హైదరాబాద్‌లో అమ్మపాల బ్యాంకు: తల్లుల నుంచి పాల సేకరణ.. ఉచితంగా చిన్నారులకు

- రచయిత, సంగీతం ప్రభాకర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
"నా కూతురు ప్రైవేట్ దవాఖానాలో పురుడు అప్పుడు చనిపోయింది. నా రెండేళ్ల మనవరాలు తక్కువ బరువుతో పుట్టింది. ఇప్పుడు పాపను నిలోఫర్ దవాఖానా ఐసీయూలో పెట్టారు. ఈ సారోళ్లు రెండు నెలల నుంచి పాపకు పాలు ఇచ్చి బతికిస్తున్నారు. మాకే కాదు ఎంతో మందికి పాలు ఇచ్చి సహాయం చేస్తున్నారు. వీళ్లు లేకపోతే మా పిల్ల పరిస్థితి ఏమయ్యేదో"- తన మనవరాలికి పాల కోసం 'ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంకు'కు వచ్చిన లక్ష్మి బీబీసీతో అన్న మాట ఇది.
2017లో హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో ధాత్రి మిల్క్ బ్యాంకును ప్రారంభించారు.
ఒకటిన్నర కేజీలోపు బరువుతో పుట్టిన పిల్లలకు, తల్లి మరెక్కడో ఉండి ఇక్కడి ఎన్‌ఐసీయూలో చేర్చిన పిల్లలకు, అనాథ పిల్లలకు ఇక్కడ నుంచి డాక్టర్ సూచన మేరకు సేకరించిన తల్లిపాలను అందిస్తారు.
వీరి సేవలన్నీ ఉచితం. ఇలాంటి తల్లిపాల బ్యాంకులు దేశంలో కేవలం 18 ఉన్నాయి. తెలుగు నేలలో ఉన్నది ఇదొక్కటే.

"మా బ్యాంకు ఆసక్తి ఉన్నవారి నుంచి పాలు సేకరించి అవసరంలో ఉన్న వారికీ ఇస్తుంది. ఆరు నెలల్లోపు పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం వల్ల త్వరగా జీర్ణమవుతాయి. చిన్నారుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. రోగనిరోధక శక్తి, జ్ఞాపకశక్తి పెరిగే అవకాశాలు ఎక్కువ" అని ధాత్రి మిల్క్ బ్యాంకు అసోసియేట్ డైరెక్టర్ బి.శ్రీనివాస్ బీబీసీతో చెప్పారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
ప్రసవం తర్వాత అందరు తల్లులు పాలు ఇవ్వగలరని, కానీ అవగాహన లేమితో చాలా మంది మహిళలు పాలు రావడం లేదనుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు.
తమ కౌన్సిలర్లు రోజూ నిలోఫర్ ఆస్పత్రిలో అలాంటి బాలింతల వద్దకు వెళ్లి పిల్లలకు ఆరు నెలల వరకు తల్లిపాలు ఇవ్వాలని చెప్పడంతోపాటు పాలిచ్చే విధానాన్ని, ఎప్పుడు ఇవ్వాలనే విషయాలను వివరిస్తారని ఆయన తెలిపారు.

కౌన్సెలింగ్, ఫిజికల్ థెరపీ, మసాజ్ థెరపీతో తల్లిలో పాలు సమృద్ధిగా ఉండేలా చూసేందుకు పాల బ్యాంక్ ప్రయత్నిస్తుందని శ్రీనివాస్ చెప్పారు.
ఇక్కడ తమ పిల్లలకు పాలు ఇచ్చిన తర్వాత ఇతర పిల్లలకు సహాయం చేయాలనుకునే తల్లుల నుంచి పాలు సేకరిస్తారు.
తల్లి పరిస్థితిని బట్టి 10 మిల్లీలీటర్ల నుంచి 100 మిల్లీలీటర్ల వరకు పాలను సేకరిస్తారు.

పాలు సేకరించే ముందు వారికి రక్త పరీక్షలు చేస్తారు.
సేకరించిన పాలను ఐదారు ప్రక్రియల తర్వాత ఈ బ్యాంకు ఇతర పిల్లలకు అందిస్తుంది.
తల్లులు ఇచ్చిన పాలన్నీ కలిపి 150 మిల్లీలీటర్ల డబ్బాల్లోకి సమానంగా మారుస్తారు. 'పాశ్చరైజేషన్'తో ఈ పాలను శుద్ధి చేస్తారు. శుద్ధిచేసిన పాలను మరోసారి పరీక్షకు పంపి అన్ని వివరాలు తెలుసుకొని, అవసరమున్న పిల్లలకు డాక్టర్ సలహా మేరకు అందిస్తారు.
"మేం బ్యాంకు ప్రారంభించినప్పుడు చాలా భయపడ్డాం. పాలు దానం చేసేందుకు తల్లులు అంతగా ముందుకు రారేమో అనుకున్నాం. కానీ అద్భుతమైన స్పందన వచ్చింది. హిందూ, ముస్లిం అనే భేదం లేకుండా అవసరమైనవారు పాలు తీసుకొంటున్నారు" అని శ్రీనివాస్ సంతోషం వ్యక్తంచేశారు.
గడిచిన రెండేళ్లలో దాదాపు 1,093 లీటర్ల తల్లిపాలను అవసరమున్న పిల్లలకు అందించామని ఆయన తెలిపారు. "కొందరు తల్లులు.. పిల్లలు వారి పాలు తాగలేకపోతే మా బ్యాంకు సహకారంతో పాలు సేకరించి తాగిస్తారు. ఇలా తీసుకొనేవారు 20 నుంచి 25 మంది ఉంటారు. మొత్తంగా రోజూ దాదాపు 40 నుంచి 50 మంది పిల్లలకు బ్యాంకు ద్వారా ప్రయోజనం చేకూరుతుంది" అని వివరించారు.

బ్రెజిల్ లాంటి దేశంలో 260, అమెరికాలో 150 పాల బ్యాంకులు ఉన్నాయని, భారత్‌లో కేవలం 14 పాల బ్యాంకులే ఉన్నాయని, ఈ సంఖ్య బాగా పెరగాల్సి ఉందని ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ డైరెక్టర్ డాక్టర్ సంతోష్ కుమార్ తెలిపారు.
త్వరలోనే వీరు మధ్యప్రదేశ్‌లోని భోపాల్, ఇందోర్‌లలో సేవలు ప్రారంభించనున్నారు. దిల్లీలోని లేడీ హార్డింగ్ వైద్య కళాశాల వారికి కూడా సహకారం అందించనున్నారు.
ఇవి కూడా చదవండి:
- పిల్లలకు తల్లిపాలు ఎలా పట్టించాలి
- తల్లి పాలు పట్టేటప్పుడు పిల్లలు చనిపోతారా
- తల్లిపాలు ఎంతకాలం ఇస్తే మంచిది.. రెండేళ్లా? ఐదేళ్లా?
- "కశ్మీర్లో అగ్ని పర్వతం బద్దలు కానుంది, కొంత కాలం గడిచాక..."
- జాతీయ ఉత్తమ నటిగా కీర్తి సురేశ్... ఉత్తమ తెలుగు చిత్రంగా 'మహానటి'
- బంగారం ధర భగ్గుమంటోంది... డిమాండ్ తగ్గనంటోంది
- అభివృద్ధి సూచీలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్ల కంటే జమ్ము కశ్మీరే నయమా?
- ప్రధాని మోదీ చెప్పిన లద్దాఖ్‌లోని 'సోలో' మొక్క విశేషాలేంటి?
- ఆర్టికల్ 370 సవరణపై జమ్మూలోని హిందువులు ఏమంటున్నారు
- కశ్మీరీ పండితులు తమ నేలను వదిలి పారిపోయిన రోజు ఏం జరిగింది...
- గంగూలీ, ద్రవిడ్‌లకు వర్తించిన లాజిక్ ధోనీకి వర్తించదా
- వాట్సాప్‌లో కొత్త సమస్య.. మీ మెసేజ్‌లను వక్రీకరించి పంపొచ్చు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








