ఈ రైతులు కరువు నేలలో కోట్లు పండిస్తున్నారు

ఫొటో సోర్స్, బీబీసీ
- రచయిత, శ్యాంమోహన్
- హోదా, బీబీసీ కోసం
ఒకప్పుడవి రాళ్లు నిండిన బీళ్లు... ఇప్పుడవి కాసులు పండే పండ్లతోటలు. అప్పుడు చాలీ చాలని జీతంతో ఇబ్బంది పడేవారు.. ఇప్పుడు మరికొందరికి ఉపాధినిస్తున్నారు.
సకాలంలో వానలు లేక జీవం కోల్పోయిన భూమిలో పంటలు పండించే శక్తి లేక నగరానికి వలస పోయింది మునియప్ప కుటుంబం.
ఆయనకు పోలీసు కొలువు దొరకడంతో బెంగళూరులో ఉండి పోయారు. కానీ,అతడి భార్య గౌరమ్మ మనసంతా సొంతూర్లో పంటలు లేక వృధాగా ఉన్న భూమి మీదే.
ఆమెకు.. నిత్యం పెరుగుతున్న పండ్లు,కూరగాయలు ధరలు తట్టుకొని,చాలీ చాలని జీతంతో బతకడం కష్టమనిపించింది.
మునియప్పకు కూడా తాను చేస్తున్న సర్కారీ ఉద్యోగం అంత సుఖంగా అన్పించలేదు. వ్యవసాయం చేసి ఏదైనా సాధించాలని నిర్ణయించి.. సొంతూరు నాగతిహల్లి(చిత్రదుర్గ జిల్లా,కర్నాటక) కి తిరిగి వచ్చారు.

'బిందె' సేద్యం
కర్నాటకలోని కరవు జిల్లాల్లో ఒకటి చిత్రదుర్గ. ఈ జిల్లా కేంద్రానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది నాగతిహల్లి గ్రామం.
పదేళ్లుగా ఇక్కడ అతి తక్కువ వర్షపాతం నమోదవుతోంది. బతుకు తెరువు కోసం రైతులు భూములను వదిలేసి వలస పోతున్న క్లిష్ట సమయంలో, నగరం నుండి ఆ గ్రామంలోకి తిరిగి వచ్చాడు మునియప్ప.
ఇరవై ఎకరాల బీడు నేలను దున్నారు. రాళ్లను తొలగించి,వాటితో వాలుకు అడ్డుకట్టలు కట్టారు. దానిమ్మ,సపోటా మొక్కలు నాటారు.
భూమిలో తేమ లేక పోయినా ట్యాంకులతో నీటిని రప్పించి, బిందెలతో ప్రతీ మొక్కకు పోశారు.ఇలా వేసవి అంతా కష్టపడ్డారు.

సరస్సుల్లాంటి కుంటలు
ట్యాంకుల ద్వారా నీరు తేవడం,బిందెలతో పోయడం వ్యవ ప్రయాసలతో కూడినది కావడంతో వ్యవసాయనిపుణుల సహకారం తీసుకొని భూసార పరీక్షలూ, భూగర్భ జలాల పెంపుకోసం సలహాలూ తీసుకున్నారు.
వారి సలహా మేరకు తమ భూమిలో అర ఎకరం విస్తీర్ణంలో రెండు పంటకుంటలను 40 అడుగుల లోతున తవ్వి గోడల చుట్టూ, టార్పాలిన్ కవర్ పరిచారు.
చూడ్డానికి చిన్న సరస్సుల్లా కనిపించే వీటిలో 2 లక్షల లీటర్లకు పైగా నీటిని నిల్వచేసే సామర్థ్యం ఉంటుంది.
ఇందులోకి ఎగువ నుంచి వచ్చే వాన నీరంతా మళ్లించే ఏర్పాటు చేశారు. వర్షాకాలం పూర్తి అయ్యేసరికి ఈ పంటకుంటల చుట్టుపక్కల కిలొమీటరు పరిధిలో అరవై బోరుల్లోకి నీరు చేరింది.
ఫలించిన సమష్టి శ్రమ
ఎందుకు పనికి రాదనుకున్న నేలను సాగుకు అనువుగా మార్చడంలో మనియప్పకు భార్య గౌరమ్మ , కొడుకు చంద్రశేఖర్, కోడలు పల్లవి కూడా సహకరించారు.
ఫలితంగా వీరి ఇరవై ఎకరాల్లో దానిమ్మ,సపోటా పండ్లు పండుతున్నాయి.
నాణ్యమైన చిత్రదుర్గ దానిమ్మ పండ్లకు వీరి తోట ప్రసిద్ధి. వ్యాపారులు వారి తోటకే వచ్చి పండ్లను కొనుగోలు చేసి దేశం నలుమూలలకు పంపుతున్నారు.

పోలీసు కొలువు కంటే పొలం పనే హాయి
'' నిత్యం ఒత్తిడితో ఉండే కానిస్టేబుల్ ఉద్యోగం నాకు తృప్తినివ్వలేదు. మాకు కావాల్సినవి మేమే పండించుకోవాలనుకొని జాబ్ మానేసి రెండేళ్ల క్రితం పొలం బాట పట్టాను.రెండు బోర్లు వేశాం పడలేదు.ఇలా కాదని ముందుగా పంట కుంటలు తవ్వి,వాలులో రాతికట్టలు కట్టి వాన నీటిని ఒడిసిపట్టే పనులు చేశాం.
లక్కీగా అదే సమయంలో వానలు పడి కుంటలు నిండాయి. మా కష్టాన్ని వ్యవసాయశాఖ,నాబార్డు వారు గుర్తించి పంట కుంటల నిర్మాణంలో సహకరించారు. ఇపుడు భూగర్భ జలాలు పెరిగి,తోటలు పచ్చగా మారాయి.
పోలీసు ఉద్యోగం కంటే పొలం పనే తృప్తిగా ఉంది.' - మునియప్ప .

బిందు సేద్యం
' కరవు ప్రాంతంలో పండ్లతోటలా? అని మమ్మల్ని మొదట్లో కొందరు నిరాశ పరిచారు. ఇవేమీ పట్టించుకోకుండా మా ఫ్యామ్లీ మొత్తం కలిసి భూమిని అభివృద్ధి చేశాం.
మా పొలంలోనే వాననీటి ప్రవాహాన్ని ఆపే జల సంరక్షణ పనులు చేయడం వల్ల బోర్లలో నీటి మట్టం పెరిగింది. ఒకపుడు మా కోడలు పల్లవితో కలిసి బిందెలతో నీటిని పోసేవాళ్లం. నేడు బిందు(డ్రిప్) సేద్యం చేస్తూ, ఉన్న నీటిని పొదుపుగా వాడుతున్నాం. సేంద్రీయ ఎరువులు, వేపనూనె స్వయంగా తయారు చేసుకుని ఎరువులుగా ఉపయోగించుకుంటున్నాం.
చెట్టుకు 50 నుండి 72 కిలోల పండ్ల దిగుబడి వస్తోంది. మేం బతుకుతూ పది మందికి ఉపాధి కల్పిస్తున్నాం.' అని సంతోషంగా చెప్పింది మునియప్ప భార్య గౌరమ్మ.
రోజూ ఎండల్లో మట్టిలో కష్టపడటం ఇబ్బందిగా లేదా అని గౌరవమ్మ కోడలు పల్లవిని అడిగితే 'అస్సల్లేదు. మాది వ్యవసాయ కుటుంబమే, మా శ్రమ ఫలించి పండ్లు పండాక ఆ చెట్ల ముందు నిల్చునే అనుభవం.. ప్రతిసారీ ఓ పాపని ప్రసవించినంత ఆనందంగా ఉంటుంది.' అని అన్నారు.
ఒకపుడు 600 అడుగులు తవ్వినా పడని బోర్లు నేడు 80 అడుగులకే నీళ్లు పడుతున్నాయని మునియప్ప కుమారుడు చంద్రశేఖర్ అంటున్నారు. జలసంరక్షణ వల్ల వీరి తోటలో 3బోర్లు వేసవిలో కూడా పనిచేస్తున్నాయి.బీటెక్ చదివిన ఇతడు పండ్లను మార్కెట్ చేసే పనుల్లో నిమగ్నమవుతాడు.

ఏడాదికి రూ.కోటి
నేడు ఈ కుటుంబం ఆర్థిక ముఖచిత్రమే మారిపోయింది. సపోటా,దానిమ్మను కర్నాటక,ఆంధ్రా, కేరళకు ఎగుమతి చేస్తూ, ఏడాదికి రూ.కోటికి పైగా ఆర్జిస్తూ, సుస్ధిర ఆదాయం పొందుతున్నారు.
దేశం మొత్తం మీద దానిమ్మ దిగుబడిలో చిత్రదుర్గ జిల్లా ప్రసిద్ది చెందడం వెనుక ఈ కుటుంబం కృషి కూడా ఉంది. ఇక్కడ పండిన దానిమ్మ పండ్లను కర్నాటకలో వైన్ తయారీకి కూడా ఉపయోగిస్తున్నారు.

ఊరు మారుతోంది
ఈ కుటుంబం చేపట్టిన పనుల వల్ల రెండేళ్ల తరవాత అక్కడ ఎంతో మార్పు వచ్చింది. బీడు నేలల్లో పంటలు పండటం మొదలైంది. వలసలు వెళ్లి వారంతా వెనక్కి వచ్చి అన్నదాతలుగా మారుతున్నారు.
ఈ కుటుంబం ప్రయోగం సఫలం కావడంతో... ఏకంగా 930 ఎకరాల్లో నాబార్డు ఈ ప్రయోగాన్ని అమలు చేస్తున్నది.
దీన్ని మైక్రో వాటర్ షెడ్ ప్రాజెక్టులుగా పిలుస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








