ఐక్యరాజ్య సమితి: ‘రోహింజ్యాల ఊచకోతలో ఫేస్‌బుక్ పాత్ర’

ఫొటో సోర్స్, Getty Images
మయన్మార్‌లో రోహింజ్యా ముస్లింలపై విద్వేషాలను పెంచే విషయంలో ఫేస్‌బుక్ 'చెప్పుకోదగిన పాత్ర' పోషించిందని ఐరాస తెలిపింది.
మయన్మార్‌లో సామూహిక హత్యాకాండపై విచారణ జరుపుతున్న ఐరాస బృందంలోని సభ్యురాలొకరు 'ఫేస్‌బుక్ మృగంలా మారింద'న్నారు.
రఖైన్ రాష్ట్రంలో 'తిరుగుబాటుదారుల'కు వ్యతిరేకంగా మయన్మార్ మిలటరీ చేపట్టిన ఆపరేషన్ కారణంగా గత ఆగస్ట్ నుంచి ఇప్పటివరకు సుమారు 70 వేల మంది ముస్లింలు దేశం వదిలి బంగ్లాదేశ్‌కు పారిపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
'హింసను ప్రేరేపించింది'
మయన్మార్‌లో ఐరాస నిజనిర్ధారణ కమిటీ తన మధ్యంతర నివేదికను విడుదల చేసింది. సోమవారం నివేదిక విడుదల చేస్తూ ఆ కమిటీ చైర్మన్ మార్జుకి దారుస్మాన్, రోహింజ్యా ముస్లింలపై విద్వేషాలు పెంచడంలో సోషల్ మీడియా చెప్పుకోదగ్గ పాత్ర పోషించిందని అన్నారు.
యాంగీ లీ అనే ఐరాస సభ్యురాలు, ''రోహింజ్యాలు, ఇతర మైనారిటీలకు వ్యతిరేకంగా అతివాద జాతీయవాద బౌద్ధులు విద్వేషాలను రెచ్చగొట్టారు. ఈ విషయంలో ఫేస్‌బుక్ మృగంలా వ్యవహరించింది'' అని ఆరోపించారు.
బంగ్లాదేశ్, మలేషియా, థాయ్‌ల్యాండ్‌లో మానవ హక్కుల బాధితులు, సాక్షులతో చేసిన సుమారు 600 ఇంటర్వ్యూల ఆధారంగా ఆ మధ్యంతర నివేదికను విడుదల చేశారు.
''కొన్నిసార్లు పారిపోతున్న గ్రామస్తులను వేటాడి కాల్చారు. ఇళ్లలో ఉన్నవాళ్లు బతికి ఉండగానే వాటిని తగలబెట్టారు. ఈ మారణకాండలో వృద్ధులు, వికలాంగులు, పిల్లలు మరణించారు'' అని నివేదిక పేర్కొంది.
తమ పరిశోధనను అడ్డుకోవడానికి మయన్మార్ ప్రభుత్వం ప్రయత్నించిందని కూడా ఐరాస ఆరోపిస్తోంది.

ఫొటో సోర్స్, Reuters
అయితే ఫేస్‌బుక్ మాత్రం తమ వేదికలో విద్వేషపూరిత భావాలకు స్థానం లేదంటోంది.
''ఐరాస ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తాం. మయన్మార్‌లో ద్వేషపూరిత భావాలకు వ్యతిరేకంగా చాలా ఏళ్లుగా ప్రచారం చేస్తున్నాం'' అని ఫేస్‌బుక్ ప్రతినిధి బీబీసీకి తెలిపారు.
దేశవ్యాప్తంగా దీనిపై అనేక స్థానిక బృందాలకు శిక్షణ కూడా ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇకపై కూడా స్థానిక నిపుణులతో కలిసి అలాంటి ద్వేషపూరిత భావాల వ్యాప్తిని అరికట్టడం కోసం కృషి చేస్తామన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రోహింజ్యాలను మిలటరీ ఊచకోత కోసిందని, అత్యాచారాలకు పాల్పడ్డారని, వందలాది గ్రామాలను నేలమట్టం చేసి, తగలబెట్టారని శరణార్ధులు, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌తో పాటు పలు మానవ హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి.
అయితే రోహింజ్యాలపై జరిగిన దారుణాలకు స్పష్టమైన సాక్ష్యాధారాలను చూపాలని మయన్మార్ ప్రభుత్వం ఐరాసను కోరుతోంది.
ఇవి కూడా చదవండి:
- ఎడిటర్స్ కామెంట్: పవన్ కల్యాణ్ దక్షిణాది సెంటిమెంట్‌ను అస్ర్తంగా మార్చుకోబోతున్నారా? జనసేన భవిష్యత్తు ఏంటి?
- ‘బ్రిటన్‌లో రష్యా విష ప్రయోగం’
- ఎడిటర్స్ కామెంట్: ఎవరికీ మరొకరిపై విశ్వాసం లేదు, ఈ అవిశ్వాస రాజకీయాలనెలా అర్థం చేసుకోవాలి?
- ‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు: బహుశా.. ఈ తరానికి పెద్దగా తెలియని చరిత్ర ఇది
- అవిశ్వాస తీర్మానం: అంటే ఏమిటి? ఏం జరుగుతుంది?
- గ్రౌండ్ రిపోర్ట్: ‘‘భయపడొద్దమ్మా, జంతువులు నన్నేమీ చేయలేవు’’ అని చెప్పేవాడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








