అంతర్వేది ఆలయం: రథం ఘటనపై సీబీఐ విచారణ సరే.. అన్యాక్రాంతమైన వందలాది ఎకరాల భూముల సంగతి ఏమిటి?

అంతర్వేది ఆలయం
    • రచయిత, శంకర్ వి.
    • హోదా, బీబీసీ కోసం

అంతర్వేది ఆలయంలో జరిగిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. రథం కాలిపోయిన ఘటనపై ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించడంతో కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ రంగంలో దిగే అవకాశం కనిపిస్తోంది.

అయితే రథం కాలిన అంశంలో సాగినంత చర్చ అక్కడి ఆలయంలో సాగుతున్న అక్రమాలకు ఎందుకు సాగడం లేదనే సందేహాలు అంతర్వేది పరిసర ప్రజల్లోనూ, భక్తుల్లోనూ వినిపిస్తోంది.

విలువైన భూములు, ఖరీదైన ఆస్తులు కలిగిన ఆలయంలో ఏటా స్వామి వారి కళ్యాణానికి చందాల ఎత్తాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది? ఆలయ పరిసరాల్లోనే ఆక్వా సాగు యథేచ్ఛగా సాగుతున్నా ఎందుకు పట్టనట్టున్నారు? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో అంతర్వేది ఆలయ భూముల వివాదంపై బీబీసీ వివరాలు సేకరించింది.

అంతర్వేది ఆలయం

పల్లవ రాజులు కట్టిన ఆలయం...

అంతర్వేది ఆలయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. పల్లవ రాజులు క్రీస్తు శకం 5వ శతాబ్దంలో ఆలయాన్ని నిర్మించినట్టు స్థానికులు చెబుతుంటారు. అది కాలగర్భంలో కలిసిపోవడంతో అల్లవరం మండలం బెండమూరులంక ప్రాంతానికి చెందిన నౌక వ్యాపారి కొప్పనాతి ఆదినారాయణ ఆధ్వర్యంలో రాతి మండపాలు, శిఖరాలతో మళ్లీ ఈ ఆలయాన్ని నిర్మించినట్టు ఆధారాలున్నాయి.

ఆ తర్వాత 2004లో ఆధునికీకరణ జరిగింది. ప్రాకారాలు, గోపురాలను పునర్నిర్మించారు. నాటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.

నవ నారసింహ క్షేత్రాలలో అంతర్వేది ఒకటిగా చెబుతారు. నిత్యం పూజా కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.

గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతం కావడంతో పర్యాటక పరంగా కూడా అంతర్వేదికి ప్రాధాన్యత ఉంది. అందుకు తగ్గట్టుగా గత కొన్ని దశాబ్దాలలోఈ ప్రాంతంలో అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.

అంతర్వేది ఆలయ సందర్శనార్థం వచ్చే భక్తుల అవసరార్థం నిత్యాన్నదాన పథకంతో పాటుగా గోశాల కూడా ఏర్పాటు చేశారు. ఆలయం ఆధ్వర్యంలో కొన్ని వసతి గృహాలు కూడా నిర్మించారు.

అయితే ఆలయానికి ఉన్న ఆదాయ వనరులకు తగ్గట్టుగా ఆలయాభివృద్ధి జరగలేదనేది స్థానికుల వాదన. అత్యంత విలువైన భూములున్నప్పటికీ వాటి ద్వారా ఆదాయం సమకూర్చుకునే ప్రయత్నాలు జరగడం లేదని చెబుతున్నారు.

అంతర్వేది ఆలయం
ఫొటో క్యాప్షన్, అంతర్వేదిని ఆనుకుని ఆక్వాసాగు

రికార్డుల ప్రకారం సుమారు 900 ఎకరాల భూములు...

అంతర్వేది ఆలయానికి రికార్డుల ప్రకారం సుమారు 900 ఎకరాల భూములున్నాయని అమలాపురం ఆర్డీవో చెబుతున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇవి ఉన్నాయి. వాటిలో మెరక 416 ఎకరాలు కాగా, పల్లం 476 ఎకరాలుగా రికార్డులు చెబుతున్నాయి.

తొలినాళ్లలో రికార్డుల ప్రకారం మెరక, పల్లం అంటూ ప్రస్తావించిన భూములు కూడా ప్రస్తుతం ఆక్వా సాగు కారణంగా కలిసిపోయినట్లు, అన్ని భూములను చదును చేసి చెరువులు తవ్వేసినట్లు కనిపిస్తోంది.

ఆక్వా సాగు ద్వారా అధిక ఆదాయం వస్తుండడంతో ఆలయ అధికారుల అనుమతులు లేకుండానే లీజు దారులు వాటిని చెరువులుగా మార్చేశారు. ఆక్వా సాగు కోసం రెవెన్యూ నుంచి కూడా అనుమతులు తీసుకోలేదని ఆర్డీవో బీబీసీకి తెలిపారు.

అంతర్వేది ఆలయ భూములు అన్యాక్రాంతం అయిన తీరుపై తాము ఎంత ప్రయత్నం చేసినా ఫలితం ఉండడం లేదని ట్రస్ట్ బోర్డ్ మాజీ మెంబర్ గంటా నాయుడు బీబీసీ అంటున్నారు.

''గత ప్రభుత్వ హయంలో నేను ట్రస్ట్ బోర్డ్ సభ్యుడిగా ఆస్తుల అన్యాక్రాంతం విషయం మీద పట్టుబట్టాను. చివరకు కొందరు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఆలయ భూముల్లో శాశ్వత నిర్మాణాలకు అవకాశం లేకపోయినా పంచాయితీలు అనుమతినిచ్చాయి. ఎలక్ట్రికల్, వాటర్ సప్లై అనుమతులు కూడా వాటికి దక్కాయి. అలాంటి వాటిపై లోకాయుక్త సీరియస్ అయ్యింది. అలాంటి నిర్మాణాలను తొలగించాలని పంచాయితీరాజ్ శాఖను ఆదేశించింది. అయినా పట్టించుకున్న వారు లేరు'' అని ఆయన తెలిపారు.

''ఆలయానికి లీజు ద్వారా ఏటా కోట్ల రూపాయాల ఆదాయం రావాలి. కానీ నేటికీ నామమాత్రపు లీజులే ఉన్నాయి. ఎకరాకి రూ. 300, రూ. 200 చొప్పున వసూలు చేసే భూములు కూడా ఉన్నాయి. పైగా అవన్నీ ఇప్పుడు సామాన్యుల నుంచి పెద్దల చేతుల్లోకి మారిపోయాయి'' అని వివరించారు.

అంతర్వేది ఆలయం

'ఆ భూములు ఇప్పుడు మా చేతుల్లో లేవు...'

అంతర్వేది దేవస్థానం భూములను వివిధ సొసైటీల పేరుతో సాగు నిమిత్తం కేటాయించారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న భూములను స్వల్ప లీజు రుసుంతో సామాన్యులకు కేటాయించారు. స్థానికులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు, దేవాలయ నిర్వహణకు లోటు రాకుండా చూసేందుకు ఈ భూములను అప్పగించారు.

అందులో కులాల వారీగా ఏర్పడిన వివిధ సొసైటీలు కూడా ఉన్నాయి. తొలుత మెరక భూముల్లో కొబ్బరి, పల్లం నేలలో వరి ఎక్కువగా సాగు చేసేవారు. అయితే గడిచిన మూడు దశాబ్దాలుగా అంతర్వేది ప్రాంతంలో ఆక్వాసాగు జోరందుకుంది. ఇప్పుడు పూర్తిగా విస్తరించింది.

దాంతో కొబ్బరి తోటలను తొలగించారు. వరి పొలాలను కూడా చెరువులుగా మార్చేశారు. ఆ క్రమంలో తాము సాగు చేయాలని ప్రయత్నించిన కొందరు లీజుదారులకు కూడా అవకాశం లేకుండా పోయింది.

అంతర్వేది కర గ్రామానికి చెందిన కొల్లాబత్తుల వేణుగోపాల్ బీబీసీతో మాట్లాడుతూ "మా తండ్రుల కాలంలో దేవస్థానం భూములు మాకు వచ్చాయి. వాళ్ల తర్వాత మేము కూడా సాగు చేశాం. కానీ రొయ్యల చెరువులు వచ్చిన తర్వాత పెద్ద పెద్ద చెరువులు తవ్వేయడంతో మా భూములు కూడా చవట భూములయిపోయాయి'' అని చెప్పారు.

''ఉప్పునీరు కారణంగా వ్యవసాయం చేసే పరిస్థితి లేకుండా పోయింది. చివరకు మేము కూడా రికార్డుల ప్రకారం లీజుదారులం అయినప్పటికీ సాగు చేయలేక మూడో వ్యక్తికి అప్పగించేశాం. ఇప్పుడు వాళ్లే ఆలయ భూములను కూడా పెద్ద పెద్ద చెరువులు తవ్వేశారు. వాళ్లిచ్చిన లీజు మేము తీసుకుని, అందులో కొంత ఆలయానికి శిస్తు కింద కడుతూ గడుపుతున్నాం'' అని తెలిపారు.

అంతర్వేది ఆలయం

'భూములన్నీ చేతులు మారిపోయాయి...'

''మేము సాగుచేసుకున్నప్పుడు లాభమయినా, నష్టమయినా మాకు వచ్చేది. కానీ ఇప్పుడు అలాగాకుండా ఏటా రూ. 50 వేల వరకూ మాకు వస్తుంది. కానీ రొయ్యల చెరువుకి బయట భూములయితే లీజు ఎకరాకి రూ. లక్ష వరకూ ఉంటుంది'' అని ఆయన వివరించారు.

అంతర్వేది ఆలయానికి ఉన్న భూములు ఇప్పటికే పలువురి చేతులు మారిపోయాయని స్థానికులు చెబుతున్నారు. మానవ హక్కుల వేదిక ప్రతినిధిగా ఉన్న ముత్యాల శ్రీనివాస్ బీబీసీతో మాట్లాడారు.

"చాలా కుటుంబాల్లో కట్నాల కింద ఈ భూములు రాసేసుకున్నారు. ఇంకొందరు ఎవరెవరికో అమ్మేసుకున్నారు. ఆలయ లీజుదారులెవరూ ఇప్పుడు భూముల మీద లేరు. సబ్ లీజులే ఉన్నాయి. కొందరు పెద్దలు ఈ భూములను కాజేశారు. ఆలయ ఆస్తులను సొంతం చేసుకున్నారు. పైగా చెల్లించాల్సిన లీజులు కూడా నామమాత్రంగా ఉన్నాయి'' అని చెప్పారు.

''చివరకు అంతర్వేది ఆలయ రథోత్సవం చేయాలంటే ఏటా చందాలు వసూలు చేయాల్సి వస్తోంది. అసలే అంతంతమాత్రంగా ఉండే పంచాయితీల నుంచి రెండు వేలు, మూడు వేలు చొప్పున కూడా తీసుకుంటున్నారు. ఆలయానికి ఆస్తులున్నప్పటికీ ఇలా చందాలు వసూలు చేసి కళ్యాణం జరపాల్సిన పరిస్థితి ఎందుకు రావాలి? ఈ ఆలయ భూముల వ్యవహారంపై విచారణ చేయాలి'' అని కోరారు.

అంతర్వేది ఆలయం

'భూముల అన్యాక్రాంతం అయిన విషయాన్ని గుర్తించాం...'

అంతర్వేది ఆలయ భూముల వ్యవహారంలో పలువురు రాజకీయ నేతలదే పెద్ద పాత్ర అని చెబుతున్నారు. వివిధ పార్టీల నేతలు, వారి అనుచరులే ప్రస్తుతం భూములపై పెత్తనం చేస్తున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో భూముల పరిరక్షణకు కొందరు ప్రయత్నాలు చేసినా ఫలితాలు రావడం లేదంటున్నారు. లోకాయుక్త ఆదేశాలు కూడా అమలు కాలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు అంతర్వేది భూములు అన్యాక్రాంతం జరిగిన మాట వాస్తవమేనని అధికారులు అంగీకరిస్తున్నారు. అమలాపురం ఆర్డీవో వసంతరాయుడు ఈ విషయంపై బీబీసీతో మాట్లాడారు.

"అంతర్వేది ఆలయ ఆస్తుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం. కొంత అన్యాక్రాంతం జరిగిందనేది వాస్తవం. ఇరిగేషన్, ఫిషరీస్ అధికారులతో ఇప్పటికే దానిపైన ప్రాధమిక చర్చలు జరిపాం. పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటాం. దేవస్థానం భూముల విషయంలో అక్రమాలను అడ్డుకుంటాం. ఆక్వా సాగుకి అనుమతులు లేవు. వాటిని కూడా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటాం'' అని వెల్లడించారు.

అంతర్వేది ఆలయం

'వేల కోట్ల ఆస్తులపైనా దృష్టి పెట్టాలి...'

1962లో నిర్మించి, 64 నుంచి వినియోగంలో ఉన్న ఆలయ రథం ఈ నెల 6వ తేదీన మంటల్లో కాలిపోవడం స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఆలయ రథం విషయం రాజకీయంగా ప్రకంపనలు రేపింది.

విచారణకు ప్రయత్నించిన ఏపీ పోలీసులు కూడా ఓ నిర్ణయానికి రావడానికి తగిన ఆధారాలు లభించలేదు. దానికి ప్రధాన కారణం సీసీ కెమెరాలు పనిచేయకపోవడమేనని చెబుతున్నారు. ఆలయానికి సంబంధించిన విలువైన సామగ్రిని పక్కదారి పట్టించే సిబ్బందిలో కొందరు సీసీ కెమెరాలు పనిచేయకుండా చేసి ఉంటారనే వాదన కూడా ఉంది.

దానికి అనుగుణంగా రథం ఘటనపై చర్యల్లో భాగంగా ఈవోతో పాటుగా సెక్యురిటీ, సీసీ కెమెరాల నిర్వహణ బాధ్యత చూడాల్సిన కంప్యూటర్ ఆపరేటర్‌ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

దాంతో ప్రస్తుతం సీబీఐ విచారణకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో అంతర్వేది ఆలయానికి చెందిన భూముల విషయంలో కూడా తగిన చర్యలు తీసుకోవాలని అని రైతు సంఘాలు కోరుతున్నాయి.

ఏటా కేవలం మెరక భూములకు గరిష్టంగా రూ. 1,500 మాత్రమే శిస్తు వసూలు చేస్తున్నారని, పల్లం భూములకు 4 బస్తాల ధాన్యం తీసుకుంటున్నారని ఆలయ రికార్డులు చెబుతున్నాయి. వాటిపై దృష్టి సారించి, అసలు లీజుదారులు, ఆక్రమణదారుల వివరాలతో పాటు వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా లీజు పెంచడం వంటి చర్యలు చేపట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది.

ఆలయ ఆదాయ లెక్కలు, వ్యయం వివరాలు వెల్లడించడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అవకాశం లేదని ఆలయ నిర్వహణ కోసం కొత్తగా అసిస్టెంట్ కమిషనర్ హోదాలో బాధ్యతలు స్వీకరించిన యర్రంశెట్టి భద్రాజీ బీబీసీతో చెప్పారు. ప్రస్తుతం రథం ఘటనపై విచారణ సాగుతున్నసమయంలో వివరాలు అందించడం వీలుకాదన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)