SPBalasubrahmanyam: హీరోలతో పోటీపడి నటించడం... ప్రభుదేవాతో సమానంగా స్టెప్పులేయడం ఆయనకే చెల్లింది

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం

ఫొటో సోర్స్, facebook/S. P. Balasubrahmanyam

    • రచయిత, అరుణ్ శాండిల్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంటే పాట. ఆ గొంతు నుంచి జాలువారిన వేల పాటలు కోట్లాది అభిమానులను సమ్మోహితులను చేశాయి. తెర వెనుక గాత్రమిచ్చి ఎంత పేరు తెచ్చుకున్నారో, తెర మీద నటుడిగానూ అంతే స్థాయిలో మెప్పించారు.

బాలు నటించిన సినిమాలు తక్కువే ఆయినా అవి బాలులోని అభినయ కౌశలానికి నిదర్శనాలుగా నిలిచాయి. కొన్ని సినిమాలతోనే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు బాలసుబ్రహ్మణ్యం.

ముఖ్యంగా తెలుగు తెరపై ఆయన పోషించిన స్ఫూర్తిదాయక తండ్రి పాత్రలను, స్నేహితుడిలాంటి నాన్న పాత్రలను ఆయన లేని ఈ సమయంలో అందరూ గుర్తుతెచ్చుకుంటున్నారు.

అలాగే సున్నిత హృదయుడైన ప్రేమికుడిగా, రెక్కలొచ్చి పిల్లలు ఎగిరిపోయన తరువాత విచారంలో మునిగిపోకుండా జీవితాన్ని తన తోడుతో కలిసి రమణీయంగా మలచుకున్న వయోధికుడిగానూ ఆయన ప్రేక్షకుల మనుసులను కొల్లగొట్టేశారు.

2020 సెప్టెంబర్ 25న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఈ కథనం మరోసారి...

మిథునంలో బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి

ఫొటో సోర్స్, youtube

ఫొటో క్యాప్షన్, మిథునంలో బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి

నటుడిగా తొలి చిత్రం 'పెళ్లంటే నూరేళ్ల పంట'

బాలసుబ్రహ్మణ్యం తెరంగేట్రం 1968లో 'పెళ్లంటే నూరేళ్ల పంట' సినిమాతో మొదలైంది. తాను గాయకుడిగా సినీ రంగానికి పరిచయమైన కొద్దికాలానికే నటుడిగానూ తెరపై కనిపించారని సీనియర్ పాత్రికేయుడు పామర్తి హేమసుందర్ 'బీబీసీ'తో చెప్పారు.

ఆ తరువాత ఒకట్రెండు సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో కనిపించినా 1990లో వచ్చిన 'ఓ పాప లాలీ' ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇది నిజానికి 'కేలడి కన్మణి' అనే తమిళ చిత్రానికి అనువాదం మాత్రమే. కానీ, తెలుగులో ఈ సినిమా మంచి ఆదరణ పొందింది.

'మాటే రాని చిన్నదాని కళ్లు పలికే ఊసులు'' అంటూ గుక్కతిప్పుకోకుండా రాధికకు ప్రేమ కవిత్వం వినిపిస్తూ కనిపించే బాలసుబ్రహ్మణ్యాన్ని ఇప్పటికీ మరిచిపోలేరు ఆయన అభిమానులు.

చెంగుచెంగున ఎగురుతూ బ్రేకు డ్యాన్సులు, ఫోక్ డ్యాన్సులు చేసే హీరోలు రాజ్యమేలుతున్న సమయంలో 1990లో వచ్చిన ఆ సినిమాలో సాగర తీరంలో ప్రియురాలి వెంట రొప్పుతూ నడుస్తూ బ్రీత్‌లెస్ పాట పాడేసి హిట్ కొట్టేశారు బాలు.

బాలు

ఫొటో సోర్స్, facebook/spbalasubrahmanyam

రమేశ్ అరవింద్ వంటి తమిళ హీరోలు ఇందులో ఉన్నప్పటికీ బాలసుబ్రహ్మణ్యానిదే ఈ సినిమాలో ప్రధాన పాత్ర.

ఇందులో బాలుకి అప్పటికే పెళ్లయి భార్య ఒక ప్రమాదంలో చనిపోతుంది. ఆ తరువాత కూతురే ప్రాణంగా బతుకుతుంటారు బాలు. కూతురు కూడా అనారోగ్యం పాలై చనిపోతానని తెలుసుకుంటుంది. దాంతో తండ్రి ఒంటరివాడైపోతాడని భయపడుతూ ఉంటుంది. అలాంటి సమయంలో బాలుకు రాధిక పరిచయమవుతుంది. వారిద్దరినీ కలపాలని బాలు కుమార్తె ప్రయత్నిస్తుంటుంది. బాలు కుమార్తెకు ప్రియుడిగా రమేశ్ అరవింద్ నటించారు.

బాలు నటనా కెరీర్లో ఈ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. 'మాటే రాని చిన్నదాని' పాటను గుక్క తిప్పుకోకుండా తానే స్వయంగా పాడగా ఈ సినిమాలో రమేశ్ అరవింద్ కోసం కేజే ఏసుదాస్ పాడిన 'నీవేగా నా ప్రాణం' పాట కూడా మంచి ఆదరణ పొందింది.

నాగార్జున , బాలు

ఫొటో సోర్స్, youtube/volga video

ఫొటో క్యాప్షన్, నాగార్జున , బాలు

వెంకటేశ్, నాగార్జున, ప్రభుదేవాలకు తండ్రిగా..

హీరో వెంకటేశ్‌ నటించిన ప్రేమ, పవిత్ర బంధం సినిమాల్లో బాలసుబ్రహ్మణ్యం నటించారు. 1989లో వచ్చిన ప్రేమ సినిమాలో బాలు కీలక పాత్ర పోషించారు.

అలాగే 1996లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన పవిత్ర బంధం సినిమాలో ఆయన వెంకటేశ్ తండ్రిగా నటించారు. వివాహ బంధానికి విలువివ్వని కొడుక్కి బోధ చేసి దారిలో పెట్టే తండ్రి పాత్ర అది.

బాలసుబ్రహ్మణ్యానికి సుఖ్విందర్ సింగ్ గొంతు

ఆ తరువాత ఏడాది 1997లో ప్రవీణ్ గాంధీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా, సుష్మిత సేన్ హీరోయిన్‌గా తమిళ, తెలుగు భాషల్లో ఒకే సారి విడుదలైన భారీ చిత్రంలో నాగార్జున తండ్రిగా నటించారు బాలసుబ్రహ్మణ్యం.

అందులో ఆవేశపరుడైన కొడుకుని మంచి అబ్బాయిలా మార్చుకునే ప్రయత్నం ఆయనది.

ఈ సినిమాలో 'లక్కీ లక్కీ' అంటూ నాగార్జునతో కలిసి స్టెప్టులేశారు బాలు. ఈ పాటలో నాగార్జునకు బాలు పాడగా, బాలుకు సుఖ్విందర్ సింగ్ పాడారు.

బాలుతో శంకర్, ప్రభుదేవా

ఫొటో సోర్స్, Twitter/shnakrshanmugam

ఫొటో క్యాప్షన్, బాలుతో శంకర్, ప్రభుదేవా

అంతకుముందు 1994లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ప్రేమికుడు సినిమాలో ప్రభుదేవాకు తండ్రిగా నటించారు బాలు. ఇది కూడా తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన సినిమా.

కొడుకు ప్రేమకు సపోర్ట్ చేయగలిగే ఒక మెచ్యూర్డ్ తండ్రిగా ఆయన పోషించిన పాత్ర యువతను ఆకట్టుకుంది.

1997లో వచ్చిన ఆరోప్రాణం, 1998లో విడుదలైన దీర్ఘసుమంగళీభవ చిత్రాల్లోనూ కీలక పాత్రల్లో కనిపించారు బాలు.

2000లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'దేవుళ్లు' సినిమాలో వినాయకుడి పాత్రలో నటించారు.

‘మిథునం’తో మళ్లీ..

ఆ తరువాత కొంతకాలం తెరపై కనిపించని బాలు 2012లో మళ్లీ మెరిశారు.

ఆ ఏడాది తనికెళ్ల భరణి దర్శకత్వంలో వచ్చిన మిథునం సినిమాలో ఆయన నటన విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ప్రత్యేక నంది పురస్కారం దక్కించుకున్న ఈ సినిమాలో లక్ష్మి, బాలసుబ్రహ్మణ్యం వయోధిక జంటగా కనిపిస్తారు.

పిల్లలంతా ఎవరి జీవితాలు వారు చూసుకుని విదేశాలకు తరలిపోయిన తరువాత ఏమాత్రం విచారం లేకుండా ఒకరికొకరుగా ఆనందమయ జీవనం గడిపిన జంటగా ఇద్దరూ పోటీపడి నటించారు.

ప్రభుదేవా, బాలు

ఫొటో సోర్స్, youtube/shalimarfilmexpress

ఫొటో క్యాప్షన్, ప్రభుదేవా, బాలు

ప్రభుదేవాతో పోటీ పడి డ్యాన్స్

ప్రేమికుడులో ప్రభుదేవాతో పోటీపడి స్టైలిష్ స్టెప్‌లు వేశారు బాలసుబ్రహ్మణ్యం. ''అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే'' అనే పాటలో కనిపించిన బాలు అందులో కొడుకు పాత్రలో ఉన్న ప్రభుదేవాతో సమానంగా డ్యాన్స్ చేశారు.

ప్రభుదేవాతో సమానంగా బాలు డ్యాన్స్ చేయడమనేది ఏ పనిచేసినా అందులో ప్రావీణ్యం చూపాలన్న బాలు తపనకు నిదర్శనమని హేమసుందర్ అన్నారు.

ఆయన పాటల్లో, సంభాషణల్లో, నటనలో భాషను పలికే తీరు, భావాన్ని పలికించే తీరు అత్యున్నతంగా ఉంటుందని హేమసుందర్ అన్నారు.

చిరంజీవి, బాలకృష్ణ, రాజేంద్రప్రసాద్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలతోనూ నటించారు బాలసుబ్రహ్మణ్యం. తెలుగు, తమిళంలో అనేక చిత్రాల్లో బాలు తెరపై కనిపించి మెప్పించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)