రాజాసాబ్ రివ్యూ: ప్రభాస్ హర్రర్ కామెడీ సినిమా భయపెట్టి నవ్వించిందా?

ఫొటో సోర్స్, Rajasaab/X
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
రెండు బ్లాక్ బస్టర్ల తర్వాత ప్రభాస్ కొత్త లుక్, కొత్త జానర్‌తో రాజాసాబ్‌గా వచ్చాడు. కామెడీలు బాగా తీస్తాడనే పేరున్న దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో రాజాసాబ్ మెప్పించాడా? లేదా?
కథ ఏమంటే గంగమ్మ (జరీనా వాహెబ్) ఒక వృద్ధురాలు. ఆమెకు మనవడు రాజు (ప్రభాస్) తోడుగా ఉంటాడు. రాజుతల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోతారు. గంగమ్మకు మతిమరుపు వ్యాధి. కానీ ఆమెకు భర్త కనకరాజు (సంజయ్ దత్) గుర్తుంటాడు. ఎప్పటికైనా కలుసుకోవాలని కోరిక. కనకరాజు ఇల్లు వదిలి వెళ్లిపోయి వుంటాడు.
కనకరాజు కోసం రాజు హైదరాబాద్ బయల్దేరుతాడు. అక్కడ ఒక నన్ (నిధి అగర్వాల్)ని చూసి ప్రేమిస్తాడు. అనుకోకుండా భైరవి (మాళవిక మోహనన్) హీరోని కలుస్తుంది. కనకరాజు నర్సాపూర్ అడవిలో ఉన్నాడని తెలిసి అక్కడికి బయల్దేరుతాడు. పాడు పడిన బంగ్లాలో కనకరాజు ఎందుకున్నాడు? ప్రేతాత్మతో హీరోకి జరిగిన సంఘర్షణ ఏమిటి? రాజకుమారిగా ఉన్న గంగ పేదరాలిగా ఎందుకు మారింది? ఇదంతా మిగతా కథ.


ఫొటో సోర్స్, Rajasaab/X
హారర్ సినిమా అంటే తెరమీద నటులు, ప్రేక్షకులు కలిసి భయపడడం. హారర్ కామెడీ అంటే వాళ్లు భయపడుతూ వుంటే , చూస్తున్న మనం నవ్వడం. 13 ఏళ్ల క్రితం వచ్చిన ప్రేమ కథా చిత్రం ఇప్పటికీ గుర్తుండే హారర్ కామెడీ. రైటింగ్ మారుతి, ఒక రకంగా ఈ సినిమాకి ఘోస్ట్ దర్శకుడు.
కామెడీ పండిస్తూ స్క్రిప్ట్ రాసుకోవడంలో మారుతీకి మంచి పేరు వుంది. ప్రభాస్‌కి మంచి కామెడీ టైమింగ్ వుంది. దాంతో ఈ కాంబినేషన్‌పై అంచనాలు పెరిగాయి. ట్రైలర్ కూడా బజ్ పెంచింది. అయితే సినిమాలో హారర్ అక్కడక్కడ భయపెట్టి, కామెడీ ఎక్కడో ఒక చోట నవ్వించింది. దీనికి కారణం బలహీనమైన స్క్రిప్ట్. మారుతి ప్లాప్‌లన్నీ కథ, కథనం లోపాలే. రాజాసాబ్‌లో కూడా ఇదే జరిగింది.

ఫొటో సోర్స్, Rajasaab/X
ప్రభాస్ లాంటి బలమైన హీరో వున్నపుడు కథ, కథనం నెక్ట్స్ లెవెల్‌లో వుండాలి. ఇది రొటీన్‌గా వుండి , మూడు గంటల నిడివి విసుగెత్తిస్తుంది. నాయనమ్మ కోసం మనవడు పడే తపనలో కావాల్సినంత ఎమోషన్ వుంది. అయితే అసలు కథలోకి వెళ్లకుండా ప్రభాస్‌కి రెండు ఫైట్స్, మూడు పాటలతో ఫస్టాఫ్ అయిపోతుంది. ఇంటర్వెల్‌కి గానీ అసలు పాయింట్ రాదు.
సెకండాఫ్ మొత్తం బంగళాలో గ్రాఫిక్స్, అక్కడున్న వాళ్లు భయపడడం రిపీటెడ్‌గా మారింది. ప్రభాస్ , జరీనా పాత్రలకి తప్ప మిగతా ఎవరికీ బలం లేదు. అసలు సంజయ్‌దత్‌కి అంత దురాశ ఎందుకు? భార్యని , మనమడిని హింసించి ఏం సాధిస్తాడో గోల్ కూడా అర్థం కాదు. బతికి వున్నప్పుడు కూడా అతను ఏం అనుభవించినట్టు అనిపించదు.

ఫొటో సోర్స్, Rajasaab/X
అదే లోపం
ప్రభాస్ లాంటి హీరోలకు బలమైన ప్రత్యర్థి ఉండాలి. ఇక్కడ ప్రత్యర్థి సొంత తాత. అతన్ని ఎదిరించడానికి హీరోకి శక్తి చాలదు. ఇక అభిమానులు కోరుకునే హీరోయిజం, గూస్‌బంప్స్ ఎక్కడి నుంచి వస్తాయి?
పోనీ కామెడీ పండిందా అంటే ప్రభాస్ , శీను, సత్యా, సప్తగిరి , వీటీవీ గణేష్ ఉన్నా వాళ్లకి ప్రాధాన్యం లేదు. డైలాగ్‌లు పేలలేదు. ఓల్డ్ కామెడీ నవ్వించలేకపోయింది. సముద్రఖని లాంటి మంచి నటుడు కూడా వృథా అయ్యాడు. బొమన్ ఇరానీ బాగా నటించాడు కానీ, ఆ క్యారెక్టర్‌కి ఒక ముగింపు లేదు.
మంత్రతంత్రాలు , హిప్నాటిజం, సైన్స్ ఇలా ఏదేదో గందరగోళంతో ప్రేక్షకుడికి తానేం చూస్తున్నాడో అర్థం కాదు. మాళవిక మోహనన్‌కి కథలో కొంత స్కోప్ వుంది. మిగతా వాళ్లు పాటలు పాడడానికి మాత్రమే వున్నారు. సెకండాఫ్‌లో ముగ్గురు హీరోయిన్లతో వచ్చే పాట రాంగ్ ప్లేస్‌మెంట్.

ఫొటో సోర్స్, Rajasaab/X
ప్లస్సులు, మైనస్సులు ఏమిటంటే..
ప్రభాస్ చాలా సీన్స్‌లో బాగా నటించాడు. జరీనా వాహబ్ కూడా పాత్ర పరిధిలో అద్భుతంగా నటించింది. కథ, కథనాలు వీక్‌గా ఉండడంతో అంతా తేలిపోయింది.
తమన్ పాటలు , బీజీఎం పెద్దగా వర్కౌట్ కాలేదు. అరగంట తగ్గించి వుంటే ఎడిటింగ్ బాగుండేది. కెమెరా ఓకే. వీఎఫ్ఎక్స్ కొన్ని సీన్స్‌లో తేలిపోయింది. ఖర్చు బాగా పెట్టారు. రిచ్‌నెస్ తెలుస్తూ వుంది.
ప్లస్ పాయింట్స్ః
1.ప్రభాస్ ,జరీనా నటన
2.అక్కడక్కడ కాసిన్ని నవ్వులు
మైనస్ పాయింట్స్ః
1.నిడివి
2.బీజీఎం
3.విలన్ లేకపోవడం
4.సెకండాఫ్
ఈ సినిమాలో మూడు నాలుగు సార్లు భావోద్వేగాలు అని వినిపిస్తూ వుంటుంది. రాజాసాబ్‌లో అవే లోపించాయి.
దర్శకుడిగా మారుతి ఇంత నిరాశపరుస్తాడని ఊహించలేదు.
(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











