ఎలుకకు బంగారు పతకం ఇచ్చారు... ఎందుకంటే?

ఫొటో సోర్స్, PDSA/PA
ధైర్య సాహసాలకు, విధి నిర్వహణలో చూపుతున్న అంకిత భావానికి గుర్తింపుగా ఓ ఎలుక బంగారు పతకం పొందింది.
బ్రిటన్‌కు చెందిన జంతు కారుణ్య సంస్థ పీడీఎస్ఏ... మగావా అనే ఎలుకకు ఈ పతకాన్ని అందజేసింది.
కంబోడియాలో ఎన్నో ప్రమాదకరమైన ల్యాండ్‌మైన్లను గుర్తించి, వెలికితీయడంలో కీలకపాత్ర పోషించినందుకు మగావాకు ఈ గౌరవం దక్కింది.
కంబోడియాలో 60 లక్షల ల్యాండ్ మైన్లు ఉన్నాయని ఓ అంచనా.
ధైర్యసాహసాలు, విధి నిర్వహణలో అంకితభావం చూపిన జంతువులకు గుర్తింపుగా పీడీఎస్ఏ కొన్నేళ్లుగా ఇలా బంగారు పతకాలు ఇస్తూ వస్తోంది.
ఇప్పటివరకూ దాదాపు 30 కుక్కలు ఈ పురస్కారం పొందాయి. కుక్కలు కాకుండా, ఈ గౌరవం దక్కించుకున్న మరో జీవి మగావానే.
మగావాకు ఇప్పుడు ఏడేళ్లు. టాంజానియాలో ఉన్న అపొపో సంస్థ దీనికి శిక్షణ ఇచ్చింది.
ల్యాండ్ మైన్లను, టీబీని గుర్తించడంలో అపోపో ఎలుకలకు శిక్షణ ఇస్తూ ఉంటుంది. 1990ల నుంచి ఈ సంస్థ పనిచేస్తోంది. ఈ సంస్థ శిక్షణ ఇచ్చిన ఎలుకలను హీరోర్యాట్స్ అని పిలుస్తుంటారు. శిక్షణ పూర్తైన తర్వాత వాటికి ఓ సర్టిఫికేట్ కూడా ఇస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘మగావాకు ఈ పురస్కారం రావడం మాకు గర్వకారణం. కంబోడియా ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ల్యాండ్‌మైన్ల కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్న అందరికీ ఇది గొప్ప విషయమే’’ అని అపోపో చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రిస్టోఫ్ కాక్స్ ప్రెస్ అసోసియేషన్ వార్తా సంస్థతో అన్నారు.
మగావాకు పురస్కారం ప్రదానం చేసే కార్యక్రమాన్ని పీడీఎస్ఏ తమ వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసింది.
మగావా టాంజానియాలో పుట్టి, పెరిగినట్లు అపోపో తెలిపింది.
మగావా బరువు 1.2 కిలోలు, పొడవు 70 సెం.మీ.లు. చాలా జాతుల ఎలుకల కన్నా మగావా పరిమాణం పెద్దదే.
అయినా, ల్యాండ్‌మైన్లపై అది తిరుగుతున్నా ప్రమాదమేమీ ఉండదు. ఎందుకంటే, మైన్‌లను పేల్చేంత బరువు మగావా లేదు.
ల్యాండ్ మైన్స్‌లో ఉండే ఓ రసాయన పదార్థాన్ని గుర్తించేలా మగావా లాంటి ఎలుకలకు అపోపో శిక్షణ ఇస్తుంది. చుట్టూ లోహం ఉన్నా, ఆ పదార్థాన్ని ఎలుకలు త్వరగా పసిగడతాయి.
ల్యాండ్ మైన్‌ను గుర్తించగానే, వాటిపైభాగాన్ని గీకుతూ మనుషులను అవి అప్రమత్తం చేస్తాయి.
ఓ టెన్నిస్ కోర్టు అంత ప్రదేశం మొత్తాన్ని మగావా 20 నిమిషాల్లో గాలించగలదు. అదే, మెటల్ డిటెక్టర్‌తో ఓ మనిషి ఈ పని చేయాలంటే నాలుగు రోజులు పడుతుందని అపోపో చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
రోజూ ఉదయం ఓ అరగంట పాటే మగావా పనిచేస్తుంది. దాని రిటైర్మెంట్ వయసు కూడా దగ్గరపడింది.
‘‘మగావా పరోక్షంగా ఎంతో మంది జీవితాలపై ప్రభావం చూపించింది. అనేక మంది ప్రాణాలను కాపాడింది’’ అని పీడీఎస్ఏ డైరెక్టర్ జనరల్ జాన్ మెక్‌లాహ్లిన్ అన్నారు.
ల్యాండ్ మైన్లను వెలికితీసేందుకు పనిచేస్తున్న హెచ్ఏఎల్ఓ ట్రస్టు వెల్లడించిన సమాచారం ప్రకారం... 1979 నుంచి ఇప్పటివరకూ కంబోడియాలో ల్యాండ్ మైన్ల కారణంగా 64 వేల మంది ప్రమాదాలకు గురయ్యారు. వీరిలో దాదాపు 25 వేల మంది వికలాంగులయ్యారు.
1970, 80ల్లో కంబోడియాలో అంతర్యుద్ధం జరిగింది. ఈ సమయంలోనే దేశంలో చాలా చోట్ల ల్యాండ్ మైన్లు పెట్టారు.
బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉండగా, 2014లో ఆ దేశం ల్యాండ్ మైన్ల వాడకంపై నిషేధం విధించుకుంది. అయితే, ఆ తర్వాత అధ్యక్ష పదవి చేపట్టిన డోనల్డ్ ట్రంప్ 2020 జనవరిలో ఈ నిషేధాన్ని ఎత్తివేశారు.
ఇవి కూడా చదవండి:
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- ఇస్లాం స్వర్ణయుగం: జ్యోతిషశాస్త్రాన్ని అధ్యయనం చేసిన అరబ్ తత్వవేత్త అల్-కింది
- పోర్ట్ రాయల్: చరిత్రలో ‘అత్యంత దుర్మార్గపు నగరం’ ఎందుకైంది? సముద్రంలో ఎలా మునిగిపోయింది?
- కోకాకోలా, మొసలిపేడ, పంది పేగులు... గర్భం రాకుండా పూర్వం వీటితో ఏం చేసేవారో తెలుసా?
- అండమాన్ కాలాపానీలో బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మేయో హత్య.. ‘‘ద ఫస్ట్ జిహాద్’’
- కొళాయి నీళ్లలో మెదడును తినేసే సూక్ష్మజీవులు.. ఆ నీళ్లు వాడొద్దంటూ అధికారుల వార్నింగ్
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- గ్వాదర్: ఒమన్ నుంచి ఈ ప్రాంతం పాకిస్తాన్లో ఎలా కలిసింది? భారత్ మంచి అవకాశం వదులుకుందా?
- కరోనావైరస్: వ్యాక్సీన్ ముందుగా ఎవరికి అందుతుంది? పేద దేశాలకు ఎవరు ఇస్తారు? ఎలా ఇస్తారు?
- ఐక్యరాజ్యసమితి అంటే ఏమిటి? అది ఏం చేస్తుంది?
- అండమాన్ కాలాపానీలో బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మేయో హత్య.. ‘‘ద ఫస్ట్ జిహాద్’’
- కోటీశ్వరుడైన యజమానితో పనిమనిషి పోరాటం.. ఎందుకు? ఎవరు గెలిచారు?
- బంగారం వ్యాపారానికి ప్రొద్దుటూరు ఎలా కేంద్రంగా మారింది? ఈ ఊరిని రెండో ముంబై అని ఎందుకు అంటారు?
- వాడి పడేసిన 3 లక్షల కండోమ్‌లు రీసైకిల్ చేసి విక్రయించే ప్రయత్నం...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








