ప్రెస్ రివ్యూ: చంద్రబాబు కంటే ఆయన మనవడు దేవాన్ష్ ఆస్తి ఎక్కువ!

ఫొటో సోర్స్, tdp.ncbn.official/Facebook
చంద్రబాబు కంటే ఆయన మనవడే ఆస్తిపరుడు!
ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యుల నికర ఆస్తులు విలువ రూ.69.72 కోట్లు.
మంత్రి నారా లోకేశ్ తమ కుటుంబ ఆస్తులు, అప్పుల వివరాలను శుక్రవారం వెల్లడించారు.
చంద్రబాబు కుటుంబ పెట్టుబడుల కంపెనీ నిర్వాణ హోల్డింగ్స్ నికర ఆస్తుల విలువ రూ.5.36 కోట్లుగా పేర్కొన్నారు.
చంద్రబాబుతో పోల్చితే, ఆయన మనవడు దేవాన్ష్ పేరిట ఉన్న ఆస్తుల విలువే ఎక్కువగా ఉంది.
ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం లోకేశ్ వెల్లడించిన ఆస్తుల విలువ.
- హెరిటేజ్ మార్కెట్ విలువ రూ. 3700 కోట్లు, లాభం 66.8 కోట్లు
- కుటుంబంలోని బంగారం: 5.839 కిలోలు
- చంద్రబాబు ఆస్తి రూ. 8.17 కోట్లు, అప్పు రూ. 5.64 కోట్లు
- దేవాన్ష్ ఆస్తి రూ. 11.54 కోట్లు
- భువనేశ్వరి నికర ఆస్తి రూ. 25.41 కోట్లు
- లోకేశ్ నికర ఆస్తి రూ. 15.21 కోట్లు
- బ్రహ్మణి నికర ఆస్తులు రూ. 15 కోట్లు
మార్కెట్ విలువ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందని, అందుకే ఆయా ఆస్తులను కొనుగోలు చేసినప్పుడు ఉన్న అసలు విలువలను ప్రకటిస్తున్నామని లోకేశ్ తెలిపారు.

ఫొటో సోర్స్, janasenaparty/facebook
రంగా హత్య తప్పే: పవన్ కల్యాణ్
"వంగవీటి రంగాను హత్యచేయడం తప్పు. దీక్ష చేస్తున్న సమయంలో నిరాయుధుడుగా ఉన్న వ్యక్తిని చంపడం దారుణం. నిజంగా తప్పు చేసి ఉంటే శిక్షించడానికి చట్టాలున్నాయి. అప్పుడు అధికారంలో ఉంది తెలుగు దేశం పార్టీనే. ఈ సంఘటనకు ఏ సంబంధం లేని కుటుంబాలు కూడా రంగా హత్య సమయంలో ఇబ్బందిపడ్డాయి. విజయవాడ ఇంకా కులాల వ్యవస్థ నుంచి మారలేదు" అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారని సాక్షి ఓ కథనంలో పేర్కొంది.
ప్రపంచ రాజధానికి విజయవాడ సిద్ధంగా లేదని, కులాలకు మతాలకు అతీతంగా పార్టీలు ఉండాలని పవన్ కోరారు. అమరావతిలో కుల ఐక్యత ఎంతో అవసరమన్నారు.
తాను ఇకమీదట సినిమాలు వదిలి వేస్తున్నానని కూడా ఆయన ప్రకటించారు.

ఆధార్ అనుసంధానానికి మార్చి 31 గడువు
పాన్ నంబర్, బ్యాంకు ఖాతా, ప్రభుత్వ పథకాలు, ఇతర సేవలను ఆధార్‌తో అనుసంధానం చేసుకునే గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 31 వరకు ఉన్న గడువును 2018 మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టుగా ప్రకటించిందని నమస్తే తెలంగాణ పత్రిక పేర్కొంది.
ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆధార్ అనుసంధానం గడువును కేంద్రం ఇప్పటికే రెండుసార్లు పొడిగించింది.
అయితే, మొబైల్ నంబరును ఆధార్‌తో లింకు చేసుకునేందుకు ఉన్న గడువు మాత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 6 వరకు మాత్రమేనని, దానిని పొడిగించటం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం ఎదుట కేంద్రం ఇటీవల స్పష్టం చేసింది.

ఫొటో సోర్స్, Kalyan-Kanuganti/facebook
హీరోగా చిరు అల్లుడు!
మెగా ఫ్యామిలీ నుంచి మరో కథానాయకుడు పరిచయమవుతున్నారు. అతను మరెవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ భర్త కల్యాణ్.
గతంలో పవన్‌కల్యాణ్, రవితేజ, మహేశ్, ప్రభాస్, వరుణ్‌తేజ్ తదితరులకు శిక్షణ ఇచ్చిన వైజాగ్‌లోని సత్యానంద్ దగ్గరే కల్యాణ్ శిక్షణ తీసుకున్నారు.
కల్యాణ్‌తో సినిమా తీయడానికి నిర్మాత, వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి ముందుకొచ్చారు. జనవరిలో చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని ఆంధ్రజ్యోతి పత్రిక వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
వివాహేతర సంబంధాల కేసుల్లో శిక్ష పురుషులకేనా?
వివాహేతర సంబంధాల్లో కేవలం పురుషులనే శిక్షించి, మహిళలను విడిచిపెడుతున్నారంటూ దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.
ఇందుకు సంబంధించి ఐపీసీ సెక్షన్ 497ను సవాలు చేస్తూ భారత సంతతి వ్యక్తి జోసఫ్ షినే (40) ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
ఈ సెక్షన్ కింద వివాహేతర సంబంధాల కేసుల్లో పురుషునికి శిక్ష విధిస్తారు. మహిళకు ఎలాంటి శిక్షా ఉండదు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, దీన్ని కొట్టివేయాలని పిటిషనర్ కోరినట్టు ఈనాడు పత్రిక ఓ కథనంలో పేర్కొంది.
ఈ వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్ర, న్యాయమూర్తులు జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది.
మా ఇతర కథనాలు:
- గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేదెవరు? ఓడేదెవరు?
- '18 ఏళ్ల లోపు వయసున్న భార్యతో సెక్స్ అత్యాచారమే'
- సినిమాహాళ్లలో జాతీయగీతం ఎందుకంటున్న సినీ ప్రేమికులు
- 'నా జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు నాకు లేదా?'
- క్విజ్: డాక్టర్ అంబేడ్కర్ గురించి మీకెంత తెలుసు?
- వందేళ్ల ఫిన్లాండ్ గురించి మీరు తెలుసుకోవాల్సిన ఏడు అంశాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








