ప్రెస్ రివ్యూ: హైదరాబాద్‌పై ఢిల్లీ వాసుల సైబర్ దాడి

ఫొటో సోర్స్, Getty Images
సాక్షి: దేశ రాజధాని ఢిల్లీ సైబర్ నేరగాళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఆర్థిక అంశాలతో ముడిపడిన నేరాలు చేస్తూ నగర సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర నేరస్తుల్లో ఢిల్లీకి చెందిన వారే అత్యధికంగా ఉన్నారు. గడిచిన 46 నెలల్లో సైబర్ పోలీసులు అరెస్ట్ చేసిన ఇతర రాష్ట్రాల వారిలో దేశ రాజధానికి చెందిన వారే 44 శాతం మంది ఉన్నారు.
ఈ కాలంలో నగర నేర పరిశోధన విభాగం(సీసీఎస్) అధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు మొత్తం 333 మంది నిందితుల్ని అరెస్టు చేశారు.
వీరిలో తెలంగాణకు చెందిన వారు 109 మంది ఉండగా.. మిగిలిన 224 మందిలో ఢిల్లీ వారే 100 మంది ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
సైబర్ నేరాలకు సంబంధించి అరెస్టు అవుతున్న స్థానికుల్లో (తెలంగాణ, ఏపీ వారు) దాదాపు 99 శాతం ఫేస్‌బుక్, వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాలను వినియోగించి ఎదుటి వారిని ఇబ్బందులు పెట్టేవారే. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు సైతం ఈ తరహా కేసుల్లో అరెస్టు అయ్యారు.
ఆర్థిక సంబంధ సైబర్ నేరాల్లో 2016 జనవరి నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన ఇతర రాష్ట్రాల వారిలో ఢిల్లీ వాసులే ఎక్కువగా ఉన్నారు. వీరు ఇన్సూరెన్సులు, లాటరీలు, తక్కువ వడ్డీకి రుణాలు, వీసాల పేరు చెప్పి అందినకాడికి డబ్బు కాజేస్తున్నారు.
ఢిల్లీతోపాటు నోయిడా, గుర్గావ్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ సైబర్ నేరగాళ్లు ప్రత్యేకంగా కాల్ సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఇలాంటి నేరాల్లో సూత్రధారులుగా ఉంటున్న వారిలో నైజీరియన్లు ఎక్కువగా ఉంటున్నారు.
బ్యాంకు అధికారులమంటూ ఫోన్లు చేసి.. డెబిడ్/క్రెడిట్ కార్డులకు చెందిన వివరాలతో పాటు వన్ టైమ్ పాస్‌వర్డ్స్ (ఓటీపీ) సైతం సంగ్రహించి.. అందినకాడికి దండుకునే నేరగాళ్లలో 95 శాతం మంది జార్ఖండ్‌లోని జమ్‌తార ప్రాంతానికి చెందిన వారే.

ఫొటో సోర్స్, Telangana CMO
జ్యోతిబసు తర్వాత కేసీఆరే బాస్: కేటీఆర్
ఆంధ్రజ్యోతి: ‘‘భారత దేశ చరిత్రలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి జ్యోతిబసు. తెలంగాణ ప్రజల అభిమానం చూస్తుంటే జ్యోతిబసు రికార్డును తిరగరాసే దమ్మున్న వ్యక్తి కేసీఆరేనన్న విశ్వాసం కలుగుతోంది’’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.
కాంగ్రెస్ పాలనతో విసిగి వేసారిపోయిన ప్రజల కోసం అప్పట్లో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించగా.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్‌ఎస్‌ను కేసీఆర్ ప్రారంభించారని గుర్తు చేశారు.
తెలంగాణ ఉద్యమం జరిగిందే అస్తిత్వం కోసమని... అలాంటి చోట ఇంకా ఢిల్లీ నేతల మోచేతి నీళ్లు తాగుతున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు పుట్టగతులుండబోవని వ్యాఖ్యానించారు.
తెలంగాణ భవన్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. బీహార్ నుంచి విడిపోయిన జార్ఖండ్‌లో ఆర్జేడీ ఉనికి కోల్పోయినట్లు.. టీడీపీ కూడా కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
నన్ను చంపడానికి ప్రయత్నించండి.. నేనే గెలుస్తా : కమల్‌హాసన్
ఈనాడు: సామాజిక మాధ్యమాల్లో విస్తరిస్తోన్న ఒక వీడియోను చూసి నటుడు కమల్‌హాసన్ చలించారు. ఇటీవల ఆయన 'హిందూ తీవ్రవాదం'పై వ్యాఖ్యలు చేశారని ప్రచారం సాగిన నేపథ్యంలో ఇద్దరు చిన్నారులు కమల్ చిత్రంపై కత్తితో పొడుస్తున్నట్లు అందులో ఉంది. దీన్ని చూసిన కమల్ ట్వీట్లర్లో స్పందించారు. దీన్ని చూడటం కన్నా చిన్నారుల చేతిలో చావడం మేలని వ్యాఖ్యానించారు.
కమల్ చిత్రాన్ని పొడవండనే వ్యాఖ్యలు అందులో ఉండటం, పిల్లలు కత్తులతో అలాగే చేయడంతో కమల్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. 'ప్రకృతి నన్ను ఎలాగైనా చంపేస్తుంది. దానికంటే ముందు చంపడానికి ప్రయత్నించండి... అయినా నేనే గెలుస్తా' అని కమల్ ట్వీట్ చేశారు. ఈ విషయంలో ఆయనకు మద్దతుగా నటులు ఖుష్బూ, ప్రకాష్‌రాజ్ తదితర ప్రముఖులు నిలిచారు.

ఫొటో సోర్స్, facebook
హైదరాబాద్ హాయిగా ఉంది: మనీశ్ సిసోడియా
నమస్తే తెలంగాణ: వాయుకాలుష్యం కారణంగా ఢిల్లీలో ఆకాశాన్ని కూడా చూడలేకపోతున్నామని, హైదరాబాద్‌లో వాతావరణం బాగుందని, హాయిగా ఆకాశాన్ని చూడగలుగుతున్నామని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌సిసోడియా చెప్పారు.
బుధవారం గచ్చిబౌలిలోని టీ హబ్‌ను ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రకుమార్‌జైన్, ఇతర అధికారుల బృందంతో కలిసి సిసోడియా సందర్శించారు. అనంతరం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావుతో సమావేశమయ్యారు.
టీ హబ్‌తోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీరంగంలో సృజనాత్మక రీతిలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై సిసోడియా ఆసక్తి కనబరిచారు. ఢిల్లీలో ఇంక్యుబేటర్ ఏర్పాటుకు సహకరిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. రాజకీయాలలో టీఆర్‌ఎస్, ఆప్ కలిసి పనిచేసే విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందని సిసోడియా చెప్పారు. జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ముందుకు వెళ్తామన్నారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








