వన్నాక్రై సైబర్ దాడి: ఉత్తర కొరియానే చేసిందని అమెరికా ఆరోపణ

ఫొటో సోర్స్, EPA
వన్నాక్రై.. కంప్యూటర్ల ప్రపంచంలో సంచలనం. ప్రపంచ దేశాలను వణికించిన ఉపద్రవం.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 150 దేశాలు దీని బారిన పడ్డాయి. పదులు కాదు వందలు కాదు వేల కోట్ల రూపాయలు హరించుకు పోయాయి.
ఆసుపత్రులు, బ్యాంకులు, కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు ఇలా దేనిని ఈ మాల్‌వేర్ వదలలేదు.
ఇంతకు దీని వెనుక ఉన్నది ఎవరు?

ఫొటో సోర్స్, Reuters
ఉత్తర కొరియానే?
ఇంతటి భారీ దాడి వెనుక ఉత్తర కొరియా హస్తం ఉందని తాజాగా అమెరికా ఆరోపించింది.
ఇందుకు తమ వద్ద తగిన సాక్ష్యాలు ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు అమెరికా హోంశాఖ భద్రతా సలహాదారు థామస్ బాసెర్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్ వేదికగా ఉత్తర కొరియాపై ఆరోపణలు గుప్పించారు.
"వన్నాక్రై బాధ్యత ముమ్మాటికి ఉత్తర కొరియాదే. దాదాపు దశాబ్ద కాలంగా ఆ దేశం చెడు మార్గంలో నడుస్తోంది. మాల్‌వేర్ దాడితో ఇది పతాక స్థాయికి చేరుకుంది" అని థామస్ తన వ్యాసంలో పేర్కొన్నారు.
ఇందుకు సంబంధించి త్వరలో వైట్ హౌస్ అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, EPA
గతంలో సోనీ పిక్చర్స్
2014లో సోనీ పిక్చర్స్ లక్ష్యంగా ఉత్తర కొరియా సైబర్ దాడికి పాల్పడినట్లు అమెరికా ఆరోపించింది.
ఒక సినిమాలో ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ పాత్రను చంపినట్లుగా సోనీ చూపించింది.
ఆ తరువాత ఆ సంస్థకు చెందిన అనేక దస్త్రాలు, సినిమాలు, ప్రైవేటు ఈ-మెయిళ్ల వివరాలు లీకయ్యాయి.
కానీ ఈ ఆరోపణలను ఉత్తర కొరియా ఖండించింది.
అయితే తాజాగా వన్నాక్రై గురించి అమెరికా చేసిన ఆరోపణలపై ఉత్తర కొరియా ఇంకా స్పందించ లేదు.

ఫొటో సోర్స్, SAEED KHAN/gettyimages
చరిత్రలో తొలిసారి
వన్నాక్రై వంటి భారీ మాల్‌వేర్ దాడి ఇంతకు ముందు ఎన్నడూ జరగలేదు.
ఈ ఏడాది మేలో విండోస్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా పని చేసే కంప్యూటర్ల వ్యవస్థలపై వన్నాక్రై విరుచుకు పడింది.
అనేక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన విలువైన సమాచారాన్ని హ్యాకర్లు తస్కరించారు.
ఆ సమాచారాన్ని తిరిగి ఇవ్వాలంటే భారీ మొత్తంలో బిట్‌కాయిన్లు చెల్లించాలని డిమాండు చేశారు.

ఫొటో సోర్స్, kcna/afp
భారత్‌లోనూ
150 దేశాల్లో దాదాపు 3,00,000 కంప్యూటర్లు వన్నాక్రై బారిన పడినట్లు అంచనా. ఆయా దేశాలు వేల కోట్ల రూపాయలు నష్ట పోయాయి.
బ్రిటన్‌లో నేషనల్ హెల్త్ సర్వీస్ వ్యవస్థపై ఈ ప్రభావం తీవ్రంగా పడింది.
దేశవ్యాప్తంగా ఎన్నో ఆసుపత్రుల్లో సేవలు నిలిచి పోయాయి. ఆపరేషన్లు ఆగి పోయాయి.
రష్యా తపాల సేవలు కూడా గణనీయ ప్రభావానికి లోనయ్యాయి.
భారత్‌లో కూడా కొన్ని ప్రభుత్వ వెబ్‌సైట్లపై వన్నాక్రై స్వల్ప ప్రభావాన్ని చూపింది.
మా ఇతర కథనాలు:
- ట్రంప్ యుద్ధ ప్రణాళిక కిమ్ చేతికి చిక్కినట్టేనా?
- ఇంటర్నెట్ ఓటింగ్.. తెలుసుకోవాల్సిన విషయాలు
- బ్లూ స్క్రీన్ వచ్చిందా! మరేం భయం లేదు!
- నెట్ సరే.. న్యూట్రాలిటీ సంగతేంటి?
- ‘విదేశాలకు వెళ్లాలంటే వీసా చాలు.. ఉత్తర కొరియా వెళ్లాలంటే ధైర్యం కూడా కావాలి’
- తెలుగు సభలు తేల్చిందేమిటి?
- తెలుగులో వాడుక భాషకు పట్టం గట్టిందెవరు?
- ఇలాగైతే.. లండన్‌లో తెలుగోళ్లకు ఇల్లు కష్టమే!
- ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు ప్రకటించే ఈమె ఎవరో తెలుసా!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








