కశ్మీర్‌పై ట్రంప్‌కు ఎందుకంత శ్రద్ధ? - అభిప్రాయం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, హర్ష్ పంత్
- హోదా, బీబీసీ కోసం
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ జీ-7 సదస్సు నేపథ్యంలో ఈరోజు (ఆదివారం) భేటీకానున్నారు.
ఈ సమావేశంలో జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 సవరణ, జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తరువాత పెరిగిన ఉద్రిక్తతను తగ్గించే ప్రణాళిక గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత ప్రధాని మోదీని అడగొచ్చు.
ఈ భేటీలో ట్రంప్ ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించే ప్రణాళిక గురించి మోదీని అడిగి తెలుసుకునే అవకాశం ఉందని, కశ్మీరీ ప్రజల మానవ హక్కుల గురించి ప్రస్తావించనున్నారని మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
భారత్, పాకిస్తాన్‌ల మధ్య మధ్యవర్తిత్వం చేస్తానని ఇటీవల ట్రంప్ పేర్కొన్నారు. అప్పటి నుంచి కశ్మీర్ గురించి తరచుగా మాట్లాడుతున్నారు.
ఇటీవల కశ్మీర్ సమస్యపై తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.
''కశ్మీర్ చాలా క్లిష్టమైన ప్రాంతం. అక్కడ హిందువులు, ముస్లింలు ఉన్నారు. వాళ్లు సామరస్యంగా ఉంటారని నేను చెప్పలేను. అటువంటి పరిస్థితిలో నేను చేయగలిగిన గొప్పపని మధ్యవర్తిత్వం చేయడం'' అని ట్రంప్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మోదీ, ఇమ్రాన్‌లకు ఫోన్
కశ్మీర్ సమస్యపై గతంలోనే భారత్, పాక్ ప్రధానులకు ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ ఫోన్ సంభాషణలో ''భారత వ్యతిరేక ప్రకటనలు చేయడం, ఈ ప్రాంతంలోని కొందరు నాయకులు హింసను ప్రేరేపించడం వల్ల శాంతి ఏర్పడదు'' అని మోదీ స్పష్టం చేశారు.
ఇమ్రాన్ ఖాన్‌తో ఫోన్ సంభాషణలో ''కశ్మీర్ సున్నితమైన అంశం. దీనిపై సంయమనంతో మాట్లాడాలి'' అని ట్రంప్ సూచించారు.
ఇటీవల పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికాలో పర్యటించిన సందర్భంలో ట్రంప్ ఊహించని రీతిలో, నాటకీయంగా కశ్మీర్ సమస్యపై మాట్లాడారు. తాను ఈ విషయంలో మధ్యవర్తిత్వం చేస్తానని ప్రతిపాదించారు. దీన్ని భారత మీడియా ప్రముఖంగా ప్రచురించింది. రాజకీయంగా వివాదం అయింది.
ట్రంప్ వైట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ, ''గతంలో జపాన్‌లో నరేంద్ర మోదీని కలిసినప్పుడు ఆయన మీరు మధ్యవర్తిత్వం ఎందుకు చేయకూడదు అని అన్నారు. నేను ఎందులో అని అడిగా.. ఆయన కశ్మీర్ విషయంలో అని చెప్పారు. నాకు తెలిసి వారు ఈ సమస్యపై ఒక పరిష్కారం కోసం వేచిచూస్తున్నారు'' అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, EPA
ట్రంప్ ప్రతిపాదన దాడిలాంటిదే
వాస్తవానికి ట్రంప్ ప్రతిపాదన చాలా మంది భారతీయులకు షాక్ ఇచ్చింది. ఎందుకంటే ఆయన వ్యాఖ్యలు అమెరికా విధానానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.
బరాక్ ఒబామాతో సహా చాలామంది అమెరికా అధ్యక్షులు కశ్మీర్ వివాదాన్ని అర్థం చేసుకున్నారు. భారత్‌తో సంబంధాలు బాగుండాలంటే కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోకూడదని అనుకున్నారు. వాషింగ్టన్ కూడా ఈ విషయం అర్థం చేసుకుంది. అయితే, భారత్‌లో అలజడి సృష్టించేలా ట్రంప్ ప్రకటన చేయడానికి కారణం ఏమిటి?
వాస్తవం ఏమిటంటే, ట్రంప్ అనుకున్నది ఊహించడం చాలా కష్టమైన పని. ప్రత్యేకించి ఇది భౌగోళిక రాజకీయాలకు సంబంధించిన సున్నితమైన విషయం. ట్రంప్ ఆలోచన గురించి అమెరికా విదేశాంగ శాఖకు తెలియకపోయినా భారత్‌కు మాత్రం ఆయన వ్యాఖ్యలు జీర్ణించుకోలేనివి.
కశ్మీర్ విషయంలో ట్రంప్ జోక్యం చేసుకుంటున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు, తద్వారా తమ అఫ్ఘాన్ విధానానికి పాకిస్తాన్ మద్దతును సంపాదించేందుకు ప్రయత్నిస్తారు.
అఫ్ఘాన్ నుంచి అమెరికా సైన్యాన్ని వెనక్కి రప్పించాలని ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన ఈ ఎత్తుగడ వేస్తున్నారు. ఈ చర్యతో వచ్చే ఏడాది అధ్యక్ష పదవిలో మళ్లీ విజయం సాధించవచ్చని భావిస్తున్నారు.
అమెరికా దళాల ఉపసంహరణపై తాలిబన్లకు, అమెరికాకు మధ్య ఒప్పందం కుదిరిందని, త్వరలో అధికారిక ప్రకటన చేయవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే, ఈ ఒప్పందం అమలుకు ట్రంప్‌కు పాకిస్తాన్ మద్దతు అవసరం. కశ్మీర్ సమస్యపై ట్రంప్ తమకు మద్దతు ఇవ్వాలని పాకిస్తాన్ కోరుతోంది.
అఫ్ఘాన్‌లో అమెరికా దళాల సంఖ్యను తగ్గించడం ట్రంప్ ప్రాధాన్యతగా ఉన్న నేపథ్యంలో ఆయన ఇమ్రాన్ ఖాన్‌ను సంతృప్తి పరచడానికి వెనకాడరు.

ఫొటో సోర్స్, Getty Images
భారత ప్రభుత్వం ఆర్టికల్ 370ని సవరించి జమ్మూకశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేసింది. అంతేకాదు తన పొరుగు దేశాలతో స్పష్టమైన విధానాన్ని అనుసరిస్తోంది.
పాకిస్తాన్ ఇప్పుడు కశ్మీర్ వివాదాన్ని అఫ్ఘాన్ సమస్యతో ముడిపెట్టడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది. కానీ, దీనిని తాలిబన్లు విమర్శిస్తున్నారు.
''కొన్ని పార్టీలు కశ్మీర్ సమస్యను అఫ్ఘాన్‌తో ముడిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే, ఇది పరిస్థితిని మెరుగుపరచదు. ఎందుకంటే కశ్మీర్ వివాదానికి అఫ్ఘాన్‌తో సంబంధం లేదు'' అని తాలిబన్లు అంటున్నారు.
పాకిస్తాన్ ఈ గందరగోళం నేపథ్యంలో అఫ్ఘాన్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయింది. ఆ దేశంలో ఎవరు అధికారంలోకి వచ్చినా, తన సార్వభౌమత్వాన్ని కాపాడటానికి అది భారతదేశం వైపే చూస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ట్రంప్ ప్రతిపాదనతో పాక్ ముందుకు సాగినప్పటికీ కశ్మీర్ ద్వైపాక్షిక సమస్య మాత్రమేనని భారత్ అమెరికాకు స్పష్టంగా తెలిపింది.
కశ్మీర్‌పై ట్రంప్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ ప్రాంత వాస్తవికతను, కశ్మీర్‌పై భారత విధానాన్ని వారు మార్చలేరు.
అంతర్జాతీయ సమాజం ఈ విషయాన్ని ఎలా చూస్తుందో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రకటనలో చూడవచ్చు. ''కశ్మీర్ సమస్యకు భారత్, పాక్‌లు పరిష్కారమార్గం కనుగొనాలి. మూడో వ్యక్తి జోక్యం ఉండరాదు'' అని ఆయన పేర్కొన్నారు.
(రచయిత అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టడీస్ డైరెక్టర్, లండన్‌లోని కింగ్స్ కాలేజీలో అంతర్జాతీయ వ్యవహారాలపై బోధకులు.)
ఇవి కూడా చదవండి:
- జియో గిగా ఫైబర్: సూపర్ స్పీడ్ ఇంటర్నెట్.. టీవీ, ఫోన్ ఫ్రీ
- హైదరాబాద్‌లో అమ్మపాల బ్యాంకు: తల్లుల నుంచి పాల సేకరణ.. ఉచితంగా చిన్నారులకు
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటో బ్లాక్ అండ్ వైటా.. కలరా?
- భారత్-పాక్ వాణిజ్య సంబంధాలు: తెంచుకుంటే ఎవరికెంత నష్టం?
- డాక్టర్ మయిల్‌స్వామి అన్నాదురై: పశువుల కొట్టం నుంచి అంతరిక్ష పరిశోధనల దాకా...
- కార్గిల్ చొరబాట్ల గురించి ఉప్పందించిన గొర్రెల కాపరి ఇప్పుడేం చేస్తున్నారు
- ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఐదుగురు మహిళా గూఢచారులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








