Ind Vs Eng: సెమీస్‌కు టీమిండియాను కలవరపెడుతున్న 4 ప్రధాన సమస్యలు ఇవే..

ఫొటో సోర్స్, MB Media/Getty Images
టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్, ఇంగ్లండ్ తలపడుతున్నాయి.
ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.
దక్షిణాఫ్రికా, న్యూజీలాండ్ జట్ల మధ్య బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించి న్యూజీలాండ్ ఫైనల్‌కు చేరింది.
ఈ రోజు జరిగే సెమీఫైనల్‌లో విజేతగా నిలిచిన జట్టు మార్చి 8న, ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో న్యూజీలాండ్ జట్టుతో తలపడుతుంది.
టీ20 ప్రపంచ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్టును టైటిల్ ఫేవరెట్‌గా భావించినప్పటికీ, ప్రధానంగా నాలుగు లోపాలు జట్టును ఆందోళనకు గురిచేస్తున్నాయి.


ఫొటో సోర్స్, Getty Images
జోఫ్రా ఆర్చర్‌ను ఎదుర్కోవడం
ఈ టోర్నమెంట్‌లో భారత జట్టు కేవలం ఒకే మ్యాచ్‌లో ఓటమి పాలైనప్పటికీ, భారత టాప్ ఆర్డర్ వైఫల్యం జట్టును ఆందోళనకు గురిచేస్తోంది.
దక్షిణాఫ్రికాపై భారత్ ఓటమికి ప్రధాన కారణం పవర్‌ప్లేలో ముగ్గురు బ్యాట్స్‌మెన్ ఔట్ కావడం. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లోనూ, పవర్‌ప్లేలో 4 వికెట్లు కోల్పోయింది.
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 84 పరుగుల ఇన్నింగ్స్ టోర్నమెంట్ మొదటి మ్యాచ్‌లో భారత్‌ను షాకింగ్ ఓటమి నుంచి బయటపడేసినప్పటికీ, ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో ఆ తప్పు నుంచి భారత్ కోలుకునే అవకాశం లేకపోవచ్చు.. ఎందుకంటే, ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలింగ్‌కు జోఫ్రా ఆర్చర్ నేతృత్వం వహిస్తున్నాడు.
తొలి రెండు మ్యాచ్‌లలో 90 పరుగులు ఇచ్చిన తర్వాత, ఆర్చర్ ఈ టోర్నమెంట్‌లో బలంగా పుంజుకున్నాడు. ఈ ప్రపంచ కప్‌లో, పవర్‌ప్లేలో మొత్తం 114 బంతులు వేస్తే, వాటిలో 66 డాట్‌బాల్స్. అంటే, ఎలాంటి పరుగులూ ఇవ్వలేదు.
ఈ టోర్నమెంట్‌లో, పవర్‌ప్లేలో అత్యధిక డాట్‌బాల్స్ వేసిన బౌలర్‌గా నిలిచాడు జోఫ్రా ఆర్చర్. సంజూ శాంసన్‌పై కూడా ఆర్చర్‌కు మంచి రికార్డ్ ఉంది.
ఐదు టీ20 మ్యాచ్‌లలో మూడింటిలో అతను సంజూని ఔట్ చేశాడు.
సంజూ శాంసన్ బలహీనతల గురించి ఇంగ్లండ్‌కు తెలుసని సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ డు ప్లెసిస్ అభిప్రాయపడ్డాడు.
"సంజూ శాంసన్ ఇంగ్లండ్ షార్ట్ బౌలింగ్‌ను బాగా ఆడగలడు. కానీ, ఆర్చర్ బంతి వేగం 140 కంటే ఎక్కువ. ఇది షార్ట్ బౌలింగ్‌ను ఆడడం కష్టతరం చేస్తుంది. ఇంగ్లండ్‌కు ఇది బాగా తెలుసు" అని అన్నాడు.

ఫొటో సోర్స్, Getty Images
బ్యాట్స్‌మెన్ సమష్టిగా రాణించకపోవడం
జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ మినహా, మిగిలిన ప్రతి మ్యాచ్‌లోనూ బ్యాట్స్‌మెన్ మెరుగ్గా రాణించకపోవడం భారత్‌కు అతిపెద్ద సమస్యగా మారింది.
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒంటరి పోరాటం అమెరికాపై విజయంలో కీలకంగా మారగా.. నమీబియా, పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లలో ఇషాన్ కిషన్ ఎక్స్ ఫ్యాక్టర్‌గా పనిచేశాడు.
దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లలో శివమ్ దుబే మంచిగా బ్యాటింగ్ చేశాడు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజూ శాంసన్ అజేయంగా 97 పరుగులు చేసి భారత్ సెమీఫైనల్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించాడు.
అయితే, ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకూ భారత టాప్ ఆర్డర్ సమష్టిగా మెరుగైన ప్రదర్శన కనబరచలేదు.
అభిషేక్ శర్మ ఫామ్‌లో లేకపోవడం భారత్‌కు అతిపెద్ద సమస్య. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు 6 ఇన్నింగ్స్‌లలో 13.33 సగటుతో 80 పరుగులు మాత్రమే చేశాడు. వాటిలోనూ మొదటి మూడు ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు.
ఈ వరల్డ్ కప్‌లో జింబాబ్వేపై జరిగిన మ్యాచ్‌లో ఒక అర్ధ శతకం సాధించాడు. కెప్టెన్ సూర్యకుమార్ కూడా మొదటి మ్యాచ్‌లో చేసిన 84 పరుగులు మినహా, ఈ టోర్నమెంట్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేదు.
జట్ట సెమీ ఫైనల్స్‌కు చేరుకున్నప్పటికీ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 ఆటగాళ్లలో ఒక భారత ఆటగాడు కూడా లేడు. 231 పరుగులతో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 7వ స్థానంలో ఉన్నాడు.

ఫొటో సోర్స్, Getty Images
ఆకట్టుకోని వరుణ్ చక్రవర్తి
భారత్‌లోని పిచ్‌లు సిన్నర్లకు అనుకూలంగా ఉండడం వల్ల భారత జట్టుకు వరుణ్ చక్రవర్తి ఓ ట్రంప్ కార్డ్.
ఈ టోర్నమెంట్‌లో అతను 12 వికెట్లు తీసి ప్రధానమైన వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నారు. అయితే, టీమ్ బ్యాలెన్స్ కారణంగా ఒకే ఒక్క మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ జట్టులో చోటు దక్కించుకున్నారు. అందువల్ల వరుణ్ చక్రవర్తి మీద ఆధారపడడం భారత్‌కు కీలకంగా మారింది.
సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి నాలుగు ఓవర్లకు 47 పరుగుల ఇచ్చారు. అలాగే వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో 40 పరుగులు ఇచ్చారు.
అయితే, వరుణ్ చక్రవర్తి వ్యూహాన్ని బ్యాట్స్‌మెన్ అర్థం చేసుకోవడం మొదలుపెట్టారని భారత జట్టు మాజీ కోచ్, స్పిన్ బౌలర్ అనిల్ కుంబ్లే అన్నారు.
"వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. కానీ, ప్రస్తుతం రైట్ హ్యాండర్స్‌పై ఔట్‌సైడ్ ఆఫ్‌లో బంతిని వరుణ్ చక్రవర్తి ఎలా వేస్తారో స్పష్టంగా తెలుస్తోంది" అని ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో షోలో మాట్లాడుతూ అనిల్ కుంబ్లే అన్నారు.
బలహీనమైన ఫీల్డింగ్
టోర్నమెంట్‌లో ఇప్పటివరకు భారత క్రికెట్ జట్టు 33 క్యాచ్‌లు అందుకోగా, 13 క్యాచ్‌లను వదిలేసింది.
వెస్టిండీస్‌తో జరిగిన గత మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఒక్కడే రెండు క్యాచ్‌లు వదిలేశాడు.
టోర్నమెంట్‌లో భారత జట్టు 71.7శాతం క్యాచ్‌లను విజయవంతంగా పట్టుకుంది.
ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని జట్టు బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్.. మ్యాచ్‌కు ఒకరోజు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్సులో అన్నారు.
"ఫీల్డింగ్‌పైనే మా పూర్తి ఫోకస్ ఉంది. టోర్నమెంట్‌కు ముందు కూడా ఫీల్డింగ్ ప్రధానమనే భావించాం. అందుకు తగ్గట్లుగా సన్నద్ధమయ్యాం. ఫీల్డర్లను సరైన స్థానంలో ఉంచగలిగితే.. క్యాచింగ్‌లో మేం మెరుగైన ఫలితాలు చూపిస్తాం" అని ఆయన అన్నారు.
అలాగే, టోర్నీలో టాస్ కూడా నిర్ణయాత్మక అంశంగా నిలుస్తోంది. ఎందుకంటే టోర్నీ మొత్తంగా గమనిస్తే మంచు కారణంగా.. తర్వాత బౌలింగ్ చేసే జట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా కనిపిస్తున్నాయి.
మొదటి సెమీ- ఫైనల్ మ్యాచ్‌లో మంచు ప్రభావం స్పష్టంగా కనిపించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













