'మీరిలా చేస్తే గుండెపోటు వచ్చిన వ్యక్తి ప్రాణాలు కాపాడొచ్చు'

ఫొటో సోర్స్, iStock
- రచయిత, క్లాడియా హమ్మండ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రథమ చికిత్స ఒకరి ప్రాణాలు కాపాడుతుంది. సరైన సమయంలో సరైన చికిత్స అందిస్తే ఆపదలో ఉన్న వ్యక్తి బతికే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
అంటే మనం చేసే ఫస్ట్‌ఎయిడ్ ఒక వ్యక్తి చావు బతుకుల్ని నిర్ణయిస్తుంది.
కానీ, సరైన ప్రథమ చికిత్స ఎలా చేయాలి? దీనిపై ప్రజల్లో అనేక అపోహలు, అనుమానాలు ఉన్నాయి.
చాలా మంది ప్రథమ చికిత్స తప్పుగా చేస్తుంటారు. నిజానికి అది వారి పొరపాటు కాదు. అలా చేయడం తప్పని వారికి తెలియదు.
ఇంతకీ ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి? ప్రజల్లో ఉన్న అపోహలు ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
అపొహ 1 : కాలిన గాయంపై వెన్న రాయాలి!
ఒక పెద్ద అగ్నిప్రమాదం జరిగింది. అందులో ఒక వ్యక్తి చేయి బాగా కాలిపోయింది. నొప్పితో విలవిల్లాడుతున్నాడు. చికిత్స చేసేందుకు చుట్టుపక్కల ఆర్ఎంపీ డాక్టర్ కూడా లేడు.
అక్కడే ఉన్న ఓ పెద్దాయన కాలిన గాయంపై వెన్న రాయమని సలహా ఇచ్చాడు. పెద్దాయన సూచనతో కాలిన గాయంపై వెన్న రాశారు.
ఈ నాటు వైద్యం తాతముత్తాతల నుంచి పాటిస్తున్నారు.
చివరికి ఫస్ట్‌ఎయిడ్ ఆవిష్కర్తగా చెప్పుకునే పర్షియన్ డాక్టర్ జనరల్ ఫెడరిక్ ఎస్‌మార్చ్ కూడా ఇదే సిఫార్సు చేశారు.
అయితే, కాలిన గాయానికి గాలి తగిలితే విపరీతమైన నొప్పి పుడుతుంది. దానిపై వెన్న లాంటి చల్లని పదార్థం ఏదైనా రాస్తే కాసేపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
కానీ అది తాత్కాలికమే. కాసేపైన తర్వాత తిరిగి నొప్పి మొదలవుతుంది.
కాలిన గాయానికి గాలి తగలకుండా ఏదైనా కప్పి ఉంచితే వేడి గాయం లోపలే ఉంటుంది. అంటే చర్మం నిరంతరాయంగా మండుతూనే ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
కాలిన గాయాలకు సరైన ప్రథమ చికిత్స ఏంటి?
ముందుగా కాలిన గాయం దగ్గర దుస్తులు, ఆభరణాలు ఏవైనా ఉంటే తీసేయాలి.
తర్వాత కాలిన ప్రాంతంపై కుళాయి నీళ్లు ధారగా పడేలా చూడాలి.
అలా వీలుకాకుంటే నీటిలో చాలా సేపు ఉంచాలి. కనీసం 20 నిమిషాల పాటు ఇలా చేయాలి.
ఇలా చేస్తే చర్మం నిరంతరం మండకుండా ఉంటుంది. అంతేకాదు.. ఆ ప్రాంతం మొద్దుబారేలా.. గాయం త్వరగా నయమయ్యేలా చేస్తుంది.
ఒకసారి గాయం మంటతగ్గిన తర్వాత ఇన్ఫెక్షన్ సోకకుండా శుభ్రమైన వస్త్రంతో కట్టుకట్టాలి. ఆ తర్వాత సాధ్యమైనంత త్వరగా వైద్యుడి వద్దకు తీసుకెళ్లాలి.
ఆ విషయంలో వెన్న చక్కగా పనిచేస్తుంది!
కానీ ఒక ప్రత్యేక సందర్భంలో వెన్న చాలా చక్కగా పనిచేస్తుంది.
చర్మంపై వేడి బొబ్బలు, కురుపులు వచ్చినప్పుడు వెన్న రాస్తే చక్కని ఫలితం కనిపిస్తుంది.
నొప్పి తగ్గడంతో పాటు..గాయం త్వరగా మానడానికి సాయం చేస్తుంది.
దీని గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఫొటో సోర్స్, Getty Images
అపోహ 2 : గుండెపోటు వచ్చిన వ్యక్తికి అవసరం లేకపోయినా చేతులతో ఛాతిపై అదిమితే ప్రమాదం!
ఎవరైనా ఒకరికి గుండెపోటు వచ్చిందనుకోండి. గుండె పనిచేయడం మందగిస్తుంది. శరీర భాగాలకు రక్త సరఫరా ఆగిపోతుంది.
అలాంటి సమయంలో ప్రథమ చికిత్స అందిందా లేదా అన్న అంశంపై ఆ వ్యక్తి ప్రాణాలు ఆధారపడి ఉంటాయి.
ఆ ఆపద సమయంలో కార్డియో పల్మోనరీ రిససిటేషన్-సీపీఆర్ చాలా కీలకం. గుండెను మళ్లీ బతికించే ప్రయత్నం చేయడమే సీపీఆర్.
వివరంగా చెప్పాలంటే గుండె పనిచేయడం ఆగిపోవడంతో శరీర భాగాలకు నిలిచిపోయిన రక్త సరఫరాను తిరిగి పంపిణీ చేయడమే.
ఇందుకోసం ఆపదలో ఉన్న వ్యక్తి ఛాతి మీద చేతులతో ఒత్తిడి కలిగించి గుండె కొట్టుకునేలా చేస్తారు.
ఫస్ట్ఎయిడ్ కోర్సులో పలు విషయాలు నేర్పిస్తారు.


గుండెపోటు వచ్చిన వ్యక్తి శ్వాస తీసుకుంటున్నాడా లేదా అని తెలుసుకునేందుకు ముందు అతని ఛాతిని గమనించాలి.
తర్వాత అతనికి దగ్గరగా తల పెట్టి శ్వాస తీస్తున్నాడా లేదా చూడాలి.
ఒకవేళ అతను శ్వాస తీసుకోకపోతే తక్షణం అంబులెన్స్‌కి ఫోన్ చేయాలి. ఆ తర్వాత వెంటనే సీపీఆర్ ప్రారంభించాలి.
అయితే, గుండెపోటు వచ్చిన వ్యక్తి శ్వాస మామూలుగా తీసుకుంటున్నారో లేదో మీకు అర్థం కాకపోయినా కూడా సీపీఆర్ చేయవచ్చని ఫస్ట్ఎయిడ్ నిపుణులు చెప్తుంటారు.
డాక్టర్లు చెప్పినా.. నిపుణులు సూచించినా సీపీఆర్ చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపించరు. సీపీఆర్ చేస్తే మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుందేమో అన్నది వాళ్ల భయం.
అవసరం లేకపోయినా సీపీఆర్ అందించడం వల్ల ఏమైనా చెడు ప్రభావాలు కలిగాయా అన్న అంశంపై జపాన్‌లోని యోకహామా పట్టణంలో ఒక అధ్యయనం చేశారు.
ఈ అధ్యయనంలో భాగంగా 910మంది రోగులకు సీపీఆర్ చేశారు. వీరిలో ముగ్గురికి మాత్రమే సీపీఆర్ కారణంగా చిన్న చిన్న సమస్యలు వచ్చాయి. ఒకరికి పక్కటెముక విరిగింది. కానీ ఈ ఇబ్బందులేవీ ప్రమాదకరమైనవి కాదు.
అందుకే సీపీఆర్ చేసేందుకు ప్రజలు భయపడొద్దని రచయితలు చెబుతున్నారు. సీపీఆర్ వల్ల ఒక ప్రాణం నిలబడుతుందని సూచిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అపోహ 3: నోటిలో నోరు పెట్టి శ్వాస అందిస్తేనే సీపీఆర్ సరిగా చేసినట్లు!
ఈ అంశంలో గత పదేళ్లలో ఎన్నో మార్పులు వచ్చాయి.
మామూలుగా పదిహేనుసార్లు చేతితో ఛాతిపై ఒత్తిన తర్వాత రెండుసార్లు రోగి నోటిలో నోరు పెట్టి శ్వాస అందించాలని చెబుతుంటారు.
ఆ తర్వాత 30సార్లు ఛాతిపై అదిమిన తర్వాత రెండుసార్లు నోటితో శ్వాస అందిస్తే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని తేలింది.
అప్పటి నుంచి అందరూ దీన్నే పాటిస్తున్నారు.
నోటి ద్వారా శ్వాస అందించకుండా కేవలం సీపీఆర్ చేస్తే?
నోటి ద్వారా శ్వాస అందించాల్సిన అవసరం లేదు కాబట్టి, సీపీఆర్‌పైనే దృష్టి పెట్టొచ్చు. ఫలితంగా ఎక్కువ విరామం లేకుండా సీపీఆర్ చేస్తే గుండె నుంచి మెదడుకు రక్త సరఫరా పెరిగేందుకు అవకాశం అధికంగా ఉంటుంది.
రక్త సరఫరా పూర్తిగా మెరుగుపడకపోయినా.. త్వరగా మెదడును చేరుకునే వీలుంటుంది.
చిన్నచిన్నవి మినహా ఈ రెండు పద్ధతుల్లో పెద్దగా వ్యత్యాసాలు లేవని అధ్యయనంలో తేలింది.
అంటే కేవలం ఛాతిపై అదిమినా.. లేదంటే నోటిలో నోరు పెట్టి శ్వాస అందిస్తూ సీపీఆర్ చేసినా దాదాపు రెండూ ఒక్కటే.
అయితే, ఒంటరిగా సీపీఆర్ చేసిన వారి కంటే, ఫోన్‌లో వైద్య సిబ్బంది ఇచ్చిన సూచనలు పాటిస్తూ సీపీఆర్ చేసినప్పుడు 22శాతం మెరుగైన ఫలితాలు కనిపించాయి. అంటే బ్రతికే అవకాశాలు మెరుగుపడ్డాయి.


అయితే, ఈ నిబంధనలు చిన్నారులు, నీటిలో మునిగిన వారి విషయంలో వర్తించవు. వారికి సీపీఆర్‌తో పాటు నోటితో శ్వాస కూడా అందిస్తే మంచిది.
నోటిలో నోరు పెట్టి శ్వాస అందించకున్నా కేవలం సీపీఆర్ వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని తేలింది.
ఇది రెండు విధాలుగా మంచిది. ఒకటి.. రోగి బతికే అవకాశాలు పెరుగుతాయి. రెండు.. సీపీఆర్ చేసేందుకు ఎక్కువ మంది ప్రజలు ఆసక్తి చూపించొచ్చు.
నిబంధనలు ఎంత సులువుగా ఉంటే ప్రజలు అంత ఎక్కువగా సీపీఆర్ చేసేందుకు ప్రయత్నిస్తారు. సీపీఆర్ ఎలా చేయాలో నేర్చుకునేందుకు ప్రత్యేకంగా కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి.
నిజానికి ఒక అపరిచిత వ్యక్తి నోటిలో నోరు పెట్టి శ్వాస అందించేందుకు ఎవరూ పెద్దగా ఇష్టపడరు. అదే సమయంలో సీపీఆర్ చేసేందుకు కూడా ప్రతీఒక్కరూ సిద్ధపడరు.
గుండెపోటు వచ్చిన మహిళల ఛాతిని తాకేందుకు కొందరు మగవాళ్లు ఇష్టపడలేదని 2017లో అమెరికన్ హార్ట్ అసోషియేషన్ నిర్వహించిన సైంటిఫిక్ సెషన్‌లో వెల్లడైంది.
ఆండ్రే బ్లేవర్ 20వేల గుండెపోటు కేసులను పరిశీలించారు. ఇందులో 45శాతం మంది మగవారికి సకాలంలో సీపీఆర్ అందింది. అంటే బహిరంగ ప్రదేశాల్లో పక్కనే ఉన్న ఎవరో ఒకరు వారికి సీపీఆర్ చేశారు.
కానీ మహిళల విషయంలో ఈ శాతం తక్కువగా ఉంది. 35శాతం మంది మహిళలకే సీపీఆర్ అందింది. అంటే మగవారితో పోలిస్తే మహిళలకు సీపీఆర్ చేసేందుకు అపరిచిత వ్యక్తులు ముందుకు రాలేదు.

ఫొటో సోర్స్, iStock
అపోహ 4: గుండె కొట్టుకోవడం పూర్తిగా ఆగిపోయిన తర్వాతే కరెంట్ షాక్ పెట్టాలి!
ఇదొక పెద్ద అపోహ. నిజానికి అభివృద్ధి చెందిన దేశాల్లో డీఫిబ్రిలేటర్స్ (గుండెకు కరెంట్ షాక్ పెట్టే పరికరాలు) రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు లాంటి ప్రదేశాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచుతారు.
ఈ ఎలక్ట్రిక్ షాక్ వల్ల గుండెపోటు వచ్చిన వ్యక్తికి ఎంత ప్రయోజనం కలుగుతుందో మీరు తెలుసుకోవాల్సిన పనిలేదు.
రోగికి ఎలక్ట్రిక్ షాక్ అవసరమా కాదా అన్న విషయాన్ని కూడా డీఫిబ్రిలేటరే అంచనా వేసుకుంటుంది. అవసరం లేకపోతే షాక్ ట్రీట్‌మెంట్ ఇవ్వదు.
కేవలం సీపీఆర్ ఒక్కటే కాకుండా డీఫిబ్రిలేటర్ ఉపయోగిస్తే రోగి బతికే అవకాశాలు రెట్టింపు అవుతాయని అమెరికాలో చేసిన ఒక పరిశోధనలో తేలింది.
2017లో వార్విక్ మెడికల్ స్కూల్‌కి చెందిన క్రిస్టోఫర్ స్మిత్ దీనిపై పరిశోధన చేశారు.
డీఫిబ్రిలేటర్ అంటే ఏమిటో.. అవి ఎక్కడ ఉంటాయో.. వాటిని ఎలా ఉపయోగించాలో చాలా మంది ప్రజలకు తెలియనే తెలియదని ఆయన అధ్యయనంలో తేలింది.
వాటిని ఉపయోగిస్తే మంచి కంటే చెడు ఎక్కువగా జరుగుతుందేమో అన్న భయం వారిలో కనిపించింది.

ఫొటో సోర్స్, Getty Images
అపోహ 5: ముక్కు నుంచి రక్తం కారుతుంటే తల వెనక్కివాల్చాలి!
ఇది చాలా పాత సలహా. కానీ అలా చేస్తే ఒక వ్యక్తి తన రక్తాన్ని తనే మింగేసే ప్రమాదం ఉంది. అంతేకాదు.. ఒక్కోసారి శ్వాస తీసుకోవడం కూడా కష్టం కావొచ్చు.
మృదువుగా ఉన్న ముక్కు ముందు భాగాన్ని నొక్కుతూ తలను ముందుకు వంచడం దీనికి ఒక మంచి మార్గంగా చెప్పుకోవచ్చు.
అరగంట తర్వాత కూడా రక్తం కారడం ఆగకపోతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
గమనిక:
ఈ కథనంలో చెప్పిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్యం కాదు. వైద్యుడి సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఈ కథనంలోని సమాచారం ఆధారంగా ప్రయత్నిస్తే ఎవరికైనా ఏదైనా అనుకోని ఘటన జరిగితే దానికి బీబీసీ బాధ్యత వహించదు. ఈ కథనంలో ఇచ్చిన ఇతర వెబ్‌సైట్ల లింకుల్లోని సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు. మీ ఆరోగ్యం విషయంలో ఏవైనా సందేహాలుంటే తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించండి.
ఇవి కూడా చదవండి:
- హైపర్సోనిక్ ప్యాసింజర్ విమానాన్ని తయారు చేస్తున్న చైనా. ఎందుకు?
- గుజరాత్లో అరుదైన శిలాజాలు కనుగొన్న తెలుగు ప్రొఫెసర్
- కాఫీ ఆరోగ్యానికి మంచిదా? కాదా?
- రోజుకు 200 సెల్ఫీలు తీసుకుంటే ఏమవుతుంది?
- ఒక్క పఫ్ అని మొదలెడతారు.. తర్వాత బుక్కైపోతారు
- అధ్యయనం: ‘కోపం వస్తే కోప్పడండి.. నవ్వొస్తే నవ్వండి.. ఏదీ దాచుకోవద్దు’
- అధ్యయనం: ‘గర్భిణులు ఈ మాత్రలు వాడితే.. పుట్టబోయే పిల్లలకు పిల్లలు పుట్టరు..!’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








