'కశ్మీర్ పరిణామాలపై ధైర్యంగా మాట్లాడాలనే ఐఏఎస్ పదవికి రాజీనామా చేశాను' -కన్నన్

ఫొటో సోర్స్, FACEBOOK / KANNAN GOPINATHAN
- రచయిత, ప్రమీలా కృష్ణన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కశ్మీర్ విషయంలో తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించలేకపోతున్నానంటూ కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీలో విధులు నిర్వహిస్తున్న యువ ఐఏఎస్ అధికారి కన్నన్ గోపీనాథన్ (33) తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
తాను ప్రభుత్వ విధుల్లో ఉన్నందున, ఆర్టికల్ 370 కింద జమ్ము కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడంపై తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించలేకపోతున్నానని, అందుకే సర్వీసు నుంచి వైదొలగాలన్న నిర్ణయం తీసుకున్నట్లు గోపీనాథన్ చెప్పారు.
ఏడేళ్ల సర్వీసులో వేర్వేరు పోస్టుల్లో విధులు నిర్వహించిన కన్నన్ గోపీనాథన్, స్ఫూర్తిమంతమైన పనితీరును కనబరిచారు. మిజోరాంలో నష్టాల్లో కొనసాగుతున్న విద్యుత్ బోర్డును లాభాల్లోకి తీసుకొచ్చారు. విపత్తు నిర్వహణ కోసం యాప్‌ను రూపొందించారు. పుల్లెల గోపీచంద్‌తో కలిసి 30 బ్యాడ్మింటన్ క్రీడా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేశారు.
2012 బ్యాచ్‌కు చెందిన గోపీనాథన్ స్వస్థలం కేరళలోని కొట్టాయాం జిల్లా.

2018లో కేరళను వరదలు ముంచెత్తినప్పుడు సాదాసీదా వ్యక్తిగా పునరావాస కేంద్రంలో ఆయన ఎనిమిది రోజులు పనులు చేశారు. ఆయన ఒక ఐఏఎస్ అధికారి అంటూ కొన్ని ఫొటోలు బయటకు రావడంతో గోపీనాథన్ పేరు దేశ ప్రజలకు తెలిసింది. ఆయన సహాయక చర్యల్లో పాల్గొన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఉద్యోగానికి ఎందుకు రాజీనామా చేశారు? అని అడిగినప్పుడు, ఆయన స్పందిస్తూ, "నన్ను ఎవరూ బలవంతపెట్టలేదు. నా అంతట నేనే నిర్ణయం తీసుకున్నాను. నేను బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని నా మనసు చెప్పింది. నా అభిప్రాయాలను లోలోపల దాచుకోలేను. దేశంలో ఒకమూలన అనేకమంది ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తుంటే, కనీసం నా అభిప్రాయాలను వెల్లడించలేని పరిస్థితుల్లో విధుల్లో కొనసాగలేను. నా మనసు ఊరుకోవట్లేదు. ప్రజా సమస్యలపై స్వేచ్ఛగా గళమెత్తే వెసులుబాటు ఉండాలన్నది నా వాదన" అని బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రధాన మంత్రి ఎక్సలెన్స్ అవార్డు కోసం దరఖాస్తు చేయనందుకు, కేరళ వరదల్లో సాదాసీదా వ్యక్తిగా వెళ్లి సహాయ పనులు చేసినందుకు తనకు ఉన్నతాధికారుల నుంచి రెండు మెమోలు వచ్చాయని కన్నన్ తెలిపారు. "ఆ రెండు తాఖీదులకూ నా స్పందన తెలిపాను. అవి పనికిమాలిన మెమోలు. నాకు దేని గురించీ ఆందోళన లేదు" అని ఆయన అన్నారు.
భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు? అని అడిగినప్పుడు ఆయన మాట్లాడుతూ, "నా రాజీనామా లేఖ మీద నాకు ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. ఇప్పటికైతే నాకు ఎలాంటి ప్రణాళికలు లేవు. ఇప్పుడు నాకు సర్వీసు నిబంధనలు వర్తిస్తాయి. రాజీనామా ఆమోదం పొందిన తర్వాత నేను మీతో అన్ని విషయాలూ పంచుకోగలను" అని ఆయన చెప్పారు.
కన్నన్ నిర్ణయాన్ని మాజీ ఐఏఎస్ అధికారి ఎం.జీ. దేవసహాయం స్వాగతించారు. ఆయన కూడా 1985లో ఇలాగే ఉద్యోగానికి రాజీనామా చేశారు.
"నేను కన్నన్‌తో మాట్లాడాను. అభినందించాను. నేను కూడా 1985లో హరియాణాలో ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నాను. రాజకీయ నాయకుల అవినీతిని సహించలేకపోయాను. రెండో ఆలోచన లేకుండా ఉద్యోగానికి రాజీనామా చేశాను. జీతం కోసం అలాంటి ప్రభుత్వంలో విధులు నిర్వహించడం కంటే, బయటకొచ్చి ప్రజల కోసం పనిచేయడం ఉత్తమం అనిపించింది. అప్పటికి ఇంకా 15 ఏళ్ల సర్వీసు మిగిలి ఉండగానే రాజీనామా చేశాను" అని ఎం.జీ. దేవసహాయం గుర్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, MGDEVASAHAYAM/ FACEBOOK
ఐఏఎస్ అధికారులుగా ఒకప్పుడు ఉన్నతస్థాయి బాధ్యతలు నిర్వహించిన సామాజిక ఉద్యమకారులు అరుణా రాయ్, హర్ష మంధేర్‌లు కూడా ప్రజలకు సేవ చేసేందుకు ఉద్యోగాలకు రాజీనామా చేసిన విషయాన్ని కూడా దేవసహాయం గుర్తు చేశారు.
"సమాచార హక్కు చట్టం కోసం తీవ్రంగా పోరాడిన అరుణా రాయ్ నా బ్యాచ్‌మేట్. ఆమె ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన తర్వాత 6 నెలల్లోపే రాజీనామా చేశారు. 2002లో జరిగిన గోధ్రా అల్లర్లలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడాన్ని చూసిన తర్వాత హర్ష మందర్ రాజీనామా చేశారు. ఇలా ఐఏఎస్ అధికారులు రాజీనామా చేయడం 1975లో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించినప్పటి నుంచే ప్రారంభమైంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల పట్ల మౌనం వహిస్తూ, ప్రభుత్వ విధుల్లో కొనసాగడం నచ్చని చాలామంది అధికారులు ఉద్యోగాలను వదిలేశారు. అలాంటి నిర్ణయాలు తీసుకుని బయటకొచ్చిన వారు ఇప్పుడు మీడియాలో కనిపిస్తుండటం చూస్తుంటే నాకు సంతోషంగా ఉంది" అని దేవసహాయం అన్నారు.
ఇవి కూడా చదవండి:
- 'కశ్మీర్‌లో ప్రజాస్వామిక హక్కులను కాలరాశారు' - ది హిందూ గ్రూప్ చైర్మన్ ఎన్. రామ్
- కశ్మీర్ అంశంపై వేరే దేశాన్ని జోక్యం చేసుకోనివ్వం - జీ7 సదస్సు సందర్భంగా ట్రంప్‌తో మోదీ
- అంబేడ్కర్ హౌస్: ఇద్దరు వ్యక్తుల ఫిర్యాదుతో లండన్‌లోని అంబేడ్కర్ ‘మ్యూజియం’... భవిష్యత్ ప్రశ్నార్థకం
- ఆసియాలోనూ సైనిక సూపర్ పవర్ అమెరికానేనా?
- రాజధాని నిర్మాణానికి 2.3 లక్షల కోట్లు... కొత్త ప్రాంతాన్ని ప్రకటించిన దేశాధ్యక్షుడు
- జమ్మూకశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజనతో బీజేపీకి కలిగే ప్రయోజనాలేంటి...
- ఈ మహిళలు తుపాకీ రిపేర్ చేస్తే తూటా సూటిగా దూసుకుపోవాల్సిందే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








