అధ్యయనం: ‘ఒత్తిడికి గురైతే ఒళ్లు పెరుగుతుంది’ జాగ్రత్త!!

ఫొటో సోర్స్, iStock
- రచయిత, డాక్టర్ మైఖేల్ మోస్లే
- హోదా, బీబీసీ
మనం స్థూలకాయులుగా ఎలా అవుతామో మనందరికీ తెలుసు. మనం శక్తి రూపంలో ఖర్చు చేసే దానికన్నా ఎక్కువ కెలోరీలను తీసుకుంటే స్థూలకాయం వస్తుంది.
ఇది నిజమే అయినా, మరో ముఖ్యమైన ప్రశ్నకు ఇది సమాధానం ఇవ్వదు - ఇంతకూ మనం ఎందుకు ఎక్కువ తింటాం?
తిన్న కొద్ది సేపటికే ఎందుకు తిన్నాననే బాధ కలుగుతుందని తెలిసినా, ఎందుకు మనం కేక్ ముక్కనో, చాకలేట్ బార్‌నో తినాలనే కోరికను ఆపుకోలేం?
అది కేవలం దురాశా లేక దాని వెనకాల ఏదైనా కారణముందా?
తిండి విషయంలో స్వయం నియంత్రణ చాలా ముఖ్యమే అయినా, స్థూలకాయంలో ఒత్తిడి కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తుందనడానికి ఇటీవల చాలా రుజువులు కనిపిస్తున్నాయి.
నిరంతర ఒత్తిడి మన నిద్రను, బ్లడ్ షుగర్ లెవల్స్‌ను దెబ్బతీస్తుంది. దీని వల్ల ఆకలి పెరిగి, దాన్ని తీర్చుకోవడానికి తినడం ఎక్కువవుతుంది.
దాని వల్ల నిద్ర మరింత పాడై, అది మరింత ఒత్తిడికి దారి తీస్తుంది. దాని వల్ల బ్లడ్ షుగర్స్ మరింత పెరుగుతాయి. ఇది కేవలం బాడీ ఫ్యాట్ పెరగడానికే కాకుండా టైప్-2 మధుమేహ వ్యాధికి కూడా దారి తీస్తుంది.
దీనిపై 'ట్రస్ట్ మీ, ఐయామ్ ఎ డాక్టర్' టీమ్ సభ్యుడైన డాక్టర్ గైల్స్ ఇయో, లీడ్స్ యూనివర్సిటీ సైంటిస్టులతో కలిసి ఒక పరిశోధన నిర్వహించారు. దానిలో ఆయన తనపైనే 'మాస్ట్రిచ్ స్ట్రెస్ టెస్ట్' అనే పరీక్షలు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
లీడ్స్ శాస్త్రవేత్తలు గైల్స్‌ను ఒక కంప్యూటర్ ఎదురుగా కూర్చోబెట్టి, 2,043 అనే సంఖ్య నుంచి 17 అనే సంఖ్యను వేగంగా తీసేయాలని చెప్పారు. అయితే గైల్స్ లాంటి డాక్టర్‌కు అది కష్టం కావడం వల్ల ఆయన తప్పులు చేస్తూ పోయారు.
ఆ తర్వాత లీడ్స్ సైంటిస్టులు గైల్స్ చేతిని కొద్ది సేపు చన్నీళ్లలో పెట్టమన్నారు. ఈ పరీక్షల తర్వాత లీడ్స్ టీమ్ గైల్స్ రక్తంలోని షుగర్ లెవెల్స్ పరీక్షించింది.
గైల్స్ లాంటి ఆరోగ్యవంతుల్లో ఏదైనా ఆహారం తీసుకున్న కొద్దిసేపటికే షుగర్ లెవెల్స్ సాధారణ స్థితికి చేరుకుంటాయి.
కానీ గైల్స్‌ను ఒత్తిడికి గురి చేసిన రోజున అతని షుగర్ లెవెల్స్ సాధారణ స్థితికి చేరుకోవడానికి మూడు గంటల సమయం - ఒత్తిడి లేని సాధారణ రోజున పట్టే సమయం కన్నా ఆరురెట్లు ఎక్కువ సమయం తీసుకున్నట్లు తేలింది.
దీనికి కారణం మనిషి ఒత్తిడికి గురైనప్పుడు వాళ్ల శరీరం 'ఫైట్ లేదా ఫ్లైట్ ' మోడ్‌లోకి వెళుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
అంటే శరీరం తనపై ఎవరో దండెత్తుతున్నారని భావించి కండరాలకు శక్తినివ్వడానికి రక్తంలోకి గ్లూకోజ్ విడుదల చేస్తుంది.
అయితే ప్రమాదం తప్పించుకోవడానికి మీకు ఆ శక్తి అవసరం లేకుంటే, రక్తంలోని షుగర్ లెవెల్స్‌ను సాధారణ స్థితికి తెచ్చేందుకు పాంక్రియాజ్ ఆ ఇన్సులిన్‌ను తిరిగి బయటకు పంప్ చేస్తుంది.
ఇలా ఇన్సులిన్ పెరిగి, షుగర్ లెవల్స్ తగ్గే క్రమంలో మనిషికి ఆకలి ఎక్కువ అవుతుంది. అందుకే ఒత్తిడికి గురైనప్పుడు చక్కెరతో కూడిన కార్బొహైడ్రేట్ల కోసం తపిస్తారు.
రాత్రిళ్లు సరిగా నిద్ర పట్టనప్పుడు జరిగేది కూడా అదే.
ఇటీవల లండన్‌కు చెందిన కింగ్స్ కాలేజి నిర్వహించిన పరిశోధనల్లో సరిగా నిద్రపోని వ్యక్తులు మామూలు వాళ్లకన్నా రోజుకు 385 కిలో కెలోరీలు ఎక్కువ తీసుకుంటారని తేలింది. ఇది ఒక పెద్ద కేక్ ముక్కతో సమానం.
పిల్లలు కూడా తగినంత నిద్ర లేకపోతే ఏదో ఒకటి నములుతుంటారు. 3-4 ఏళ్ల మధ్య వయసు కలిగిన పిల్లలను నిద్రకు దూరం చేస్తే వాళ్లు ఆ మరుసటి రోజు సాధారణంకన్నా 20 శాతం ఎక్కువ కెలోరీలు తీసుకున్నట్లు తేలింది.
మరి రోజువారీ ఒత్తిడిని జయించడం ఎలా?

బ్రీతింగ్ టెక్నిక్
దీనికి నేను ఎన్‌హెచ్‌ఎస్ సూచించిన బ్రీతింగ్ టెక్నిక్‌ను సిఫార్సు చేస్తాను. దీనిని మీ రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా చేసుకుంటే వాని వల్ల మంచి ఫలితం ఉంటుంది.
దీనిని మీరు కూర్చొని, నిలుచుని, పడుకుని - ఎలాగైనా చేయవచ్చు.
- మొదట ముక్కు ద్వారా వీలైనంత బలంగా శ్వాస తీసుకోండి. ఊపిరి బిగబట్టి, ఐదు వరకు లెక్క పెట్టండి.
- ఆ తర్వాత నెమ్మదిగా నోటి ద్వారా శ్వాస వదిలిపెట్టండి.
- ఇలా క్రమం తప్పకుండా ముక్కు ద్వారా గాలి పీలుస్తూ, నోటి ద్వారా వదిలిపెట్టడం చేయండి.
- ఈ ఎక్సర్‌సైజ్ 3 నుంచి 5 నిమిషాల పాటు చేయండి.

స్థూలకాయం రాకుండా ఉండడానికి నేనిచ్చే సలహా రాత్రిళ్లు బాగా నిద్రపొండి.
అలాగే ఒత్తిడిని దూరం చేయడానికి ఎక్సర్‌సైజులు, గార్డెనింగ్, మైండ్‌ఫుల్‌నెస్, యోగలాంటివి చేయండి.
వీటిలో మైండ్‌ఫుల్‌నెస్ వల్ల చాలా మేలు జరుగుతుందని నా పరిశీలనలో తేలింది.
మీ విషయంలో ఏది బాగా పని చేస్తుందో పరీక్షించి దానిని అనుసరించండి.
ఇవి కూడా చదవండి:
- కూల్‌డ్రింక్స్ తాగితే కొవ్వు పెరుగుతుందా?
- హలో.. మిమ్మల్నే.. వినిపిస్తోందా? లేదంటే వెంటనే పరీక్షించుకోవాలి
- పుట్టగొడుగులు తింటే మెదడు ‘శుభ్రం’!
- అధ్యయనం: ‘కోపం వస్తే కోప్పడండి.. నవ్వొస్తే నవ్వండి.. ఏదీ దాచుకోవద్దు’
- అనుమానం లేదు.. ఆడవాళ్లే శక్తిమంతులు!
- బంగ్లాదేశ్ యుద్ధంలో 'రా' చీఫ్ రామేశ్వర్నాథ్దే కీలక పాత్ర!
- ఒక్క పఫ్ అని మొదలెడతారు.. తర్వాత బుక్కైపోతారు
- జోల పాటలు, లాలి పాటలతో తల్లికి కూడా లాభమే!
- అమ్మతనంపై విమర్శలు ఆగేదెప్పుడు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








