుంచి తీసిన సుగంధ తైలాల వాడకానికి మధ్య చాలా దగ్గర సంబంధం ఉన్నట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
ఒక పరిశోధనలో - ఇలాంటి సుగంధ తైలాలలోని 8 కెమికల్స్ హార్మోన్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు గుర్తించారు.
మగవాళ్లలో వక్షోజాలు పెరగడాన్ని వైద్య పరిభాషలో 'గైనెకోమాస్టియా' అంటారు. అయితే దీనికి ఖచ్చితమైన కారణాలు తెలీదు.
సుగంధ తైలాల వాడకం వల్లే ఇది జరుగుతున్నట్లు ఇప్పుడు గుర్తించారు. అమెరికాలో నిర్వహించిన ఒక పరిశోధనలో సుగంధతైలాలలోని కొన్ని కెమికల్స్, ఈస్ట్రోజన్‌ను పెంపొందించి, టెస్టోస్టిరాన్‌ను అడ్డుకుంటున్నట్లు వెల్లడైంది.
అనేక సందర్భాలలో మగవాళ్లలో వక్షోజాలు పెరగడానికి ఈ సుగంధ ద్రవ్యాలే కారణమని గుర్తించారు. వాటిని వాడడం నిలిపేయగానే వక్షోజాలు పెరగడం ఆగిపోయింది.
అయితే సుగంధ తైలాలు వాడే వారందరిలోను ఇది జరుగుతుందని చెప్పలేం.
మొక్కల నుంచి తీసిన సుగంధ తైలాలను సబ్బులు, లోషన్లు, షాంపూలు, హెయిర్ స్టైలింగ్ ఉత్పత్తుల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
అయితే వాటిని ఉపయోగించే విషయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలని నార్త్ కరోలినాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ సైన్సెస్‌లో పరిశోధకుడిగా పని చేస్తున్న టైలర్ రామ్‌సే తెలిపారు.
వాటిలో చాలా కెమికల్స్ ఉంటాయని, అవి అంతస్స్రావ గ్రంథులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆయన హెచ్చరించారు.
ఈ పరిశోధనలో వందలాది సుగంధ తైలాలను పరిశీలించగా, 8 కెమికల్స్ వక్షోజాల వృద్ధికి దోహదం చేస్తున్నాయని గుర్తించారు.
వాటిని లేబరేటరీలో పరిశీలించగా, అవి ఈస్ట్రోజన్ ఉత్పత్తిని పెంచి, టెస్టోస్టిరాన్ లక్షణాలను అడ్డుకుంటున్నట్లు తేలింది.
మొత్తం 65 సుగంధ తైలాలలో ఇలాంటి సమస్యాత్మక కెమికల్స్‌ను గుర్తించారు.

సుగంధ తైలాలు - జాగ్రత్తలు
- పలుచన (డైల్యూట్ ) చేయని సుగంధ తైలాలను సరాసరి చర్మం మీద రాయొద్దు.
- మూడేళ్ల లోపు పిల్లలకు పలుచన చేయని నూనెలను ఉపయోగించొద్దు.
- గర్భవతులు డాక్టర్ల సూచన తీసుకున్న తర్వాతే సుగంధ తైలాలను ఉపయోగించాలి.
కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఫ్రొఫెసర్ యువాన్ హ్యూజెస్, అలాంటి సుగంధ తైలాలను వాడే మగవాళ్లలో వక్షోజాలు పెరుగుతున్నాయని ఈ పరిశోధనలో తేలినా, వాటిని వాడే అందరిలో ఇది జరుగుందని చెప్పలేం అన్నారు.
కొందరు అలాంటి వాటికి సెన్సిటివ్‌గా ఉంటారని తెలిపారు. ఇలాంటి సుగంధ తైలాల విషయంలో మరిన్ని కఠినమైన నిబంధనలు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే ఎడిన్‌బర్గ్‌లోని క్వీన్స్ మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో కన్సల్టెంట్ ఎండోక్రినాలజిస్ట్‌గా ఉన్న డాక్టర్ రాడ్ మిచెల్ - గైనెకోమాస్టియాకు లావెండర్, తేయాకు నూనెల మధ్య సంబంధం ఉన్నట్లు తెలుస్తున్నా, ఈ కెమికల్స్ ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్‌లపై ఏ విధమైన ప్రభావం చూపుతాయో లేబరేటరీలో ఖచ్చితంగా అంచనా వేయలేమన్నారు.
అందువల్ల దీనిపై మరింత లోతైన పరిశోధన జరగాలని అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








