వాట్సాప్: భారత మొబైల్ పేమెంట్ మార్కెట్‌ను శాసిస్తుందా?

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న చాటింగ్ యాప్‌గా వాట్సాప్‌కు పేరుంది. ఇటీవల ఆన్‌లైన్ చెల్లింపుల కోసం కొత్త సర్వీసును ఇది ప్రారంభించింది. ఇది భారత్‌లోని మొబైల్ వాలెట్ మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? బీబీసీ ప్రతినిధి దెవినా గుప్తా విశ్లేషణ.
ప్రస్తుతానికి బీటా వెర్షన్‌లో మొబైల్ చెల్లింపులను వాట్సాప్ పరీక్షిస్తోంది. ఇప్పటికే దేశంలో చాలా మంది దీన్ని వాడుతున్నారు. వాట్సాప్‌లో చాట్ చేసినంత సులభంగా ఇప్పుడు డబ్బును పంపే అవకాశం దీని ద్వారా కలిగింది.
దేశంలో ఇంటర్నెట్, వాట్సాప్‌ల వల్లే మొబైల్ రంగం బాగా విసృతమైంది. వాట్సాప్ తీసుకొచ్చిన ఈ కొత్త ఆప్షన్‌తో దేశంలో మొబైల్ చెల్లింపుల్లో అగ్రగామిగా ఉన్న పేటీఎం బాగా కలవరపడుతోంది.
''కీలకమైన చెల్లింపు నిబంధనల నుంచి వాట్సాప్ తప్పించుకుంటుందని'' పేటీఎం వ్యవస్థాపకులు విజయ్ శేఖర్ శర్మ ఆరోపించారు. అయితే, ప్రభుత్వం ఆయన వ్యాఖ్యలను ఖండించింది.
జపాన్‌కు చెందిన సాఫ్ట్ బ్యాంక్, చైనాకు చెందిన అలీబాబా పేటీఎంలో భాగస్వామ్య సంస్థలు. దేశంలో 30 కోట్ల మంది పేటీఎం వినియోగదారులుగా ఉన్నారు. రోజువారిగా 50 కోట్ల చెల్లింపులు దీని ద్వారా జరుగుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం 2016లో ఒక్కసారిగా పెద్ద నోట్లను రద్దు చేయడం పేటీఎంకు బాగా కలిసొచ్చింది. ఈ నిర్ణయంతో అత్యధికంగా లాభపడింది ఈ సంస్థే.
పెద్ద నోట్ల రద్దు తర్వాత తమ యాప్ ట్రాఫిక్ 700 శాతానికి పెరిగిందని, 300 శాతం మంది కొత్తగా పేటీఎంను డౌన్‌లోడ్ చేసుకున్నారని ఆ సంస్థ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
పేటీఎం ఏమంటోంది?
వాట్సాప్‌ను సొంతం చేసుకున్న ఫేస్‌బుక్‌పై పేటీఎం విమర్శలకు దిగుతోంది. కొన్ని వెబ్‌సైట్లనే అనుమతించే విధంగా ఫేస్‌బుక్ యాప్ ఉచితంగా ఇంటర్నెట్ సేవలు అందిస్తోందని, నెట్ న్యూట్రాలిటీకి భంగం కలిగిస్తోందని ఇప్పటికే దీనిపై విమర్శలు వచ్చాయి.
భారత టెలికాం రంగం ఇప్పటికే ఈ యాప్‌పై నిషేధం విధించింది.
''పోటీ యాప్‌లను నిర్వీర్యం చేయడానికి వాట్సాప్ ప్రయత్నిస్తోంది. మార్కెట్‌లో పెత్తనం చెలాయించేందుకు ఫేస్‌బుక్ ప్రయత్నిస్తోంది. వినియోగదారులను తమ వ్యవస్థ ద్వారా అదుపు చేయాలని అది భావిస్తోంది'' అని పేటీఎం సీనియర్ వైస్ ప్రసిడెంట్ దీపక్ అబాట్ బీబీసీకి వివరించారు.
అయితే, మార్కెట్‌లో ఉన్న ఇతర పోటీ సంస్థలు మాత్రం ఆయన అభిప్రాయంతో ఏకీభవించడం లేదు. దేశంలో మొబైల్ చెల్లింపుల రంగానికి మరింత మార్కెట్ ఉందని అంటున్నాయి.
''దేశంలో మొబైల్ ద్వారా చెల్లింపులు జరిపేవారు 5 నుంచి 10 శాతం మంది మాత్రమే ఉన్నారు. కొత్తగా ఇంకో సంస్థ ఈ రంగంలో దిగడం మంచి పరిణామమే'' అని మొబీక్విక్ వ్యవస్థాపకులు బిపిన్ ప్రీత్ సింగ్ అభిప్రాయపడ్డారు.
''మొబీక్విక్ లాంటి దేశీయ కంపెనీలకు క్షేత్రస్థాయిలో భారీగా ఉద్యోగులున్నారు. చెల్లింపుల్లో ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే సరిదిద్దే వ్యవస్థ ఉంది. కానీ, అంతర్జాతీయ సంస్థలు ఈ విషయంలో మాతో పోటీ పడలేవు'' అని ఆయన పేర్కొన్నారు.
వాట్సాప్‌లో చెల్లింపులు ఎలా?
యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) పద్ధతిని ఉపయోగించి వాట్సాప్ ద్వారా చెల్లింపులు చేయొచ్చు. ఈ పద్ధతిలో ఒకరి బ్యాంకు అకౌంట్ నుంచి మరొకరి బ్యాంకు అకౌంట్‌కు నగదు బదిలీ అవుతుంది.
ఇందుకోసం వినియోగదారులు బ్యాంక్ అకౌంట్‌ను తమ వాట్సాప్‌కు అనుసంధానించుకోవాల్సి ఉంటుంది.
కేవలం మొబైల్ చెల్లింపులే కాకుండా పేటీఎం మాదిరిగా సినిమాలు, రవాణా టికెట్లు తదితర ఇతర సేవలను కూడా అందించడమే వాట్సాప్ ముందున్న పెద్ద సవాల్.

ఫొటో సోర్స్, Getty Images
పేటీఎంకు ముప్పు పొంచి ఉందా?
భారత్‌లో అత్యధిక మందికి తెలిసింది, ఎక్కువ మంది వాడుతోంది పేటీఎం మాత్రమే. అదే దీని బలం. చిరు వ్యాపారులు, టీ కొట్టు యజమానులు, ఆటో డ్రైవర్లు కూడా నగదు చెల్లింపులకు పేటీఎంను వాడుతున్నారు.
ఇటీవల బ్యాంక్ తరహా సేవలను కూడా పేటీఎం ప్రారంభించింది. భవిష్యత్తులో ఇన్సూరెన్స్ సేవలను కూడా మొదలుపెట్టనుంది. అయితే, వాట్సాప్ లాంటి అంతర్జాతీయ సంస్థలు భారీ స్థాయిలో నిధులు గుమ్మరించి 23 కోట్ల మందికి పైగా ఉన్న తన వినియోగదారులను ఆకట్టుకోగలదు.
ఇప్పటికే వాట్సాప్ బీటా వెర్షన్‌ను వినియోగిస్తున్నవారి సంఖ్య భారీగా పెరిగింది. మరోవైపు వాట్సాప్‌తో తాము పోటీకి సిద్ధమని పేటీఎం స్పష్టం చేసింది.
''వాట్సాప్‌ను మరో ప్రత్యర్థిగా పరగణిస్తాం. యూపీఐ పద్ధతికి 90 శాతం మంది ఇంకా దూరంగానే ఉన్నారు. వాట్సాప్ మాదిరిగా మేం కూడా ఈ మార్కెట్‌లో వినియోగదారులను ఆకట్టుకుంటాం. మన సేవలు నచ్చితే ఈ మార్కెట్‌లో నిలబడగలం. ఈ రంగంలో మరింత మంది రావడం సంతోషమే'' అని ఆయన పేర్కొన్నారు.
అలీబాబా తరహాలోని తమ మనుగడ దెబ్బతింటుందని పేటీఎం ఆందోళన చెందుతోంది.
అలీబాబా కంపెనీ 2009లో 'అలీపే' పేరుతో మొబైల్ చెల్లింపుల సర్వీసును ప్రారంభించింది. మొదట్లో మార్కెట్‌లో దీనిదే గుత్తాధిపత్యం. అయితే టెన్‌సెంట్ అనే చాటింగ్ యాప్ ఇదే మార్కెట్‌లోకి రావడంతో పరిస్థితి మారింది. మార్కెట్‌లో అలీపే వాటా 80 నుంచి 53 శాతానికి పడిపోయింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








