'అందమైన యువతి'లా కనిపించేందుకు ఫిల్టర్ వాడుతూ లైవ్‌లో దొరికిపోయిన వీడియో బ్లాగర్

ఫొటో సోర్స్, DOUYU
ఆమె ఒక ప్రముఖ చైనీస్ వీడియో బ్లాగర్. ఆమెకు పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. ఆమె 'లైవ్' కార్యక్రమంలో ఏదో సాంకేతిక సమస్య తలెత్తింది. అప్పుడు ఆమెను చూసిన అభిమానులు ఆశ్చర్యపోయారు. తాము ఇంతకాలం అనుకున్నట్లు ఆమె 'అందమైన యువతి' కాదని, నడివయస్కురాలని వారికి తెలియడమే కారణం.
లైవ్‌లో కనిపించేటప్పుడు ఆమె ఇంతకాలం ఒక ఫేస్ ఫిల్టర్ వాడారని భావిస్తున్నారు. కియావో 'తియ్యటి గొంతు' ఆమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది.
తాజా పరిణామంతో, అందానికి ప్రామాణికం ఏమిటనే చర్చలు చైనా సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతున్నాయి.
వీడియో బ్లాగర్ పేరు కియావో బిలూవో. డౌయూ అనే లైవ్ స్ట్రీమింగ్ వెబ్‌సైట్‌లో ఆమెకు గతంలో లక్ష మందికి పైగా ఫాలోయర్లు ఉన్నారు.
అభిమానుల్లో కొందరు ఆమెను 'దేవతలా' ఆరాధించారని చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ తెలిపింది. కొందరు ఆమెకు సుమారు రూ.10 లక్షలు(లక్ష యువాన్లు) పైగా బహుమతి రూపంలో ఇచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
డౌయు ప్లాట్‌ఫామ్‌పై మరో యూజర్ క్వింజీతో కలిసి కియావో లైవ్ స్ట్రీమింగ్‌లో ఉండగా జులై 2న ఈ ఘటన జరిగిందని లైవ్ స్ట్రీమింగ్ వేదిక లిచీ న్యూస్ తెలిపింది.
ముఖం చూపించాలని, ఫిల్టర్ ఉపయోగించవద్దని అభిమానులు కియావోను తరచూ అడిగేవారని గ్లోబల్ టైమ్స్ ప్రస్తావించింది. లక్ష యువాన్లు బహుమతిగా అందే వరకు తన ముఖాన్ని చూపించలేననే అర్థంలో ఆమె చెప్పేవారని, తానో అందమైన హోస్ట్‌ను అనేవారని తెలిపింది.
ఫాలోయర్లు ఆమెకు డొనేషన్లు పంపేవారు. ఒక సెషన్‌లో అత్యధికంగా 40 వేల యువాన్లు ఆమెకు అందించారు.
ఒక దశలో కియావో వాడుతున్న ఫిల్టర్ పనిచేయడం ఆగిపోవడంతో అసలు రూపం వీక్షకులకు తెలిసిపోయింది. వీఐపీ యాక్సెస్ రూమ్ ద్వారా ఆమెను చూస్తున్న యూజర్లలో చాలా మంది ఒకేసారి అందులోంచి వెళ్లిపోవడం మొదలయ్యాకగాని ఆమె దీనిని గుర్తించలేకపోయారు.
మిశ్రమ స్పందన
కియావో రూపం తెలిశాక ఫాలోయర్లలో చాలా మంది ముఖ్యంగా మగవారు ఆమెను అనుసరించడం ఆపేశారు.
యూట్యూబ్, బిలిబిలీ వెబ్‌సైట్ యూజర్లు ఆమె ఫిల్టర్ లేకుండా కనిపించిన ఫుటేజీని సేకరించారు.
తాజా ఘటన తర్వాత కియావో లైవ్-స్ట్రీమింగ్‌ను నిలిపివేశారు. ఆమె డౌయూ ప్రొఫైల్ పేజీకి ఇప్పుడు 6.5 లక్షల మంది ఫాలోయర్లకు ఉన్నారు.
చైనాలో 42.5 కోట్ల లైవ్-స్ట్రీమర్లు ఉండగా, ఇక్కడ సోషల్ మీడియా వేదికల్లో ఫిల్టర్ వాడటం సాధారణమైపోయింది.
యూజర్లను మోసం చేసినందుకు కియావోకు తగిన శాస్తి జరిగిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరేమో ఆమెకు నగదు బహుమతి ఇచ్చిన వ్యక్తుల వివేకాన్ని ప్రశ్నిస్తున్నారు.
ఇంకొందరు కియావో పట్ల సానుభూతి వ్యక్తంచేస్తున్నారు. ఆమె రూపాన్ని చూసి ఆమెపై నిర్ణయానికి రావొద్దని, ఆమె తన స్వరంతోనే ఎక్కువగా పేరు తెచ్చుకున్నారనేది గుర్తుపెట్టుకోవాలని సూచిస్తున్నారు.
కియావో అసలు రూపం బయటపడిన తర్వాత మరో యూజర్ క్వింజీ ఎలాంటి స్పందనా వ్యక్తంచేయకపోవడాన్ని కొందరు అభినందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- భారత్‌లో రెట్టింపైన పులులు... ఇంతకూ వీటిని ఎలా లెక్కిస్తారు
- సోషల్ మీడియా: మీకు లాభమా? నష్టమా?
- సోషల్ మీడియా ఎడిక్షన్: బయటపడండి ఇలా..
- మేకప్ వీడియోలు: మనం కనిపించే తీరును సోషల్ మీడియా మార్చేస్తోందా?
- ఫేక్ న్యూస్‌పై సమరం: ‘సోషల్ మీడియాలో కనిపించేదంతా నిజం కాదు’
- పెళ్లి ఊరేగింపులో గుర్రం ఎక్కినందుకు దళితుల సామాజిక బహిష్కరణ
- అనంతపురం: ఆలయంలో అడుగుపెట్టారని దళిత కుటుంబానికి జరిమానా
- బీజేపీ ఎంపీ రమాదేవి: ఆమె ఈ స్థాయికి చేరుకోవడానికి పడిన శ్రమంతా ఎవరికీ పట్టదా?
- కశ్మీర్ లోయలో అదనపు బలగాల మోహరింపు దేనికి సంకేతం
- ‘బాల్యంలో నేనూ లైంగిక వేధింపులు ఎదుర్కొన్నా’.. పార్లమెంటులో ఎంపీ ప్రసంగం
- సోషల్ మీడియాలో మీ పిల్లల ఫొటోలు షేర్ చేస్తున్నారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








