అవిశ్వాస తీర్మానం: అంటే ఏమిటి? ఏం జరుగుతుంది?

పార్లమెంటు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పృథ్వీరాజ్
    • హోదా, బీబీసీ తెలుగు

అవిశ్వాస తీర్మానం అంటే.. అధికారంలో ఉన్న ఒక వ్యక్తి కానీ వ్యక్తుల సముదాయం (మంత్రివర్గం/ప్రభుత్వం) కానీ ఆ అధికారాన్ని లేదా పదవిని నిర్వర్తించటానికి అనర్హులని తాము భావిస్తున్నట్లు ప్రవేశపెట్టే తీర్మానం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో నియమిత ప్రభుత్వం మీద ఎన్నికయిన పార్లమెంటుకు ఇక విశ్వాసం లేదని చెప్పే తీర్మానం.

అయితే భారత రాజ్యాంగంలో విశ్వాస తీర్మానం లేదా అవిశ్వాస తీర్మానం అనే ప్రస్తావన ఎక్కడా లేదు. కానీ.. మంత్రి మండలి ఉమ్మడిగా లోక్‌సభకు బాధ్యత వహిస్తుందని 75వ అధికరణ స్పష్టంచేస్తోంది. అంటే.. ప్రధానమంత్రి, ఆయన మంత్రిమండలిని లోక్‌సభలో మెజారిటీ సభ్యులు వ్యతిరేకించరాదని దీనర్థంగా చెప్పుకోవచ్చు.

భారతదేశంలో పార్లమెంటు దిగువ సభ, ప్రత్యక్షంగా ఎన్నికయిన పార్లమెంటు సభ్యులు గల లోక్‌సభలో మాత్రమే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. లోక్‌సభ కార్యకలాపాల నియమావళిలోని 198వ నిబంధన.. అవిశ్వాస తీర్మానం విధివిధానాలను నిర్దేశిస్తోంది.

దీనిప్రకారం.. లోక్‌సభ సభ్యుడు ఎవరైనా సరే రాతపూర్వకంగా అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇవ్వవచ్చు. స్పీకర్ ఈ అవిశ్వాస తీర్మానం నోటీసు నిర్దేశిత విధానంలో ఉందని భావిస్తే దానిని సభలో చదవాలి. దీనిని చర్చకు చేపట్టటానికి మద్దతు ఇచ్చేవారందరూ నిలబడాలని కోరాలి.

నరేంద్రమోదీ, చంద్రబాబు

ఫొటో సోర్స్, Nara chanrababu naidu/FACEBOOK

అవిశ్వాసం నోటీసుకు కనీసం 50 మంది ఎంపీలు మద్దతు లభించకపోతే ఆ తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరిస్తారు. తీర్మానం ప్రవేశపెట్టటానికి కనీసం 50 మంది ఎంపీలు మద్దతు తెలిపినట్లయితే.. స్పీకర్ తీర్మానాన్ని స్వీకరించి, దానిపై చర్చకు ఒక తేదీ లేదా తేదీలను నిర్ణయిస్తారు. ఆ తేదీ.. నోటీసు ఇచ్చిన పది రోజుల లోపే ఉండాలి.

ఈ తీర్మానంపై చర్చలో ప్రసంగాలకు స్పీకర్ అవసరమని భావిస్తే కాలపరిమితి కూడా నిర్ణయించవచ్చు. ఈ చర్చలో అవిశ్వాస తీర్మానం పెట్టిన వారు, దానికి మద్దతు ఇచ్చిన వారు ప్రసంగిస్తారు. ప్రభుత్వంపై వారు చేసిన ఆరోపణలకు సాధారణంగా ప్రధానమంత్రి కానీ, మంత్రి మండలి సభ్యులు కానీ సమాధానం ఇస్తారు.

ఈ చర్చ ముగిసిన అనంతరం అవిశ్వాస తీర్మానంపై స్పీకర్ ఓటింగ్ నిర్వహిస్తారు. మూజువాణి ఓటు ద్వారా కానీ, సభ్యుల విభజన ద్వారా కానీ ఈ ఓటింగ్ ఉండవచ్చు. అందులో మెజారిటీ సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తే.. ప్రభుత్వం దిగిపోవాల్సి ఉంటుంది. మెజారిటీ సభ్యులు తీర్మానాన్ని వ్యతిరేకిస్తే తీర్మానం వీగిపోతుంది.

జగన్‌మోహన్‌రెడ్డి

ఫొటో సోర్స్, YS JAGAN MOHAN REDDY/FACEBOOK

మోదీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ఎందుకు?

లోక్‌సభలో బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉంది. అందులో బీజేపీకే సొంతంగా స్పీకర్ కాకుండా.. 274 మంది సభ్యులు (ఇద్దరు నామినేటెడ్ సభ్యులతో కలిసి) ఉన్నారు. ఇది కనీస మెజారిటీకన్నా ఇద్దరు సభ్యులు ఎక్కువ. తాజాగా టీడీపీ వైదొలగినా కానీ.. మిత్ర పక్షాలతో కలిపి మోదీ సర్కారుకున్న బలం 315 మంది సభ్యులు.

ఈ పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందని, ప్రభుత్వం కూలిపోతుందని ఊహించేవారు ఎవరూ ఉండరు. అయితే.. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశంపై 'పార్లమెంటులో పోరాటాన్ని తీవ్రం' చేయటం, 'కేంద్రం అన్యాయం చేస్తోంద'న్న చర్చ పార్లమెంటులో జరిగేలా చేసే ప్రయత్నాల్లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ ఈ అవిశ్వాస తీర్మానాన్ని ఆయుధంగా చేసుకుంటోంది.

నిన్నటివరకూ ఎన్‌డీఏ భాగస్వామిగా ఉన్న టీడీపీ సైతం.. ప్రత్యేక హోదా కోసం చివరి అస్త్రంగా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతామని కొద్ది కాలం ముందు నుంచే చెప్తోంది.

టీడీపీ, వైసీపీ ఎంపీలు

ఫొటో సోర్స్, DRSIVAPRASAD/YSAVINASHYOUTH/FB

అవిశ్వాసంపై వైసీపీ - టీడీపీ కలిసి నడుస్తాయా?

నిజానికి.. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, వైసీపీ, జనసేన రాజకీయ వ్యూహాలు.. ప్రత్యేక హోదా కేంద్రంగా ఆయా పార్టీలు పైచేయి కోసం వేస్తున్న ఎత్తుగడల్లో భాగంగానే 'అవిశ్వాస తీర్మానం' అంశం తెరపైకి వచ్చింది.

కేంద్రంలోని నరేంద్రమోదీకి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన నాయకుడు పవన్‌కళ్యాణ్ కొమ్ముకాస్తున్నారని వైసీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించటం.. దానికి పవన్‌కళ్యాణ్ స్పందిస్తూ.. జగన్ తమ మీద కాకుండా కేంద్రం మీద పోరాడాలని, చేతనైతే మోదీ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని సవాల్ చేశారు. అలా అవిశ్వాసం పెడితే దానికి టీడీపీ సహా ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు తాను కృషి చేస్తాననీ అన్నారు.

ఈ నేపథ్యంలో మార్చి 21వ తేదీన తాము కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని వైసీపీ ప్రకటించింది. అందుకు మద్దతివ్వాలని టీడీపీ సహా ప్రతిపక్ష పార్టీలన్నిటినీ కోరింది. లేదంటే టీడీపీ లేదా మరెవరైనా అవిశ్వాసం పెట్టినా తాము మద్దతిస్తామనీ పేర్కొంది.

పవన్‌కళ్యాణ్, నరేంద్రమోదీ

ఫొటో సోర్స్, JANASENAPARTY/FACEBOOK

వైసీపీ అనూహ్యంగా అవిశ్వాస తీర్మానం నోటీసును మార్చి 15వ తేదీనే ఇచ్చేసింది. పార్లమెంటు సమావేశాల కాలాన్ని కుదిస్తారన్న అంచనాతో ఇలా గడువును ముందుకు జరిపినట్లు చెప్తున్నారు. వైసీపీ అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతిస్తామని చంద్రబాబు స్వయంగా గురువారం సాయంత్రం ప్రకటించారు. ఎన్‌డీఏ నుంచి తాము పూర్తిగా వైదొలగనున్నట్లూ ప్రకటించారు.

కానీ శుక్రవారం ఉదయానికి చంద్రబాబు వ్యూహం మార్చారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశాన్ని కూడా అత్యవసరంగా టెలీకాన్ఫరెన్స్‌లో నిర్వహించి.. ఎన్‌డీఏ నుంచి వైదొలగాలని అందులో ఏకగ్రీవంగా నిర్ణయించారు. వైసీపీ పెట్టే అవిశ్వాసానికి తాము మద్దతు ఇవ్వటం కాకుండా.. తామే స్వయంగా అవిశ్వాసం పెడతామని టీడీపీ ప్రకటించింది. అప్పటికప్పుడు లోక్‌సభ కార్యదర్శికి తీర్మానం నోటీసు ఇచ్చేసింది.

వైసీపీ, టీడీపీ అవిశ్వాస తీర్మానం నోటీసులను స్పీకర్ విడివిడిగా స్వీకరిస్తారా? కలిపి పరిగణనలోకి తీసుకుంటారా? ఈ పరిస్థితుల్లో టీడీపీ, వైసీపీలు అవిశ్వాస తీర్మానంపై కలిసి నడుస్తాయా? ఎప్పటిలాగానే 'హోదాపై పోరాటం'లో ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవహరిస్తాయా? అన్నది చూడాల్సి ఉంది.

పార్లమెంటులో రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు

ఫొటో సోర్స్, RAHUL GANDHI/FACEBOOK

అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందా?

లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం గెలవటం సంగతి అటుంచి.. కనీసం చర్చకు రావాలంటే కనీసం 50 మంది మద్దతు కావాలి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రస్తుతం 25 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నారు. అందులో ఇద్దరు ఎంపీలు భారతీయ జనతా పార్టీ సభ్యులు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా ఆంధ్రప్రదేశ్ నుంచి 8 మంది లోక్‌సభ సభ్యులు ఉన్నారు. తెలంగాణ నుంచి ఉన్న మరొక సభ్యుడిని కూడా కలుపుకుంటే 9 మంది అవుతారు.

తెలుగుదేశం పార్టీకి ఏపీ నుంచి అధికారికంగా 15 మంది సభ్యులు ఉన్నారు. తెలంగాణ నుంచి గల మరొక సభ్యుడిని కూడా కలుపుకుంటే ఆ సంఖ్య 16 అవుతుంది.

అయితే.. వైఎస్సార్ కాంగ్రెస్ ఏపీ లోక్‌సభ సభ్యులు ఇద్దరు (ఎస్.పి.వై.రెడ్డి, బుట్టా రేణుక) చాలా కాలంగా టీడీపీతో కలిసి ఉన్నారు. అలాగే ఆ పార్టీకి తెలంగాణ నుంచి గల ఎంపీ (పొంగులేటి శ్రీనివాసరెడ్డి) కూడా తెలంగాణ రాష్ట్ర సమితితో చేరారు. అంటే.. లోక్‌సభలో వైసీపీ వాస్తవ సంఖ్యా బలం ఆరుగురు మాత్రమే.

నరేంద్రమోదీ, కేసీఆర్

ఫొటో సోర్స్, Pmo

అలాగే.. టీడీపీ తెలంగాణ ఎంపీ (సి.హెచ్. మల్లారెడ్డి) కూడా టీఆర్‌ఎస్‌తో కలిశారు. అయితే ఏపీలో ఇద్దరు వైసీపీ ఎంపీలు తమతో చేరటంతో.. ఏపీ నుంచి గల తన సొంత ఎంపీలు 15 మందితో కలుపుకుని టీడీపీ వాస్తవ సంఖ్యా బలం 17 అవుతోంది.

అంటే.. వైసీపీ అవిశ్వాస తీర్మానం నోటీసుకు కనీసం మరో 44 మంది మద్దతును సమీకరించాలి. అదే టీడీపీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇస్తే కనీసం 33 మంది మద్దతు ఇవ్వాలి. తీర్మానానికి వీరిద్దరూ పరస్పరం మద్దతు తీసుకుంటే.. మరో 27 మంది మద్దతు అవసరమవుతుంది.

లోక్‌సభలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 48 మంది సభ్యులు ఉన్నారు. ఇటీవలే కేంద్రంపై కత్తిదూసి, ఫెడరల్ ఫ్రంట్ వ్యూహరచన ప్రకటించిన కె.చంద్రశేఖరరావు సారథ్యంలోని టీఆర్ఎస్ పార్టీకి సొంత సభ్యులు 11 మందితో పాటు.. టీడీపీ, వైసీపీల నుంచి తనతో చేరిన ఇద్దరు ఎంపీలు కలిపి 13 మంది సభ్యులు ఉన్నారు. వామపక్షాలకు 10 మంది (సీపీఎం 9, సీపీఐ 1) సభ్యులు ఉన్నారు. అలాగే టీఎంసీ (33), బీజేడీ(20), ఎస్‌పీ (7), ఎన్‌సీపీ (6), ఆప్ (4) తదితర పార్టీల మద్దతు కూడా కోరుతున్నారు.

వీరిలో ఎవరెవరు అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తారు? ఇస్తే ఎవరి అనేది ఇంతవరకూ స్పష్టం కాలేదు. ప్రత్యేక హోదా పోరాటానికి కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఎం మద్దతు ప్రకటించాయి. అయితే.. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానానికి మద్దతు విషయంలో ఆ పార్టీలు ఎలా స్పందిస్తాయనేది చూడాలి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)