‘స్టాలిన్ మృతి’: బ్రిటిష్ కామెడీ సినిమాపై మండిపడ్డ రష్యా.. దేశవ్యాప్తంగా ప్రదర్శన నిలిపివేత

ఫొటో సోర్స్, Volga Films
‘స్టాలిన్ మృతి’ (ది డెత్ ఆఫ్ స్టాలిన్) సినిమాను దేశంలో ఎక్కడా ప్రదర్శించకూడదని రష్యా ప్రభుత్వం గతవారం నిర్ణయించింది.
ఈ వ్యంగ్య చిత్రం ‘సైద్ధాంతిక యుద్ధతంత్రం’ అని, ‘అతివాదం’ అని ఈనెల 22వ తేదీన సినిమా ప్రత్యేక ప్రదర్శన తిలకించిన రష్యా అధికారులు ఫిర్యాదు చేశారు.
25వ తేదీన ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా.. దానిని ప్రదర్శించేందుకు, పంపిణీ చేసేందుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించారు. సినిమా విడుదల, ప్రదర్శనల్ని రద్దు చేశారు.
అమెరికన్ నటుడు స్టీవ్ బుస్కెమి, జెఫ్రీ టాంబర్‌లు నటించిన ఈ చిత్రాన్ని రష్యాలో పంపిణీ చేసే ఓల్గా సంస్థకు ఈ మేరకు రష్యా సాంస్కృతిక శాఖ తమ నిర్ణయాన్ని వెల్లడించింది.
సోవియట్ నాయకుడు జోసెఫ్ స్టాలిన్ 1953లో చనిపోయిన తర్వాత దేశంలో అధికార పోరుపై ఈ వ్యంగ్య చిత్రాన్ని దర్శకుడు అర్మాండో లన్నుక్కి తెరకెక్కించారు.
ఈ చిత్రంలో చాలా పాత్రల్లో ఆనాటి చారిత్రక నాయకులను చూపించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ చిత్రం బ్రిటన్‌లో గతేడాది అక్టోబర్‌లోనే విడుదలైంది. ఈనెల 22న మాస్కోలో జరిగిన సినిమా ప్రత్యేక ప్రదర్శనకు పలువురు పార్లమెంటు సభ్యులు, రష్యా చలనచిత్ర రంగ ప్రతినిధులు హాజరయ్యారు. చిత్రం పట్ల వారిలో చాలామంది అసంతృప్తి వెలిబుచ్చారు.
సైనిక చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ యుద్ధంగా పరిగణించే స్టాలింగ్రాడ్ యుద్ధం జరిగి ఈ ఫిబ్రవరికి 75 ఏళ్లు కానున్నాయి. 1943లో జరిగిన ఈ యుద్ధంలో నాజీ జర్మనీపై రష్యా విజయం సాధించింది. దీనికి నాయకత్వం వహించింది మార్షల్ గార్గీ ఝుకోవ్. ఈయన పాత్ర కూడా ఈ కామెడీ సినిమాలో ఉంది.

ఫొటో సోర్స్, Volga
అయితే, ఈ చిత్రంపై ఫిర్యాదు చేసిన 21 మందిలో మార్షల్ ఝుకోవ్ కుమార్తె కూడా ఉన్నారు.
ఈ సినిమా రష్యా చరిత్రను తప్పుదోవ పట్టిస్తోందని, నాజీలపై పోరాడిన వారిని కించపరుస్తోందని ఆ 21 మంది తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. రష్యా ప్రజలను, సోవియట్ యూనియన్ జాతీయ గీతాన్ని అవమానిస్తోందని వారు తెలిపారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
సినిమా వివాదంపై రష్యా సాంస్కృతిక శాఖ మంత్రి మెడిన్‌స్కీ స్పందిస్తూ.. ‘‘ఇది సోవియట్ చరిత్రను కించపరుస్తోందని, వెక్కిరిస్తోందని చాలామంది భావిస్తున్నారు. మాకు సెన్సార్‌షిప్ లేదు. మా చరిత్ర పట్ల విమర్శనాత్మక అంచనాలకు మేం భయపడటం లేదు’’ అన్నారు.
చిత్ర దర్శకుడు అర్మాండో లనుక్కి స్పందిస్తూ.. ‘‘ఈ చిత్రాన్ని చూసిన రష్యన్లు, రష్యా మీడియా అంతా కూడా బాగుందని అభినందించారు. ఇది హాస్యపూరితమైన, నిజమైన చిత్రమన్నారు’’ అని తెలిపారు.

రెండు రోజులు ప్రదర్శించి ఆపేసిన థియేటర్
కాగా, రష్యా ప్రభుత్వం ఈ చిత్ర ప్రదర్శనను రద్దు చేసినప్పటికీ.. మాస్కోలోని ‘ది పయనీర్ సినిమా’ రెండు రోజులు.. గురు, శుక్రవారాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించింది. తర్వాతి రోజులకు కూడా బుకింగ్స్ అనుమతించింది.
కానీ, చిత్రప్రదర్శనకు అవసరమైన అనుమతులు లేకుండా ప్రదర్శనలు కొనసాగించటం నిబంధనల్ని ఉల్లంఘించటమే అవుతుందని, దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాధికారులు చెప్పారు. సినిమా థియేటర్ల యజమానుల మండలి ఛైర్మన్ సూచన మేరకు శుక్రవారం పోలీసులు థియేటర్ వద్దకు వెళ్లారు.
దీంతో, థియేటర్ ఫేస్‌బుక్‌లో ఒక ప్రకటన చేసింది. ‘‘మా పరిధిలోలేని కారణాల వల్ల జనవరి 27వ తేదీ నుంచి ‘ది డెత్ ఆఫ్ స్టాలిన్’ సినిమా ప్రదర్శనను నిలిపివేస్తున్నాం’’ అని తెలిపింది. అయితే, ముందస్తు బుకింగ్‌లు చేసుకున్న ప్రేక్షకులందరికీ వారి డబ్బు తిరిగి ఇచ్చేస్తామని వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
- ఎడిటర్స్ కామెంట్: తెలుగు నేలపై అక్టోబర్ విప్లవం
- పుతిన్ను రక్షకుడిగా ఎందుకు చూపిస్తున్నారు?
- రష్యా ఎన్నికలు: పుతిన్ ప్రత్యర్ధి అలెక్సీ నావల్సీపై అనర్హత వేటు
- నాడు దీపిక పదుకొణెకు సెక్యూరిటీ ఇచ్చి.. నేడు పద్మావత్ వ్యతిరేకంగా ఉద్యమం
- 'జై సింహా'లో బాలకృష్ణ కారెత్తడంపై ఆనంద్ మహీంద్రా ఏమన్నారు?
- ‘ఇంతకీ అజ్ఞాతవాసి ఫ్రెంచ్ మూవీకి కాపీయా? కాదా?’
- దేవతలు తెల్లగానే ఎందుకుండాలి?
- సామాన్యుడి కాపురంలో నిప్పులు పోసిన ‘హీరో’
- జాతీయ గీతం గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








