తెలంగాణ రెవెన్యూ శాఖలో సంస్కరణలు అవసరమా, కాదా? ఉద్యోగుల భవిష్యత్తు ఏంకానుంది?

- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
'ప్రభుత్వం' అనగానే ముందుగుర్తొచ్చేది పోలీసు, రెవెన్యూ శాఖలే. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో రెవెన్యూ సిబ్బందితో పనిపడుతుంది. భూమి సమస్యల గురించో, పట్టాదారు పాసు పుస్తకం గురించో, కుల - ఆదాయ - స్థానికత ధ్రువపత్రాల గురించో, మరేదైనా అవసరంతోనో రెవెన్యూ కార్యాలయం గుమ్మం తొక్కని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.
రెవెన్యూ ఉద్యోగులతో ఈ పనులు చేయించుకోవడంలో ఒక్కో పౌరుడిది ఒక్కో అనుభవం. ఉద్యోగులు కష్టపడుతున్నారని మెచ్చుకునేవారూ, రకరకాల కారణాలతో తిట్టిపోసేవారూ ఉంటారు.
ప్రభుత్వంలోనూ రెవెన్యూ ఉద్యోగులకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. వీరికి పని ఎక్కువ, పలుకుబడి ఎక్కువ. వీరిపై ఆరోపణలు కూడా ఎక్కువే.
తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థను సమూలంగా మార్చాలనీ, సంస్కరణలు తేవాలనీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేస్తున్న ప్రయత్నాలు చివరి దశకు వచ్చాయి. వీటిపై రెవెన్యూ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.

సుదీర్ఘ చరిత్ర
రెవెన్యూ వ్యవస్థకు ఎంతో చరిత్ర ఉంది. ఒకప్పుడు భూమి మాత్రమే ప్రభుత్వ ఆదాయ వనరుగా ఉన్న రోజుల్లో ఈ శాఖదే హవా. భారతదేశంలో మొఘలుల ముందు నుంచీ రెవెన్యూ రికార్డుల వ్యవహారం ఉంది.
తెలంగాణలో సాలార్జంగ్ హయాంలో 1853లో మొదటిసారి భూమి సర్వే జరిగింది. తర్వాత 1930-50 మధ్య మరోసారి సర్వే జరిగింది. 1979-80లలో మళ్లీ తెలంగాణలో ఆర్వోఆర్ జరిగింది.
ఆంధ్రప్రదేశ్‌లో బ్రిటిష్ కాలంలో 1820లలో భూమి సర్వే జరిగింది. అప్పట్నుంచీ ఆ రికార్డుల నిర్వహణ చేతులు మారుతూ వచ్చింది. భూమితోపాటు జిల్లా స్థాయిలో కలెక్టర్ ఎలాగైతే అన్ని శాఖలో విషయంలో సర్వాధికారిగా వ్యవహరిస్తారో, డివిజన్లో ఆర్డీవో, మండలంలో తహశీల్దార్, గ్రామంలో వీఆర్వోలు అంత ముఖ్యపాత్ర పోషిస్తారు.
సంస్కరణలు అవసరమా, కాదా?
రెవెన్యూ శాఖలో సంస్కరణలు అవసరమనేది అన్ని వర్గాలూ ఒప్పుకొనే మాట. ఎలాంటి సంస్కరణలు కావాలనే విషయంలో అభిప్రాయ బేధాలున్నాయిగానీ, అవసరమా, కాదా అనే విషయంలో కాదు.
అన్ని రకాల పనుల బాధ్యతలూ పడడం వల్ల రెవెన్యూ ఉద్యోగులు పదుల సంఖ్యలో చట్టాలు, జీవోలను తెలుసుకుంటూ పనిచేయాల్సి వస్తుంది.
చట్టవ్యతిరేక మార్గాల్లో పనిచేయించుకునేవారు, చేసేవారూ పెరిగిపోయారు.

ఫొటో సోర్స్, Regati Nagaraju
మరోవైపు రెవెన్యూ సిబ్బంది వారి కార్యాలయాల్లో అందుబాటులో ఉండటమే కష్టమైపోతోంది. పౌరులే కాదు, చాలా సందర్భాల్లో ఇతర ప్రభుత్వ శాఖల వారు రెవెన్యూ శాఖ, రెవెన్యూ సిబ్బందిపై తీవ్ర అసహనం వ్యక్తంచేస్తుంటారు.
"రెవెన్యూ వాళ్లను మేమేం అనలేం. భూమి రికార్డులు వాళ్ల చేతుల్లో ఉంటాయి. అటవీ భూముల వివాదాలకు సగం కారణం కొందరు రెవెన్యూ సిబ్బంది ప్రవర్తనే" అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.
ఉదాహరణకు ఇటీవల తెలంగాణలో భూరికార్డుల సంస్కరణ చేపట్టారు. కొత్త పాసుపుస్తకాలు ఇచ్చారు. వాటిలో చాలా తప్పులు జరిగాయి.
రికార్డుల సరవణ బాగా చేశారని ఒక దశలో రెవెన్యూ సిబ్బందిని మెచ్చుకుని, ఒక నెల జీతం బోనస్ ఇచ్చిన సీఎం కేసీఆర్, తర్వాత వారిని తప్పుబట్టారు.
ఈ విషయంలో తప్పు మీదంటే మీదంటూ రచ్చ జరిగింది.
ఈ పరిస్థితుల్లో రెవెన్యూశాఖను ప్రక్షాళించాలని సంకల్పించింది తెలంగాణ ప్రభుత్వం.
రెవెన్యూ వ్యవస్థ బాగా లేదనీ, రెవెన్యూ వ్యవస్థను సంస్కరించి సరికొత్త చట్టం తెస్తామని స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో సీఎం చెప్పారు. అంతేకాదు పలు వేదికల మీద రెవెన్యూ సిబ్బందిపై ఘాటు విమర్శలు చేశారు. ఒక వీఆర్వో తలచుకుంటే ఒకరి భూమిని మరొకరి పేరిట రాసేయగలడని చెప్పారు.
ఇటీవలే మున్సిపల్ చట్టంలో సమూల మార్పులు చేసిన ప్రభుత్వం, అంతకంటే పెద్ద మార్పులు రెవెన్యూలో చేయబోతోందని వార్తలు వస్తున్నాయి.

రెవెన్యూ శాఖ ఇప్పుడు చేస్తున్న పనుల్లో ప్రధానమైనవి:
1. భూమి రికార్డుల నిర్వహణ
2. సాధారణ పరిపాలన
3. ప్రొటోకాల్ పనులు
4. ధ్రువపత్రాల జారీ
5. ఎగ్జిగ్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో న్యాయపరమైన పనులు
5. ప్రకృతి - మానవ వైపరీత్యాల్లో సహాయ చర్యలు
రెవెన్యూ శాఖలో హోదాలు
1. గ్రామ స్థాయి: వీఆర్వో, వీఆర్‌ఏ
2. మండల స్థాయి: తహశీల్దార్(ఎమ్మార్వో), డిప్యూటీ తహశీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (సీనియర్ అసిస్టెంట్)
3. డివిజన్ స్థాయి: ఆర్డీవో (డిప్యూటీ కలెక్టర్, సబ్ కలెక్టర్)
4. జిల్లా స్థాయి: కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో)
ప్రతిపాదిత కొత్త రెవెన్యూ చట్టం గురించి బయటకు సమాచారం పొక్కకుండా ప్రభుత్వ యంత్రాంగం జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.
ప్రస్తుత రెవెన్యూ వ్యవస్థ వల్ల అటు సిబ్బందీ, ఇటు పౌరులూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్న పనిమీద తహశీల్దార్ ఆఫీసుకు వెళ్లాలంటే, తహశీల్దార్ ఎప్పుడు అందుబాటులో ఉంటారో తెలియని పరిస్థితి. తహశీల్దారే కాదు, ఆర్ఐ, వీఆర్వోలది కూడా అదే పరిస్థితి. ఆ ముగ్గురూ కలిసి ఒకే చోట కూర్చుంటే తప్ప పూర్తికాని పనులు ఎన్నో ఉంటాయి. సాధారణంగా తహశీల్దార్లు కలెక్టరేట్లో సమావేశాలనీ, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్ల సమావేశాలనీ, శిక్షణ కార్యక్రమాలనీ, మంత్రుల పర్యటనలనీ.. ఇలా రకరకాల పనుల్లో ఉంటారు. దీంతో ఈ సిబ్బంది ఎప్పుడు అందుబాటులో ఉంటారో తెలుసుకుని ఆ కార్యాలయాలకు వెళ్లి వారి చేత పనిచేయించుకోవడం పెద్ద ప్రహసనం.
దీనికి పరిష్కారంగా కొన్ని సంస్కరణలు సూచించారు రెవెన్యూ శాఖలో డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న ఏనుగు నరసింహా రెడ్డి. ఆయన "తెలుగు రాష్ట్రాల రెవెన్యూ వ్యవస్థ, నిన్న నేడు రేపు" అనే పుస్తకం రాశారు.
"వాస్తవానికి ప్రజలు ఆశించిన స్థాయిలో పనిచేయలేని పరిస్థితుల్లో రెవెన్యూ శాఖ ఉంది. అన్ని ఎక్కువ పనులు వారిపై ఉన్నాయి. దీన్ని ఎదుర్కోవడానికి కొన్ని సంస్కరణలు కావాలి. నేను చట్టం గురించి మాట్లాడలేను. కానీ కొన్ని మార్పులు చెప్పగలను" అని ఆయన తెలిపారు.

నరసింహారెడ్డి సూచనలు ఆయన మాటల్లోనే...
కనీసం వారంలో మూడు రోజులు ముందే ఖరారు చేసి, ఏ కార్యక్రమమూ లేకుండా, ఆ రోజుల్లో తహశీల్దారు తన మొత్తం సిబ్బందిదో కలసి తన కార్యాలయంలో తన సీట్లో కూర్చునేలా చూడాలి. ఆయనకు, ఆయన సిబ్బందికీ ఆ మూడు రోజులూ ఏ బయటి పనీ పెట్టకూడదు. అలా చేస్తే సగం సమస్యలు పరిష్కారమైపోతాయి. ఎందుకంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తహశీల్దార్ తన మొత్తం సిబ్బందితో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకూ తన ఆఫీసులో ఉండే పరిస్థితి లేదు.
ఇక స్పెషల్ డ్రైవులు, అంటే మీ ఊరికే వచ్చి మీ భూమి సమస్యను పరిష్కరిస్తామనే స్పెషల్ డ్రైవులు ఆపేయాలి. అవి డ్రామా చేయడానికి తప్ప ఎందుకూ ఉపయోగపడవు. రోజుకు మూడు ఊర్లు చొప్పున పది రోజుల్లో 30 ఊర్లు తిరుగుతారు. దరఖాస్తులు తీసుకుంటారు. కానీ ఏ పనీ జరగదు. అక్కడ సమస్యను పరిష్కరించే వ్యవస్థ ఉండదు. సర్వేయరు ఉండడు. సరిచూసికోవడానికి పాత రికార్డులూ ఉండవు. కాబట్టి ఇది వృథా.
జనం మండల కేంద్రం వరకూ రావడానికి ఏ ఇబ్బందీ లేదు. వాళ్లు వచ్చినప్పుడు ఆఫీసులో ఉంటే చాలు.
జిల్లా కలెక్టర్ల సొంత అజెండా, సొంతంగా రూపొందించే కార్యక్రమాలు రద్దు చేయాలి.
రెవెన్యూలో ఇంకా చాలా పనులు పేపర్ మీదే జరగుతున్నాయి. అన్నీ కంప్యూటరైజ్ చేయాలి. ఒక ఫైల్ క్లోజ్ అయ్యే వరకూ రెండో ఫైల్ ఓపెన్ కాకుండా చేయాలి.
తహశీల్దార్లకు ఉన్న ఎగ్జిగ్యూటివ్ మేజిస్ట్రేట్ హోదా సరిగా ఉపయోగించుకోవడం లేదు. చాలా సందర్భాల్లో పోలీసుల మాట వినడమే ఉంటుంది. శవ పంచనామాకు పిలుస్తారు. పోలీసులు సంతకం పెట్టమన్న చోట పెడతారు. అంతే. దాని బదులు పోలీసు ఉన్నతాధికారులకే ఎగ్జిగ్యూటివ్ మేజిస్ట్రేట్ పవర్ ఇచ్చుకోవాలి.
ఏ ప్రభుత్వమూ ఇప్పటివరకు అవగాహన ఉన్న వ్యక్తిని రెవెన్యూశాఖ మంత్రిగా పెట్టి, ఒక పదేళ్లు సమయం ఇచ్చి మార్పులు చేయాలని అనుకోలేదు. ముఖ్యమంత్రులు తమ ఉద్వేగాల ప్రకారం సంస్కరణలు చేశారు. ఉదాహరణకు ఎన్టీఆర్‌కు పట్వారీల మీద మంచి అభిప్రాయం లేదు. ఆయన వాటిని రద్దు చేశారు. భూమి పన్ను రద్దు చేశారు. భూమి పన్ను ఉండుంటే రికార్డుల వెరిఫికేషన్ నిరంతరం జరిగేది.
ప్రస్తుతం భూములను వ్యవసాయానికి కాకుండా ఇతర అవసరాలకు వాడుతున్నారు. ఆ ప్రకారం టౌన్ సర్వేలు జరగాలి. 'అగ్రికల్చర్' నుంచి 'నాన్ అగ్రికల్చర్'గా మార్చాలి. కానీ హైదరాబాద్, కాకినాడ, రాజమండ్రి నగరాల్లో తప్ప ఇంకెక్కడా టౌన్ సర్వే జరగలేదు. ఉదాహరణకు హైదరాబాద్ శివార్లు సరూర్ నగర్ వంటి ప్రాంతాల్లో భూవివాదాలు వచ్చినా పహాణీలు చూడాల్సిన పరిస్థితి ఉంది.
ఇలాంటి మార్పులతో రెవెన్యూ వ్యవస్థను సరళతరం చేయొచ్చని నరసింహా రెడ్డి అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Regati Nagaraju
సర్వీస్ రూల్స్ గొడవ
తమను వేరే శాఖల్లో కలుపుతారన్న ఆందోళన రెవెన్యూ సిబ్బందిలో చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం తెలంగాణలో 24,035 వీఆర్వో పోస్టులు, 7,038 వీఆర్‌ఏ పోస్టులు ఉన్నాయి. వీరు కాకుండా, తహశీల్దార్లు, డిప్యూటి కలెక్టర్లూ ఉన్నారు. తమను వేరే శాఖకు మారిస్తే సహించేది లేదనీ వారంతా అంటున్నారు. రెవెన్యూ శాఖలోనే కొనసాగించి ఎన్ని సంస్కరణలు చేసినా పర్వాలేదనేది వారి మాట.
"మేము రెవెన్యూ సంస్కరణలను స్వాగతిస్తాం. ప్రజలకు సేవ చేయాలనే ఈ శాఖలోకి వచ్చాం. మిగిలిన శాఖలు ఆప్షన్లు కాదని ఈ ఉద్యోగాలు ఎంపిక చేసుకున్నాం. క్షేత్రస్థాయిలో విధి నిర్వహణలో టెక్నాలజీలో లోపాలు మమ్మల్ని వేధిస్తున్నాయి. వందల చట్టాలు, వేల జీవోల నిబంధనలు తెలుసుకుంటూ పనిచేయాలి. వాటన్నిటికీ మేం సిద్ధం. కానీ మమ్మల్ని తీసుకెళ్లి వేరే శాఖల్లో కలిపితే మాత్రం కుదరదు. దానికి మేం వ్యతిరేకం, అవసరమైతే పోరాడతాం. అలా కాకుండా పనులను సరళతరం చేసే సంస్కరణలను స్వాగతిస్తాం" అని రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకుడు రవీందర్ రెడ్డి బీబీసీతో చెప్పారు.
వాస్తవానికి తెలంగాణలో రెవెన్యూ సంఘాలు చాలా ఉన్నాయి. వారంతా ఒక మాట మీద లేరు. ప్రస్తుతం అందరూ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకొంటుందా అని ఎదురుచూస్తున్నారు.
ప్రతిపాదిత ప్రక్షాళనపై రెవెన్యూ ఉద్యోగుల అసంతృప్తి ఎలా ఉందంటే- "అవసరమైతే మాకిచ్చిన ఒక నెల బోనస్ వెనక్కు ఇచ్చేస్తాం" అంటూ తహశీల్దార్ల సంఘం ప్రకటన విడుదల చేసింది.
కొందరు రెవెన్యూ ఉద్యోగులు చినజీయర్ స్వామిని కలిసి ప్రభుత్వానికి తమ తరపున చెప్పాలని కోరారు. పైగా రెవెన్యూ సిబ్బంది మొత్తం ఒకేలా ఉద్యోగాలు పొందిన వారు కాదు.
సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ఎంపికైన వారు కొందరు. ప్రభుత్వ పరీక్షలు రాసి వచ్చిన వారు కొందరు. కారుణ్య నియామకాలు, సంప్రదాయ మస్కూర్ విధానం నుంచి వచ్చిన వారు.. ఇలా రకరకాల వారున్నారు. వారందరిలో భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది.
సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో రెవెన్యూ చట్టంలో మార్పుల ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. కేసీఆర్, మంత్రులు - ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించి అభిప్రాయాలు తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- వైఎస్ రాజశేఖర రెడ్డి: హెలికాప్టర్ అదృశ్యం తర్వాత 25 గంటల్లో ఏం జరిగింది?
- చంద్రయాన్ 2: మరో ముఖ్య అంకం విజయవంతం.. ఆర్బిటర్ నుంచి వేరుపడిన 'విక్రమ్ ల్యాండర్'
- ఆటోమొబైల్ సంక్షోభం: “మాకు తినడానికి తిండి లేదు.. పరిస్థితి ఎలా ఉందో తెలియాలంటే ఫ్యాక్టరీలకు వెళ్లి చూడండి”
- ఆంధ్రా బ్యాంకు విలీనం: సంక్షోభం నుంచి భారత ఆర్థిక వ్యవస్థను, బ్యాంకింగ్ వ్యవస్థను గట్టెక్కిస్తుందా? - అభిప్రాయం
- ఆంధ్రా బ్యాంకు చరిత్ర: తెలుగు నేలపై పుట్టిన బ్యాంకు పేరు త్వరలో కనుమరుగు
- ఎవరీ క్రికెట్ బాహుబలి
- ప్రభాస్ సాహో సినిమాపై లార్గో వించ్ డైరెక్టర్ ఏమన్నారు? అభిమానులు ఎలా స్పందించారు?
- ‘మా నాన్న ఒక గ్యాంగ్‌స్టర్... నా మూలాలు దాచేందుకు నా ముక్కునే మార్చేశాడు’
- ఇది భారత ఆర్థికవ్యవస్థ మందగమనమా లేక మాంద్యమా?
- ఎన్ఆర్సీ: వారు భారతీయులు కాదు - కేంద్ర ప్రభుత్వం
- మైకేల్ జాక్సన్: అసలా స్టెప్పులు ఎలా వెయ్యగలిగాడు? పరిశోధనలో ఏం తేలింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








