నెట్ సరే.. న్యూట్రాలిటీ సంగతేంటి?

ఫొటో సోర్స్, MANJUNATH KIRAN/gettyimages
- రచయిత, వరికూటి రామకృష్ణ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇంటర్నెట్.. 20వ శతాబ్దపు అతి గొప్ప ఆవిష్కరణల్లో ఒకటి.
నేడు ప్రపంచమంతా ఒక కుగ్రామంగా మారిందంటే అందుకు కారణం ఇంటర్నెట్.
ఆధునిక యుగంలో సమాచార, సాంకేతిక (ఐటీ) ఫలాలు అందరికీ అందుతున్నాయంటే అదంతా ఇంటర్నెట్ చలవే.
వరల్డ్ వైడ్ వెబ్‌ను సృష్టించిన టిమ్ బెర్నర్స్ లీ ఇలాంటి అభివృద్ధినే ఆకాంక్షించారు. ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో ఉండేలా చూశారు.
అయితే నేడు ఈ సమానత్వానికి భంగం కలుగుతోందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
నెట్ న్యూట్రాలిటీకి వ్యతిరేకంగా అమెరికాలో చోటు చేసుకున్న తాజా పరిణామం ఇందుకు కారణం.
నెట్ న్యూట్రాలిటీకి అనుకూలంగా 2015లో ఒబామా పాలనలో తీసుకున్న నిర్ణయాన్ని ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సీసీ) ఎత్తివేసింది.

ఫొటో సోర్స్, Kimberly White/getty images
ఎంతో ఉపయోగం
ప్రాధాన్యత ఆధారంగా ఇంటర్నెట్ వేగాన్ని, కంటెంట్‌ను నియంత్రించే వెసులుబాటును ఇంటర్నెట్ ప్రొవైడర్లు, టెలికాం సంస్థలకు కల్పిస్తూ ఎఫ్‌సీసీ తీసుకున్న నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది.
తాము తీసుకున్న ఈ నిర్ణయం మరిన్ని సృజనాత్మకత ఆలోచనలకు దారి తీస్తుందని పత్రికా ప్రకటనలో ఎఫ్‌సీసీ తెలిపింది.
ఈ నేపథ్యంలో మరోసారి నెట్ న్యూట్రాలిటీ తెరపైకి వచ్చింది.
మనదేశంలోనూ ఇటీవల దీనిపై పెద్ద చర్చ జరిగింది.

ఫొటో సోర్స్, NOAH SEELAM/getty images
అందరికీ అందుబాటులో
ఇంటర్నెట్ నేడు ఒక ప్రాథమిక అవసరం. అందరికీ సమానంగా ఈ సేవలు అందుబాటులో ఉండాలని ఎంతో మంది నిపుణులు కోరుతున్నారు.
ఇదే అభిప్రాయంతో భారతీయ టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) నెట్ న్యూట్రాలిటీకి అనుకూలంగా ఓటు వేసింది.
కొందరికి కొన్ని రకాల సేవలను దూరం చేస్తూ మరికొందరికి అధిక ప్రాధాన్యం ఇవ్వడమనేది నెట్ న్యూట్రాలిటీ స్ఫూర్తికి విరుద్ధమని ట్రాయ్ వ్యాఖ్యానించింది.
కంటెంట్ వినియోగంలో కానీ, డేటా వేగంలో కానీ వివక్షకు చోటు ఇవ్వకూడదని ఇటీవల ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ట్రాయ్ ప్రతిపాదించింది.
ట్రాయ్ ప్రతిపాదనలు కనుక అమల్లోకి వస్తే నెట్ న్యూట్రాలిటీ విషయంలో బలమైన చట్టం తెచ్చిన దేశంగా భారత్ నిలవనుంది.
నెట్ న్యూట్రాలిటీ అంటే?
వినియోగదార్లందరికీ ఇంటర్నెట్ సేవలు సమానంగా అందుబాటులో ఉండాలి.
అంటే అన్ని వెబ్‌సైట్‌లను అందరూ ఎటువంటి తేడా లేకుండా వాడుకోగలగాలి. అన్ని వెబ్‌సైట్‌లు లోడ్ అయ్యే వేగం ఒకే రకంగా ఉండాలి.
ఇందులో ఎటువంటి వివక్ష ఉండకూడదు. దీన్నే ఇంటర్నెట్ వినియోగంలో సమానత్వం (నెట్ న్యూట్రాలిటీ) అంటారు.

ఫొటో సోర్స్, INDRANIL MUKHERJEE/getty images
మనకేంటీ?
ఉదాహరణకు ఒక టెలికాం సంస్థ ఉంది అనుకుందాం.
ఈ సంస్థ అమెజాన్‌తో ఒప్పందం కుదుర్చుకుందని భావిద్దాం.
అపుడు ఈ సంస్థ వినియోగదార్లు అమెజాన్ వెబ్‌సైట్‌ను ఉచితంగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి సంస్థల వెబ్‌సైట్‌లకు డబ్బులు చెల్లించాల్సి రావొచ్చు.
ఇక్కడ రెండు రకాల ప్రభావాలు ఉంటాయి.
ఒకటి.. వినియోగదారులు డబ్బు చెల్లించే స్థితిలో లేకుంటే వారు అన్ని వెబ్‌సైట్లను వాడుకోలేరు. అంటే ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి వాటిని వినియోగించుకునే వెసులు బాటు ఉండదు. తద్వారా కొన్ని సేవలను వారు కోల్పోతారు.
రెండు.. ఇక్కడ టెలికాం సంస్థ అమెజాన్‌కు ప్రాధాన్యం ఇచ్చింది. అంటే వినియోగదారులు ఈ వెబ్‌సైట్‌లోని వస్తువులను మాత్రమే కొనాలి. అందువల్ల ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటివి నష్ట పోవచ్చు.

ఫొటో సోర్స్, David Becker/getty images
వాటికి కూడా
ప్రస్తుతం వాట్సాప్, స్కైప్ వంటి వాటిని ఉచితంగా వాడుకుంటున్నాం. వీటిని వినియోగించుకునేందుకు అయ్యే డేటాకు మాత్రమే మనం డబ్బులు చెల్లిస్తున్నాం.
అయితే వీటి వల్ల తమ ఆదాయం పోతోందని అందువల్ల ఇటువంటి వంటి సేవలకు ఛార్జ్ చేస్తామని 2014లో ఎయిర్‌టెల్ ప్రకటించింది.
ఇంటర్నెట్ కాలింగ్‌కు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపింది.
ఎయిర్‌టెల్ జీరో పేరిట పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా కొన్ని రకాల అప్లికేషన్లను వినియోగదార్లు ఉచితంగా వాడుకోవచ్చు.
అయితే ఆ తరువాత వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో దీన్ని ఎయిర్‌టెల్ నిలిపి వేసింది.
ఫేస్‌బుక్ ఫ్రీ బేసిక్స్ కూడా ఇటువంటిదే. రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తో ఈ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.
కొన్ని అప్లికేషన్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపింది.
అప్పట్లో దీనిపై కూడా విమర్శలు వచ్చాయి. ఆ తరువాత ఫేస్‌బుక్ ఆ సేవలు ఆపేసింది.

ఫొటో సోర్స్, Facebook/Trai
ట్రాయ్ ముఖ్యమైన సిఫారసులు
- అన్ని రకాల అప్లికేషన్లు, కంటెంట్ అందరికీ అందుబాటులో ఉండాలి.
- ఇంటర్నెట్ ఆధారంగా అందించే సేవల్లో ఎటువంటి పక్షపాతం ఉండకూడదు.
- కంటెంట్‌ను వినియోగించుకోవడంలో ఎటువంటి వివక్ష ఉండరాదు.
- కొన్ని వెబ్‌సైట్లు వాడకుండా నిరోధించకూడదు.
- ప్రాధాన్యం ఆధారంగా ఇంటర్నెట్ వేగాన్ని తగ్గించకూడదు.
- నెట్ న్యూట్రాలిటీకి విరుద్ధంగా టెలికాం సంస్థలు ఎటువంటి ఒప్పందాలు చేసుకోకూడదు.
(ఆధారం: 28.11.2017న విడుదల చేసిన ట్రాయ్ నివేదిక)
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









