కూల్‌డ్రింక్స్ తాగితే ఊబకాయం వస్తుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డాక్టర్ మైఖెల్
- హోదా, బీబీసీ
తియ్యటి పానియాల్లో కేలరీలు అధిక స్థాయిలో ఉంటాయన్న విషయం తెలిసిందే. మనం తాగే సాధారణ కూల్ డ్రింక్‌లో ఏడు చెంచాల చక్కెరకు సమానమైన తీపి ఉంటుంది. అయితే మనల్ని ఊబకాయుల్ని చేస్తుంది ఆ పానియాల్లోని తీపా లేక గ్యాసా?
పాలస్తీనా పరిధిలోని బర్జాయిట్ యూనివర్సిటీ ఇటీవల ఈ అంశంపై పరిశోధనలు జరిపింది.
ఈ పరిశోధనలో కొన్ని ఎలుకలను తీసుకొని వాటిలో కొన్నింటికి కార్బొనేటెడ్ డ్రింక్స్ ( గ్యాస్ ఉండే తియ్యని పానీయాలు), మరికొన్నింటికి సాధారణ తియ్యని పానీయాలు ఇచ్చి పరీక్షించారు.
కార్బొనేటెడ్ డ్రింక్స్ తాగిన ఎలుకలు 'ఫ్లాట్ డ్రింక్స్' ( గ్యాస్ లేని పానీయాలు) తాగిన ఎలుకలకంటే ఎక్కువ బరువు పెరిగినట్లు వారి పరిశోధనలో తేలింది.
అంతేకాదు కార్బొనేటెడ్ డ్రింక్స్ తాగిన ఎలుకల్లో ఆకలిని ప్రేరేపించే గ్రెలిన్ అనే హార్మోన్ అధికస్థాయిలో ఉన్నట్లు కనుగొన్నారు.
'చీజ్ సాండ్‌విచ్' పరీక్ష
ఇదే తరహా పరిశోధనను బీబీసీ ‘ట్రస్ట్ మీ ఐయాం ఏ డాక్టర్’ బృందం మనుషులపై చేసింది.
బర్మింగ్‌హామ్‌లోని ఆస్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జేమ్స్ బ్రౌన్ ఈ పరిశోధనలకు నేతృత్వం వహించారు.
పరిశోధనలో భాగంగా ఆయన స్వచ్ఛందంగా ప్రయోగానికి ముందుకువచ్చిన వాళ్లను బృందాలుగా విభజించారు.
ఫలితాలపై ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో ప్రయోగం గురించి వాళ్లకు చెప్పలేదు.
10 గంటలపాటు వారికి ఏలాంటి ఆహారం ఇవ్వకుండా ల్యాబ్‌కు తీసుకొచ్చారు. అక్కడ వాళ్లందరికి మొదటగా కేలరీలు తక్కువగా ఉండే సాండ్‌విచ్‌లు ఇచ్చారు. దాని వల్ల అందరిలోనూ ఒకేస్థాయిలో ఆకలిని ప్రేరేపించే గ్రెలిన్ ఉత్పత్తి అవుతుందనేది దీని వెనుక ఉన్న ఆలోచన. అది తిన్న గంట తర్వాత కొందరికి కార్బొనేటెడ్ డ్రింక్స్, మరికొందరికి నార్మల్ డ్రింక్స్ ఇచ్చారు.
10 నిమిషాల తర్వాత జేమ్స్ అందరి రక్తనమూనాలను సేకరించారు. వారిలో ఉన్న గ్రెలిన్ స్థాయిలను పరిశీలించారు.
కొన్నివారాలపాటు మూడుసార్లు ఇదే తరహాలో వారిపై పరిశోధనలు జరిపారు. అయితే ప్రయోగాలకు హాజరైన వారికి ఒకరకమైన సాండ్‌విచ్ ఇచ్చినా డ్రింక్స్ మాత్రం ప్రతిసారి మార్చారు.
ఒకే వ్యక్తికి భిన్నరకాల డ్రింక్స్ అందించడంలో ముఖ్యఉద్దేశం వాటి ప్రభావం ఎలా ఉందో పరిక్షించడానికే.

ఫొటో సోర్స్, Getty Images
'గ్రెలిన్'దే కీలక పాత్ర
సాధారణ డ్రింక్స్ కంటే కార్బొనేటెడ్ డ్రింక్స్ తాగిన వారిలో గ్రెలిన్ స్థాయి 50 శాతం ఎక్కువగా ఉందని పరిశోధనలో తేలింది.
అంటే సాధారణ పానీయాల కంటే గ్యాస్ ఉండే పానీయాలు (కార్బొనేటెడ్ డ్రింక్స్) ఆకలిని ఎక్కువగా ప్రేరేపిస్తాయని దాని వల్లే ఆ డ్రింక్స్ తాగిన వాళ్లు లావెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.
'కార్బొనేటెడ్ డ్రింక్స్, సాధారణ డ్రింక్స్‌లను రెండు గ్రూపులకు ఇచ్చి ఆ తర్వాత వారు ఎంత తిన్నారో పరిశీలించాం. కార్బొనేటెడ్ డ్రింక్స్ తాగిన వాళ్లు సాధారణ డ్రింక్స్ తాగిన వాళ్ల కంటే 120 కేలరీలు ఎక్కువ తింటున్నట్లు గ్రహించాం' అని జేమ్స్ చెప్పారు.
గ్యాస్ కారణమా?
కూల్ డ్రింక్స్‌లో ఉన్న గ్యాస్ వల్లే లావెక్కే అవకాశం ఉందా అంటే అదే ప్రధానకారణమని చెప్పలేమని జేమ్స్ అన్నారు.
'కార్బొనేటెడ్ డ్రింక్స్‌లో కార్బన్ డై ఆక్సైడ్ ఉంటుంది. దాన్ని తాగినప్పుడు జీర్ణాశయంలో కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతుంది. అక్కడ రసాయన చర్యలు జరిగి ఆకలిని ప్రేరేపించే గ్రెలిన్ స్థాయిని అది పెంచుతుంది. మరో కారణం, కడుపులో గ్యాస్ చేరడం వల్ల అది ఉబ్బిపోతుంది. దీంతో అందులోని కణాలు గ్రెలిన్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది' అని జేమ్స్ తెలిపారు.
కార్బొనేటెడ్, నాన్ కార్బొనేటెడ్ డ్రింక్స్‌లలో ఏవి మంచివి, వేటిని తాగాలి అని అడిగితే రెండూ మంచివి కాదు అని జేమ్స్ చెబుతున్నారు. మంచినీళ్లే ఆరోగ్యానికి మంచిదని సలహా ఇస్తున్నారు.
మా ఇతర కథనాలు:
- చైనాలో నూడుల్స్ అమ్మకాలు ఎందుకు తగ్గాయ్?
- ఇరానీ చాయ్‌తో సమోసా ఎందుకు తింటారంటే..
- దుబాయ్: మీరు చూడని కోణాలు.. కొత్త మంత్రిత్వ శాఖలు
- 'మా ఆయన పోర్న్ చూస్తారు.. నన్నూ అలాగే చేయమంటారు’
- మీ పిల్లలు స్మార్ట్‌వాచీలు వాడుతున్నారా? కాస్త జాగ్రత్త!
- ‘బ్లూ వేల్’ బూచి నిజమేనా?
- ‘వన్నాక్రై సైబర్ దాడి చేసింది ఉత్తర కొరియానే’
- బ్లూ స్క్రీన్ వచ్చిందా! మరేం భయం లేదు!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








