భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ రివ్యూ: రవితేజ కామెడీ టైమింగ్ సినిమాను నిలబెట్టిందా?

ఫొటో సోర్స్, FB/Ravi Teja
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
వరుస ఫ్లాపులతో డీలా పడిన రవితేజ భర్త మహాశయులకి విజ్ఞప్తి అంటూ ఈ సంక్రాంతి పండుగకు ప్రేక్షకులను పలకరించాడు.
కామెడీ బాగా తీస్తాడు, రాస్తాడు అని పేరున్న కిశోర్ తిరుమల ఈ సినిమాకు దర్శకుడు.
మరి కిశోర్ ఈ సినిమాను ఎలా తీశారు, రవితేజ ఎలా నటించారు? ‘మాస్‌మహరాజ’అనే ట్యాగ్‌లైన్ పక్కనపెట్టి రవితేజ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా?


ఫొటో సోర్స్, FB/Ravi Teja
కథ ఏంటంటే..
రామ్ సత్యనారాయణ (రవితేజ) ఒక వైన్ యార్డ్ యజమాని. అతని బ్రాండ్ అనార్కలి వైన్‌ని స్పెయిన్‌లోని ఒక వైన్ కంపెనీ తిరస్కరిస్తుంది.
ఈ విషయమై హీరో తన పీఏ లీల (వెన్నెల కిశోర్)తో స్పెయిన్ వెళ్తాడు. స్పెయిన్ వైన్ కంపెనీకి మానస షెట్టి (అషికా రంగనాథ్) యజమాని. ఆమె పీఏ బెల్లం (సత్య) ప్రత్యర్థులతో చేతులు కలిపి ఆమెని మోసం చేస్తుంటాడు.
ఈ విషయం మానసకి అర్థమయ్యేలా చేసి ఆమెకు హీరో దగ్గరవుతాడు. రిలేషన్ ఏర్పడుతుంది. అయితే తనకి పెళ్లయిందని, తాను వచ్చింది వైన్ బ్రాండింగ్ కోసమని చెప్పడు. తర్వాత ఇండియాకు తిరిగొస్తాడు.
హీరో భార్య బాలామణి (డింపుల్ హయతి)కి భర్త అంటే అపారమైన నమ్మకం. పరాయి స్త్రీని కన్నెత్తి చూడడనే విశ్వాసం. మానస ఇండియా వస్తుంది. భార్యకి తెలియకుండా హీరో ఎలా మేనేజ్ చేసాడు? చివరికి ఏమైంది అన్నదే మిగతా కథ.
భార్య, భర్త... ఓ ప్రియురాలు
భార్య, ప్రియురాలి మధ్య నలిగిపోయే సినిమాలు లెక్కలేనన్ని వచ్చాయి. ఈ కోవలో ఎమోషన్‌తో నిండితే కార్తీక దీపం, కామెడీ అయితే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు బాగా గుర్తుండిపోయాయి. ఇలాంటి కథలను ఎన్నిసార్లు చూసినా కామెడీ కొత్తగా చేయగలిగితే జనానికి ఎక్కుతుంది. ఈ సినిమాలో ఇదే లోపించింది. ఆల్రెడీ చూసేసినా సినిమాలా అనిపిస్తే అది ప్రేక్షకుడి తప్పు కాదు.

ఫొటో సోర్స్, FB/Ravi Teja
ఫస్టాఫ్‌లో నవ్వులు...
ఈ తరహా కథలతో ఉన్న ఇబ్బంది ఏంటంటే చివరికి ఏం జరుగుతుందో ప్రేక్షకులకు ముందే తెలిసిపోతుంది. కథలో పెద్ద మలుపులు ఉండవు. కాబట్టి డైలాగ్ కామెడీ మీద ఆధారపడ్డారు. ఫస్టాఫ్‌లో కొంత నవ్వులు పండించినా సెకండాఫ్ కదలడం కష్టమైంది.
కిశోర్ తిరుమల రైటింగ్ బలంగానే ఉంటుంది. అయితే, ఈ సినిమాలో తన బలం కంటే సోషల్ మీడియా మీమ్స్‌పైన ఎక్కువ ఆధారపడ్డారు దర్శకుడు. ప్రారంభంలో మొదటి 20 నిమిషాలు స్లోగా ఉంది. సత్య కాస్త నవ్వించడానికి ప్రయత్నించాడు. హీరోలో నుంచి ఒక అపరిచితుడు బయటికొచ్చి సలహాలు చెప్పడం అరిగిపోయిన టెక్నిక్.
సింగిల్ లైన్ కథ, అనేక కామెడీ పాత్రలు
సింగిల్ లైన్ కథలోకి కామెడీ కోసం అనేక పాత్రలు వచ్చి నవ్వించే ప్రయత్నం చేస్తాయి. భార్యకి ఎఫైర్ తెలియకుండా హీరో పడే ఇబ్బందులు సెకండాఫ్ కూడా కొనసాగడంతో కొత్తదనం, కొత్తపాత్రలు లేవు. మానస అన్న, గెటప్ శీను కాసేపు వచ్చినా పెద్దగా నవ్వించలేదు.
నాలుగు పాటలు, రెండు ఫైట్స్ పాత నమూనా నుంచి హీరోలు ఎప్పుడు బయటపడతారో తెలియదు. నిడివి విషయంలో ఎడిటర్ జాగ్రత్త పడ్డాడు. డైలాగ్‌లు అక్కడక్కడ పేలాయి. రవితేజకి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. కూల్‌గా చేసుకెళ్లాడు. ఆషికా, డింపుల్‌కు అప్పుడప్పుడు ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం తప్ప నటించే స్కోప్ లేదు.

ఫొటో సోర్స్, FB/Ravi Teja
సునీల్ కామెడీ
కొన్ని సీన్స్‌లో సునీల్, మురళీధర్ గౌడ్ కామెడీ పండింది. ముఖ్యంగా హోటల్ సీన్ నవ్వించింది. ప్రాబ్లమ్ ఏంటంటే ప్రేక్షకుడు మారిపోయాడు. ఓల్డ్ టెంప్లెట్ నచ్చడం లేదు. కాసేపు నవ్వించడానికి కామెడీ షోలు, రీల్స్ ఉన్నపుడు థియేటర్‌కి ఎందుకు వస్తాడు? ఇంకా హీరోలు డ్యాన్స్‌లు, ఫైట్స్ చేస్తే ప్రేక్షకులకు నచ్చుతుంది అనుకుంటే వెనుకపడి పోతారు. ఎమోషన్ అయినా, కామెడీ అయినా థియేటర్ బయటికొచ్చినా గుర్తుండాలి. ఓల్డ్ వైన్ బాగుంటుంది కానీ, ఓల్డ్ కామెడీ కాదు.
ప్లస్ పాయింట్స్
1.ఫస్టాఫ్‌లో కామెడీ
మైనస్ పాయింట్స్
1.సెకెండాఫ్
2.రొటీన్ కథ
3.వీక్ రైటింగ్
(గమనిక: అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














