తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం: మీ భూమి సమస్యకు ఎవరి దగ్గరకు వెళ్లాలి? మీ భూమి మీదేనని అధికారికంగా ఎవరు చెప్తారు?

ఎడ్ల బండిపై రైతు
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణ ప్రభుత్వం భూపరిపాలనలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చింది. 1985లో యన్టీఆర్ చేపట్టిన సంస్కరణల తరువాత ఇవే అతి పెద్ద సంస్కరణలు. ఇంతకీ ఈ కొత్త చట్టాల వల్ల ఏం మారబోతోంది? మీ భూమికి సంబంధించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఇవే.

ప్రస్తుతం ఉన్న భూమి రికార్డులకు సంబంధించిన చట్టాల స్థానంలో ఈ కింది ఐదు చట్టాలనూ తెస్తున్నారు:

  • ది తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్ బిల్ 2020
  • ది తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ది ఫోస్ట్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ బిల్ 2020
  • ది తెలంగాణ పంచాయితీ రాజ్ ఎమెండ్మెంట్ బిల్ 2020
  • ది తెలంగాణ మునిసిపల్ లాస్ ఎమెండ్మెంట్ బిల్ 2020 (జీహెచ్ఎంసీ చట్టం ప్రత్యేకంగా ఉంటుంది, అది ఐదవది)

పేరుకు ఐదు చట్టాలు ఉన్నా, వీటన్నటి లక్ష్యం ఒకటే అన్నారు ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు. ఈ చట్టాలు ప్రవేశపెట్టాక వాటి గురించి ఆయన శాసన సభకు వివరించారు. ''(భూ నిర్వహణలో) సరళీకృత, అవినీతి రహిత, బలహీనులకు మేలు చేసే విధంగా రూపొందించిన చట్టం ఇది. తెలంగాణ వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో, ఇవాళ అంత సంతోషంగా ఉన్నాను.'' అన్నారు కేసీఆర్.

తెలంగాణలో మొత్తం 1 లక్షా 12 వేల చదరపు కిలోమీటర్ల భూమి, అంటే సుమారు 2 కోట్ల 75 లక్షల ఎకరాల భూమి ఉంది. ఇందులో 1.55-1.6 కోట్ల ఎకరాలు వ్యవసాయ భూమి, 66.56 లక్షల ఎకరాలు అటవీ భూమి ఉంది. మిగతా రకరకాలు అంటే ప్రభుత్వ భూమి, గ్రామ కంఠాలు, పట్టణాల కింద, ప్రజా ఉమ్మడి ఆస్తుల కిందా ఉంది.

భూమి

రికార్డులు

ఇప్పుడున్న అనేక వ్యవస్థలు, ఫాంలు (Form), రికార్డు పుస్తకాల స్థానంలో 'ధరణి' వెబ్ సైట్ వస్తుంది. ఇది రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి వ్యవసాయ భూములకు సంబంధించినది, రెండవది వ్యవసాయేతర భూములకు సంబంధించినది.

ఈ వెబ్ సైట్ ఎవరైనా తెరవచ్చు, చూడవచ్చు, కాపీ చేయవచ్చు, డౌన్లోడ్ చేయవచ్చు. ఇకపై తెలంగాణ భూ రికార్డులకు ఇదే ప్రధాన రికార్డు ఆయువు పట్టు అవుతుంది. ఈ వెబ్ సైట్ దెబ్బతినకుండా, అందులో ఉన్న సమాచారం పోకుండా పలు ప్రాంతాల్లో నిక్షిప్తం చేస్తారు. (డాటా బ్యాకప్ మల్టిపుల్ సర్వర్స్ లో వేర్వేరు ప్రాంతాల్లో నిక్షిప్తం చేస్తారు.)

ఇకపై రెవెన్యూ అధికారుల విచక్షణాధికారాలు రద్దు అవుతాయి. తహశీల్దారు నుంచి జాయింట్ కలెక్టర్ వరకూ ఎవరికీ విచక్షాణాధికారాలు ఉండవు. వారు రికార్డుల నిర్వహణలో అక్రమాలు చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయి.

రిజిస్ట్రేషన్లు, ఈసీలు, మ్యూటేషన్లు

వీలైనన్ని సేవలు ఆన్లైన్లోనే అవుతాయి. నేరుగా ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం బాగా తగ్గుతుంది. ఆయా భూములపై వచ్చిన వివాదాలపై కోర్టు తీర్పులను కూడా ఆన్లైన్ రికార్డుల్లో అప్డేట్ చేస్తారు.

ఇకపై రిజిస్ట్రేషన్ తో పాటూ మ్యుటేషన్ కూడా జరుగుతుంది.

తహశీల్దార్లందరికీ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హోదా ఇస్తారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు ఇకపై సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు వెళ్లక్కర్లేదు. తహశీల్దార్ల ఆఫీసుల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, వెంటనే అక్కడే మ్యూటేషన్ కూడా పూర్తి చేసి, వెంటనే ఆ వివరాలన్నీ ఆన్లైన్లో ధరణి వెబ్ సైట్లో అప్డేట్ చేసి పంపిస్తారు. ప్రస్తుతం తెలంగాణలో 590 మండలాలున్నాయి.

ప్రస్తుతం ఉన్న సబ్ రిజిస్ట్రార్లు వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు చేస్తారు. అంటే వ్యయసాయం కింద రాని ప్లాట్లు, ఇళ్లు, అపార్టుమెంట్లు, కంపెనీల స్థలాలు.. గ్రామ కంఠం(ఆబాదీ) ఇవన్నీ వీరి కిందకు వస్తాయి. వాటి మ్యుటేషన్లు కూడా ఇకపై సబ్ రిజిస్ట్రార్లే చేస్తారు. మ్యుటేషన్ కోసం వేరే ఎక్కడికీ వెళ్లక్కర్లేదు. ప్రస్తుతం తెలంగాణలో 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి.

ఈ రిజిస్ట్రేషన్ కి సమయం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. బుక్ చేసిన సమయం పబ్లిగ్గా అందరికీ కనిపిస్తుంది. అదే విషయం అక్కడ లాగ్ బుక్ లో కూడా రాయాలి.

పంట పొలాలు

దస్తావేజులు సొంతంగా తయారు చేసుకోవచ్చు. లేదంటే లేఖరి (దస్తావేజు రాసేవారు) చేత రాయించుకోవచ్చు. వారందరికీ ఇకలపై లైసెన్సులు తప్పనిసరి.

రిజిస్ట్రేషన్ అయిన వెంటనే నిమిషాలు లేదా గంటల వ్యవధిలోనే పట్టాదారు పాస్ బుక్ లో చేర్పులు, తొలగింపులు జరుగుతాయి. మ్యుటేషనూ అక్కడే జరుగుతుంది. వెంటనే ఆన్లైన్లో కూడా చేరుస్తారు.

ఎంకంబరెన్స్ సర్టిఫికేట్ (ఈసీ - భూమిపై ఉన్న తనఖా ఇతర వివరాలు తెలిపే పత్రం) వివరాలు వెబ్ సైట్లోనే ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడవచ్చు.

రిజిస్ట్రేషన్ చేయకూడని భూములను కంప్యూటర్లో ఆటో లాక్ చేస్తారు. అంటే వాటని ఏ అధికారీ రిజిష్టర్ చేయలేరు. ప్రజల ఉమ్మడి ఆస్తులు, ప్రభుత్వ భూములను ఇలా పెడతారు.

వారసత్వ భూమిని వారసులకు మార్చే పద్ధతి (ఫౌతీ)ని సరళతరం చేస్తున్నారు. ఇకపై అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసే పద్ధతి ఉండదు. కుటుంబం అంతా సంతకాలు పెడితే వెంటనే ఇచ్చేస్తారు.

ఇకపై పట్టాదారు పాస్ పుస్తకాల్లో కుటుంబ సభ్యులు వివరాలన్నీ పెడతారు. దీనివల్ల మరణం తరువాత వారసత్వ భూమి విషయంలో సమస్య రాదు.

భూ సర్వే

ప్రభుత్వ నిర్ణయాల్లో అతి పెద్దది సమగ్ర భూ సర్వే. దాదాపు 150 ఏళ్ల క్రితం నిజాం రాజుల కాలంలో, బ్రిటిష్ ప్రభుత్వ సూచనతో తెలంగాణలో భూ సర్వే జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అవే రికార్డులు ఆధారం. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మరోసారి భూ సర్వే జరుపబోతోంది.

తెలంగాణలో ఉన్న ప్రతీ అంగుళం భూమినీ కొలుస్తామనీ, ప్రతీ సర్వే నంబరుకూ కచ్చితమైన కొలమానం, అక్షాంశాలూ, రేఖాంశాలూ (లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్) ఆధారంగా ఇస్తామనీ, దాని వల్ల సరిహద్దు తగాదాలు ఉండబోవనీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పారు. వంద శాతం ఎవరూ రికార్డులు మార్చలేని విధంగా డిజిటలైజ్ చేయబోతున్నట్టు ఆయన ప్రకటించారు.

అటవీ అధికారిణిపై టీఆర్ఎస్ నాయకుడి దాడి

వివాదాల పరిష్కారం

ఇప్పటి వరకూ రెవెన్యూ కోర్టుల వ్యవస్థ ఉండేది. అంటే చిన్న చిన్న భూ తగాదాల పరిష్కారానికి తహశీల్దార్లు (ఎమ్మార్వో), ఆర్డీవోలు, జాయింట్ కలెక్టర్లే రెవెన్యూ కోర్టుల్లో జడ్జి పాత్ర పోషించేవారు. తమ శాఖ ఇచ్చే ఆదేశాలపై తామే విచారణ జరిపే వ్యవస్థ ఇది. ఇప్పుడు ఆ రెవెన్యూ కోర్టులను రద్దు చేశారు. వాటి స్థానంలో ఫాస్ట్రాక్ ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రెవెన్యూ కోర్టుల్లో ఉన్న 16,137 కేసులు ఆ ఫాస్ట్రాక్ కోర్టులకు బదిలీ అవుతాయి. నిర్ణీత కాల వ్యవధిలో వాటిని తేలుస్తారు.

ఇకపై వచ్చే వివాదాలు మాత్రం నేరుగా సివిల్ కోర్టులకు వెళ్లి తేల్చుకోవాల్సి ఉంటుంది. ఈ ట్రిబ్యునళ్లు కేవలం ఇప్పటికే ఉన్న కేసులకు మాత్రమే పరిమితం.

వివిధ సర్టిఫికెట్లు

ఇకపై కుల సర్టిఫికెట్లు లైఫ్ టైం ఉపయోగపడేలా ఒకేసారి ఇస్తారు. ఇకమీదట రెవెన్యూ శాఖ బదులు, గ్రామ పంచాయితీ, మునిసిపాలిటీలే ఈ సర్టిఫికెట్లు ఇస్తాయి.

ఇకపై ఆదాయ సర్టిఫికెట్లు మనుషులతో సంబంధం లేకుండా తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఉన్న డాటా ఆధారంగా ఇస్తారు. మీకున్న ఆస్తిపాస్తుల వివరాలు ప్రభుత్వానికి తెలుసు (సమగ్ర సర్వే ద్వారా) కాబట్టి, వాటి ఆధారంగా అప్లై చేసిన వారికి ఆన్లైన్లో సర్టిఫికేట్ ఇస్తారు.

ఉద్యోగ వ్యవస్థ

విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (విఆర్ఒ) వ్యవస్థను రద్దు చేస్తున్నారు. అలాగే వారికి ఎవర్నీ ప్రత్యామ్నాయంగా నియమించడం లేదు. వారు చేసే పనులు ఇకపై తహశీల్దార్ ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని నిర్వహిస్తారు. విఆర్ఒలకు ఐటీ నడిపించే వెబ్ సైటే ప్రత్యామ్నాయం అని ముఖ్యమంత్రి అన్నారు.

ప్రస్తుతం తెలంగాణలో ఉన్న 5,480 మంది విఆర్ఒలను వేర్వేరు శాఖల్లో ఉద్యోగులుగా సర్దుబాటు చేస్తారు. అవసరాన్ని బట్టి కొందరిని రెవెన్యూలో కొనసాగిస్తారు.

20,292 మంది విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (మస్కూరి) లను పూర్తి స్థాయి జీతం తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తారు. ఇప్పటి వరకూ వారు నెలకు పది వేల గౌరవ వేతనంతో చేస్తున్నారు. రెవెన్యూలో అవసరం అయినంత మందిని ఉంచి, మిగతా వారిని వేరే శాఖల్లో సర్దుబాటు చేస్తారు.

కొత్త వెబ్ సైట్ వ్యవస్థ రూపుదిద్దుకోవడానికి కాస్త సమయం పడుతుందనీ ప్రజలు ఓపిగ్గా ఉండాలనీ ముఖ్యమంత్రి చెప్పారు.

(చట్టం గురించి పూర్తి వివరాలతో ఈ కథనం అప్డేట్ అవుతూ ఉంటుంది.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)