సూర్యకాంతం: గుండమ్మ కథను రీమేక్ చేస్తే.. ఎన్టీఆర్, ఏఎన్నార్ పాత్రలకు నటులు ఉన్నారు కానీ గుండమ్మ పాత్ర పోషించేది ఎవరు?

ఫొటో సోర్స్, Wikipedia
- రచయిత, ల.లి.త.
- హోదా, బీబీసీ కోసం
కాకినాడ దగ్గరున్న వెంకట కృష్ణరాయపురంలో పొన్నాడ అనంతరామయ్య, వెంకటరత్నమ్మ దంపతులకు అక్టోబర్ 28, 1924 న పుట్టిన ఆఖరి ఆడపిల్ల సూర్యకాంతం.
విశాలమైన పసుప్పచ్చటి ఆ పువ్వులాగానే నిండుగానూ తెరనిండుగానూ కళకళలాడుతూ బ్రతికింది మన తెలుగు నటి, నిన్నమొన్నటి తరాలవరకూ పరిచయం అక్కర్లేని మన సూర్యకాంతం.
నశించిన ఒక తెలుగు గయ్యాళి భాషాసంస్కృతులకు ప్రతీక ఆమె. ఓ ఇరవై ఏళ్ళ క్రితం కూడా ఎవరినైనా ఉద్దేశిస్తూ "అమ్మో ఆవిడా? గయ్యాళి బాబోయ్!" అనటానికి బదులు, "అమ్మో ఆవిడా? సూర్యకాంతం!" అనేవారు జనం.
అంతలాగా గయ్యాళితనాన్ని ఆవాహన చేసుకుంది సూర్యకాంతం.
వాడుక తెలుగుభాష ఎంతగానో మారిపోయిన ఈ రోజుల్లో గయ్యాళితనం ఉన్నాకూడా దానికి చక్కటి భాషనిచ్చి నిలబెట్టే తెలుగుతెర వీరనారులు ఇంకెవరూ లేరు.
ఆ సరదా సరదా తిట్లూ, ముక్కూ మూతీ విరవటాలూ, చేతులు విసరటాలూ, సర్వాంగాలతోనూ హాస్యాన్ని ముద్దుగా అభినయించటాలూ లేనేలేవు.

ఫొటో సోర్స్, NFAI
'గుండమ్మ కథ' లో సూర్యకాంతం పాత్రను సినిమాలో పరిచయంచేసే సీను ఎలా ఉండాలా అని స్క్రీన్‌ప్లే చర్చల్లో అందరూ ఆలోచిస్తుంటే నిర్మాత చక్రపాణి "సూర్యకాంతం ఉంటే చాలు. ఆమె పాత్ర ఎలాంటిదో ప్రేక్షకులకు తెలిసిపోతుంది. ఆవిడ పాత్ర ఇలా ఉంటుందని వేరే సీన్లతో నిరూపించే అవసరం లేదు'' అన్నార్ట.
అంటే అంతలాగా ఆమెను తెలుగుతెర గయ్యాళిగా చేసేయటం, చూసేయటం జరిగిపోయేదన్నమాట.
టైప్ కాస్ట్ చెయ్యటంలో మన తెలుగు సినిమావాళ్ళని మించినవాళ్ళు లేరు. నిర్మాతల, దర్శకుల చేతుల్లో పడి మూసలై బతికేబాధ నటులందరికీ తప్పదు. ప్రతిభ ఉన్నా సరే పాపం, ఒకేరకం మూసల్లో ఇరుక్కుని ఇరుక్కుని, బక్కచిక్కిపోయి, ఆనవాళ్ళు లేకుండా పోయిన నటులు ఎంతోమంది.
కానీ టైప్ కాస్ట్ ఇరుకులోంచే విశ్వరూపం ఎత్తి, ఓ ముప్పై సంవత్సరాలపాటు ఆ టైప్‌కే వన్నెలు దిద్దగలిగిన సామర్ధ్యం సూర్యకాంతానిది. (టైప్ కాస్ట్ విషయంలో ఆ తరువాత ఆమెకు వారసుడు బ్రహ్మానందమే. ఈయన తన మూసలోనే ఇంకొన్ని పిల్ల మూసల్ని సృష్టించే ప్రయత్నాలు కూడా చేశారు).
చిన్నప్పటి సూర్యకాంతం చాలా చలాకీ పిల్ల. ఆఖరిపిల్ల కావటంతో ఇంట్లో గారాబం ఎక్కువట. తను అనుకున్నదే సాధించుకునేదట.
ఈ లక్షణం వల్లేనేమో బుద్ధిమంతులైన ఒద్దిక టైప్ హీరోయిన్లకు తను పూర్తిగా విరుద్ధం. డిటెక్టివ్ నవలలు చదివేదట.
వార్నీ! దీనికితోడు హిందీ సినిమాలు ఇష్టం. హిందీ హీరోయిన్ అవుదామని సరదా. అయినా అప్పట్లో చలామణీలో ఉండే నీరసపు ఏడుపుగొట్టు హీరోయిన్‌గా ఈ అచ్చతెలుగు అత్తగారు సూర్యకాంతాన్ని అసలు ఊహించగలమా?
పదిహేనేళ్ళ వయసులో అందరూ అమ్మాయిలే ఉండే నాటక సమాజంతో తిరిగి నాటకాలు వేసేదట. సతీ సక్కుబాయి, కృష్ణ తులాభారం, చింతామణి నాటకాల్లో వేషాలు ఇంట్లోవాళ్లకి ఇష్టం లేకపోయినా తానేమీ పట్టించుకునేది కాదట.
జెమినీ వాళ్ళు 'చంద్రలేఖ' అనే సినిమాను భారీయెత్తున తీస్తున్నారని తెలుసుకుని ఇంకో ఇద్దరు స్నేహితురాళ్ళతో కలిసి మద్రాసుకు ప్రయాణం కట్టింది.
చంద్రలేఖ సినిమాలో వేస్తే అక్కడినుంచి హిందీ సినిమాలోకి ప్రవేశం దొరుకుతుందని ఆమె ఉద్దేశ్యం.
జెమినీలో చిన్నవేషం దొరికింది కూడా. ఇంతలోనే దర్శకుడు సి. పుల్లయ్య ఆమెను తన 'నారద నారది' సినిమాలో మరో చిన్నవేషమిచ్చి 1946లో తెలుగు సినిమాలోకి లాక్కొచ్చేశారు. తరువాత 'ధర్మాంగద'లో వేసింది.
సంసారం (1950) సినిమా ద్వారా బాగా గుర్తింపు వచ్చింది. 'సంసారం'లో తన ఇరవై ఆరో ఏట, రేలంగికి తల్లిగా అరవయ్యేళ్ళ వృద్ధపాత్ర వేసింది. అప్పుడే గుంటూరుకు చెందిన న్యాయమూర్తి పెద్దిభొట్ల చలపతిరావు ఆమెను రెండో పెళ్లి చేసుకున్నారు.
పిల్లలు కలగకపోవటంతో సూర్యకాంతం తన అక్క కొడుకును పెంచుకుంది.
ఆమెకు వండటమన్నా, తినటమన్నా, అందరికీ కడుపునిండా తినిపించటమన్నా ఎంతో ఆనందం. ఇంటినుంచి ప్రారంభమై విస్తరించే ఉదారత్వం అది. అలాగే ఆమె దానధర్మాలు కూడా బాగానే చేసేదట.

ఫొటో సోర్స్, Vijaya Pictures
ఎంత హాయైన మనిషి సూర్యకాంతం!
లావైపోతానన్న బాధ లేదు. అప్పటి హీరోయిన్లెవరికీ ఆ బాధ లేదనుకోండి. సుఖంగా ముద్దబంతిపువ్వుల్లా నిండుకుండల్లా బ్రతికేవారు తెరమీదా బయటా కూడా.
లావుపాటి అత్తగారు అందం. ఆమె ముక్కందం. మార్కస్ బార్ట్‌లే కెమెరాలోంచి మెరిసే ఆ ముక్కుపుడక ఇంకా అందం. ముద్దుగా ఉండే పెదవులని వొంకర్లు తిప్పటం, ఎడంచెయ్యి విసురుతూ మెటికలు విరుస్తూ 'మాయదారి సంత, మాయదారి సంతాని' అంటూ మాటల్ని జోరుగా విసరటం మరీ అందం.
మాటలో నెమ్మది లేనేలేదు. చిన్నతనంలో ఉండే జోష్ ఆమెను చివరిదాకా వదిలినట్టే కనబడదు. వ్యంగ్యపు మాటలని విరిచి మీద విసరటం, అంతలోనే ముక్కు ఎగబీల్చి, కళ్ళనీళ్ళు పెట్టుకోవటం, అంతా జోరుగానే సాగుతాయ్.
ఆ జోష్‌లో మునిగిపోనివాళ్ళు, మొహమ్మీద నవ్వు చెరిగిపోయేవాళ్ళూ ప్రేక్షకుల్లో ఎవరూ ఉండరు.
సూర్యకాంతం ఉన్న సీన్ మొత్తం, ఇంకెవరు ఇంకెన్ని నటనలు ప్రదర్శిస్తున్నా పట్టదు. అలా సూర్యకాంతాన్ని చూస్తూనే ఉంటే, ఈమె ఎప్పుడూ పాసివ్‌గా అసలుండలేదా అనిపించేలా నటిస్తూనే ఉంటుంది.
మిగతా నటుల మాటలకు ఈమె ముఖంలో ఏదో ఒక రియాక్షన్ కనిపిస్తూనే ఉంటుంది. కెమెరా ఆమె మీదకు ఫోకస్ అయి ఉండాలనేం లేదు. అలా ముఖంలో హావభావాలు ప్రదర్శిస్తూనే ఉంటుంది. అంతటి చలాకీతనాన్ని నింపుకుని పుట్టింది సూర్యకాంతం.
భాషమీద పట్టు. ఇది అప్పట్లో నటులందరికీ తప్పనిసరి. తేనెలూరే తెలుగును మాట్లాడుతూ ఉండేవాళ్ళు. సూర్యకాంతం సరేసరి.
నుడికారం ఆమె సొంతం. చాలా భాషలు నేర్చుకోవాలనే కోరిక ఉండేదట ఆమెకు. హిందీ సినిమాలోకి వెళ్లి నిలవగలనని అనుకోవటం వెనుక, ఏ భాషనైనా పట్టుకోగలననే ధైర్యం ఉండే ఉంటుంది.
యాభయ్యవ ఏట ఆమె ఫ్రెంచ్ నేర్చుకునే ప్రయత్నం చేసిందట. మాలతీ చందూర్ వంటలపుస్తకం కంటే ముందే వంటల పుస్తకం ఒకటి రాశారట సూర్యకాంతం.

ఫొటో సోర్స్, twitter/baraju_SuperHit
ప్రతి సినిమాలోనూ హీరో, లేదా అతనికి విధేయురాలైన హీరోయిన్, ఆమె గయ్యాళితనాన్ని అణిచేసే ప్రయత్నం చేసి, ఆఖరికి ఆమెను లొంగదీసి, కన్నీళ్లు పెట్టిస్తూ ఉంటారు.
ఆ ఏడుపు కూడా తనకే సొంతమైన డిక్షన్‌తో కామెడీలాగానే చేసి అలరించే ప్రయత్నం చేస్తుంది సూర్యకాంతం.
అందుకే సినిమా తీస్తున్నవాళ్ళు బోధించే నీతిపాఠాల కంటే, తిట్టినా, నవ్వినా ఏడ్చినా ఆమె నటనే ఎక్కువ సరదాగా వుంటుంది మనకు.
అన్నేళ్ళుగా అన్ని సినిమాల్లో ఒకేలా ఉన్నా విసుగుపుట్టని అత్తగారి మోడల్‌ని ఎక్కువ ప్రయత్నం లేకుండానే తయారు చేసింది సూర్యకాంతం.
ఏ తెలుగు గయ్యాళి వనితనో చిన్నప్పట్నుంచి చూసి, ఆ పోకడలకు తన సహజ వాక్చాతుర్యాన్ని కూడా చొప్పించి సూర్యకాంతం తయారు చేసుకున్న మోడల్ లాగా అనిపిస్తుందది.
బాపు 'ముత్యాలముగ్గు' సినిమాలో సూర్యకాంతం ఇంకోలా కనబడుతుంది.
అమాయకురాలైన ఉత్తమురాలైన భార్య. భర్తగారి అక్రమాలు తెలియక, ఆయనకు భజన చేస్తుంటుంది.
తెలిశాక చివరకు అసహ్యించుకుంటుంది. కానీ అది చాలా చిన్నపాత్ర. చాలావరకూ సినిమాల్లో సూర్యకాంతం మూర్ఖత్వంతో నోరు పారేసుకునే గయ్యాళిగానే వేసింది.
అది అత్త అయినా, కోడలయినా, తోటికోడలయినా సరే. అత్తగా కోడలిని వేధిస్తుంది. కోడలిగా అత్తను వేధిస్తుంది. అయినా ఈమెలో సున్నితత్వం ఎక్కడో ఉందని మనకు స్ఫురిస్తూనే ఉండేలా చేస్తుంది.
'కన్యాశుల్కం'లో గిరీశం ప్రియురాళ్ళలో ఒకతీ, బలహీనురాలూ అయిన మీనాక్షి వేషంలోనూ గిరీశాన్ని బాగానే ఇబ్బంది పెడుతుంది. భీముడి భార్య 'హిడింబ' అనగానే గుర్తువచ్చేది మాయాబజార్ లోని సూర్యకాంతమే.
సిటీ షోకుల మోజుతో పల్లెను వదిలి పట్నాలకు వలసవెళ్లి హోదాలూ దర్జాలూ ఒలకబోసే ముందటితరం మధ్యతరగతి స్త్రీల వేషాలు ఆమెవే.
భర్తను ఉమ్మడి కుటుంబం నుంచి విడదీసి, సిటీలో కాపురం పెట్టించే మొదటితరం స్త్రీ ఆమెనే. మహిళా సమాజాలకు ప్రెసిడెన్సీ ఆమెదే. ఇలా పైపైకి ఎదగాలనే కోర్కెలను సినిమాల్లో బాగా తప్పు పట్టేవాళ్ళు.
భర్తనూ కుటుంబాన్నీ లెక్క చెయ్యని ఆడవాళ్లే వస్తువులనూ హోదానూ తెగ ఇష్టపడతారని సినిమాల్లో సూత్రీకరణ జరిగేది. అప్పట్లో సమాజంలో ఆడవాళ్ళ హోదా చాలా కిందిస్థాయిది.
చదువూ, సిటీలో తిరగటాలూ తమని కొంతైనా పైకి తెస్తాయన్న భావం కొంతమందైనా ఆడవాళ్ళలో ఉండేది. చదువులేని ఈ ఆడవాళ్ళ ప్రపంచం ఇల్లే.
ఇంట్లో అన్ని నిర్ణయాలూ చేసే మగవాళ్ళ పైచెయ్యిని కొంతైనా కిందికి వంచుదామనే ప్రయత్నంలో నోరుపెట్టుకుని అందరిమీదికీ విరుచుకుపడే లక్షణమే గయ్యాళితనం. ఇది మారాం చేస్తే అనుకున్నది దొరుకుతుందని పిల్లలు అనుకున్నట్టే ఉంటుంది.
గయ్యాళి ఆడవాళ్ళు తీసుకునే ప్రతి నిర్ణయం మూర్ఖంగానే ఉండితీరుతుందని నిర్ణయిస్తుంది సినిమా. ఆ ఫీల్డ్ కూడా మగవాళ్ళదే కదా మరి!
ఇప్పుడు పరిస్థితులు చాలావరకూ మారాయి. ఇల్లే ప్రపంచం అయిపోయిన ఆడవాళ్ళు తగ్గి, చదువులూ ఉద్యోగాలూ పెరిగినకొద్దీ గయ్యాళితనం కూడా తగ్గిపోయింది.

ఫొటో సోర్స్, imdb
నేటి గుండమ్మ ఎవరు?
ఆనాటి సినిమాల్లోని సమాజం ఇప్పుడు ఇంచుమించుగా లేనేలేదు. మధ్యతరగతి ఉమ్మడి కుటుంబాలూ, అత్తాకోడళ్లు వంటింటి పెత్తనం కోసం, ఇంటి మగాడి మీద హక్కు కోసం అంతర్యుద్ధాలు చేసుకునే పరిస్థితులూ తగ్గిపోయాయి.
న్యూక్లియర్ కుటుంబాల్లో అత్తాకోడళ్లు పరిచయస్తుల్లా మిగులుతున్నారు. ఎవరి ఉద్యోగాలూ వ్యాపకాలూ వాళ్ళు చేసుకుంటూ, ఎవరిళ్లలో వాళ్ళుంటూ స్నేహితుల్లా ఉండటానికి చాలావరకూ ప్రయత్నిస్తున్నారు. 'కలిసుంటే లేదు సుఖం' అనేది ఇప్పటి నీతి. మగవాళ్ళకు ఓం శాంతి.
అయినా సరే, మార్వాడీ ఉమ్మడి కుటుంబాలు ఎలా ఉంటాయో ఇప్పుడు ప్రతి ఒక్క తెలుగు ఇల్లాలికీ తెలుసు.
రాజస్థానీ వ్యాపారుల ఇళ్లలోని అత్తాకోడళ్ల, ఆడవాళ్ళ ఆధిపత్యపు పోట్లాటను మన డ్రాయింగ్ రూముల్లోకి తెలుగు డబ్బింగ్ సీరియల్స్‌గా తెచ్చేశాయి టీవీ చానెల్స్.
కానీ వీటిలోని విలన్లు సూర్యకాంతం కాలిగోటికి పోలరు అనిపిస్తుంది.
ఆడవాళ్ళలో ఎక్కడా చూడని దుర్మార్గపు కళల్ని కృత్రిమంగా చూపిస్తుంటారు వీటిలో. హాస్యం అసలే శూన్యం. సూర్యకాంతం గానీ చూసిందంటే 'మాయదారి సంత' అని తిడుతుంది వీళ్ళని.
తెలుగు సినిమాల్లో కూడా సూర్యకాంతం మాటవిరుపునూ ఒడుపునూ జోరునూ తరువాతి తరం తెరమీది అత్తగార్లు ఎవరూ అందుకోలేదు.
సినిమాల్లో, టీవీ సీరియళ్ళలో కనపడే ఆడవిలన్లూ అత్తలూ సూర్యకాంతం నుంచి బొత్తిగా ఏమీ నేర్చుకోలేదు.
దురుసుతనం, బోళాతనం, తెలియనితనం కలగలిసి ఎవరిలోనూ కనబడదు.
అందువల్లనే రెండు మూడు తరాల తెలుగువారి మనసుల్లో గయ్యాళితనానికి ఏకైక ప్రతినిధిగా సూర్యకాంతం నిలిచిపోయింది.
తెలుగు సమాజానికి గొప్ప అన్యాయం చేసి వెళ్లిపోయింది సూర్యకాంతం! అంత అందమైన పేరు మరెవరూ పెట్టుకోకుండా చేసిపోయింది. ఒక మనిషి తాను పోషించిన పాత్రలతో అంత ప్రభావం చూపించిందంటే అంతకంటే ఆమె గొప్పతనానికి నిదర్శనం మరేముంటుంది?
ఆ మధ్య గుండమ్మ కథను ఎన్టీఆర్, ఏఎన్నార్ వారసులతో తీయాలనే ప్రతిపాదన వచ్చినపుడు మిగిలిన పాత్రలకు ఎలాగోలా సెలక్ట్ చేయగలం, గుండమ్మను ఎక్కడి నుంచి తేవాలి అనే ప్రశ్న ఎదురైంది. అదీ సూర్యకాంతమంటే!
(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)
ఇవి కూడా చూడండి:
- ‘స్టాలిన్ మృతి’: బ్రిటిష్ కామెడీ సినిమాపై మండిపడుతున్న రష్యా
- ‘టాలీవుడ్లో హీరోయిన్లకు వేధింపులు ఇలా ఉంటాయ్!‘
- ‘నేను చెప్పినట్టు వింటే నీకు కారు కొంటాను’ అనేవారు
- ‘సావిత్రి’ కోసం ఆ సీన్లను వందసార్లు చూశా - కీర్తి సురేష్
- అనుపమా పరమేశ్వరన్ : కాలేజీ రోజుల్లో నన్నూ వేధించారు
- #DreamGirls: సమాజం ఉన్నట్లే సినీ పరిశ్రమ కూడా : నందినీ రెడ్డి
- BBC SPECIAL: చైనాలో బాహుబలి, దంగల్ సినిమాలు ఎందుకంత హిట్టయ్యాయంటే...
- చైనా బాహుబలి: వారం రోజులు కూడా ఆడని భారీ బడ్జెట్ సినిమా ‘అసుర’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











