ధోనీ రిటైర్మెంట్ ఎప్పుడు... గంగూలీ, ద్రావిడ్‌లకు వర్తించిన లాజిక్ అతనికి వర్తించదా?

ధోనీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, విధాంశు కుమార్
    • హోదా, స్పోర్ట్స్ జర్నలిస్ట్, బీబీసీ కోసం

లెఫ్టినెంట్ కల్నల్ మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం కశ్మీర్‌లో సైనికులతో పాటు శిక్షణలో ఉన్నాడు. జులై 31 నుంచి ఆగస్ట్ 15 వరకు గార్డుగా, గస్తీ జవానుగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

ధోనీలోని దేశసేవ దృక్పథం ప్రశంసనీయమే కాదు, యువతరానికి ప్రేరణ కూడా. అయితే, అత్యంత విజయవంతమైన ఈ కెప్టెన్ వెస్టిండీస్‌ సిరీస్‌లో భారత జట్టులో ఆడడం లేదు.

ఈ సిరీస్ నుంచి అతడు స్వయంగా తప్పుకున్నాడు. ధోనీ ఎందుకలా చేశాడు? రెండు ఐసీసీ ప్రపంచ కప్‌లు గెల్చుకున్న ఈ కెప్టెన్ చుట్టూ ఇప్పుడు చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వాటికి స్వయంగా అతడి నుంచే సమాధానాలు వస్తే బాగుటుంది.

ధోనీ

ఫొటో సోర్స్, Getty Images

అన్నింటికన్నా కీలకమైన ప్రశ్న... ధోనీ తన కెరియర్ చరమాంకంలో ఉన్నాడా? అంతర్జాతీయ క్రికెట్‌కు అతను గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నాడా?

కానీ, ధోనీ మాత్రం తాను ఎప్పుడు రిటైర్ అవుతానో తనకే తెలియదని అంటున్నాడు. బాగానే ఉంది. అలా చెప్పే హక్కు అతనికి ఉంది. కానీ, క్రికెట్ చరిత్రను గమనిస్తే నిర్ణయాలు మనసుతో కాకుండా బుద్ధితో తీసుకోవాల్సి ఉంటుందని అర్థమవుతుంది. ఈ సంగతి ధోనీకి బాగా తెలుసు.

వీవీఎస్ లక్ష్మణ్

ధోనీతో పాటు భారత క్రికెట్ జట్టులో ఆడిన దిగ్గజాల్లో కొందరు చివరి దశలో ఊహించని పరిస్థితులు ఎదుర్కొన్నారు.

వీవీఎస్ లక్ష్మణ్ లాంటి జంటిల్మన్ క్రికెటర్ బహుశా ప్రపంచంలోని ఏ జట్టులో లేరేమో. టెస్ట్ క్రికెట్‌లో అద్భుత అటతీరు ప్రదర్శించిన లక్ష్మణ్ 2012లో రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ విస్మయం కలిగించాడు.

వీవీఎస్

ఫొటో సోర్స్, Getty Images

హైదరాబాద్‌లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఒక జర్నలిస్ట్ ఆయనను, రిటైర్మెంట్ విషయం గురించి మీరు కెప్టెన్ ధోనీకి చెప్పారా అని అడిగారు. దానికి లక్ష్మణ్ సన్నగా నవ్వుతూ, ధోనీతో మాట్లాడాలంటే ఎంత కష్టమో అందరికీ తెలుసని బదులిచ్చాడు.

ఆ తరువాత లక్ష్మణ్ తన ఆత్మకథ '281 నాటౌట్' ప్రచురించాడు. రిటైర్మెంట్ సమయంలో తాను ధోనీ గురించి చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ఆ పుస్తకంలో పేర్కొన్నాడు.

కానీ, అప్పట్లో కొందరు మాజీ ఆటగాళ్లు ధోనీ మీద విమర్శలు చేశారు. తోటి ఆటగాళ్లతో మాట్లాడనివాడు కెప్టెన్ ఎలా అవుతాడని వ్యాఖ్యానించారు.

నిజంగానే, ధోనీ తన జట్టులోని ఆటగాళ్లతో మాట్లాడడా?

యువ ఆటగాళ్ళు తమకు అలాంటి సమస్యేమీ లేదని చెబుతారు. కానీ, లక్ష్మణ్ వంటి సీనియర్ ఆటగాళ్లు మాత్రం చివరి రోజుల్లో తమకు సరైన ట్రీట్‌మెంట్ లభించలేదని అన్నారు.

గంభీర్, సెహవాగ్, ధోనీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్‌లతో ధోనీ

వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్

2011-12లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌ను భారత జట్టు 4-0తో కోల్పోయింది. ఆ తరువాత వన్డే సిరీస్ ప్రారంభం కావల్సి ఉండగా కెప్టెన్ ధోనీ టీమ్ మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఆ సమావేశంలోని కీలక సందేశం ఏంటంటే, గంభీర్, సెహ్వాగ్, సచిన్... ఈ ముగ్గురి వయసూ 30 దాటింది కాబట్టి, వారంతా ఒకేసారి ఆడితే జట్టు ఫీల్డింగ్ మీద ప్రభావం పడుతుంది.

గంభీర్ ఆ సిరీస్‌లో అప్పట్లో యువకుడైన విరాట్ కోహ్లీ తరువాత అత్యధిక పరుగులు సాధించాడు. కానీ, ఆ తరువాత గంభీర్, సెహ్వాగ్‌లిద్దరూ కొనసాగలేకపోయారు.

అది కాకతాళీయంగా జరిగిందా లేక నిజంగానే జట్టుకు వారి అవసరం తీరిపోయిందా?

ధోనీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యువరాజ్, గంభీర్‌లతో ధోనీ

నిజానికి, గంభీర్‌కు అప్పటికి రిటైర్ అవడానికి చాలా టైమ్ ఉంది. 2011 వరల్డ్ కప్‌లో అత్యధిక స్కోర్ చేసింది అతనే.

అలాంటి వాడు, ఏడాదిలోనే జట్టుకు పనికిరాకుండా పోయాడా?

గంభీర్

ఫొటో సోర్స్, Getty Images

ఆ తరువాత గంభీర్ తనకు పెద్ద షాక్ తగిలిందని చెప్పుకొచ్చాడు. ధోనీ గురించి ప్రస్తావిస్తూ అతడు, 2015లో ఫలానా ఆటగాడు ఆడలేడని ఎవరైనా 2012లోనే ఎలా చెబుతారని ప్రశ్నించాడు.

యువరాజ్ సింగ్ తండ్రి, మాజీ క్రికెటర్ యోగరాజ్ సింగ్ కూడా అప్పట్లో, జట్టు నుంచి గంభీర్, సెహ్వాగ్, యువరాజ్‌లను తీసేయడంలో ధోనీ కీలక పాత్ర పోషించాడని ఆరోపించారు.

ధోనీ, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ధోనీ, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ

సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్

ఫీల్డింగ్ కారణాలతో ధోనీ 2008 ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు గంగూలీ, రాహుల్ ద్రవిడ్‌లను వన్డే జట్టు నుంచి తప్పించాడు.

ఆ నిర్ణయం సరైనదే. ఎందుకంటే, ధోనీ 2011 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని ఆటగాళ్ళను ఎంచుకునే పనిలో ఉన్నాడు.

కానీ, ఆ లాజిక్‌ను ధోనీ ఇప్పుడు మరిచిపోయాడా?

వీరేంద్ర సెహ్వాగ్ ఒక ఇంటర్వ్యూలో, 'ధోనీ తన కెరీర్ విషయంలో అప్పటి కెప్టెన్ గంగూలీకి ధన్యవాదాలు చెప్పుకోవాలి' అని అన్నాడు.

ధోనీ తొలిరోజుల్లో పెద్దగా రాణించలేదు. కెప్టెన్‌ గంగూలీ సెహ్వాగ్ కోసం తన ఓపెనింగ్ పొజిషన్ వదులుకుని మూడో స్థానంలో వచ్చేవాడు.

అతను ధోనీ కోసం మూడో స్థానం కూడా వదులుకున్నాడు. విశాఖపట్నంలో ధోనీ పాకిస్తాన్ మీద విరుచుకుపడి సెంచరీ చేసి జట్టులో తన స్థానాన్ని ఎలా పక్కా చేసుకున్నాడో మనందరికీ తెలుసు.

బహుశా, ఈ కథలోనే ధోనీకి కొన్ని మార్గాలు కనిపించవచ్చు.

ధోనీ

ఫొటో సోర్స్, Getty Images

ధోనీ రిటైర్మెంట్ ఎప్పుడు?

ధోనీ ఇప్పుడు ప్రపంచం దృష్టిని తన వైపుకు తిప్పుకోగల బ్యాట్స్‌మన్ కాదు. ప్రపంచ కప్ పోటీలలో అతడు తన బ్యాటింగ్ ధాటితో భారత జట్టుకు విజయాలేమీ సాధించలేదు. అతడిని మించిన ఫినిషర్ లేడనే అభిప్రాయాలు కూడా ఇప్పుడు వినిపించడం లేదు.

అలాంటప్పుడు, ధోనీ తనకు తానుగా రిటైర్మెంట్ ప్రకటన ఎందుకు చేయకూడదు?

బహుశా, ఆయన మదిలో వచ్చే ఏడాది రాబోయే టీ-20 వరల్డ్ కప్ ఉండవచ్చు. ఆ గెలుపుతో క్రికెట్ జీవితం నుంచి నిష్క్రమించాలని అతను కోరుకుంటూ ఉండవచ్చు.

కానీ, ఇటీవలి కాలంలో ఏ ఆటగాడైనా తనకు తగిన విధంగా రిటైర్ అయ్యే అవకాశం లభించిందని భావించిన దాఖలాలు ఉన్నాయా?

ఇలాంటి అపవాదుల నుంచి బయటపడే అవకాశం ఇప్పుడు ధోనీ చేతుల్లోనే ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)