కశ్మీర్: 'మమ్మల్ని కొట్టకండి, కాల్చి చంపేయండి...' భారత సైన్యం హింసకు పాల్పడుతోందని ఆరోపిస్తున్న స్థానికులు..

- రచయిత, సమీర్ హష్మి
- హోదా, బీబీసీ ప్రతినిధి
జమ్మూకశ్మిర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ప్రభుత్వం రద్దు చేసిన తరువాత భారత పాలిత కశ్మీర్‌లో భద్రత దళాలు ప్రజలను కొడుతున్నారని, హింసిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తమను కర్రలతో, తీగలతో కొట్టారని, విద్యుత్ షాక్ ఇచ్చారని కొందరు గ్రామస్థులు బీబీసీకి చెప్పారు.
కొన్ని గ్రామాల్లోని ప్రజలు తమ గాయాలను నాకు చూపించారు. ఈ ఆరోపణల్లోని నిజానిజాలను అధికారులతో మాట్లాడి నిర్థరించడం బీబీసీకి వీలు కాలేదు. అయితే, భారత సైన్యం మాత్రం, "అవన్నీ నిరాధార ఆరోపణలు" అని ప్రకటించింది.
మూడు వారాలకు పైగా నిర్బంధంలో ఉన్న కశ్మీర్‌లో ఇంతకు ముందెప్పుడూ లేనివిధంగా ఆంక్షలు విధించారు.
రాష్ట్ర స్వయం ప్రతిపత్తిని తొలగిస్తూ ఆర్టికల్ 370ని రద్దు చేసిన ఆగస్టు 5 నుంచి ఇక్కడ సమాచార వ్యవస్థలను కూడా ఆపేశారు.
ఈ ప్రాంతంలో వేలాది అదనపు దళాలను మోహరించారు. రాజకీయ పార్టీల నేతలు, వ్యాపారులు, కార్యకర్తలు సహా దాదాపు 3 వేల మందిని అదుపులోకి తీసుకున్నారు.
చాలా మందిని రాష్ట్రం బయట ఉన్న జైళ్లకు తరలించారు.

ఫొటో సోర్స్, Abid Bhat
అధికారులు వీటిని కశ్మీర్లో శాంతిభద్రతలు కాపాడేందుకు ముందు జాగ్రత్తతో తీసుకున్న చర్యలుగా చెబుతున్నారు.
ఏకైక ముస్లిం మెజారిటీ రాష్ట్రమైన జమ్ము-కశ్మీర్‌ను ఇప్పుడు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు.
భారత సైన్యం ఇక్కడ మూడు దశాబ్దాలకు పైగా వేర్పాటువాద తిరుగుబాటుదారులతో పోరాడుతోంది.
పాకిస్తాన్ ఈ ప్రాంతంలోని మిలిటెంట్లకు సహకరిస్తూ హింసను రెచ్చగొడుతోందని భారత్ ఆరోపిస్తోంది. దీనిని పాకిస్తాన్ ఖండిస్తోంది.
భారతదేశం అంతటా చాలా మంది ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రధాని నరేంద్ర మోదీ 'సాహసోపేత' నిర్ణయం తీసుకున్నారని ప్రశంసిస్తున్నారు.
దేశంలోని ప్రధాన మీడియా అంతా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాయి.
గత కొన్నేళ్లుగా భారత వ్యతిరేక ఉగ్రవాద హబ్‌గా ఆవిర్భవించిన దక్షిణ జిల్లాల్లోని ఆరేడు గ్రామాల్లో నేను పర్యటించాను.
రాత్రిళ్లు సైన్యం దాడులు చేసి కొట్టడం, హింసించడం జరుగుతోందని ఈ గ్రామాల్లోని చాలా మంది ఒకే విషయం చెప్పారు.
అనారోగ్యంతో సంబంధం లేకుండా రోగులు ఎవరైనా మీ ఆస్పత్రులకు వచ్చారా అనే దానిపై జర్నలిస్టులతో మాట్లాడ్డానికి డాక్టర్లు, ఆరోగ్యశాఖ అధికారులు నిరాకరించారు.

ఫొటో సోర్స్, AFP
కానీ, గ్రామస్థులు భద్రతా దళాలు కొట్టినవని ఆరోపిస్తూ నాకు గాయాలు చూపించారు.
భారత్ వివాదాస్పద నిర్ణయం తీసుకున్న కొన్ని గంటల తర్వాత భారత సైన్యం ఇల్లిల్లూ వెతికారని ఒక గ్రామంలో ఉంటున్న వారు చెప్పారు.
నిద్రపోతున్న తమను లేపి ఒక బహిరంగ ప్రాంతంలోకి తీసుకెళ్లారని, అక్కడ గ్రామంలోని మరో పది మందికి పైగా గుమిగూడి ఉన్నారని ఇద్దరు సోదరులు చెప్పారు.
మేం కలిసిన మిగతా గ్రామస్థుల్లాగే, వారు కూడా తమ గుర్తింపు బయట పెట్టడానికి భయపడిపోయారు.
"వాళ్లు మమ్మల్ని కొట్టారు. మేమేం చేశామని వాళ్ళని అడిగాం. ఏదైనా తప్పు చేసుంటే, అబద్ధాలు చెబుతుంటే గ్రామస్థులనే అడగండి అన్నాం. కానీ, వాళ్లు ఏదీ వినలేదు. ఒక్క మాట కూడా అనలేదు. వాళ్లు మమ్మల్ని కొడుతూనే ఉన్నారు" అని సోదరుల్లో ఒకరు చెప్పారు.
"వాళ్లు నా శరీరంలో కొట్టని చోటు లేదు. కాళ్లతో తన్నారు. కర్రలతో కొట్టారు. కరెంటు షాకులు ఇచ్చారు. కేబుల్స్ తీసుకుని కొట్టారు. మా కాళ్ల వెనక దారుణంగా కొట్టారు. మేం సొమ్మసిల్లి పడిపోతే, కరెంట్ షాక్ ఇచ్చి మళ్లీ స్పృహలోకి తీసుకొచ్చారు. అప్పుడు వాళ్లు కర్రలతో కొట్టడంతో బాధతో కేకలు వేశాం. వాళ్లు మట్టిపోసి మా నోళ్లు మూసేశారు".
"మేం అమాయకులమని, మమ్మల్ని ఎందుకిలా చేస్తారని అడిగాం. వాళ్లు మా మాట వినలేదు. నేను వాళ్లతో కొట్టకండి, మమ్మల్ని కాల్చేయండి అన్నాను. దేవుడా నన్ను చంపెయ్ అని కోరుకున్నా. ఎందుకంటే ఆ హింస భరించలేకపోయాను".

గత పదేళ్లుగా కశ్మీర్ లోయలో జరుగుతున్న ఆందోళనల్లో పాల్గొనే యువకుల గురించి తెలుసుకోడానికి సైన్యం హింసిస్తోందని మరో గ్రామంలోని యువకుడు కూడా చెప్పాడు.
"రాళ్లు రువ్వినవారి పేర్లు చెప్పాలంటూ భద్రతాదళాలు నన్ను పదే పదే అడిగాయి. నాకేం తెలీదని చెప్పానని, వాళ్లు నా కళ్లజోడు, బట్టలు, బూట్లు తీయమని చెప్పారు. నేను నా బట్టలు తీయగానే దాదాపు రెండు గంటలపాటు రాడ్లు, కర్రలతో క్రూరంగా కొట్టారు. నేను సొమ్మసిల్లినప్పుడల్లా స్పృహతెప్పించడానికి కరెంటు షాకులు ఇచ్చేవాళ్లు" అన్నాడు.
"భద్రతా దళాలకు వ్యతిరేకంగా నిరనస ప్రదర్శనల్లో పాల్గొంటే మీరు ఇలాంటి పరిణామాలే ఎదుర్కోవాల్సి ఉంటుందని గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరినీ హెచ్చరించారు" అని ఆ యువకుడు చెప్పాడు.
ఆర్మీకి వ్యతిరేకంగా జరిగే ఆందోళనల్లో పాల్గొనాలంటేనే వణికిపోయేలా భయపెట్టడానికే భద్రతాదళాలు ఇలా చేస్తున్నాయని ఆ గ్రామాల్లో మాతో మాట్లాడిన పురుషులందరూ చెప్పారు.
అయితే, బీబీసీకి ఇచ్చిన ఒక ప్రకటనలో భారత సైన్యం ప్రతినిధి కల్నల్ అమన్ ఆనంద్, "ఆరోపణలు వస్తున్నట్లు పౌరులను ఎవరినీ మేం కొట్టలేదు. వారు చెబుతున్నవేవీ మా దృష్టికి రాలేదు. వ్యతిరేక శక్తులు ప్రేరేపించడం వల్లే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు" అని చెప్పారు.
"పౌరుల భద్రత కోసం అన్ని చర్యలూ చేపట్టాం. కానీ, ఆందోళనలను అడ్డుకునేందుకు చేపట్టిన చర్యల్లో గాయపడడం, ప్రాణనష్టం గానీ జరగలేదు. స్వతంత్ర పోరాటం చేస్తున్నామని చెప్పుకుంటున్న వేర్పాటువాద మిలిటెంట్ గ్రూపుల సానుభూతిపరులున్న చాలా గ్రామాల్లో మేం తనిఖీలు చేశాం. అని ఆయన చెప్పారు.
కశ్మీర్‌లోని ఈ ప్రాంతంలో ఉన్న ఒక జిల్లాలో ఫిబ్రవరిలో ఒక ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఇందులో 40 మందికి పైగా భారత సైనికులు చనిపోయారు. అది భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెంచింది.
2016లో కశ్మీరీ మిలిటెంట్ బుర్హాన్ వనీని కాల్చిచంపిన ప్రాంతం కూడా ఇదే. ఆ ఘటనతో ఆగ్రహించిన చాలామంది కశ్మీరీలు భారత వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆ ప్రాంతంలో ఒక సైనిక శిబిరం ఉంది. తీవ్రవాదులు, వారి సానుభూతిపరులను పట్టుకునేందుకు జవాన్లు నిత్యం ఆ ప్రాంతంలో కూంబింగ్ చేస్తుంటారు.
ఆ ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన సుమారు ఇరవయ్యేళ్ల యువకుడితో నేను మాట్లాడాను. మిలిటెంట్లకు సంబంధించిన సమాచారం ఇచ్చే ఇన్ఫార్మర్‌గా మారాలని తనపై సైనికులు ఒత్తిడి చేశారని, వారు చెప్పినట్లు వినకుంటే తనపై తీవ్రవాద ముద్రవేస్తామని బెదిరించారని ఆయన ఆరోపించారు.
అంతేకాదు, తాను ఇన్ఫార్మర్ పని చేయడానికి అంగీకరించకపోవడంతో తనను దారుణంగా కొట్టారని, వారు కొట్టిన రెండు వారాల తరువాత కూడా శరీరం స్వాధీనంలోకి రాలేదని.. నిలబడలేకపోతున్నానని చెప్పాడా యువకుడు.
''ఈ దారుణాలు ఇలాగే ఉంటే ఇల్లొదిలి వెళ్లిపోవడం తప్ప వేరే మార్గం లేదు నాకు. వారు మమ్మల్ని మనుషుల్లా చూడరు. పశువులను కొట్టినట్లుగా కొడతార''న్నారాయన.
మరోవ్యక్తి మమ్మల్ని కలిశాడు. ఆయన తన ఒంటిపై ఉన్న గాయాలను చూపిస్తూ 15 నుంచి 16 మంది జవాన్లు వచ్చారని, తనను నేలపై పడేసి తుపాకులు, కర్రలు, ఇనుప రాడ్లతో కొట్టారని చెప్పాడు.
''నన్ను దారుణంగా కొట్టిన తరువాత దాదాపు స్పృహ తప్పినట్లయింది.. అప్పుడు వారు నా గడ్డం పట్టుకుని బలంగా లాగారు.. నా పళ్లు ఊడిపోతాయేమో అనిపించేంత గట్టిగా గడ్డం పట్టుకుని లాగార''ని చెప్పాడాయన.
''నేను స్పృహతప్పిన స్థితిలో ఉన్నప్పుడు ఓ జవాను నా గడ్డాన్ని తగలబెట్టాలని చూశాడని.. కానీ, మరో జవాను వారించడంతో ఆగిపోయాడని అక్కడున్న ఓ అబ్బాయి నాకు చెప్పాడు'' అంటూ ఆయన ఆ ఘటనను వివరించారు.
అక్కడికి సమీపంలోని మరో గ్రామంలో ఇంకో యువకుడిని కలిశాను. రెండేళ్ల కిందట ఆయన సోదరుడు హిజ్బుల్ ముజాహిదీన్‌లో చేరాడని ఆయనే చెప్పాడు.

ఫొటో సోర్స్, Getty Images
ఇటీవల సైనికులు ఆ యువకుడిని తీసుకెళ్లి విచారించారట. ఆ సందర్భంగా దారుణంగా హింసించడంతో ఆయన కాలు విరిగిపోయిందని చెప్పాడు.
''నా కాళ్లు చేతులు కట్టేసి తలకిందులుగా వేలాడదీశారు. రెండు గంటల పాటు దారుణంగా కొట్టారు'' అని ఆ యువకుడు చెప్పాడు.
అయితే, ఆర్మీ మాత్రం ఇవన్నీ కట్టుకథలని కొట్టిపారేస్తోంది. తమ సైనికులు ఎలాంటి అకృత్యాలకు పాల్పడలేదంటోంది.
బీబీసీకి విడుదల చేసిన ఒక ప్రకటనలో, ''భారత సైన్యం ఒక వృత్తిగతమైన సంస్థ. అది మానవ హక్కులను అర్థం చేసుకోవడంతో పాటు గౌరవిస్తుంది కూడా'' అని సైన్యం పేర్కొంది.
సైన్యంపై వస్తున్న అన్ని ఆరోపణలపైనా సత్వర విచారణ చేపడతామని కూడా ఆ ప్రకటనలో తెలిపారు.
గత అయిదేళ్లలో జాతీయ మానవ హక్కుల కమిషన్ చెప్పిన 37 కేసుల్లో 20 కేసులు నిరాధారమైనవని తేలాయని సైన్యం చెప్పింది. మరో 15 కేసుల్లో విచారణ కొనసాగుతోందని, కేవలం 3 కేసుల్లో వచ్చిన ఆరోపణలు మాత్రం లోతుగా విచారించదగ్గవని తేలిందని.. ఇందులో దోషులుగా తేలినవారికి శిక్ష పడక తప్పదని తెలిపింది.

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 1

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది, 2

ఇవి కూడా చదవండి:
- కశ్మీర్: భారత్-పాక్ సరిహద్దు వెంబడి శత్రువుల తుపాకీ నీడలో దశాబ్దాలుగా పహారా
- 'కశ్మీర్లో ప్రజాస్వామిక హక్కులను కాలరాశారు' - ది హిందూ గ్రూప్ చైర్మన్ ఎన్. రామ్
- కశ్మీర్ అంశంపై వేరే దేశాన్ని జోక్యం చేసుకోనివ్వం - జీ7 సదస్సు సందర్భంగా ట్రంప్‌తో మోదీ
- ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణతో నిరుద్యోగం మరింత పెరుగుతుందా
- అంతరిక్షం నుంచి అందరికీ ఇంటర్నెట్.. కొత్త ఉద్యోగాలు వస్తాయ్
- మీ చేతిలోని స్మార్ట్ ఫోనే మీకు శత్రువుగా మారితే...
- "డబ్బులిచ్చి ఉద్యోగులతో అబద్ధాలు చెప్పిస్తున్నారు" - అమెజాన్‌పై ట్విటర్‌లో విమర్శలు
- చంద్రుడిపై దిగడానికి అపోలో మిషన్‌కు 4 రోజులు పడితే, చంద్రయాన్-2కు 48 రోజులెందుకు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









