‘వెండి కోసం మనుషులు లేని ఆ పట్టణంలో 22 ఏళ్లు గడిపాను’

బ్రెంట్ అండర్‌వుండ్

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, సెర్రో గోర్డో
    • రచయిత, విక్టోరియా పార్క్
    • హోదా, బీబీసీ న్యూస్

కాలిఫోర్నియాలోని నిర్మానుష్య పట్టణం సెర్రో గోర్డోలో నివసించే ఏకైక వ్యక్తి రాబర్ట్ లూయిస్ డెస్మరైస్. ఇక్కడే ఆయన వెండి నిక్షేపాల కోసం 22 ఏళ్లుగా వెతుకుతున్నారు.

హైస్కూల్ టీచరైన 70 ఏళ్ల డెస్మరైస్ బడిలో చదువుకునే రోజుల్లో కూడా నిధుల కోసం మారుమూల ప్రాంతాల్లో వెతికేవారు. తర్వాత కాలంలో సెర్రో గోర్డోలో పూర్తిస్థాయిలో జీవించడం మొదలుపెట్టారు.

సెర్రో గోర్డో (లావైన కొండ అని స్పానిష్‌లో అర్థం) ఒకప్పుడు కాలిఫొర్నియాలోనే ప్రధానమైన వెండి గనిగా ఉండేది. "లాస్ ఏంజిలిస్ నిర్మించడానికి ఇది సహాయపడింది" అని డెస్మరైస్ చెప్పారు.

వెండి ఇంకా ఇక్కడ పుష్కలంగా ఉందని ఆయన నమ్ముతున్నారు. 800 అడుగుల రాళ్లను సైతం ఉలి, సుత్తితో పగలగొట్టి వాటిలో ఏముందో చూస్తున్నారు.

Robert, the only resident of Cerro Gordo ghost town. Vivian Sacks

ఫొటో సోర్స్, Vivian Sacks

ఫొటో క్యాప్షన్, కాలిఫోర్నియాలోని నిర్మానుష్య పట్టణం సెర్రో గోర్డోలో నివసించే ఏకైక వ్యక్తి రాబర్ట్ లూయిస్ డెస్మరైస్.

''ఆ గనులను కనిపెట్టగలననే నమ్మకంతోనే ఉన్నా. అందుకే ఇంకా ఇక్కడే ఉన్నా'' అని ఆయన చెప్పారు.

ప్రస్తుతానికి, ముడిరూపంలోని వెండిని ఇక్కడికొచ్చే పర్యటకులకు 5 నుంచి 20 డాలర్ల మధ్య డెస్మరైస్ విక్రయిస్తున్నారు.

డెస్మరైస్ కొన్నేళ్లుగా ఇక్కడే నివసించడం చూసి ఎవరో ఆయనకు ఒక క్యాబిన్‌ను ఇచ్చారు, ఇది ఒకప్పుడు విలియం హంటర్ అనే వ్యక్తి నివాసంగా ఉండేది. డెస్మరైస్ నివాసం 8,200 అడుగుల ఎత్తులో ఉంటుంది.

అక్కడ జీవించడం అంత సులువు కాదు. అందుకే ఆయన భార్య అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆమె నెవడాలో ఉంటున్నట్లు డెస్మరైస్ చెప్పారు.

వంట చెరకు సేకరించి మంట పెట్టడం డెస్మరైస్ రోజువారీ పని. ఆయనుండే పర్వతంపైన విద్యుత్ ఉంది కానీ, నీళ్లు లేవు. అందుకే కీలర్ అనే సమీప పట్టణం నుంచి లారీ నిండా నీళ్లు తీసుకెళ్తారు.

బ్రెంట్ అండర్‌వుండ్

ఫొటో సోర్స్, Brent Underwood

ఫొటో క్యాప్షన్, సెర్రో గోర్డో పట్ణణం

కీలర్ ఒకప్పుడు రైల్వే స్టేషన్.. అభివృద్ధి చెందుతున్న పట్టణం. ముడి వెండిని పర్వతాల నుంచి మొదట కీలర్‌కు తీసుకొచ్చేవారు. ఇక్కడి నుంచి రైలులో లాస్ ఏంజిలిస్‌కు తరలించేవారు.

లాస్ ఏంజిలిస్ నిర్మాణ ప్రాజెక్టుల వల్ల ఇక్కడున్న చెరువు ఎండిపోయింది. దీంతో జనాభా 30కి పడిపోయింది.

ఇక కీలర్‌కు 15 మైళ్ల దూరంలో లోన్‌పైన్ అనే మరో పట్టణం ఉంది. ఇక్కడ నిత్యావసర వస్తువులు దొరుకుతాయి. బార్లు, కాఫీ షాపులు కూడా ఉన్నాయి.

ఇక్కడికి వచ్చే పర్యటకులకు సెర్రో గోర్డో చరిత్రను డెస్మరైస్ వివరిస్తారు. 1865లో నిర్మించిన ఈ పట్టణం వేగంగా పెరిగిందని, ఒకప్పుడు 4,500 జనాభా ఉండేదని, తనకు మైనింగ్ అంటే చాలా ఇష్టమని వారికి చెబుతారు.

బ్రెంట్ అండర్‌వుండ్

ఫొటో సోర్స్, Brent Underwood

భూగర్భంలోని మైనింగ్ విశేషాలను పర్యటకులకు చూపించాలని డెస్మరైస్ అనుకుంటున్నారు. కానీ, ఈ పట్టణ యజమానులు బ్రెంట్ అండర్‌వుడ్, జోన్ బియర్ ఈ ఆలోచనకు వ్యతిరేకంగా ఉన్నారు. గనులు స్వాభావికంగా ప్రమాదకరమైనవని వారి అభిప్రాయం.

వీరిద్దరు 1.4 మిలియన్ డాలర్లకు గత జులైలో సెర్రో గోర్డోను వేలంపాటలో కొనుగోలు చేశారు.

''కనిపించకుండా పోయిన వెండి గని ఏదో ఒక రోజు దొరుకుతుందని మేం నమ్ముతున్నాం. ఇప్పటికే కనీసం 500 మిలియన్ డాలర్ల విలువైన వెండి ఖనిజాలను పర్వతం నుంచి బయటకు తీశారు. ఇంకా అక్కడ కనీసం 500 మిలియన్ డాలర్ల నిక్షేపాలు ఉన్నట్లు పుకార్లు ఉన్నాయి'' అని వారు తెలిపారు.

బ్రెంట్ అండర్‌వుండ్

ఫొటో సోర్స్, Brent Underwood

ఫొటో క్యాప్షన్, సెర్రో గోర్డో పట్ణణం యజమానులు బ్రెంట్ అండర్‌వుండ్, జోన్ బియర్

బ్రెంట్ అండర్‌వుడ్, జోన్ బియర్

పర్యటకులకు రాత్రిపూట వసతి ఏర్పాటు చేసి పట్టణానికి కొత్త కళ తీసుకురావాలని యజమానులు కోరుకుంటారు.

ఇక్కడొక సినిమా థియేటర్ కూడా ఏర్పాటు చేయాలని ప్రణాళిక వేస్తున్నారు.

కొత్త యజమానులు ఇప్పుడు డెస్మరైస్‌కు డబ్బులిస్తూ ఈ పట్టణానికి కాపలాదారుగా నియమించుకున్నారు.

బ్రెంట్ అండర్‌వుండ్

ఫొటో సోర్స్, Brent Underwood

సెర్రో గోర్డోను చూస్తున్నందుకు డెస్మరైస్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో కొంతమంది కృతజ్ఞతలు కూడా చెబుతున్నారు. కానీ, అవేవీ డెస్మరైస్‌కు తెలియదు. ఎందుకంటే కంప్యూటరే కాదు, ఎలాంటి సాంకేతిక పరికరమూ ఆయన దగ్గర లేదు.

''నాకు జంతువులు, సాహసాలు, ఆకాశంలోని నక్షత్రాలు అంటే ఇష్టం. మీకు కూడా ఇష్టమేననుకుంటా'' అని డెస్మరైస్ చెప్పారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)