కోకాకోలా, మొసలిపేడ, పంది పేగులు... గర్భం రాకుండా పూర్వం వీటితో ఏం చేసేవారో తెలుసా?

ఫొటో సోర్స్, Anna Huzar
- రచయిత, కాట్రియోనా వైట్
- హోదా, బీబీసీ ప్రతినిధి
సెప్టెంబర్ 26 ప్రపంచ గర్భ నిరోధక దినం.
దీనికి కూడా ఓ రోజు ఎందుకు అనుకుంటున్నారా? ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ కండోమ్‌లు, గర్భ నిరోధక మాత్రలు సులభంగా దొరికేస్తున్నాయి కాబట్టి, వాటి విలువ మనకు తెలియడం లేదు.
పూర్వం ఇవి లేని రోజుల్లో మనుషులు ఎన్ని పాట్లు పడ్డారో, ఎన్ని వింత పద్ధతులు పాటించారో తెలిస్తే మీ అభిప్రాయం మారుతుంది.
మీకు ఆ విషయం తెలిసివచ్చేలా చేసేందుకే, గర్భ రాకుండా ఉండేందుకు వాళ్లు చేసిన ఓ పది వింత పనులను మీ ముందుకు తెచ్చాం. చదవండి.

ఫొటో సోర్స్, Anna Huzar
1. కాళ్లపై కూర్చోవడం
పూర్వం గ్రీకు ప్రజల్లో ఓ నమ్మకం ఉండేది.
సెక్స్‌లో పాల్గొన్న తర్వాత ఆడవాళ్లు నేలపై పూర్తి శరీరం ఆనించకుండా, కాళ్లపై మాత్రమే కూర్చుని తల ముందుకు వాల్చితే (ఇండియన్ స్టైల్ టాయిలెట్‌పై కూర్చున్నట్లుగా) వీర్యం గర్భాశయంలోకి వెళ్లదని వాళ్లు అనుకునేవారు.
అయితే, ఇలా చేస్తే గర్భం రాదని శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలూ లేవు.
2. కాలికి వృషణాలు కట్టుకోవడం
యూరప్‌లో మధ్య యుగ కాలంలో వీజెల్ అనే ఓ రకం ముంగీస వృషణాలు ఆడవాళ్లు కాలికి కట్టుకుంటే, గర్భం రాదని నమ్మేవారు.
దీన్ని ప్రచారంలో పెట్టిన మహానుభావులు ఎవరో గానీ, అనవసరంగా మూగ జీవులు బలైపోయాయి.
3. విషపు నీళ్లు తాగడం
మళ్లీ గ్రీకుల దగ్గరికి వెళ్దాం. ఈసారి కాస్త పని చేసే ట్రిక్కుతోనే వాళ్లు ముందుకువచ్చారు.
కమ్మరి పనిచేసేవాళ్లు తమ పనిముట్లను చల్లబరిచేందుకు నీళ్లతో వాటిని కడుగుతారు కదా! ఆ నీటిని తాగితే గర్భం రాదని ప్రచారంలో పెట్టారు.
ఒక విధంగా ఈ ట్రిక్కు పనిచేసిందనే చెప్పాలి. ఎందుకంటే ఆ నీటిలో లెడ్ లాంటి విష పదార్థాలు ఉంటాయి.
గర్భం రాకుండా చేయడమేం కర్మ... వాంతులు, మూత్ర పిండాల సమస్యలు, మూర్ఛ, కోమా, మరణం లాంటి అదనపు ప్రయోజనాలను కూడా అది మోసుకువచ్చింది.
మొదటి ప్రపంచ యుద్ధం వరకూ ఈ ట్రిక్కు వాడుకలో ఉందంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. ఆ సమయంలో ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న మహిళలు కొందరు గర్భం రాకుండా ఉండేందుకు లెడ్‌ను తీసుకునేవారు.
4. మొసలి పేడ
ప్రాచీన ఈజిప్షియన్లకు మనం సలాం కొట్టాల్సిందే.
ముక్కు రంధ్రం నుంచి మనిషి మెదడును బయటకుతీసిన ఘనత వారిది.
గర్భాన్ని నిరోధించేందుకు వాళ్లు కాస్త 'ప్రాక్టికల్' విధానాన్నే అనుసరించారు.
గర్భం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, వీర్యం గర్భాశయంలోకి వెళ్లకుండా చూడాలి. ఓ అడ్డుగోడ ఏర్పాటు చేస్తే, సరిపోతుంది కదా.
ఇక్కడి వరకూ బాగానే ఉంది.
కానీ, ఆ అడ్డుగోడ ఎలా ఏర్పాటు చేయాలన్న విషయంలోనే వాళ్లు వినూత్నంగా, విచిత్రంగా ఆలోచించారు. మొసలి పేడను, తేనెను కలిపి యోనిలోకి పంపి ఈ అడ్డుగోడను తయారుచేసేవారు.
ఇప్పుడు వాడుకలో ఉన్న గర్భ నిరోధక డయాఫ్రాగ్మ్ పరికరం ఇదే సూత్రం మీద పనిచేస్తుంది.

ఫొటో సోర్స్, Anna Huzar
5. వృషణాల పొడి
ఈసారి 16వ శతాబ్దపు కెనడియన్లు వృషణాల మీద పడ్డారు.
బీవర్ అని పిలిచే జంతువు వృషణాలను మెత్తగా పొడిలా దంచి, ఓ రకం టీ చేసుకుని తాగితే గర్భం రాదని వాళ్లు అనుకునేవాళ్లు.
ముంగిస వృషణాలు కాళ్లకు కట్టుకుంటే ఎంత ఫలితం ఉంటుందో, ఈ వృషణాల టీ తాగినా అంతే ఫలితం ఉంటుంది.
6. జంతువుల పేగులు
ఇవి మొదటి తరం కండోమ్‌లు అన్నమాట.
ఇప్పటి తరహా ఫ్లేవర్లు అప్పుడు లేవు గానీ, రకరకాల జంతువుల పేగులతో వాళ్లు సర్దుకుపోయేవారు.
చరిత్ర రికార్డులను తిరగేస్తే, మొట్టమొదట పంది పేగులను ఇలా కండోమ్‌లుగా వాడినట్లుగా తెలుస్తోంది.
వాడేముందు వీటిని వేడి పాలలో నానబెట్టేవారంట. ఆ పాల గ్లాసుకు ఏదైనా గుర్తు పెట్టుకునేవారో, లేదో!
7. నిమ్మపిప్పి
నిమ్మకాయను రెండు ముక్కలుగా కోసి, దానిలోని పిప్పి అంతా బయటకు తీసేవారు. తీసిన పిప్పినంతా యోనిలో పెట్టుకునేవారు.
ఈ నిమ్మ పిప్పికి ఆమ్ల లక్షణం ఉంటుంది. ఇది వీర్యకణాలను నాశనం చేసేది.
మొత్తానికి ఈ ట్రిక్కు పనిచేసిందన్నమాట.
నిమ్మకాయలను ఇలా వాడొచ్చని కనిపెట్టిన ఆ మేధావి ఎవరో?
8. పాదరసంలో కప్పల వేపుడు
ఎంతైనా చైనా వాళ్ల రూటు కొంచెం సెపరేటు.
క్రీస్తు పూర్వం 900 ప్రాంతంలో గర్భం రాకుండా ఉండేందుకు అక్కడి నిపుణులు ఇచ్చిన సలహాను వింటే... అసలు వీళ్లు ఇలా ఎలా ఆలోచించగలరన్న అనుమానం మనకు రాకమానదు.
వాళ్ల సలహా ఏంటంటే... సెక్స్ పూర్తైన వెంటనే, కప్ప గుడ్ల నుంచి అప్పుడే బయటకువచ్చిన లేత తోకకప్పలను పాదరసంలో దోరగా వేయించి, గుటుక్కుమని మింగాలి.
ఇది కూడా ఆ గ్రీకుల లెడ్ నీటిని తాగే ఉపాయం లాంటిదే.
పాదరసంలో వేయించిన కప్పలు కాబట్టి... చాలా మంది మహిళలు గర్భం దాల్చకుండా ఉండటమే కాదు, ఆరోగ్యపరంగా విపరీతమైన పరిణామాలను చవిచూశారు.

ఫొటో సోర్స్, UNIVERSITY OF YORK
9. నల్లమందు
నల్లమందు మొక్కలను మత్తుకే కాదు, గమ్మత్తుగా గర్భనిరోధక సాధనాలుగా కూడా ఉపయోగించొచ్చని అనుకున్నారు సుమత్రా దీవీలోని పాత తరాల వాళ్లు.
అక్కడి మహిళలు నల్లమందు కాయను డయాఫ్రాగ్మ్ తరహాలో యోనిలో పెట్టుకునేవారు. కొందరు పూవును పెట్టుకునేవారు.
అవి అసలు ఎలా పనిచేశాయో, ఎంతవరకూ పనిచేశాయో మనకైతే తెలియదు.
10. కోకాకోలా
చరిత్రంతా చుట్టేశాం కదా! ఇక ఆధునిక కాలానికి వద్దాం. అలా అని మరీ ఆధునిక కాలానికి కాదు, ఒక అరవై ఏళ్ల క్రితం వరకూ వద్దాం.
ఎవరు మొదలుపెట్టారో తెలియదు గానీ... సెక్స్ అయ్యాక కోకాకోలాను యోనిలో పోసుకుంటే, వీర్య కణాలు నశిస్తాయని అప్పట్లో ప్రచారం జరిగింది.
కోకాకోలాలో ఉండే షుగర్ వీర్య కణాలను చంపేస్తుందని మహానుభావులెవరో సిద్ధాంతీకరణ చేశారు. ఇంకేముంది, కొందరు అదే పనిచేసేవారు.
కార్బొనేటెడ్ డ్రింక్ కావడంతో కోకాకోలా కూడా బుస్సని పొంగుతూ, ఈ పనికి అనుకూలంగా ఉండేది.
ఈ చిట్కాను నమ్మి, ఎంత మంది మోసపోయి ఉంటారో?
ఇవి కూడా చదవండి:
- బంగారం వ్యాపారానికి ప్రొద్దుటూరు ఎలా కేంద్రంగా మారింది? ఈ ఊరిని రెండో ముంబై అని ఎందుకు అంటారు?
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
- బంగారం నిక్షేపాలు భూమిలో తరిగిపోతున్నాయా... ఇక చంద్రుడిపై తవ్వాల్సిందేనా?
- భారత్-పాక్ 1965 యుద్ధం: జనరల్ అయూబ్ ఖాన్ రహస్య బీజింగ్ పర్యటన, యుద్ధం చేయాలని చైనా సలహా
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- పెళ్లి కోసం అమ్మాయిలను కిడ్నాప్ చేస్తారక్కడ
- మోదీ కేబినెట్లో మంత్రి రాజీనామాకు కారణమైన మూడు బిల్లుల్లో ఏముంది.. రైతులకు లాభమా, నష్టమా?
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- హీరోలకు దీటుగా నటించడం... ప్రభుదేవాతో కలసి స్టెప్పులేయడం ఆయనకే చెల్లింది
- అరుణ్ శౌరి: వాజపేయి కేబినెట్లో మంత్రి.. మోదీ ప్రభుత్వం వచ్చాక సీబీఐ కేసులో నిందితుడు ఎలా అయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








