రష్యాలోని రెండున్నర కోట్ల ఏళ్ళ నాటి సరస్సును కాపాడాలని హాలీవుడ్ హీరో డికాప్రియోకు విజ్ఞప్తుల వెల్లువ

ఫొటో సోర్స్, Getty Images
గత నెల్లో చెన్నై నీటి సంక్షోభంపై ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించిన హాలీవుడ్ నటుడు, ఆస్కార్ పురస్కార గ్రహీత లియోనార్డో డికాప్రియోకు ఒక ప్రఖ్యాత సరస్సు పరిరక్షణ కోసం రష్యన్ల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.
"బైకాల్ సరస్సు పరిరక్షణ కోసం మీ వంతు కృషి చేయండి" అంటూ ఆయన సోషల్ మీడియా పేజీలపై సిరిలిక్ లిపిలో కామెంట్ల రూపంలో వేల కొద్దీ వినతులు వస్తున్నాయి.
కాలుష్యం, వేట నుంచి ఈ సరస్సుకు ముప్పు పొంచి ఉందని 'వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్)' ఆందోళన వ్యక్తంచేస్తోంది.
బైకాల్ సరస్సు రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఉంది. ఇది ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) వారరసత్వ సంపద జాబితాలో ఉంది.
యునెస్కో సమాచారం ప్రకారం- బైకాల్ సరస్సు ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన సరస్సు. ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన సరస్సు. ఇది సుమారు రెండున్నర కోట్ల సంవత్సరాల కింద ఏర్పడింది. ఈ మంచినీటి సరస్సు లోతు దాదాపు 1,700 మీటర్లు.

ఫొటో సోర్స్, Getty Images
"లెవుష్కా! మా బైకాల్‌ను కాపాడు. రష్యాలోని అందరి తరపున మీకు ఈ విజ్ఞప్తి చేస్తున్నా" అని ఓ యూజర్ తన కామెంట్‌లో రాశారు. 'లియోనార్డో'ను రష్యాలో 'లెవుష్కా' అని కూడా అంటారు.
ప్రకృతి సంరక్షణలో డికాప్రియో చొరవ, ఆయన రష్యన్ మూలాలను దృష్టిలో ఉంచుకొని రష్యన్లు బైకాల్ సరస్సును కాపాడాలని ఆయన్ను కోరుతున్నట్లు కనిపిస్తోంది.
డికాప్రియో పర్యావరణ అంశాల గురించి సోషల్ మీడియాలో తరచూ పోస్టులు పెడుతుంటారు. పర్యావరణ పరిరక్షణకు 1998లో 'లియోనార్డో డికాప్రియో ఫౌండేషన్' ఏర్పాటు చేశారు.
2016లో బీబీసీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో డికాప్రియో- ఇప్పుడు యువతకు ఎదురవుతున్న అతిపెద్ద సమస్య వాతావరణ మార్పులేనని చెప్పారు.
ఆయన 2012లో ఒక పత్రికతో మాట్లాడుతూ- తన అవ్వ రష్యన్ అని తెలిపారు. దీనిని కొందరు యూజర్లు పరోక్షంగా ప్రస్తావిస్తూ- "మీ అవ్వను గుర్తుతెచ్చుకోండి, బైకాల్ సరస్సు సంక్షోభంలో జోక్యం చేసుకోండి" అని కోరారు.
బైకాల్ సరస్సు సమీపంలోని ఉలన్-ఉడే నగరం వార్తలు షేర్ చేసే ఒక ప్రముఖ సోషల్ మీడియా ఖాతా నుంచి, ఈ అంశంపై డికాప్రియోకు వినతులు పెట్టాలని యూజర్లకు పిలుపునిచ్చినట్లు కనిపిస్తోంది.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది
"బైకాల్ సమస్యల గురించి అందరం డికాప్రియోకు రాద్దాం. ఆయనో ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు, సినీ ప్రముఖుడు. దేశ పౌరులందరూ ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలి. బైకాల్ సరస్సు మన సర్వస్వం" అని ఆ ఖాతా నుంచి చేసిన పోస్టులో చెప్పారు.
డికాప్రియో పోస్టుల కింద కామెంట్లలో రష్యన్, ఇంగ్లిష్ భాషల్లో రాసిన కామెంట్లలో 'సేవ్ బైకాల్ (బైకాల్‌ను పరిరక్షించండి)', 'బైకాల్ ఈజ్ అవర్స్(బైకాల్ మనది)' అనే హ్యాష్‌ట్యాగ్‌లను యూజర్లు పెట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
డికాప్రియో నటించిన 'టైటానిక్' చిత్రాన్ని దృష్టిలో ఉంచుకొని మరికొందరు సరదా వ్యాఖ్యలు రాశారు. "టైటానిక్ సినిమాను బైకాల్లో తీసుంటే, మీరు మునిగిపోయేవారు కాదు" అని ఒక యూజర్ చమత్కరించారు.
రష్యా పర్యావరణ సమస్యలను చూడాలని మరొకరు డికాప్రియోకు సూచించారు.
బైకాల్‌ను కాపాడితే బదులుగా మీకు మరో ఆస్కార్ ఇప్పిస్తామని ఇంకొందరు రాశారు.
ఇవి కూడా చదవండి:
- 'మీరిలా చేస్తే గుండెపోటు వచ్చిన వ్యక్తి ప్రాణాలు కాపాడొచ్చు'
- ఏడాదిలో నెల రోజులు మాత్రమే కనిపించే గ్రామం ఇది
- యుగాండా నుంచి భారత్‌కు భారీ వలసల్లో నిజమెంత
- చరిత్ర: భారత్ నుంచి బ్రిటన్ ఎంత సంపద దోచుకెళ్లింది?
- అత్యధిక పోషక విలువలున్న 25 ఆహార పదార్థాలు ఇవే
- పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే.. ఆచరణ సాధ్యమేనా? నిపుణులు ఏమంటున్నారు?
- కార్గిల్ యుద్ధాన్ని బీబీసీ ప్రపంచానికి ఎలా అందించింది?
- ప్రపంచబ్యాంకు బాటలోనే ఏఐఐబీ.. రాజధాని ప్రాజెక్టు నుంచి వెనక్కు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








